close

తాజా వార్తలు

వదిలితే జరిమానా తింటే నజరానా

విస్తరిలో ఒక్క మెతుకు మిగిలినా యాభై రూపాయలు జరిమానా కట్టాలి. ఎక్కడండి బాబు... అదేమైనా అన్నదాన సత్రమా? కాదు. అదో హోటల్‌. డబ్బులిచ్చి కొనుక్కుంటాం కదా.. మనిష్టం..! అలా అంటే కుదరదు మరి! దాని యజమాని ముక్కుపిండి జరిమానా వసూలు చేస్తారు. ఆయన ఎందుకలా చేస్తున్నాడు? వినియోగదారులు కడుతున్నారా? ఆగండి...ఆగండి.. జవాబులన్నీ చదవండి.

‘‘ఇద్దరు వృథా చేసే భోజనం ఒకరి ఆకలి తీరుస్తుంది.’’
‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. వృథా చేయకండి.’’
... అనే సూక్తులు వరంగల్‌ నగరం హన్మకొండ అదాలత్‌ కూడలిలోని ‘లింగాల కేదారి ఫుడ్‌కోర్టు’లో కనిపిస్తాయి. వీటిని అతిక్రమిస్తే జరిమానా కట్టకుండా బయటికి వదలరు దాని యజమాని లింగాల కేదారి. ఒకవేళ డబ్బుల్లేక పోతే...తన జేబు నుంచి ఇచ్చి తరువాత వసూలు చేస్తారు. ఎందుకిదంతా? అంటే... అన్నం వృథా చేయకూడదనే స్పృహ అందరిలో కలగాలనే తన తపనంటాడు కేదారి. ఆ.. ఒక ముద్ద వదిలేస్తే ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం ఆయన ఊరుకోరు. కానీ జరిమానా కట్టిన వారంతా కేదారిని మెచ్చుకుని వెళుతుంటారు.

రెండేళ్ల క్రితం...
లింగాల కేదారి ఫుడ్‌ కోర్టు మధ్యాహ్నం అయ్యిందంటే కిటకిటలాడుతుంది. వందలాది మంది కడుపునిండా భోంచేస్తారు. కానీ తిన్న తర్వాత విస్తరాకులు కడిగినట్టే ఉంటాయి. ఈ హోటల్‌లో భోజనం రూ. 50.  అన్నం, పప్పు, చట్నీ, మరో అయిదారు రకాల కూరలు, చికెన్‌ కర్రీ, చేప కూర, పులిహోర, పెరుగన్నం, సీˆ్వటు... ఇదీ రోజూ హోటల్‌ మెనూ. పదార్థాలన్నీ ఎంతో రుచిగా, శుచిగా ఉంటాయి. హోటల్‌కు వచ్చే వారు రూ. 60 చెల్లించి టోకెన్‌ తీసుకోవాలి. విస్తరాకుల్లో మాత్రం ఏ ఒక్క పదార్థం కూడా మిగలకూడదు.  అలా ఆహారం వృథా చేయని వారికి యజమాని లింగాల కేదారి తిరిగి రూ.10 ఇచ్చేస్తారు. వదిలితే మాత్రం రూ.50 జరిమానా కట్టాలి

ఇలా ఎందుకంటే..
1986లో కేదారి తినడానికి తిండి కూడా దొరకని పేదరికం అనుభవించారట. ఒక రోజు రాత్రి అన్నం లేక కడుపులో కాళ్లు పెట్టుకుని పడుకున్నారట. మర్నాడు ఉదయం నకనకలాడే ఆకలితో నడుచుకుంటూ వస్తుంటే ఒక హోటల్‌ వాళ్లు అన్నం, సాంబారును పారేస్తుంటే కేదారి తీవ్రంగా బాధపడ్డారట. తర్వాత హోటల్‌ వ్యాపారంలోకి వచ్చి క్రమంగా ఎదిగారు. ఇక నుంచి ఆహారం వృథా చేయకూడదని,  రెండేళ్ల క్రితం ఈ ప్రచారం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ హోటల్‌లో రోజుకు కనీసం 400 మంది వరకు భోంచేస్తున్నారు. రోజుకు రూ. 3000 వరకు కేదారి చేతి నుంచే ఖర్చు చేస్తున్నారట తనకున్న క్యాటరింగ్‌ వ్యాపారంలో వచ్చిన లాభాలతో హోటల్‌ నడిపిస్తున్నాడు. కేదారి భార్య, ఇద్దరు కొడుకులు, కోడలు అంతా హోటల్‌లోనే పనిచేస్తున్నారు. ఈ హోటల్‌ గత రెండేళ్లుగా ఈ నిబంధనతో నడుస్తోంది.  మొదట్లో రోజుకు ఒకరిద్దరు ఆహార పదార్థాలు వదిలేసి జరిమానా కట్టేవారట. తర్వాత క్రమశిక్షణగా ఒక్క మెతుకు వదలకుండా తినేస్తున్నారు. పైగా జరిమానా రూపంలో ఇప్పటికి రూ. 12 వేలు వసూలైతే వాటిని కేదారి అనాథాశ్రమానికి ఇచ్చేశారు.


 

అధికారులు సైతం కట్టారు

లింగాల కేదారి ఎప్పుడూ హోటల్‌లో ఒక మైకు పెట్టుకుని అన్నం పారేయకూడదని చెబుతుంటారు. ఒకసారి ఒక న్యాయమూర్తికి సైతం జరిమానా వేశారట కేదారి. అప్పుడాయన ఈ నిబంధనను శెభాష్‌ అని మెచ్చుకొని వెళ్లారు. ఇప్పటి వరకు ఈ హోటల్‌కు వచ్చిన ఎంతో మంది పోలీసులు సైతం ఫైన్‌లు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ భోం చేసే వందలాది మంది కూడా తమ ఇళ్లలో వృథా అరికడతామని చెప్పి వెళుతున్నారట. వంట శుచిగా రుచిగా లేకపోయినా కేదారి తిన్నవారికే ఫైన్‌ కడతానని చెబుతున్నారు. ఎవరైనా తాగి వచ్చినా ఇక్కడ భోజనం పెట్టరు. కేదారిని అవహేళన చేసినట్టు మాట్లాడినా టోకెన్‌ ఇవ్వరు. హోటల్‌కు వచ్చేవారు కస్టమర్లు కాదని, నా బంధువులని చెబుతారు కేదారి. అందుకే అంతా ఆనందంగా తింటారు. మెతుకు లేకుండా శుభ్రంగా విస్తరాకులు డస్ట్‌బిన్‌లో వేస్తారు.  ఎముకలు, కరివేపాకు, ఎండు మిర్చీ మాత్రం విస్తరిలో వదిలేయొచ్చు. ఇప్పుడు రోజుకొక్కరు కూడా ఫైన్‌ కట్టట్లేదని, మార్పునకు ఇదే సంకేతమని కేదారి చెబుతున్నారు.
- జి.పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.