close

తాజా వార్తలు

ఈ నరేంద్రుడు ఆదివాసీల వైద్యనాథుడు

సామాజిక నేపథ్యం ఉన్న సినిమా చూస్తే.. ‘అందులో హీరోలా ఏదైనా చేయాలని భావిస్తాం..’ థియేటర్‌ నుంచి బయటకొచ్చాక మామూలే! ఓ గొప్ప సామాజికవేత్తను కలిస్తే..  ‘ఆయనలా నలుగురికీ మేలు చేయాలని భావిస్తాం..’  ఆ నీడ వీడగానే షరా మామూలే!!  ఈ వైద్యుడు మాత్రం.. అలా కాదు. సేవాస్పృహలో.. మంచి సంపాదన వదులుకున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆదివాసీలకు అన్నయ్యాడు. అనారోగ్యం బారినపడితే చెట్ల పసర్లు, వాతల గాయాలతో బతుకీడుస్తున్న అభాగ్యులకు వైద్యనాథుడయ్యాడు.  తనవారిని వదిలి వనవాసం చేస్తూ అక్కడి వారికి ‘నేనున్నాని.. మీకేం కాదంటూ’ భరోసానిస్తున్నాడు. అడవి బిడ్డల ఆత్మీయ వైద్యుడిగా ఆపన్న హస్తం అందిస్తున్న రమావత్‌ నరేంద్రుడి స్ఫూర్తిదాయక కథ..

డాక్టర్‌ రమావత్‌ నరేందర్‌
ఊరు: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ దగ్గర ముత్యాలమ్మ గుడి తండా.
పుట్టింది, పెరిగింది: హైదరాబాద్‌
నాన్న: ఆర్టీసీలో డ్రైవర్‌ (రిటైర్డ్‌)
అమ్మ: గృహిణి
తోబుట్టువులు: ముగ్గురు చెల్లెల్లు (డాక్టర్లు)
విద్యార్హత: హోమియో వైద్యం
భార్య: డాక్టర్‌ స్వాతి (గైనకాలజిస్ట్‌), చిట్యాలలో ప్రభుత్వ వైద్యురాలు
పిల్లలు: ఒక పాప (ఆరేళ్లు)
* ఇటు వైపు ఎలా?
హోమియో వైద్యం పూర్తి చేశాక.. రామాంతాపూర్‌లో ఓ క్లినిక్‌ ప్రారంభించారు నరేంద్ర. కొన్నాళ్లకే గుర్తింపు వచ్చింది. ధన ప్రవాహమూ మొదలైంది. రెండేళ్లు గడిచాయి. నరేంద్రలో ఏదో ఆవేదన! సంపాదన చట్రంలో ఇరుక్కున్నానా? అని బాధపడేవాడు. అవసరం లేకున్నా మందుబిల్లలు రాస్తున్నానా అని అనుమానం. పరీక్షలు సిఫార్సు చేయడం, వాటిపై కమీషన్లు తీసుకోవడం అనివార్యమైంది. కొన్నాళ్లకు రోగిని చూడగానే.. ఎక్కువ కమీషన్‌ లభించే మాత్రలే గుర్తుకు రావడం మొదలైంది. తనపై తనకే విసుగొచ్చేసింది. ఒకరి పొట్టకొట్టి బతకడం.. ఇదేం జీవితం అనిపించింది. ఆయనలో అంతర్మథనం మొదలైంది. దానిలో నుంచి అన్వేషణ ప్రారంభమైంది.
* స్ఫూర్తి వారి నుంచే..
మార్పు కోరుతున్న మనసును గూగుల్‌లో ఓ మహోన్నత వ్యక్తికి సంబంధించిన సమాచారం బాగా ఆకర్షించింది. ఆయనే డాక్టర్‌ హనుమప్ప సుదర్శన్‌. మాజీ రాష్ట్రపతి కలాం స్నేహితుడాయన. ఆదివాసీ హక్కుల ఉద్యమనేతగా గుర్తింపు పొందారు. అడవిలో ఆదివాసీలకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లిపోయారు నరేంద్ర. కర్ణాటకలోని బీఆర్‌ హిల్స్‌లో నిరుపేద రోగులకు అందిస్తున్న వైద్యసేవలను ప్రత్యక్షంగా చూశారు. అదే నరేంద్రలో మార్పు తెచ్చింది. ఆ క్షణంలోనే ఆదివాసీల ఆరోగ్య రక్షకుడిగా కొత్త అవతారమెత్తాడు. మరోవైపు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా హేమల్‌కసాలో ప్రఖ్యాత సామాజికవేత్త డాక్టర్‌ ప్రకాశ్‌బాబా ఆమ్టేనూ కలిశారు. ఆయన ఆశ్రమంలో కొన్ని రోజులు గడిపారు. వీరిద్దరి సహచర్యంతో ‘ఏమీ లేనివారికి, ఏమీ ఆశించకుండా సేవ చేయడమే నిజమైన వైద్యమ’ని నిశ్చయించుకున్నారు నరేంద్ర.
* మారుమూలకు..
ఈ ప్రయాణానికి ముందు తన క్లినిక్‌ షట్టర్‌ మూసేశారు నరేంద్ర. ఇంట్లో వాళ్లు వారించినా వినలేదు. అంతరాత్మ ప్రబోధానుసారం నడిచారు. తన సొంతూరు సమీపంలో దాదాపు 30 తండాల్లో ఉచితంగా వైద్యం అందించడం ప్రారంభించారు. ఈ తండాలు వెనుకబడినవే అయినా.. టీవీ, మొబైల్‌ఫోన్‌ వంటివి ఉపయోగిస్తూ ఆధునిక జీవనశైలికి అలవాటుపడినవారే ఎక్కువమంది ఉన్నారక్కడ. ‘ఇంకా మారుమూలకు వెళ్లాలి, అసలు సిసలు అమాయక ప్రజలను ఆదుకోవాల’నుకున్నారు. కొత్తగూడెం, పాల్వంచ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. పత్రికలు, సమాచార మాధ్యమాల్లో ఖమ్మం జిల్లా కొత్తమేడిపల్లి అనే మారుమూల పల్లెలో గొత్తికోయలు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. చేతిలో సంచి.. అందులో మందులు వేసుకొని ఆ ఊరికి ఒక్కడే బయల్దేరారు.
సరికొత్త మలుపు
వాగులు, వంకలు, దట్టమైన అడవి.. అతికష్టం మీద ద్విచక్ర వాహనం వెళ్లగలిగే దారి, ఎప్పుడే జంతువు మీద పడుతుందో తెలియని పరిస్థితి.. ఉప్పొంగే వాగులు, ఇసుక దిబ్బలు.. ఇవన్నీ దాటుకుంటూ రాళ్లచెలకకు చేరుకోగానే.. తన గమ్యమిదేనని నరేంద్రకు అర్థమైంది. విద్య, వైద్యం, విద్యుత్‌ వంటి కనీస వసతుల్లేని గూడెమది. తెలుగు భాష కూడా రాదు అక్కడి వారికి. బయటి వ్యక్తిని ఆదివాసీలు అంత తొందరగా నమ్మరు. అంచెలంచెలుగా వారికి దగ్గరయ్యారు నరేంద్ర. గొత్తికోయల భాషను సైతం నేర్చుకున్నారు. ఆ ఒక్క గూడెమే కాదు.. చుట్టుపక్కల 149 చిన్న చిన్న గూడేలు ఉన్నాయనీ, అక్కడ 30 వేల మందికి పైగా ఆదివాసీలు ఉంటున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 40 గూడేలకు ప్రత్యక్షంగా వెళ్లి వైద్యం అందిస్తున్నారు. 20 గూడేల్లో నిరంతర వైద్యం అందుబాటులోకి తెచ్చారు.

* కష్టాల బాటలో
దాదాపు ఏడాదిన్నర కిందట మొదలైన డాక్టర్‌ నరేంద్ర ఆదివాసీల సేవా ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఆయన అడవిబాట పట్టిన తొలి రోజుల్లో ఖమ్మంలో తెలిసిన స్నేహితుడి దగ్గర కొన్నాళ్లు ఉన్నారు. ఓసారి ఆ స్నేహితుడు ఊరెళ్తే.. ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ షట్టర్‌ ముందు మూడు రోజులు తలదాచుకున్నానని గుర్తుచేసుకున్నారు నరేంద్ర. తొలినాళ్లలో వారానికి ఒకసారి గూడేలకు వెళ్లేవాణ్ని. హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం వరకు బస్సులో వచ్చి, అక్కడి నుంచి బైక్‌పై వెళ్లేవారు. బైక్‌నే సంచార వైద్యశాలగా మార్చారు. అవసరమైన మందులు వెంట తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఐదు రోజులు అక్కడే ఉంటున్నారు. క్రాంతినగర్‌ గూడెంలో ఓ క్లినిక్‌ ప్రారంభించారు. వారాంతాల్లో హైదరాబాద్‌ వెళ్లొస్తున్నారు. వైద్యంలో తనకు సాయంగా ఉండడానికి స్థానికులకు ఆరోగ్య కార్యకర్తలుగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గురికి తర్ఫీదునిచ్చారు. ఈ ముగ్గురూ ఒక్కొక్కరూ రోజుకు మూడు గూడేల చొప్పున పర్యటించి చిన్నచిన్న వైద్యసేవలు అందిస్తున్నారు. ముగ్గురికీ కలిపి నెలకు రూ.6వేలు వేతనంగా ఇస్తున్నారు నరేంద్ర. ఈ మొత్తం హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యుడు సమకూరుస్తున్నారు.
* స్నేహితుల అండదండలు
రోగులకు ఔషధాలు సరఫరా, మెరుగైన వైద్యానికి ఆర్థిక సాయం, అవసరార్థులకు నిత్యావసర వస్తువులు అందించడం, దుస్తుల పంపిణీ తదితర సేవలకు కొందరు ముందుకొస్తున్నారు. వైద్య మిత్రులు, సాఫ్ట్‌వేర్‌ స్నేహితులు సాయం అందిస్తున్నారు. రాళ్లచెలకలో 20 మంది వైద్యులు కలిసి సౌరఫలకలు ఏర్పాటు చేసి ఇంటింటికీ విద్యుత్‌ వెలుగులు ప్రసాదించారు. ఇక్కడి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా.. 25 గూడేల్లో సౌర దీపాలను ఏర్పాటు చేశారు. సౌరశక్తితో వెలిగే వీధి దీపాలను కూడా ఏర్పాటు చేస్తున్నామనీ, ఇప్పటికే మూడు గూడేల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని ఆనందంగా చెప్పుకొచ్చారు నరేంద్ర.

- అయితరాజు రంగారావు, ఈనాడు, హైదరాబాద్‌

ప్రజల వద్దకు వైద్యం

పోషకాహార లోపం ఆదివాసీలకు శాపం. 90 శాతం మంది సమస్య ఇదే. ప్రసవం సమయంలో తల్లీబిడ్డలకు ఇన్‌ఫెక్షన్లు సోకడం, తీవ్ర రక్తస్రావం కావడం ఇద్దరి ప్రాణాలు పోవడం ఇక్కడ సర్వసాధారణం. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే.. డోలీ కట్టుకొని మోసుకుపోవాల్సిందే! అలా ఆరు కిలోమీటర్లు తీసుకెళ్తే గానీ 108 సేవలు పొందలేని స్థితి. ఈ సమస్యకు పరిష్కారంగా మూడుచక్రాల సైకిల్‌ రిక్షా అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు నరేంద్ర.

పిల్లల కోసం బడి

తన సేవలను వైద్యానికే పరిమితం చేయలేదు నరేంద్ర. రాళ్లచెలకలో వైద్య సేవలతో పాటు అక్కడి పిల్లలకు విద్యనందించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ అధికారులతో మాట్లాడి బాలవెలుగు పథకం కింద ఓ బడి ఏర్పాటు చేశారు. బడయితే వచ్చింది కానీ, పాఠాలు చెప్పే వాళ్లేరి. సమీప గ్రామాల్లో అక్షర జ్ఞానం ఉన్న యువకులను గుర్తించి వారికి ‘గురు’తర బాధ్యతను అప్పగించారు. అలా రాళ్లచెలక, క్రాంతినగర్‌, చింతల్‌మేధి పల్లెల్లో 85 మంది చిన్నారులను బడిబాట పట్టించారు. 

మా ఆవిడే డబ్బులిస్తుంది
‘బంగారంలాంటి ప్రాక్టీస్‌ వదిలిపెట్టి అడవులెంట తిరగడం అవసరమా?’ అని మా అమ్మానాన్నలు అడ్డుతగిలారు. నాపైన ఎవరో చేతబడి చేశారని మంత్రగాడి దగ్గరికీ తీసుకెళ్లారు. కానీ నేను దృఢ నిశ్చయంతో ఉండడంతో వదిలేశారు. మా ఆవిడ తొలుత వ్యతిరేకించినా.. నా పట్టుదల చూసి తనూ సహకరించడం మొదలెట్టింది. ఇప్పుడు తన జీతం నుంచి నా ఖర్చుల కోసం నెలనెలా రూ.5వేలు ఇస్తుంటుంది. నా తిండి ఖర్చులు, పెట్రోల్‌ ఖర్చులను కొందరు స్నేహితులు భరిస్తున్నారు. వారందరి సహకారం లేకుంటే నేను ఇలా ముందుకెళ్లేవాడిని కాను. ఇక్కడ తాగునీటికి, ఇతర అవసరాల కోసం కనీసం 5-6 కి.మీ. ప్రయాణిస్తుంటారు. ఈ సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలి.

- డాక్టర్‌ నరేంద్ర

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.