close

తాజా వార్తలు

Updated : 11/02/2019 05:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రండి.. రైతు పంక్తి భోజనానికి!

సినిమా హీరోతో కలిసి భోజనం చేస్తే మురిసిపోతారు కొందరు. స్టార్‌ హీరోయినో, క్రికెటర్‌తో సెల్ఫీ దిగితే జీవితం ధన్యమయినట్లు భావిస్తారు ఇంకొందరు. వీళ్లంతా మనకు అన్నం పెడుతున్నారా? లేదు.. అయినా మనకిది ఆరాధనలా అనిపిస్తుంది.
మరి మనందరి ఆకలి తీర్చడానికి నిరంతరం స్వేదాన్ని మట్టిలో కలిపి పంటలు పండిస్తున్న రైతుకు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు?... ఇలాగే ఆలోచించింది ‘బాధ్యత ఫౌండేషన్‌’. ‘అన్నదాత సుఖీభవా’ అంటే...
అన్నం పెట్టిన వాడో... వడ్డించిన వాడో కాదు... దాన్ని పండించిన వాడు సుఖంగా ఉండటమని గుర్తించింది. కర్షకుడ్ని ఆదరిస్తోంది. ఆరాధిస్తోంది. అన్నదాతకే అన్నం పెడుతోంది. దేశానికే వెన్నెముక అయిన రైతును వెన్ను తట్టి ప్రోత్సహిస్తోంది.

తడిక మీద పేడ అలికిన నేమ్‌బోర్డ్‌... మనకు స్వాగతం పలుకుతుంది.
పేడ అలికి, ముగ్గులు పెట్టిన ఫ్లోర్‌.... తివాచీ పరుస్తుంది.
అక్కడక్కడ ఉంచిన ఇసుర్రాళ్లు, రోళ్లు.. పన్నీరు చల్లే పడుచుల్లా ఆహ్వానమంటాయి.
వేలాడదీసిన గింజ కంకులు, గిజిగాని గూడు...  మన యదలోతుల్లో ఉన్న పల్లె పరిమళాలను పలుకరిస్తాయి.
ఇంకొంచెం లోపలికి వెళ్తే పెద్ద రాగిపాత్రలు, సొరబూరలు, ధాన్యాన్ని కొలిచే సోల, తవ్వలు, పిడకలు మన చూపుల్ని కట్టిపడేస్తాయి.
ఏ పల్లెటూరి కథ చెబుతున్నావ్‌ నాయనా! అంటారా?
కాదు.. కాదు... ఇది హైదరాబాద్‌ ఏ.ఎస్‌.రావు నగర్‌లోని జనహిత ఆర్గానిక్‌ స్టోర్‌. అక్కడెందుకు ఇవన్నీ పెట్టారు? ఇంతకీ ఏం జరుగుతోందక్కడ?

ఎవరు నడుపుతున్నారు?
కుటుంబాన్ని పస్తులుంచలేక.. అప్పులు దొరక్కా.. దొరికినా తిరిగి కట్టలేక.. మట్టిలో కలిసిపోయే రైతన్నకు చేదుడువాదోడుగా ఉండాలనుకున్నారు పైడిమర్రి చంద్రశేఖర్‌, అపర్ణ దంపతులు. కష్టమైనా, నష్టమైనా కలిసి నడుద్దామని పెళ్లినాట చేసిన ప్రమాణానికి అనుగుణంగా సాగుతున్నారు. ఇద్దరి ఆశయమూ ఒక్కటే... ఎవరూ పట్టించుకోని అన్నదాతను అక్కున చేర్చుకోవాలని... ఆదుకోవాలని. బాధ్యత నెరవేర్చడంతో పాటు, అందరికీ బాధ్యత గుర్తుచేయాలనే తమ సంకల్పానికి పెట్టుకున్న పేరే ‘బాధ్యత ఫౌండేషన్‌’.

ఎందుకిలా?
చంద్రశేఖర్‌కు ప్రకృతి అంటే ఇష్టం. భూమి అంటే ప్రేమ. నల్లగొండ జిల్లా కోదాడలో పుట్టిన ఈయన అమ్మమ్మవాళ్లకి నలభై ఎకరాల పొలం ఉండేది. కొట్టంలో 80 గోవులుండేవి. నాయనమ్మ వాళ్లకి పాతిక ఎకరాలుండేది. యాభై గోవులు పెంచేవారు. నాన్న బ్యాంకు మేనేజర్‌ అయినా సెలవుల్లో పల్లెలకు వెళ్లేవాడు. అలా మట్టిమీద ఏర్పడిన ప్రేమతో. రైతును ప్రోత్సహిస్తున్నాడు. కోదాడ, కల్వకుర్తి, ఆర్మూర్‌..లాంటి ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నాడు. చేస్తున్నాడు. తన బాటలోనే ఆయన సతీమణి అపర్ణ నడుస్తున్నారు.

రైతును ఎలా ఆదుకుంటారు?
ఏఎస్‌రావ్‌ నగర్‌లో జనహిత ఆర్గానిక్‌ స్టోర్‌కి వెళితే వీళ్లు చేస్తున్న కార్యక్రమం ఏంటో తెలుస్తుంది. ఈ స్టోర్‌లో బియ్యం, పప్పులు, గానుగనూనెలు, పసుపు, కారం, హెర్బల్‌ ఆలౌట్‌, టూత్‌పౌడర్‌.. ఇవన్నీ సేంద్రియ సాగు నుంచి వచ్చినవే.  ఇక్కడ రైతులను ప్రోత్సహించడానికి అన్ని వసతులు కల్పించారు. నాలుగు ఎకరాలలోపు ఉండే సన్నకారు రైతులను.. అదీ ప్రకృతి వ్యవసాయం చేసేవారిని గుర్తించారు. వీరికి పెట్టుబడికోసం ఆర్థిక సాయం చేయాలనుకున్నాడు. సతీమణికి చెబితే ప్రోత్సహించింది. కొందరు బంధువులు, తెలిసినవాళ్లు రైతులకిస్తే తిరిగి రావని హెచ్చరించారు. అయినా పెద్ద ఉద్యోగం మాని ఈ వ్యవసాయం చేయటమేంటోనని తూలనాడారు. అదే విషయాన్ని చంద్రశేఖర్‌ స్నేహితులకు చెప్పాడు. పన్నెండుమంది ముందుకొచ్చారు. అందరూ కలిసి కర్షకులకు పెట్టుబడి అందిస్తున్నారు. జొన్న, ఉలవలు.. వంటి మెట్ట పంటలకు ఎకరానికి ఐదువేలు ఇస్తారు. పసుపు, మిర్చి లాంటి వాణిజ్య పంటలకైతే ఎకరానికి రూ.10వేలు అందిస్తారు. ఈ మొత్తాలకు ఎటువంటి ప్రామిసరీ నోట్లు రాయించుకోరు. వడ్డీ అడగరు. పంట పండి, అమ్మాక... డబ్బు తిరిగి చెల్లించాలని చెబుతారు. ధాన్యం అమ్ముడుపోకుంటే జనహిత స్టోర్‌లో పెట్టి వీళ్లే అమ్మిస్తారు. కర్షకుడు ఎప్పటికీ మాట తప్పడనేది వీరి అభిప్రాయం. ఇప్పటి వరకూ వీరు డబ్బులిచ్చిన రైతులంతా చిర్నవ్వుతో డబ్బును చెల్లించారు. ఇదే వీరి నమ్మకాన్ని రెట్టింపు చేసింది. పాజిటివ్‌ వైబ్రేషన్స్‌తో సాయం చేస్తే రైతు ఆనందంతో పండిస్తాడు. అలా పంటలో, మనం తినే తిండిలో కూడా పాజిటివ్‌నెస్‌ ఉంటుందంటారు వీళ్లు. ప్రస్తుతం ఎనభై ఎకరాల్లో, పాతిక మంది రైతులతో వ్యవసాయం చేయిస్తున్న ఈ ఫౌండేషన్‌.. వచ్చే ఏడాదికి కనీసం రెండువందల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయించాలనే లక్ష్యంతో సాగుతున్నారు.

రైతులతో భోజనం
ఈ ఫౌండేషన్‌ హైదరాబాద్‌లోని ఆరు ఎన్జీవోలను ‘భాగ్యనగర గోపాలురు’ అనే పేరుతో ఓ తాటిపైకి తెచ్చింది. రైతు కష్టంపై వినియోగదారుడికి అవగాహన కల్పించాలని ‘రైతుతో భోజనం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్నదాతలను గౌరవించుకోవటానికి డిసెంబరు 31, 2018 ఈ భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రైతుతో కలిసి భోజనం చేయడానికి ముందుగా బుక్‌ చేసుకున్న వారికే  అవకాశం ఇచ్చారు. సేంద్రియ పంటలతో వండిన వంటలు వడ్డించారు. అన్నం, పుదీన, నవార బియ్యంతో బెల్లంపొంగలి, పెసరపప్పు.. ఇలా పదార్థాలన్నీ గానుగ నూనెతో వండారు. ఆ రోజు పనివాళ్లు రాకుంటే ఆ వీధివాళ్లంతా కూరగాయలు కోయటానికి కత్తులు తెచ్చారు. వండటానికి సాయం చేశారు. వ్యాపారాలు చేసే  స్నేహితులు ఇంటిని శుభ్రపరిచారు. ఒక మంచి పని మనం తలపెడితే మనసున్న వాళ్లందరూ సహకరిస్తారడానికి ఇదే నిదర్శనం. అన్నదాతలు భోంచేసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మనసారా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాన్ని మరికొన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని సంకల్పించారు. అన్నదాతను సెలబ్రటీలా చూసే రోజుల కోసం యజ్ఞంలాంటి ప్రయత్నం చేస్తున్నారు.

పూర్వం కుటుంబం ఖర్చులో 70 శాతం తిండికి, మిగతావి అదనపు ఖర్చులుండేవి. ఇప్పుడు 25 శాతం ఆహారానికి పెడుతున్నాం. ఇతర ఖర్చులను కొంత తగ్గించుకుని ఐదుశాతం ఆహారంకోసం పెంచితే సరి. ప్రతి కుటుంబానికో బ్యూటీషియన్‌, డ్రైవరు, డాక్టరు.. ఉన్నట్లే రైతు ఉంటే బావుంటుంది. ప్రకృతి వ్యవసాయమే కావాలి. రైతు ఆనందంగా ఉండాలి. సమాజం రైతును ఆదరించాలి. సమాజాన్ని రైతు నమ్మాలి. ఇదే మా సంకల్పం. 

- పైడిమర్రి చంద్రశేఖర్‌, అపర్ణ

చంద్రశేఖర్‌ ఎంబీఏ చేశారు. ఓ బీమా కంపెనీలో ఉద్యోగం చేసేవారు.  ప్లాస్టిక్‌ వాడొద్దు, క్రిమిసంహారక మందులతో భూమిని పాడుచేయద్దని రైతుల్ని కలిసి చెప్పేవారు. కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేశారు.  2010లో బాధ్యత ఫౌండేషన్‌ మొదలు పెట్టాడు. దీన్ని స్థాపించాక నాలుగేళ్లపాటు చంద్రశేఖర్‌, అపర్ణలు రైతుల జీవితాలను లోతుగా అధ్యయనం చేశారు. కర్షకుడి కష్టం తెలుసుకొని వారికి సాయంగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

విద్యార్థుల దగ్గరికి వెళ్లి పోస్టుకార్డుపై ఎకో దీపావళి ఎలా చేయాలో రాయించారు.  మంచి స్పందన వచ్చింది. ఏ.ఎస్‌.రావు నగర్‌ దగ్గరలో ఉండే అనుపురం అనే ఓ కాలనీలో ఆరేళ్లక్రితం వెయ్యిరూపాయలలోపే ఖర్చు చేసి 150 మొక్కలు నాటారు.  ఖాళీ పాల ప్యాకెట్లలో మట్టి పోసి విత్తనాలు వేసి మొలకెత్తించారు.  ఇందుకు నీళ్లు వేయకున్నా బతికే గన్నేరు మొక్కల్ని ఎంచుకున్నారు. దీంతో కాలనీ మొత్తం పచ్చచీర కట్టుకొంది.

- రాళ్లపల్లి రాజావలి, చిత్రాలు: ఆర్‌.రఘు

 


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని