close

తాజా వార్తలు

అడవుల్లో ఎన్నికల సిగ్నల్‌ 

అరకు, పాడేరు ఏజెన్సీలకు వీహెచ్‌ఎఫ్‌ 
నల్లమలలో శాటిలైట్‌ ఫోన్లకు ప్రతిపాదన 
ఈనాడు డిజిటల్‌, కర్నూలు, విశాఖపట్నం

విశాఖ మన్యం... 
మావోయిస్టుల ప్రాబల్యం.. 
ఏ నెట్‌వర్క్‌ ఫోన్లూ పనిచేయని ప్రాంతం.. 
లోపలి సమాచారం బయటకి తెలియదు... 
వెలుపలి నుంచి ఏ విషయమూ లోపలికి రాదు.. 
ఇలాంటి ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ ఎలా? 
పోలింగు శాతం, శాంతిభద్రతలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసేదెలా? 
ఎన్నికల వేళ సమాచార వ్యవస్థే కీలకం. పోలింగ్‌ రోజు భద్రత, ఓటింగ్‌ శాతం తదితర వివరాలు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు అందజేయాల్సి ఉంటుంది. అయితే అటవీ ప్రాంతాల్లోని ఏజెన్సీల్లో సిగ్నళ్లు అందక ఫోన్లు మూగబోతున్నాయి. దీంతో ఇలాంటి ప్రదేశాల్లో ఎన్నికల నిర్వహణ కత్తిమీదసామవుతోంది. రాష్ట్రంలో అరకు, పాడేరు ఏజెన్సీలతోపాటు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లోని నల్లమలలో అత్యాధునిక సాంకేతిక సమాచార పరికరాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
విశాఖ పరిధిలో... 
విశాఖపట్నం జిల్లాలో 6,293 చ.కిమీల విస్తీర్ణంలో మన్యం విస్తరించి ఉంది. ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతం కావడంతో ఓ వైపు మావోయిస్టుల భయం.. మరోవైపు సమాచార వ్యవస్థ పనిచేయకపోవడంతో ఎన్నికల నిర్వహణ ఉత్కంఠగా ఉంటుంది. విశాఖ ఏజెన్సీలో అరకు, పాడేరు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. పాడేరులో 104 పోలింగ్‌ కేంద్రాలు, అరకులో 94 కేంద్రాలు పూర్తిగా సమాచార వ్యవస్థకు దూరంగా ఉన్నాయి. 
నల్లమలలో... 
నల్లమల అటవీ ప్రాంతం 150 కి.మీ. విస్తరించి ఉంది. గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాలతోపాటు, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. కర్నూలు పరిధిలో ఐదు కేంద్రాలు పూర్తిగా సమాచార వ్యవస్థకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. పోలింగ్‌బూత్‌ల వారీగా చూస్తే.. శ్రీశైలం పరిధిలో పెద్దచెరువు (121 ఓటర్లు), బైర్లూటి (415 ఓటర్లు), లింగాలగట్టు (908 ఓటర్లు), కొత్తపల్లి సమీపంలో బలపాలతిప్ప (220 ఓటర్లు), శిరువెళ్ల పరిధిలో పచ్చర్ల (218 ఓటర్లు) ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో అర్థవీడు మండలంలోని మారుమూల ప్రాంతాల్లో 8 పోలింగ్‌ కేంద్రాలుండగా, యర్రగొండపాలెం పరిధిలో 6 ఉన్నాయి. కడప జిల్లాలోని నల్లమల పరిధిలో 8 కేంద్రాల్లోనూ సిగ్నళ్లు ఉండవు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని 150 కేంద్రాల్లో, పశ్చిమగోదావరి జిల్లాలో 14 కేంద్రాల్లో ఇదే పరిస్థితి. 

ప్రత్యామ్నాయం.. వీహెచ్‌ఎఫ్‌ 
సిగ్నల్స్‌ లేని ప్రాంతాల్లో వీహెచ్‌ఎఫ్‌ (వెరీ హై ఫ్రీక్వెన్సీ) సెట్లను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు చూస్తున్నారు. ఇందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ వీహెచ్‌ఎఫ్‌ సెట్‌ను ఉపయోగించి 30 కి.మీ. నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలకు సంభాషించడానికి వీలుంటుంది. సమాచార వ్యవస్థ లేని పోలింగు కేంద్రాలన్నింటికీ ఈ సెట్లను పంపించనున్నారు. చూడటానికి వాకీ టాకీల్లా ఉండే వీటి ద్వారా నియోజకవర్గ కేంద్రంలోని ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు పోలింగు వివరాలు, భద్రతా పరమైన విషయాలపై సమాచారాన్ని తెలియజేయవచ్చు. కర్నూలు జిల్లాకు శాటిలైట్‌ ఫోన్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. లేని పక్షంలో ఇక్కడా వీహెచ్‌ఎఫ్‌ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నల్లమల ఆనుకుని సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కొంతమేర వచ్చే గ్రామాల్లో సిగ్నల్స్‌ను మరింత పెంచేందుకు రిపీటర్‌ ఏర్పాటు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.