close

తాజా వార్తలు

వనస్ఫూర్తిగా..

అక్కడ గాంధీ తాత.. నెహ్రూ చాచా.. చల్లగా కొలువుదీరారు.
ఆ చెంతనే ఆజాద్‌, భగత్‌సింగ్‌ ఊగిపోతున్నారు.
తాంతియాతోపే, మంగళ్‌పాండే ప్రశాంతంగా ఉన్నారు.
వీళ్లంతా ఒక్కచోట ఉండటం ఏంటి? అనుకుంటున్నారా!
మొక్కవోని దీక్షతో స్వతంత్ర సమరంలో పాల్గొన్న యోధులు ఇప్పుడు మొక్కల రూపంలో దర్శనమిస్తున్నారు.
మానులై.. మనసుల్లో జాతీయభావాన్ని నింపుతున్నారు.

1992.. క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగి 50 వసంతాలైన సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు జరుగుతున్న సమయం. దేశభక్తులను తలుచుకొని రొమ్ము విరుచుకున్నారు. వారి త్యాగాలను పొగుడుతూ ఉపన్యాసాలు ఇచ్చారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా బలేవాడికి చెందిన రైతు, సామాజిక కార్యకర్త సంపత్‌రావు పవార్‌ కొత్తగా ఆలోచించాడు. గొప్పగా ఆలోచించాడు. ఆ త్యాగమూర్తుల కీర్తిని ‘పచ్చగా’ పదికాలాలు నిలపాలని భావించాడు. సాంగ్లీ పట్టణ శివారులో కొందరు విద్యార్థుల సాయంతో వందల సంఖ్యలో మొక్కలను నాటాడు. ఒక్కో మొక్కకు ఒక్కో సమరయోధుడి పేరును పెట్టాడు. 1992 నుంచి 1998 వరకు 1,475 మొక్కలను నాటాడు. అన్నిటికీ పేర్లు పెట్టాడు.
సంపత్‌రావు సంకల్పాన్ని నిబంధనలు కూల్చివేశాయి. ఆయన మొక్కలు నాటిన భూమి తమదంటూ అటవీశాఖ అధికారులు కన్నెర్ర చేశారు. మొక్కలన్నింటినీ తొలగించారు. అయినా ఆయన కుంగిపోలేదు. బలేవాడిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రాన్ని వనసీమగా మార్చాలనుకున్నాడు. జీవనాధారమైన నాలుగు ఎకరాల భూమిని జాతినేతలకు అంకితమిచ్చాడు. వ్యవసాయ భూమిలో మళ్లీ వందల సంఖ్యలో మొక్కలు నాటాడు. వాటికి స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాడు. ‘బంగారం పండే భూమిని ఇలా చేయడం ఏంటని’ ఇంటా బయటా విమర్శించినా.. పట్టించుకోలేదు. ‘క్రాంతి వన్‌’ పేరిట భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించిన వీరులకు వనస్ఫూర్తిగా నివాళులు అర్పించాడు. క్రాంతి వన్‌ ఏర్పాటులో ఆయనను ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. మొక్కలకు నీటి కోసం బావి తవ్వే క్రమంలో సంపత్‌రావు కొడుకు వైభవ్‌ ప్రమాదవశాత్తు అందులో పడి మరణించాడు. చెట్టంత కొడుకు దూరమైనా.. మొక్కలను వీడి పోలేదాయన. వాటి సంరక్షణే దినచర్యగా చేసుకున్నాడు. ఇప్పుడీ వనంలో 700కు పైగా మొక్కలు పెరుగుతున్నాయి. కొన్ని చెట్లయ్యి చల్లని నీడనిస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రసాదిస్తున్నాయి. స్వతంత్ర సాధకుల గొప్పదనాన్ని ఈతరానికి  తెలియజేస్తున్నాయి. ఈ అద్భుత వనాన్ని వీక్షించడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. సాంగ్లీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని పాఠశాలల నుంచి విజ్ఞాన యాత్రలో భాగంగా విద్యార్థులు క్రాంతి వన్‌ సందర్శిస్తున్నారు. ప్రతి చెట్టును ముట్టుకొని.. అమరజ్యోతులకు జోతలు అర్పిస్తున్నారు. సంపత్‌రావుకు జేజేలు పలుకుతున్నారు.

- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి, ఈనాడు, మహబూబ్‌నగర్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.