close

తాజా వార్తలు

రివ్యూ: గూఢచారి 

చిత్రం: గూఢచారి 
నటీనటులు: అడివి శేష్‌, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, మధు శాలిని, రవి ప్రకాష్‌, సుప్రియ తదితరులు 
సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల 
సినిమాటోగ్రఫీ: షానియల్‌ డియో 
ఎడిటింగ్‌: గ్యారీ 
కథ, రచన: అబ్బూరి రవి, అడివి శేష్‌ 
నిర్మాత: అభిషేక్‌ పిక్చర్స్‌ 
దర్శకత్వం: శశి కిరణ్‌ టిక్కా 
బ్యానర్‌: అభిషేక్‌ పిక్చర్స్‌ 
విడుదల: 03-08-2018 
హాలీవుడ్‌కు జేమ్స్‌ బాండ్‌ కథలు కొత్తేమీ కాదు. చాలామంది నటులు ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అనుకోని మలుపులు, అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు ఇవే ఈ తరహా చిత్రాలకు ప్రాణం. ప్రేక్షకుడు మునివేళ్లపై నిలబడి చూసే చిత్రాలివి. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం జేమ్స్‌ బాండ్‌ అంటే గుర్తొచ్చేది ‘సూపర్‌స్టార్‌’ కృష్ణ. ఆ స్థాయిలో ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో తెలుగులో జేమ్స్‌ బాండ్‌ కథతో పెద్దగా సినిమాలు రాలేదు. ఈ నేపథ్యంలో యువ కథానాయకుడు అడివి శేష్‌ ‘గూఢచారి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి శుక్రవారం వచ్చిన ఈ ‘గూఢచారి’ ఎలా ఉన్నాడు? ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు? దేశం కోసం ఈ గూఢచారి చేసిన సాహసం ఏంటి?

కథేంటంటే: గోపి (అడివి శేష్‌) చిన్నప్పటి నుంచి వాళ్ల నాన్నలాగే సీక్రెట్‌ ఏజెంట్‌ కావాలనుకుంటాడు. అయితే, తండ్రి చనిపోవడంతో మామయ్య సత్య(ప్రకాష్‌రాజ్‌) దగ్గర పెరుగుతాడు. సత్య కూడా సీక్రెట్‌ ఏజెంటే. తండ్రిలా గోపీ కూడా సీక్రెట్‌ ఏజెంట్‌ అయితే ఎక్కడ ప్రాణాలు కోల్పోతాడోనని భయపడిన సత్య.. గోపి పేరును అర్జున్‌గా మార్చి పెంచుతాడు. అయితే, పెరిగి పెద్దయినా కూడా సీక్రెట్‌ ఏజెంట్‌ కావాలన్నఆకాంక్ష గోపీకి అలాగే ఉంటుంది. రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) ఉద్యోగం కోసం ఏకంగా 170 సార్లు దరఖాస్తు చేసుకుంటాడు. చివరకు త్రినేత్ర ఏజెన్సీ అర్జున్‌కు అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి ‘గూఢచారి 116’గా నియమిస్తుంది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అర్జున్‌ దేశం దృష్టిలో ఒక తీవ్రవాదిగా ముద్రింపబడతాడు. త్రినేత్ర ఏజెన్సీ కూడా అర్జున్‌ను వెంబడిస్తుంది. అర్జున్‌పై తీవ్రవాది అనే ముద్ర ఎలా పడింది? అందు కోసం ఆయన చేసిన సాహసాలు ఏంటి? చివరకు అర్జున్‌ ఆ ముద్రను ఎలా చెరిపేసుకున్నాడు?

ఎలా ఉందంటే: ‘గూఢచారి’పై హాలీవుడ్‌ సినిమాల ప్రభావం కనిపిస్తుంది. సీక్రెట్‌ ఏజెంట్‌, జేమ్స్‌ బాండ్‌ సినిమాలు అక్కడ ఎక్కువగా వచ్చాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ‘గూఢచారి’ కథను రాసుకున్నారు. జేమ్స్‌ బాండ్‌ తరహా కథలకు కావాల్సినవి పట్టు సడలని స్క్రీన్‌ప్లే, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ప్రేక్షకుడు ఊహించని మలుపులు. అవి మూడు ఈ సినిమాలో కనిపిస్తాయి. సీక్రెట్‌ ఏజెంట్‌ కావాలన్న అర్జున్‌ తపన.. అందుకు కోసం అతను చేసిన ప్రయత్నాలు.. త్రినేత్రలో జరిగే వ్యవహారాలు ఇవన్నీ చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ప్రేక్షకుడిని త్వరగానే కథలోకి లీనం చేయగలుగుతాయి. అర్జున్‌ లవ్‌స్టోరీ కథకు అడ్డుపడుతున్నట్లు అనిపించినా, దాన్ని కూడా ఒక సీక్రెట్‌ మిషన్‌లాగే, తీర్చిదిద్దాడు దర్శకుడు. విశ్రాంతి ముందు సన్నివేశాలు ఒక్కసారిగా కథలోని టెంపోను మార్చేస్తాయి. సీక్రెట్‌ ఏజెంట్‌ అయిపోవడం ఇంత ఈజీనా అనిపించినా, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మాత్రం ఆ దోషాన్ని చెరిపేస్తుంది.

ద్వితీయార్ధం కాస్త నెమ్మదిగా మొదలవుతుంది. జగపతిబాబు పాత్ర ఎంట్రీతో ఈ కథ మరో మలుపు తీసుకుంటుంది. బంగ్లాదేశ్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అంత థ్రిల్లింగ్‌గా సాగలేదు. అక్కడే స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదించినట్లు అనిపించింది. ప్రీ క్లైమాక్స్‌లో మళ్లీ దర్శకుడు గాడిన పడ్డాడు. అక్కడ రాసుకున్న ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. చివర్లో దేశభక్తి, సెంటిమెంట్‌ మేళవించిన క్లైమాక్స్‌ రాసుకుని, ఒక జేమ్స్‌ బాండ్‌ తరహా కథకు, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు అందివ్వగలిగాడు దర్శకుడు. హాలీవుడ్‌లో జేమ్స్‌ తరహా చూసేవాళ్లకు ఈ కథ ఈజీగానే అర్థమవుతున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త జోనర్‌ సినిమా చూసినట్లు అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: ఈ తరహా కథలకు అడివి శేష్‌ చక్కగా సరిపోతాడు. నిజాయతీ, దేశభక్తి, తండ్రిమీద ప్రేమ ఇవన్నీ మేళవించిన పాత్రలో అతని నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కథకుడిగానూ, స్క్రీన్‌ప్లే రైటర్‌గానూ రాణించాడు. జగపతిబాబు పేరును ప్రచారంలో పెద్దగా వాడుకోలేదు. కానీ, కథలో ప్రభావవంతంగా వాడుకున్నారు. క్లైమాక్స్‌ ముందు అతని పాత్రే కథను మలుపు తిప్పుతుంది. ఎప్పటిలాగే ప్రకాష్‌రాజ్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. సుప్రియ పాత్ర కాస్త సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. కథానాయిక శోభిత ధూళిపాళ్ల తెలుగు అమ్మాయే. చూడటానికి బాగానే ఉంది. అయితే, ఇంటర్వెల్‌తో ఆ పాత్ర ఆగిపోతుంది. బహుశా ఆ పాత్ర అక్కడితో చాలనుకున్నారేమో. వెన్నెల కిషోర్‌ పాత్ర కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దర్శకుడు శశి కిరణ్‌ బడ్జెట్‌ పరిమితుల్లో చెప్పాలనుకున్న కథను చాలా డీసెంట్‌గా చెప్పాడు. ఇలాంటి కథలకు సంగీతం ప్రాణం. శ్రీచరణ్‌ పాకాల చక్కని నేపథ్య సంగీతం అందించాడు. ఉన్న ఒక్క పాటా మెలోడియస్‌గా సాగింది. కెమెరాపనితనం బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలు చాలా నేచురల్‌గా తీశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే, ఈ తరహా కథలకు ఇంకాస్త బడ్జెట్‌ అవసరమేమో అనిపిస్తుంది.

బలాలు 
+ స్క్రీన్‌ప్లే 
+ కథలో మలుపులు

బలహీనతలు 
- బడ్జెట్‌ కొంచెం తక్కువైంది 
- హాలీవుడ్‌ చిత్రాల ఛాయలు

చివరిగా: ‘గూఢచారి’ మన జేమ్స్‌ బాండ్‌ 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.