close

తాజా వార్తలు

Published : 18/11/2019 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ పల్లెల్లో సిరి సౌర మువ్వలు

సౌరశక్తితో ఏం చేయొచ్చు... దీపాలు వెలిగించొచ్చు... చీకట్లు పారదోలొచ్చు... పేదరికాన్నీ దూరం చేయొచ్చని నిరూపిస్తుందో సంస్థ. కనీస సౌకర్యాలు లేని ప్రాంతాల్లో, నిరుపేదలున్న గూడేల్లో, అభివృద్ధికి ఆస్కారమేలేని గ్రామాల్లో కొత్త సూర్యోదయాన్ని చూపుతున్నారు వారు. కర్ణాటకలోని ఈ కుగ్రామలను చూస్తే ‘ఔరా... సౌర!’ అనక తప్పదు...

కర్ణాటకలోని మలెమహదేశ్వరం... పశ్చిమ కనుమల్లోని దట్టమైన అటవీప్రాంతం...
నిన్నమొన్నటిదాకా వీరప్పన్‌ పదఘట్టనలతో... ఇప్పటికీ వన్యమృగాల భయంతో ఉలికులికిపడుతుంటుందా ప్రాంతం.
ఈ కొండల్లోని కుగ్రామాలకు ప్రభుత్వ పథకాలు నేరుగా చేరే అవకాశం అసలు లేదు.
బండలతో కొండరాళ్లతో నిండిన ఇరుకైన ఎత్తుపల్లాల రహదారులు ఆ ప్రాంతాన్ని బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరం చేశాయి.
అక్కడ వెలుగంటే సూర్యకాంతే. రాత్రయితే చిమ్మచీకట్లే. తాగునీటి వసతి లేదు. చిన్న వాగుల్లో, వంకల్లో నీటితో నిత్యావసరాలు గడుపుకోవడమే.
పిండిమర పట్టించాలన్నా, టైలర్‌తో బట్టలు కుట్టించుకోవాలన్నా, కనీసం పెన్సిల్‌ కొనాలన్నా కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే.
అలాంటి ప్రాంతానికి కొత్త వెలుగులు తీసుకురావాలని సంకల్పించింది సెల్కో. సౌరశక్తిని దీనికి ఇంధనంగా వాడుకోవాలనుకుంది.
2010లో తమ ఫౌండేషన్‌ ద్వారా సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది.

ఇలా చేసింది...

మొదట అక్కడి ప్రజల జీవన స్థితిగతులపై క్షుణంగా అధ్యయనం చేసింది. అక్కడి ప్రజల అవసరాలేంటో సమీక్షించింది. తొలుత ప్రతి గ్రామంలో తగినన్ని సౌరఫలకాలను ఏర్పాటుచేసింది. దాని నిర్వహణపై అక్కడి ప్రజలకు శిక్షణనిచ్చింది. వాటి బాధ్యతను అప్పగించింది. సౌరశక్తితో నడిచే పలు ఉపకరణాలను అతి తక్కువ ఖర్చుతో అందించింది. వాటిని వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి ఉపయోగపడేలా మలిచింది. దీంతో కనీసం ఒక బల్బుకు నోచుకోని ఆ గ్రామాల్లో వీధి దీపాలు వెలుగుతున్నాయి. వందలాది విద్యుత్తు పరికరాలు పనిచేస్తున్నాయి. ఫ్రిజ్‌లు, పిండిమరలు, బావి నుంచి నీటిని తోడే మోటర్లు, కుట్టుమిషన్లు, ఆరోగ్య పరికరాలు, చివరకు శీతలగిడ్డింగులు కూడా వచ్చేశాయి. గిరిజన ప్రాంతాల్లో సౌరశక్తి అఖండశక్తితో వెలుగులీనుతోంది.

ఈ ప్రాజెక్టు విషయంలో సెల్కో బాధ్యత తీసుకోవడంతో పాటు  కొన్ని ఎన్‌జీవోల సహకారమూ తీసుకుంది. ప్రజలకు ఉపకరణాలు కొనిచ్చేందుకు కొన్ని సంస్థలు, బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. చామరాజనగర్‌జిల్లా కొళ్లెగాల తాలూకాలోని గ్రామాల బాధ్యతను ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంస్థ తీసుకుంది.

* తుళసికెరె గ్రామానికి చెందిన శివమ్మది ఓ నిరుపేద కుటుంబం. ఈమెకు సోలార్‌తో నడిచే పిండిమరను సెల్కో అందించింది. తృణధాన్యాలతో తయారు చేసుకున్న పిండి ఇక్కడి ప్రజల ఆహారం. మర ఏర్పాటు కానంత వరకు అక్కడి ప్రజలు ఏడు కిలోమీటర్లు వెళ్లి పిండి ఆడించుకుని తెచ్చుకునేవాళ్లు. ఇది ఏర్పాటైన తర్వాత గ్రామమంతటికీ శివమ్మ ఇల్లు ఓ సందర్శనాస్థలంగా మారింది. అక్కడి ప్రజల ప్రధాన సమస్యకు పరిష్కారం దొరికింది. ‘ఆర్థికంగా నాకు చాలా బాగుంది. మా ఊరి ప్రజల బాధ కూడా తగ్గింది. చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెబుతుంది శివమ్మ.
* గిరిజన గ్రామాల్లో వంద కుటుంబాలకు పైగా తాళ్లు పేనే వృత్తిలో ఉన్నారు. సంప్రదాయ పద్ధతుల్లో పేనిన తాళ్లను మైసూరు, మండ్య ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. చేత్తో తాళ్లు పేనాలంటే ముగ్గురు మనుషులు శ్రమించాల్సి వచ్చేది. ఇద్దరు పేనుతుంటే మరొకరు చక్రం తిప్పుతుండేవారు. దీంతో శ్రమ ఎక్కువ... ఆదాయం తక్కువగా ఉండేది. కానీ సెల్కో అక్కడ సౌరశక్తితో పనిచేసే యంత్రం ఏర్పాటుచేశాక వారి పని సులభమైంది. అప్పట్లో వంద కుటుంబాలు రోజంతా కష్టపడి వంద తాళ్లను తయారు చేయగలిగేవి. ఇప్పుడు అవే కుటుంబాలు కేవలం మూడు గంటల్లో 200 తాళ్లను పేనుతున్నాయి. దీంతో వారి రోజువారీ ఆదాయం నాలుగు రెట్లయింది. సోలార్‌ సహాయంతో కుట్టుమిషను, మిల్కింగ్‌, వ్యాపారాలు పెట్టుకున్న కుగ్రామ మహిళలు తమ వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతున్నాయని తెలిపారు. అలాగే శీతలగిడ్డింగు నిర్వహిస్తున్న మాదయ్య, రోట్టెల యంత్రంతో ఆదాయం పొందుతున్న సుమంగళపాటిల్‌ తదితర గ్రామీణులుకూడా తమకు కలిగిన అనుకూలతలను గురించి వివరించారు.

ఎంత మార్పు...

సెల్కో సంకల్పంతో అక్కడి ప్రజలకు సౌకర్యాలు వచ్చాయి. గణనీయమైన ప్రగతి సాధ్యమైంది. జీవన ప్రమాణాలు అనూహ్యంగా మెరుగయ్యాయి.  మచ్చుకు కొన్ని.
* పాళ్య తాలూకాలోని ఒక కుగ్రామంలో నివసించే సౌభాగ్య, సిద్ధరాజనాయక్‌ సోలార్‌తో నడిచే జిరాక్స్‌ మిషన్‌ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వారికి జీవనోపాధి ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాలనుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు. పిల్లలను మంచి చదువులు చేప్పించే స్థాయికి వచ్చామని ఆనందంగా చెబుతారా దంపతులు. ఇలా ఎన్నో కుటుంబాలు, గ్రామాలు ప్రస్తుతం కొత్త వెలుగులు చూస్తున్నాయి.

* సౌరశక్తి వినియోగం మొదలయ్యాక గిరిజన గ్రామాల్లో విద్యాదీపాలు వెలుగుతున్నాయి. అప్పటి వరకు కరెంటు లేకపోవడంతో ఇక్కడకు చదువు చెప్పడానికి ఎవరూ వచ్చేవారు కాదు. వచ్చినా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చాలా తొందరగా పాఠశాలలను మూసేసేవారు. సెల్కో ఆధ్వర్యంలో ఇక్కడి పాఠశాలల్లో  సౌర పరికరాలను ఏర్పాటుచేశారు. లైట్లతో పాటు ఛార్జింగ్‌ యంత్రాలనూ ఇచ్చారు. పైగా ఇళ్లలో వాడుకోడానికి వీలుగా విద్యార్థులకు సోలార్‌ లైట్లను ఇచ్చారు. నీటి సౌకర్యాన్ని మెరుగుపరిచారు. దీంతో ఒక్కసారిగా అక్కడ పాఠశాలల్లో హాజరుశాతం 90కి పైగా నమోదవుతోంది.

* మారుమూల ప్రాంతంలో వైద్య సౌకర్యాలూ అంతంత మాత్రమే.  ఈ విషయాన్ని గుర్తించిన సెల్కో మరో బృహత్తర బాధ్యతను తీసుకుంది. ఇక్కడి ప్రజల కోసం ప్రభుత్వం ఓ మొబైల్‌ హెల్త్‌వ్యాన్‌ ఏర్పాటుచేసింది. 19 గ్రామాలకు ఇదే దిక్కు. ఇందులో చిన్న ఫ్రిజ్‌, టీవీలతో పాటు పలు ఉపకరణాలు ఉంటాయి. విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో తరచూ అవన్నీ సరిగా పనిచేసేవి కావు. ప్రజలకు సక్రమంగా సౌకర్యాలు అందేవికాదు. సెల్కో ఈ వ్యాన్‌ను పూర్తిగా సౌరశక్తితో నవీకరించింది. ఇప్పుడా వ్యాన్‌ ఓ సంజీవనిలా మారింది.

అంతా ఆయనే...

ర్ణాటకలోని కుందాపురకు చెందిన హరీష్‌హండే ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేశారు. 1991లో యూఎస్‌ఏలో హరీష్‌హండే పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు డొమినికన్‌ రిపబ్లిక్‌కు వెళ్లే ఒక అవకాశం వచ్చింది. అక్కడ పేదలున్న ప్రాంతాల్లో సౌర శక్తిని ప్రభావవంతంగా వాడుకోవడం గమనించారు. చిన్నచిన్న సోలార్‌ లైట్లకింద చదువుకోవడం, పనులు చేసుకోవడం హరీష్‌ కంటపడింది. ఇలా మనదేశంలో ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన అప్పుడే మొలకెత్తింది. సౌరశక్తిని పేదరిక నిర్మూలనకు ఉపయోగించాలన్న సంకల్పం కూడా ఆయన అప్పుడే చెప్పుకొన్నారు. సౌర దీపాలు, పరికరాల ఆవిష్కరణ లక్ష్యంగా 1995లో సెల్కో ఏర్పాటుచేశారు. దానికి అనుబంధంగా 2010లో సెల్కో ఫౌండేషన్‌ స్థాపించారు. దీని ఆధ్వర్యంలో ఏమాత్రం సౌకర్యాలు లేని కుగ్రామాలు, గిరిజన గూడేలు, కొండ ప్రాంతాలను గుర్తించి సౌరశక్తిని ఉపయోగించి జీవనోపాధి కల్పిస్తున్నారు. తద్వారా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పని నిర్విరామంగా జరుగుతోంది.

- జగదీశ్వరి, బెంగళూరు


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని