చెత్త వీళ్లకు బంగారం!
close

తాజా వార్తలు

Published : 05/06/2019 00:20 IST

చెత్త వీళ్లకు బంగారం!

ప్రపంచ పర్యావరణ  దినోత్సవం సందర్భంగా

ఒక టన్ను పేపర్‌ రీసైక్లింగ్‌ చేస్తే పదిహేడు చెట్లను రక్షించినవాళ్లం అవుతాం. ఒక ప్లాస్లిక్‌ సీసా రీసైక్లింగ్‌ నెలకు అరవై వాట్ల విద్యుత్‌ని ఆదా  చేస్తుంది.  ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌ భూమిలో కలవడానికి సుమారు ఐదువందల ఏళ్లు పడుతుంది. ఇన్ని తెలిసినా  పర్యావరణానికి హాని చేస్తుంటాం. తిరిగి వాడుకోగల వస్తువుల్ని సైతం ఏమీ ఆలోచించకుండా పడేస్తుంటాం. కానీ... ఈ మహిళలు మనలా కాదు... పర్యావరణహిత స్టార్టప్‌లతో సమాజానికి మేలు చేస్తున్నారు. ఆదాయాన్నీ పొందుతున్నారు.

అమ్మ నేర్పిన విద్యతో...

ఏ వస్తువూ వృథా కాదు... అని తల్లి పాటించిన సూత్రాన్నే స్ఫూర్తిగా తీసుకున్న శిఖా షా... స్క్రాప్‌శాలను ప్రారంభించింది. వృథా వస్తువులెన్నింటినో తిరిగి వాడుకునేలా చేస్తోంది.

చిన్నప్పుడు శిఖ వాళ్లమ్మ మధుషా ఇంట్లో ఎక్కడా చెత్త కనబడనిచ్చేది కాదట. అలాని పారేసేది కాదు. కాస్త సృజనాత్మకంగా ఆలోచించి, వృథా అనుకున్న వస్తువును ఉపయోగపడేలా మార్చేది. చిన్నప్పటినుంచీ అవన్నీ చూసిన శిఖకు కూడా పర్యావరణంపై ఆసక్తి పెరిగింది. తల్లి మాటలతో ప్రభావితమై... ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో ఎంఎస్‌ చేసింది. దిల్లీలో చదువు పూర్తి చేసుకున్న ఆమెకు ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగే అవకాశం లభించింది. అలా ప్రయాణించినప్పుడు.. ఎక్కడ చూసినా చెత్తే కనిపించేదట. దాని నిర్వహణ సరిగా లేకపోవడం ఓ సమస్య అయితే...వాటివల్ల నీరు, గాలి, భూమికి కలిగే హాని గురించి తెలుసుకుంది. అప్పుడు తట్టిన ఆలోచనే ‘‘స్క్రాప్‌శాల’’. అదే సమయంలో ఐఐటీ మద్రాస్‌ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి అవకాశం కల్పిస్తోందన్న విషయం తెలిసి దరఖాస్తు చేసుకుంది. అక్కడ రెండు నెలల కోర్సు పూర్తి చేశాక సొంతూరు వారణాసికి వెళ్లిపోయింది. తన ఆలోచనను అమ్మ మధు, తన చిన్ననాటి స్నేహితురాలు కృతీసింగ్‌లతో పంచుకుంది. వారు తన ఆలోచనను సమర్థించడంతో ముగ్గురూ కలిసి బృందంగా ఏర్పడి సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా చెత్తను రీసైకిల్‌ చేసి అందమైన వస్తువులుగా మలచి మార్కెట్‌ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు పబ్లిక్‌ క్లౌడ్‌ బేస్డ్‌ డేటాబేస్‌తో ప్రజల్లో అవగాహన తీసుకు వచ్చే ప్రయత్నం కూడా చేసింది శిఖా బృందం. ఇందుకోసం గ్రామీణ మహిళలకు శిక్షణ ఇప్పించింది. ఈ క్రమంలోనే పలు ఎన్‌జీవోలతో కలిసి పనిచేస్తోంది. అంతేకాదు ‘వృథా చాలా విలువైనది’ అంటూ ప్రచారం చేస్తూ ఎన్నో ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తోంది. ఇందుకోసం లక్షల రూపాయల జీతాన్ని తృణప్రాయంగా వదిలేసుకుంది. ఇప్పటివరకూ సుమారు పదివేల కిలోల చెత్తను అందమైన వస్తువులుగా తీర్చిదిద్దింది. 50000కుపైగా ప్లాస్టిక్‌ సీసాలను ఇప్పటివరకూ కొత్తగా ఉపయోగించింది. వీటిని అమెజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్‌, క్రాఫ్ట్‌విల్లా వంటి సుమారు పదిహేను ఈ-కామర్స్‌సైట్లలో అమ్మకానికి ఉంచుతోంది. దీనిద్వారా వచ్చే ఆదాయంలో కొంత మహిళలకు ఉపాధి శిక్షణ కల్పించడానికి ఉపయోగిస్తోంది. ఎందరో గ్రామీణ కళాకారులకు, మహిళలకు శిక్షణ ఇచ్చి స్క్రాప్‌ని అందమైన వస్తువులుగా మలిచే సామర్థ్యాన్ని వారికి అందించింది. దీనిద్వారా సుమారు వందమందికిపైగానే ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు ఎవరైనా ఆసక్తి కొద్దీ నేర్చుకోవాలనుకున్నా ఉచితంగా నేర్పిస్తానంటోంది శిఖా షా.

ఒక్క మిస్డ్‌కాల్‌తో...

ఎక్కడపడితే అక్కడ పేరుకుపోతోన్న చెత్తకు ఓ పరిష్కారం వెతకాలనుకున్నారు ముగ్గురు మహిళలు. ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకుందే స్క్రాప్‌క్యూ. బిందు, రీతు, లత, శైలజ... ఈ సంస్థను ప్రారంభించారు.

సౌకర్యం కోసం మనం వినియోగిస్తున్న ఎన్నో వస్తువుల్ని... కొన్నాళ్లకే వృథా అంటూ పక్కన పడేస్తాం. ఇక నగరాల పరిస్థితి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇవి చెత్తకు అడ్డాలు. ఇంట్లోని వస్తువులన్నీ పోగేసి ఓ మూలన పెట్టి ఎప్పుడు ఆ పాతవస్తువులు కొనేవాడు వస్తాడా అని ఎదురుచూసేవాళ్లూ ఉంటారు. చివరకు స్క్రాప్‌ దుకాణానికి వేయడమో లేదా పారేయడమో చేస్తారు. అవేవీ లేకుండా కేవలం ఓ మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు.. అలా వృథా అనుకున్న చెత్తను ఇంటికొచ్చి మరీ సేకరిస్తుంది హైదరాబాద్‌కి చెందిన స్క్రాప్‌క్యూ సంస్థ. దీని నిర్వాహకులు హిమ బిందు చామకూర, రీతూ సుంకర, పుష్పలత, శైలజ... స్నేహితులు. నిత్య జీవితంలో తమకు ఎదురైన సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నారు. ఒకప్పుడు వాళ్ల ఇళ్లల్లో కూడా చెత్త పేరుకునేది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. దాన్ని వృథాగా పారేయకుండా ఏదయినా సంస్థ తీసుకుంటుందేమోనని అంతర్జాలంలో శోధించారు. అసలు చెత్తను రీసైకిల్‌ చేసే సంస్థలపైనా అధ్యయనం చేశారు. చివరకు వృథాను సేకరించడం ఓ పెద్ద సమస్య అని అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్లే పరిష్కారం ఆలోచించి స్క్రాప్‌క్యూని ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. ఓ మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు ఇంటికే వచ్చి  పనికిరాని వస్తువులను తీసుకెళ్తారు. ఇది చేస్తూనే గేటెడ్‌ కమ్యూనిటీలు, సంస్థల దగ్గరకు వెళ్లి అవగాహనా సదస్సులు, వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ డ్రైవ్‌లు మొదలుపెట్టారు. అలానే స్థానికంగా చెత్తను సేకరించే వ్యక్తులకు టెక్నాలజీ సహకారం అందించడం మొదలుపెట్టారు. ఇళ్లను నుంచి సేకరించిన వృథాకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. దాన్ని అనుమతి పొందిన రీసైక్లింగ్‌ పరిశ్రమలకు పంపిస్తారు. ఇంట్లో పడేసిన పేపర్‌లు, ప్లాస్టిక్‌, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను కొనుగోలు చేస్తారు వీళ్లు. ఇలా ఇప్పటివరకూ సుమారు 45 వేల మంది వీరికి ఖాతాదారులయ్యారు. వాటిల్లో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యశోదా హస్పిటల్స్‌ వంటి సంస్థలూ ఉన్నాయి. అంతేకాదు లాయర్లు, ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ల వంటి ప్రొఫెషనల్స్‌ కోసం ష్రెడ్డింగ్‌ సర్వీసెస్‌ కూడా అందిస్తున్నారు. ఇలా వీరు సంపాదించిన మొత్తంలో ఎక్కువ శాతాన్ని చిన్నపిల్లల వైద్యం విద్య వంటి వాటిపై పనిచేసే హ్యాపీ స్మైల్‌ ఫౌండేషన్‌ కోసం ఖర్చు చేస్తున్నారు. 040-30707070ని సంప్రదించినా స్క్రాప్‌క్యూ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నా మీ ఇళ్లల్లో చెత్త సమస్య అనేదే ఉండదంటోంది ఈ మిత్ర బృందం.

స్క్రాప్‌... వ్యాపార మార్గంగా

మనం నడుస్తున్న దారిలో మురికి కుప్ప కనిపిస్తే ముక్కు మూసుకుంటాం. ఆ వ్యర్థాల నుంచి దూరంగా నడుస్తాం. అయితే ఆ వ్యర్థాలకు కొత్త అర్థాలను చెప్పి పర్యావరణానికి మేలు చేస్తోంది ముంబయికి చెందిన దివ్యా రవిచంద్రన్‌.

దివ్య స్వస్థలం ముంబయి. తండ్రి డిఫెన్స్‌ ఉద్యోగి కావడంతో ఆమె దేశంలోని వివిధ ప్రాంతాలు చుట్టొచ్చింది. రెండేళ్ల క్రితం ముంబయిలో దివ్య ఇంటికి దగ్గర్లో ఓ అగ్నిప్రమాదం జరిగింది. ‘ఆ మంటలు నింగికెగిశాయి. పొగలు ఆ ఇంటిని కొన్నిరోజులు కమ్మేశాయి. ఆ సమయంలో కాలిపోయిన వ్యర్థాలను వేరు చేసే పని మొదలుపెట్టే ముందు మరో పెద్ద సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నా. చివరకు నేను అనుకున్నది సాధించా. చెత్తతో నిండిన ఆ ప్రాంతాన్ని చూసి నాకు మతిపోయినంత పనైంది. దాన్ని ఆటస్థలంలా భావించి పిల్లలు ఆ పక్కనే ఆడుకుంటున్నారు. భరించలేని దుర్గంధం. కాసేపు కూడా ఉండలేకపోయా. దాన్ని బాగు చేసే పరిష్కారం ఆలోచించా...’ అని అంటోంది దివ్య. అలా 2017లో నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో ‘స్క్రాప్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ వృథాకు పరిష్కారాలు ఆలోచించడమే కాదు పెద్దస్థాయి కార్యక్రమాలు, వేడుకల్లో తన సేవలను అందిస్తుంది. అంతేకాదు కార్యాలయాల్లోని వ్యర్థాలను ఎలా ఉపయోగకరంగా మార్చుకోవాలో కూడా చెబుతుంది.

రెండు రకాలుగా... ఈ సంస్థ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి ఏదయినా వేడుకకు ముందు... ఎలాగంటే... వేడుక జరగడానికి ముందు దివ్య బృందం ఆ యాజమానులతో మాట్లాడుతుంది. వీలైనంతవరకూ భూమిలో కలిసిపోయే వస్తువులనే వాడమని కోరుతుంది. అలాగే ఈ బృందంలోని సభ్యులు తిరిగి వాడుకునే వస్తువుల పట్టికను తయారుచేసి   సంబంధిత యజమానికి అందజేస్తారు. ఇక, కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా... బృంద సభ్యులు వేదిక వద్ద అతిథులు వ్యర్థాలను పడేయడానికి అనుగుణంగా వివిధ ప్రదేశాల్లో పెద్దగా ఉండే రంగుల డబ్బాలను ఏర్పాటు చేస్తారు. వేడుక జరిగే చోట ఎక్కడా చెత్త  కింద పడకుండా చూసేందుకు ప్రత్యేక బృందం అక్కడ సిద్ధంగా ఉంటుంది. అలా ఆ వృథాను సేకరించి... క్రమపద్ధతిలో పెడతారు. వాటిలో ఉపయోగకరమైన వాటిని సహజ ఎరువుల తయారీకి, రీసైక్లింగ్‌కి పంపిస్తారు. అలా ఈ సంస్థ ఇప్పటివరకు పాతికకు పైగా కార్యక్రమాలు నిర్వహించింది. ఇది ఇతర స్వచ్ఛంద సంస్థలతో అనుసంధానమై ఉంటుంది. ‘మేం చేయాల్సింది ఇంకా ఉంది. మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడంలో మాకూ కొన్ని సవాళ్లు తప్పలేదు. ఈ సంస్థ పెట్టిన కొత్తలో ఎవరూ మా సాయం కోరలేదు. కొన్నాళ్ల తరువాత నెమ్మదిగా మార్పు మొదలైంది. ప్రస్తుతం వినియోగదారులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఒక కార్యక్రమానికి నలభై వేల రూపాయల నుంచి మూడు లక్షల వరకు తీసుకుంటాం. కేవలం వృథాను సేకరించడమే కాదు... రీసైక్లింగ్‌ కాని వస్తువులను కూడా మేం వేరు చేస్తాం.’ అని చెబుతోంది దివ్య.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని