close

తాజా వార్తలు

అది నా జీవితంలో జరిగిన ఘోర అవమానం

ఇంటికి వెళ్లి సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా!

అది నా జీవితంలో జరిగిన ఘోర అవమానం

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో క్లీన్‌ కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌ చిట్టిబాబు, అనంత్‌బాబు. హాస్యాన్ని అలవోకగా పండించగల సమర్థులు. సీన్‌కు తగినట్టు పాత్రలను పండించడంలో ఉద్ధండులు. అన్నయ్య రాజబాబు సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, ధైర్యాన్ని మూటగట్టుకుని సినీ ఇండస్ట్రీ వైపు వీరిద్దరూ అడుగులు వేశారు. ఒకరు మాటలతో గారడీ చేస్తే, మరొకరు సన్నివేశానికి తగినట్లు అల్లుకుపోతారు. ఒకరు స్లాంగ్‌తో ఆకట్టుకుంటే, మరొకరు టైమింగ్‌తో అదరగొడతారు. ఇలా ఆల్‌టైమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులకు అందించి, ది బెస్ట్‌ కమెడియన్స్‌గా నిలిచారు. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే షోకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారిలా..

రాజబాబు కుటుంబం నుంచి సినీ పరిశ్రమకు వచ్చిన మీరు ఎలా ఫీలవుతున్నారు? అన్నయ్య ఉంటే బాగుంటుందనిపిస్తుందా?
చిట్టిబాబు: తప్పకుండా. నేను అన్నయ్య ఉన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నా. అనంత్‌ నటించడం మొదలు పెట్టిన తర్వాత చూసి సంతోషపడితే ఇంకా బాగుండేది. తన తమ్ముళ్లు నటులయ్యారని కాదుకానీ, తన చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అన్నయ్య కోరుకునేవాడు.

అనంత్‌... మీ అబ్బాయి ఎలా ఉన్నాడు?

అనంత్‌: ప్రస్తుతం న్యూజెర్సీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు.

అన్నయ్య(రాజబాబు) ఎన్ని సినిమాల్లో నటించారు?
అనంత్‌: 562 చిత్రాల్లో నటించారు. దానిలో 275... 200రోజులకు పైగా ఆడాయి. రాజబాబుగారు రోజుకు నాలుగు షిఫ్ట్‌ల్లో పనిచేసేవారు. రమాప్రభ, రాజబాబులు కలిసి లంచ్‌ అవర్స్‌ను కూడా అమ్మేశారు. మధ్యాహ్నం 1-2గంటల మధ్యలో కూడా పక్క సెట్‌లోకి వెళ్లి వాళ్ల సీన్స్‌ పూర్తి చేసుకుని వచ్చే వాళ్లట.

చిట్టిబాబు: ‘పిచ్చోడి పెళ్లి’ సినిమాకు లక్షా ఒక్క రూపాయి రెమ్యునరేషన్‌ తీసుకున్నారు. ఈ సినిమా విడుదల రోజునే ఎన్టీఆర్‌ చిత్రం కూడా విడుదల కావాల్సి ఉంది. నిర్మాత వెళ్లి ఎన్టీఆర్‌కు చెబితే, ‘మీ చిత్రాన్ని వాయిదా వేసుకోండి’ అన్నారట. ఇదే విషయాన్ని అన్నయ్యకు చెబితే ‘కొడితే కొండనే ఢీకొడదాం. పిక్చర్ మీరు రిలీజ్‌ చేస్తారా? లేక నాకు అమ్మేస్తే, నేనే ఆ రోజున రిలీజ్‌ చేస్తా’ అన్నారుట. అన్నయ్య సినిమా విడుదలై 100రోజులు ఆడింది.

అది నా జీవితంలో జరిగిన ఘోర అవమానం

రాజబాబు పిల్లాడిని ఎత్తుకుని మేడపై ఉన్నప్పుడు అదే సమయానికి రోడ్డుపై పెద్ద ఎర్ర కారు వెళ్తుంటే, చేతిలో ఉన్న పిల్లాడు ఆ కారు కావాలని మారాం చేస్తే, కొనిచ్చేశారట!
చిట్టిబాబు: జరిగింది అది కాదు. అన్నయ్య తన పిల్లలతో మెట్లపై కూర్చొన్నాడు. సరిగ్గా ఆ సమయానికే శివాజీ గణేశన్‌ ఎర్ర కారు రోడ్డుపై వెళ్లింది. ‘డాడీ అలాంటి కారు ఎప్పుడు కొంటావ్‌’ అని వాళ్లబ్బాయి అడిగాడు. ‘ఆ కారు నీకు కావాలా?’ అంటే ‘కావాలి’ అన్నాడు. అప్పటికి సమయం రాత్రి 7గంటలైంది. లుంగీ, చొక్కాపై ఉన్న అన్నయ్య వెంటనే లేచి శివాజీగణేశన్‌ ఇంటికి వెళ్లిపోయాడు. ‘ఏంటి రాజబాబు ఎలా ఉన్నావు. ఏం సంగతి. ఈ సమయంలో వచ్చావు’ అని శివాజీ గణేశన్‌ అడిగారు. ‘నాకు ఆ కారు కావాలి’ అని అన్నయ్య అంటే ‘అది లక్ష రూపాయలు’ అని శివాజీ సమాధానం ఇచ్చారు. ‘లక్ష ఇస్తా. కారు ఇచ్చేయండి’ అని అన్నయ్య అంటే సర్లే అని కారు తాళాలు ఇచ్చారు. తీసుకొచ్చి పిల్లలను ఎక్కించుకుని తిప్పారు. ఆ తర్వాత దాన్ని షెడ్డులో పెట్టేశాడు. మర్నాడు అన్నయ్య అకౌంటెంట్‌ను పంపి పాతిక వేల రూపాయలు ఇచ్చిరమ్మన్నాడు. శివాజీ గణేశన్‌కు కంగారొచ్చింది. కబురు పంపితే అన్నయ్య మళ్లీ శివాజీ ఇంటికి వెళ్లారు. ‘ఆ కారు లక్ష రూపాయలు. నీకెందుకంత పెద్ద కారు’ అంటే ‘మీకు కావాల్సింది లక్ష కదా! తీసుకోండి. మీ కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడల్లా నా పిల్లలు అడిగేవారు. ఇంత సంపాదించి, వాళ్ల కోర్కె తీర్చకపోతే ఇక నేనెందుకు’ అని డబ్బులు తీసి శివాజీగణేశన్‌కు ఇచ్చేశారు.

అన్నయ్య శ్రీశ్రీ తోడల్లుడా?
చిట్టిబాబు: అవును! శ్రీశ్రీగారు డబ్బింగ్‌ చిత్రాలకు రాసేవారు. అప్పుడే అన్నయ్య ఇండస్ట్రీకి వెళ్లారు. పెద్దగా వేషాలు వేయడం లేదు. డబ్బులు రావాలంటే డబ్బింగ్‌ చెప్పటమే మార్గం. అందుకే రెండుమూడు సార్లు శ్రీశ్రీగారి ఇంటికి వెళ్తే, వారు జాలిపడి ఓ చిత్రంలో డబ్బింగ్‌ చెప్పేందుకు అవకాశం ఇప్పించారు. రెండు సన్నివేశాలున్న పాత్రకు డబ్బింగ్‌ చెప్పినందుకు రూ.200 ఇచ్చారు.

అనంత్‌.. నువ్వు పరీక్షల్లో ఫెయిల్‌ అయితే, రాజబాబు ఓ గిఫ్ట్‌ ఇచ్చారట ఏంటది?
అనంత్‌: నాకు అన్నయ్యలంటే అమితమైన గౌరవం. నేను చదువుకునే సమయానికి రాజబాబు అన్నయ్య చాలా పెద్దవాడు. తండ్రిలాంటివాడు. ఒకరోజు నన్నే క్యారేజీ తీసుకుని రమ్మన్నాడు. ఎంచక్కా అన్నయ్యతో గడపవచ్చని ఎగురుకుంటూ వెళ్లా. లోపలికి వెళ్లిన తర్వాత నన్ను మామూలుగా కొట్టలేదు. ఆ తర్వాత దగ్గరకు తీసుకుని ‘నేను చదువుకోలేదు. అప్పట్లో ఆర్థిక ఇబ్బందులు. ఇప్పుడు అవేవీ లేవు కదా! బాగా చదువుకోవచ్చు కదా’ అని అన్నాడు. నన్ను కొట్టిన మరుసటి రోజే ఇంటికి వచ్చి అమ్మానాన్నకు సారీ చెప్పాడు.

అది నా జీవితంలో జరిగిన ఘోర అవమానం

డ్రామాలు వేసినందుకు మీ నాన్నగారు బాగా కొట్టారట!
చిట్టిబాబు: అవును! అప్పటికి అన్నయ్య మండపేటలో చదువుకుంటున్నాడు. అప్పుడు డ్రామాలు వేసినందుకు నాన్న బాగా కొట్టారు. ఒకరోజు రాత్రి అన్నయ్యా నేనూ ఎదురింటి తులసమ్మగారి అరుగుమీద పడుకున్నాం. రాత్రి 9గంటలకు నన్ను నిద్రలేపి డ్రామాకు తీసుకెళ్లాడు. అప్పుడు అన్నయ్య మొద్దబ్బాయి అనే నాటిక వేశాడు. అందులో అన్నయ్యది మొద్దబ్బాయి పాత్ర. అన్నయ్య మెడలో గారెల దండ, చేతిలో కొబ్బరి చిప్ప పెట్టారు. మధ్య మధ్యలో తినడానికి నాకూ గారెల దండల నుంచి తెంచి గారెలు ఇచ్చేవాడు. దీంతో నేను కూడా అక్కడే ఉండిపోయా. రాత్రి 11గంటలకు వచ్చి పడుకున్నాం. ఉదయం ఎటువాళ్లం అటు వెళ్లిపోయాం. నాన్న ఆఫీస్‌కు వెళ్తే, ‘ఏవండీ ఉమామహేశ్వరరావు గారూ మొద్దబ్బాయిగా మీ రాజబాబు బాగా చేశాడండీ’ అన్నారు. ‘మా అబ్బాయి డ్రామా వేయడమేంటీ’ అన్నారు. మొత్తం కథ నాన్నకు తెలిసిపోయింది. ఇంటికి వచ్చి, ‘ఏంటీ రాత్రి డ్రామా వేశారా’ అని అడిగాడు. ఆ సమయానికి అన్నయ్య ఇంట్లో లేడు. నేను అబద్ధం చెప్పా. అంతే నన్ను మామూలుగా కొట్టలేదు. బయటకు వెళ్లి వచ్చిన అన్నయ్యను కూడా నాన్న చితక్కొట్టేశారు. ‘ఎస్‌ఎల్‌సీ పాసయ్యే వరకూ డ్రామాలు వేశారో ఊరుకోను’ అన్నారు.

మీరు‌ ఎన్ని సినిమాల్లో నటించి ఉంటారు!
అనంత్‌: మూడు, నాలుగు వందల సినిమాల్లో నటించి ఉంటా. నా మొదటి సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ ఒక్కటే గుర్తు. 
చిట్టిబాబు: 703 సినిమాల్లో నటించా. నాలుగు హిందీ సినిమాల్లో నటించా. రెండు మలయాళ చిత్రాల్లో కూడా నటించా.

మీ అందరిదీ అరేంజ్డ్‌ మ్యారేజేనా?
అనంత్‌: నాది ప్రేమ వివాహం. మాది చాలా చిన్నవయసులో లవ్‌ మ్యారేజ్‌. నేను ఇంటర్‌లో ఉండగా, ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. ఇద్దరం ప్రేమించుకున్నాం. నా డిగ్రీ పూర్తయి, జాబ్‌ వచ్చిన తర్వాత నేను పోషించగలనని నమ్మకం కలిగాక పెళ్లి చేసుకున్నాం.

రాజబాబు అనే పేరు మీ వెనుక లేకపోతే మీరు ఏమయ్యేవారు?
అనంత్‌: నేనైతే దొంగను అయ్యేవాడిని. చదువు, సంధ్య ఉండేది కాదు. ఇక్కడ సంధ్య అంటే సంధ్యావందనం. జైలులో ఉండేవాడినో.. లేకపోతే అసలు లేకుండా ఉండేవాడినో!! ఏదైనా ఇప్పుడు మీ ముందు మాత్రం కూర్చుని ఉండేవాడిని కాదు.
చిట్టిబాబు: ఐటీఐ పాసయ్యా. ఆ తర్వాత రాత్రి కాలేజ్‌లో చేరి బీకాం పాసయ్యా. ఎలక్ట్రీషియన్‌ లేదా బ్యాంకు ఉద్యోగిని అయ్యేవాడినేమో.

అది నా జీవితంలో జరిగిన ఘోర అవమానం

‘పాండు రంగడు’ సమయంలో ఓ ప్రమాదం తప్పిందట.. ఏంటది?
అనంత్‌: ‘పాండు రంగడు’ షూటింగ్‌ సందర్భంగా నేను, రాఘవేంద్రరావుగారు, కో-డైరెక్టర్‌ ఒక చోట నిలబడి మాట్లాడుకుంటున్నాం. అప్పటికి ఇంకా షాట్‌ కోసం రెడీ చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత మేము నిలబడిన చోటు నుంచి కాస్త ముందుకు కదిలాం. అప్పుడే పైన ఉన్న పెద్ద షాండ్లియర్‌ దభేల్‌మని పడింది. కేవలం ఒక్క నిమిషం తేడా అంతే. అది మీద పడిఉంటే, ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఆ పాండురంగడే మమ్మల్ని కాపాడాడు.

పెళ్లయిన కొత్తలో మీ ఆవిడను సినిమాకు తీసుకెళ్తే ఏదో జరిగిందట!
చిట్టిబాబు: ఈ విషయం నీకెవరు చెప్పారు. నా జీవితంలో జరిగిన పెద్ద అవమానం అది. అప్పటికి కష్టం.. సుఖం.. అన్నీ చూశాం. ఎంత కోటీశ్వరుడైనా, బిచ్చగాడైనా అవమానం భరించలేడు. అప్పుడు నేను ‘ఇద్దరు అసాధ్యులు’ సినిమా చేశా. అందులో కొన్ని సన్నివేశాల్ని నాగార్జునసాగర్‌ వద్ద షూటింగ్‌ చేశారు. అక్కడ తీసిన సీన్లలో నేను నటించా. దాదాపు 15సీన్లు ఉంటాయి. ఆ సినిమాను మా ఆవిడకు చూపిద్దామని తీసుకెళ్లా. టైటిల్స్‌లో నా పేరు కూడా వేశారు. కానీ ఎంతసేపటికీ నేను నటించిన సన్నివేశాలు రాలేదు. నాకు సిగరెట్‌ కాల్చే అలవాటు ఉండటంతో బయటకు వెళ్లా. వెళ్లి వచ్చిన తర్వాత ‘నేను చేసిన సీన్లు వచ్చాయా’ అని అడిగా. ‘రాలేదండీ’ అంది. ‘నువ్వు సరిగా చూసి ఉండవు వచ్చే ఉంటాయి’ అన్నా. ‘నిజంగా రాలేదండీ’ అంది. సినిమా అయిపోయింది. కానీ, నేను నటించిన ఒక్క సన్నివేశం కూడా రాలేదు. మొత్తం ఎడిటింగ్‌లో పోయింది. పెళ్లయిన తర్వాత తొలిసారి నేను నటించిన సినిమా చూపిద్దామని మా ఆవిడను తీసుకెళ్లిన నాకు అది పెద్ద అవమానమే.(నవ్వులు) ఈ సందర్భంగా అలీ షోకు వచ్చే అతిథులందరికీ చెబుతున్నా. మీకు సంబంధించిన సీక్రెట్లు ఏవైనా ఉంటే ముందే చెప్పేయండి. (నవ్వులు)

ఒక సినిమా 100 రోజుల ఫంక్షన్‌కు మిమ్మల్ని పిలిచి అవమానించారట!
చిట్టిబాబు: ఆ సినిమా ‘నేరం నాది కాదు ఆకలిది’. రామారావుగారు హీరో. అన్నయ్యా, నేనూ ఇద్దరం నటించాం. అప్పట్లో 100రోజుల ఫంక్షన్‌ అయితే, మెయిన్‌ పాత్రలకు షీల్డ్‌ ఇచ్చేవారు. వారి పేర్లు ఆహ్వాన పత్రికలో ఉండేవి. నా పేరు కూడా ఉంది. ఫస్ట్‌టైమ్‌ షీల్డ్‌. కార్యక్రమానికి వెళ్లా. షీల్డ్‌ ఇచ్చారు. మీ ఇంటికి పంపిస్తామంటూ మేనేజర్‌ తీసేసుకున్నారు. అన్నయ్య షీల్డ్‌ వచ్చింది కానీ, నా షీల్డ్‌ రాలేదు. వారం రోజులు చూసి, నిర్మాత ఆఫీస్‌కు వెళ్లా. ‘నా షీల్డ్‌ ఇచ్చేయండి నేనే ఇంటికి తీసుకెళ్తా’ అన్నా. అప్పుడు నిర్మాత ‘నీకు షీల్డ్‌ లేదు నాన్నా’ అన్నారు. ‘అదేంటండీ స్టేజ్‌పైకి పిలిచి ఇచ్చారు కదా’ అన్నా. ‘సినిమా 100రోజులు అయ్యింది కానీ, నా డబ్బులు ఇంకా రాలేదు. నిన్ను గౌరవించాలని స్టేజ్‌పైకి పిలిచా’ అన్నారు. ఇంటికి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన వచ్చేసింది. కానీ, ‘ఎలాగైనా షీల్డ్‌ తీసుకోవాలి’ అని దృఢ సంకల్పంతో ముందుకు కదిలా. అలా నేను నటించిన సినిమాల్లో దాదాపు 400 షీల్డ్‌లు వచ్చాయి.

అది నా జీవితంలో జరిగిన ఘోర అవమానం

అన్నయ్య(రాజబాబు) పిల్లలు ఎలా ఉన్నారు?
అనంత్‌: వాళ్లు అమెరికాలో ఉన్నారు. సొంతంగా సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే సంస్థ ఉంది. వాళ్లు అక్కడ సెటిల్‌ అయిపోయారు.
చిట్టిబాబు: మాకు ఎప్పుడూ ఫోన్‌ చేయలేదు. ఇప్పుడు మనకు పనిచేస్తున్న జీపీఎస్‌ వ్యవస్థను అభివృద్ధి చేసిన బృందంలో సభ్యులు. దాదాపు రూ.10కోట్ల విలువైన ఇంటిలో ఉంటారు. భారత్‌లో వాళ్లకు రూ.25కోట్లకు పైనే ఆస్తులు ఉన్నాయి. ఏడాదికి ఒకసారి వచ్చి చూసుకుని వెళ్తారు.
అనంత్‌: మా కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అయితే, మా వదినమ్మ మాకు ఎంతో నిండుగా కనిపించేవారు. బొట్టు, చేతికి గాజులు, నిండుగా కనిపించేవారు. అన్నయ్య చనిపోయాక ఇప్పుడు మాకు అలా కనిపించడం ఇష్టం లేదేమో. అమ్మ తర్వాత మాకు అమ్మలాంటిది.
చిట్టిబాబు: అన్నయ్య చనిపోయే నాటికి వాళ్లు చిన్న పిల్లలు. కానీ, వాళ్లను ఆమె పెంచి పెద్ద చేసి, ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది.

సాయిబాబా అంటే మీకు భక్తి అనుకుంటా? 
చిట్టిబాబు: ఎంతో భక్తి. ఆ సాయిబాబా దయ వల్లే ఆయనకు ఐదు గుడులు కట్టించే భాగ్యం నాకు లభించింది. ఈ షో ద్వారా మళ్లీ అన్నయ్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.