close

తాజా వార్తలు

కందరెడ్డి కథ వింటారా?

స్ఫూర్తిప్రదాత ఈ కౌలు రైతు

100 ఎకరాల పొలం...18 రకాల పంటలు...ప్రయోగాల్లో ఘనాపాటి...మార్కెట్‌లో తనకు తానే సాటి...వందలాది మందికి ఆయనో స్ఫూర్తి అయ్యారు...అమెరికా గౌరవ డాక్టరేట్‌ కూడా అందుకున్నారు...ఇంతకూ ఆయన చదివిందేమీ లేదు...
భూమిని నమ్మారు, వ్యవసాయాన్ని ఔపోసన పట్టారు...సెంటు భూమి కూడా సొంతంగా లేని ఈ కౌలు రైతు చేసిన అద్భుతాలు చూస్తే  ఔరా అనాల్సిందే...

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల వెళ్లి సత్తి భాస్కరరెడ్డిగారి ఇళ్లెక్కడండీ అంటే ‘ఎవరాయన’ అనేస్తారు...కందరెడ్డిగారు ఎక్కడుంటారండీ... అని అడిగితే మాత్రం ఇంటికి తీసుకెళ్లి మరీ చూపుతారు. నిజానికి భాస్కరరెడ్డిది దుళ్ల కాదు. అక్కడకు 20 కిలోమీటర్ల దూరంలోని రావులపాలెం. 60ఏళ్ల భాస్కరెడ్డిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకు. చదువు సాగలేదు. కుటుంబభారం కూడా మోయాల్సి రావడంతో ఓ మోతుబరి రైతు దగ్గర 11 ఏళ్లకే పాలికాపుగా చేరాడు. ఐదేళ్ల అక్కడే పని. ఆ స్థితిలో ఉన్న చాలా మంది జీవితం అక్కడే ఆగిపోతుంది. కానీ నేర్చుకోవాలనే తపన భాస్కరరెడ్డి జీవితానికి ఆయువుపట్టైంది. ఓ వైపు పాలేరుగా ఉంటూనే వ్యవసాయంలో మెలకువలు నేర్చుకున్నారు. పదహారేళ్ల వయసులో ఓ రైతు దగ్గర అరెకరం పొలం కౌలుకు తీసుకుని హలాన్ని పట్టి పొలాన్నిదున్నారు. పెళ్లయింది. పిల్లలు పుట్టారు... నాలుగేళ్లు గడిచాక తిరిగి కష్టాలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో కౌలుకు పొలం దొరకని పరిస్థితి. దీంతో సొంతూరు వదిలేసి దుళ్ల గ్రామానికి  వలసవచ్చారు. చిన్న ఇంట్లో అద్దెకు దిగి ఓ రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. అప్పట్లో ఎవరూ వేయని కంద పంటను వేశారు. మొదటిసారి వ్యవసాయంలో అంతకు ముందెన్నడూ చూడనంత లాభాలు సాధించారు. కంద అతని జీవితాన్నే కాదు పేరునూ మార్చేసింది. భాస్కరరెడ్డి కాస్తా కందరెడ్డి అయ్యారు.
పచ్చ‘ధనం’ పండించేదిలా...
ఇక వెనుదిరిగి చూడలేదాయన. అంచలంచెలుగా వ్యవసాయ భూమిని పెంచుకుంటూ వెళ్లారు. ఇప్పుడు 100 ఎకరాల్లో పంట పండిస్తున్నారు. ఆ సాగు భూమంతా కౌలుకు తీసుకుందే. కంద, అరటి ఎక్కువగా వేస్తారు. విత్తనం కూడా ఈయనే తయారు చేసుకుంటారు. అంతర సాగుగా కర్ర పెండలం, బొంబాయి పెండలం, బీర, బెండ, దోస, పుచ్చకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ వంటి 18 రకాల పంటలను వేస్తారు. అందుకే ఆయన సాగుకు తీసుకున్న పొలం 365 రోజులూ కళకళలాడుతుంటుంది. ఏక కాలంలో పలు రకాల పంటలను పండిస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తుతారాయన.  మేలైన యాజమాన్య పద్ధతులు, నీటి సంరక్షణలో ఆయనకు ఆయనే సాటి. నిరక్షరాస్యుడైనా.. మార్కెట్లో  ఎప్పుడు ఏ పంటకు డిమాండ్‌ ఉందనే విషయాన్ని గమనించి దానికి తగ్గినట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఏడాదిలో కంద, అరటి వెయ్యి టన్నుల చొప్పున ఉత్పత్తి చేస్తారు. కూరగాయలను స్థానిక మార్కెట్లకు తరలిస్తారు.
డాక్టర్‌ కందరెడ్డి..
ఆయన కృషి ఊరికే పోలేదు. కందరెడ్డి సాధించిన విజయాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి. అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. హెల్త్‌కేర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మదర్‌ థెరిస్సా సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ కృషీవలుడిగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డులు అందుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో వ్యవసాయ విద్యను అభ్యసించే వారు క్షేత్రపర్యటన కోసం ఇక్కడి వచ్చి కందరెడ్డి చేస్తున్న వ్యవసాయాన్ని చూసి వెళతారు.


గోదావరిపై ఆనకట్ట నిర్మించిన మహనీయుడు కాటన్‌ దొర. ఆయనపై కృతజ్ఞతతో 9అడుగుల కాటన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కందరెడ్డి. కాటన్‌ జయంతి, వర్ధంతిని ఒక వేడుకలా నిర్వహించి విగ్రహానికి ధాన్యంతో అభిషేకం చేస్తారు. తన పూర్వీకులకు చేసినట్టు కాటన్‌కు కూడా ఏటా పిండప్రదానం చేస్తున్నారు.
 


సేద్యంలో అద్భుత ఫలితాలు రాబట్టడమే కాదు వచ్చిన ఆదాయంలో 70శాతం ధనాన్ని ప్రజా సేవకు వెచ్చిస్తున్నారు కందరెడ్డి. పాఠశాలలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పార్కుల అభివృద్ధికి విరాళాలు ఇస్తుంటారు.


- సీహెచ్‌.శ్రీను, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.