close

తాజా వార్తలు

అంధుడి కోసం... సుస్వరాలు పూచాయి

ఘంటసాల వెంకటేశ్వరరావు, నేదునూరి కృష్ణమూర్తి, సాలూరు రాజేశ్వరరావు, పి.సుశీల... సంగీత సరస్వతి ముద్దు బిడ్డలు వీరంతా... చలనచిత్ర రంగంలోనే కాదు, ప్రతి తెలుగువారి గుండెల్లో వారి స్థానం చిరస్మరణీయం.... వీరే కాదు, ఇంకా ఎందరెందరో అద్భుత కళాకారులు తయారైన సంగీత కోవెల విజయనగరం సంగీత కళాశాల. అసలా స్వరాల తోట ఏర్పడిన తీరే ఆసక్తికరం. ఓ అంధుడికి సంగీతం నేర్పడం కోసం ఏర్పాటైన ఈ సుస్వరాల తోట తర్వాత ఎన్నో గాన కోకిలను అందించింది...

వందేళ్ల నాటి సంగతి... పూసపాటి విజయరామగజపతి...  విజయనగరం రాజావారు... వారి ఆస్థానంలో చాగంటి జోగారావుపంతులు అనే ఆంతరంగిక కార్యదర్శి ఉండేవారు. అంతకు మించి రాజుగారికి చాలా ఆత్మీయుడు. ఆయన కుమారుడు చాగంటి గంగబాబు అంధుడు. నిరంతరం అతనికి ఉన్న లోపంతో కుమిలిపోతున్న పంతులుగారి ఆవేదన రాజుగారి దాకా వచ్చింది. అతనికి కళ్లు తెప్పించలేమా అన్న ఆలోచన ఆదిలోనే ఆగిపోయింది. అతనికి కళ్లు రావడం సాధ్యంకాదని వైద్యులు తేల్చి చెప్పేశారు. మరి ఆత్మీయుడి ఆవేదనను తగ్గించేదెలా?

ఆ కుర్రాడి  భవిష్యత్తు బాగుండేలా ఏం చేస్తే మంచిదో చెప్పమంటూ తన ఆస్థాన వైద్యుడు సీతారామయ్యని అడిగారు. చూపు లేదు కనుక అతడికి సంగీతం నేర్పిస్తే మంచిదని చెప్పారు సీతారామయ్య.
అప్పటికే తమ పూర్వీకులు మహారాజ ఆంగ్ల పాఠశాల, మహారాజ డిగ్రీ కళాశాల, మహారాజ సంస్కృత కళాశాల ప్రారంభించారు... వాటికి కొనసాగింపుగా సంగీత కళాశాల నెలకొల్పితే..? రాజుగారికి వచ్చిన ఈ ఆలోచన తెలుగు జాతికి వరమైంది. సుస్వరాల తోటకు బీజం పడింది.

వెంటనే విజయనగరం కోట వెనుక భాగాన ఉన్న టౌన్‌ హాల్‌ భవనంలో 1919 ఫిబ్రవరి 5వ తేదీన ‘విజయరామ గాన పాఠశాల’ ప్రారంభించారు. కాలక్రమంలో అదే మహారాజ సంగీత, నృత్య కళాశాలగా రూపాంతరం చెందింది. అలా మొదలైన విజయనగరం సంగీత కళాశాల ప్రస్థానం దేదీప్యమానంగా వెలుగొందుతూ సంగీతాభిమానుల్ని రంజింపజేస్తూ వందేళ్లకు చేరువై దేశ చరిత్రలో కలికితురాయిగా నిలబడింది. ఒక అంధుడి కోసం ప్రారంభమై ఎందరికో దారి చూపించిన ఏకైక కళాశాలగా విజయనగరం సంగీత కళాశాల ప్రసిద్ధికెక్కింది. రాజావారి కోరిక మేరకు భవిష్యత్తులో ఆ అంధుడు అద్భుతమైన వయోలిన్‌ విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నారు. అతడికి సంగీత శిక్షణనిచ్చేందుకు మహారాజావారే జర్మనీ నుంచి వయోలిన్‌ని తెప్పించి ఇచ్చారని చెబుతారు. తర్వాత కళాశాల కర్ణాటక సంగీతానికి కలికితురాయిగా మారింది.  అది మరింతగా విస్తరించి భారతదేశ సంగీత సంప్రదాయాలకు ఊపిరిలూదింది. తన నీడన చేరిన సామాన్యులకు సైతం సరిగమల్ని నేర్పించి మహా విద్వాంసులుగా తీర్చిదిద్దింది.


ఎందరెందరో...

హరికథా పితామహుడిగా విఖ్యాతిపొందిన అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుని సంగీత పాఠశాలకు తొలి ప్రధానాచార్యుడిగా నియమించారు. ప్రఖ్యాత వయోలిన్‌ విద్వాంసులు ద్వారం వెంకటస్వామినాయుడు ఇక్కడ అధ్యాపకులుగా పనిచేశారు. భువనేశ్వర్‌ మిశ్రా, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, చాగంటి గంగబాబు, ద్వారం సత్యనారాయణరావు, ద్వారం మంగతాయారు, ఎవటూరి విజయేశ్వరరావు, ఘంటశాల వెంకటేశ్వరరావు, మంచాల జగన్నాథరావు, సాలూరు రాజేశ్వరరావు, పి.సుశీల తదితరులంతా ఈ సంగీత సరస్వతి ముద్దుబిడ్డలే. దాదాపు 7,000 మందికి పైగా పూర్వ విద్యార్థులున్నారు..

- జి.వి.వి.సత్యనారాయణరెడ్డి, విజయనగరం
 

 


గమనిక: 03.02.2019(ఆదివారం) హాయ్‌ పేజీలో ‘వందమందినైనా చంపాలనుకున్నా’ అనే శీర్షికతో ప్రచురితమైన శాంతా బయోటెక్‌ వరప్రసాద్‌ రెడ్డి ఇంటర్వ్యూలో ఆయన లంచాలు ఇచ్చినట్లు ప్రచురితమైంది. వాస్తవానికి అప్పట్లో లంచాలు ఇస్తేనే పనిచేసే వ్యవస్థ ఉండేదని, దానిపై పోరాటం చేశానని ఆయన చెప్పారు. పాఠకులు గమనించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.