
తాజా వార్తలు
ఇకనుంచైనా... చక్కెర తగ్గిద్దాం!
చక్కెర తింటే బరువు పెరుగుతారు... వార్ధక్యపు ఛాయలూ త్వరగా వచ్చేస్తాయి. అందుకే ఈ పండగనుంచైనా ఆ వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిద్దాం.
* మానసిక ఒత్తిడి, ఇతరత్రా కొన్ని ఆందోళనలు ఉన్నప్పుడు స్వీట్ తినాలనే కోరిక పెరుగుతుందంటున్నాయి అధ్యయనాలు. ఇలాంటప్పుడు ఓ గ్లాసు మంచినీళ్లు తాగండి. అదీ లేదంటే ఓ చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోండి. బెల్లం మితిమీరి తినలేరు. పైగా దాన్నుంచి ఇనుమూ శరీరానికి అందుతుంది.
* ఒకేసారి చక్కెర మానేయలేం అనుకుంటే... కొద్దికొద్దిగా తగ్గించాలి. అంటే కాఫీ, టీలలో రెండు చెంచాల చక్కెర వేసుకుంటుంటే.. క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయండి. స్వీట్లలో చక్కెరకు బదులు బెల్లం వాడండి. తేనెనీ జత చేసుకోవచ్చు. ఇలా కొన్ని రోజుల వరకూ...సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తే... అదే అలవాటైపోతుంది.
* ఇంట్లో ఐస్‌క్రీంలు, చాక్లెట్లు, కేక్‌లు వంటివి ఉంచుకుంటే... ఆకలేస్తే వాటిపైకే మనసు మళ్లుతుంది. అందుకే అవేవీ లేకుండా చూసుకోండి. మొదట్లో ఇది కష్టంగానే అనిపించొచ్చు కానీ ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. వాటికి బదులు ఓ పండు తీసుకోవచ్చు. లేదంటే ఫ్రూట్ సలాడ్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. క్రమంగా ఆరోగ్యకరమైన పదార్థాలకు అలవాటు పడతారు.