close

తాజా వార్తలు

మామా పెళ్లంటే ఇంత సాధారణమా?

ఖరీదైన ఆహ్వాన పత్రికలు, కళ్లు చెదిరే విద్యుత్తు దీపాలు, అదిరిపోయే మంటపాలు, 100 రకాల పదార్థాలతో భోజనాలు, డ్రోన్‌ వీడియోలు, ఫొటోలు... ఇలా ఉంటాయి నేటి మిలీనియన్ల పెళ్లి ఆలోచనలు. అడుగడుగునా హంగు, ఆర్భాటం దర్శనమివ్వక పోతే వాళ్ల మనసులు విలవిలలాడిపోతాయి. మరి ఇలాంటి కాలంలో ఇద్దరు ఎంతో నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నారు. రూ.36వేలతో వివాహం జరిపించుకున్నారు.  మనసులు ఒక్కటైనప్పుడు.. హంగులు ఆర్భాటాలు ఎందుకనే నూతన దంపతులు అభినవ్‌, లావణ్యల భావాలేంటో? వీరికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో వారి మాటల్లోనే...
 

స్నేహితులకు చెబితే

నేను మొదటి నుంచి ఆధునిక జీవన శైలికి అలవాటు పడలేదు. ఉన్నదాంతో సంతోష పడేవాడిని. ఎందరో గొప్ప వ్యక్తుల ఆదర్శ జీవితాన్ని కళ్లారా చూశాను. నా సోదరి వివాహం గత ఏడాది అతి సాధారణంగానే ఆగ్రాలోని దయాల్‌బాగ్‌ నగర్‌లో రూ.16,100 ఖర్చుతో జరిగింది. ఇప్పుడు వారు సంతోషంగా ఉంటున్నారు. ఈ వివాహం నన్ను బాగా ప్రభావితం చేసింది. రాధాస్వామి సత్సంగ్‌ విధానంలో భాగంగా మా కుటుంబ సభ్యులు ఆచరించిన సాధారణ జీవన విధానమూ ఎంతో నచ్చింది. దీంతో ఇలా ఎటువంటి ఆడంబరాలు లేకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. స్నేహితులకు చెబితే ‘మామా ఇంత సాధారణంగా అవసరమా?’ అన్నారు. తర్వాత వివరిస్తే అంతా సహకరించారు. కొందరు ఢాంబికాలకు పోయి... అతి ఖర్చు చేసి అప్పుల పాలైన వారు గుర్తొచ్చారు. ఆ అప్పులు తీర్చలేక... దాంపత్య జీవితాన్ని సంతోషంగా అనుభవించలేక ఇబ్బంది పడ్డ వారు కళ్లు ముందు మెదిలారు. అతి సాధారణంగా పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చని నిర్ణయించుకున్నా. మన నిరాడంబరత పెళ్లి కుమార్తెకు తెలుస్తుంది.తనూ అలాగే ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఇది జీవితం సాఫీగా సాగిపోవడానికి ఎంతో దోహదం చేస్తుంది.

- అభినవ్‌

గొప్పదనం తెలుసుకొని..

పెళ్లంటే ఆడపిల్లలకు బోలెడు ఆశలుంటాయి. అయినా అభినవ్‌ చెప్పిన విధానం నాకు నచ్చింది. పెళ్లికి ఆరు నెలల ముందు నుంచే సత్సంగ్‌ అలవాట్లను తెలుసుకోవడం మొదలుపెట్టా. డబ్బు ఖర్చుతో కష్టమే తప్ప మరే ప్రయోజనం లేదని గ్రహించి రూ.36 వేల వివాహ క్రతువుకు ఒప్పుకొన్నా. స్నేహితులు ఈ విషయం తెలిసి నివ్వెరపోయారు. ఏమిటిదని ప్రశ్నించారు. తర్వాత నేను వివరించడంతో ఆనంద పడ్డారు.

- లావణ్య

భినవ్‌ బెంగళూరులో బ్యాంకు మేనేజర్‌. ఇతని తండ్రి పట్నాల బసంత్‌కుమార్‌ విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌. వధువు లావణ్య ఎంబీబీఎస్‌. ఈమె తండ్రి వెంకటేశ్వర్లు ఉద్యోగి. నిరాడంబరతే పందిరేసి.. ఔన్నత్యమే పీటలేసి... సదుద్దేశం వరమాలై... సంతోషం తలంబ్రాలై.. ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ ఉద్యానవనంలో నిరాడంబరంగా వీరిద్దరూ ఒక్కటయ్యారు.

- రావివలస సురేశ్‌, విశాఖపట్నం

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.