close

తాజా వార్తలు

హైదరాబాద్‌: ‘ఏదైనా జరగొచ్చు’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన తెలుగు ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 2’ శుక్రవారం కాస్త ఆసక్తికరంగా సాగింది. ‘విశ్వరూపం 2’ ప్రచారంలో భాగంగా కమల్‌హాసన్‌ ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి కమల్‌ వస్తున్నారని వ్యాఖ్యాత నాని చెప్పగానే ఇంట్లోని సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఇక కమల్‌ ఇంట్లోకి ప్రవేశించగానే, సభ్యులందరూ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. ‘బిగ్‌బాస్‌’ ఇంట్లోని వారికి కమల్‌ ‘విశ్వరూపం 2’ ట్రైలర్‌ చూపించారు. అనంతరం వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా కమల్‌ సినిమా ముచ్చట్ల గురించి మాట్లాడుకొన్నారు. అనంతరం అమిత్‌ ‘అప్పూ రాజా’ చిత్రంలోని‌ పాటను ఈల వేస్తూ పాడగా, కమల్‌ కూడా ఈల వేస్తూ ఇంటి సభ్యులను అలరించారు. ‘భారతీయుడు’లో ‘అదిరేటి డ్రెస్స్‌ మీరేస్తే దడ’ పాటకు కమల్‌ నడిచి వచ్చే స్టైల్‌ను చేసి చూపించారు. మన గురించి మనం తెలుసుకునే చక్కని షో ‘బిగ్‌బాస్‌’ అని కమల్‌ చెప్పారు. ‘మానవతా వాదులు, హేతువాదులు కాస్త కోపం తగ్గించుకోవాలి. అసహనం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమతోనే దేన్నైనా సాధించాలి’ అంటూ బాబు గోగినేనితో కమల్‌ అనగా, ‘అవును నిజం చెప్పడం మన వంతు. దాన్ని స్వీకరించడం, స్వీకరించకపోవడం ఎదుటవారి ఇష్టం’ అని బాబు గోగినేని సమాధానం ఇచ్చారు. అనంతరం తన వద్ద ఉన్న దుస్తుల్లోని ‘రీజన్‌ నాట్‌ రిలీజియన్‌’ అనే సూక్తి ఉన్న టీషర్ట్‌ను కమల్‌కు బహుకరించారు. ఇక ‘విశ్వరూపం 2’, కమల్‌పై రోల్‌ రైడా ఆలపించిన ర్యాప్‌ ఆకట్టుకుంది.

తాను తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన సందర్భంగా ఒకరికి రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఎలిమినేట్‌ అయినా ఆ షీల్డ్‌తో మరో రెండు వారాలు ఉండొచ్చు. ‘మరో చరిత్ర’ సినిమా సమయంలో తాను అనామకుడినని, బాలచందర్‌ తన ఇచ్చిన ఒక్క అవకాశంతో తన సినీ కెరీర్‌ 45ఏళ్ల పాటు కొనసాగిందని కమల్‌ అన్నారు. అనంతరం ప్రొటక్షన్‌ షీల్డ్‌ను అమిత్‌కు ఇస్తున్నట్లు చెప్పారు. కమల్‌తో పాటు, ‘విశ్వరూపం 2’ చిత్ర బృందం పూజాకుమార్‌, సంగీత దర్శకుడు జిబ్రాన్‌, సినిమాటోగ్రాఫర్‌ షాందత్‌లు కూడా ఉన్నారు.

‘కమల్‌హాసన్‌ సర్‌ రావడం ఏంటి? ఆయన మాతో కూర్చొని మాట్లాడటం ఏంటి? రెండు వారాల కార్డు నాకు ఇవ్వడం ఏంటి? థ్యాంక్యూ బిగ్‌ బాస్‌. నాకు మాటలు రావడం లేదు.’ అంటూ అమిత్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.