close

తాజా వార్తలు

ఆ పాత్రల వల్లే పేరు పోయిందా?

ఆ విషయం నన్ను ప్రతిక్షణం బాధపెడుతోంది

ఆ పాత్రల వల్లే పేరు పోయిందా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకరు కితకితలు పెడతారు. మరొకరు కితకితలు పెడుతూనే కిర్రెక్కిస్తారు. ఆ ఇద్దరూ నడిచే దారి ఒక్కటే కానీ, ఎవరి గోల వారిదే. వాళ్లే జ్యోతి.. గీతా సింగ్‌లు. ఒకరేమో అందం, అభినయంతో ఆకట్టుకుంటారు. మరొకరేమో తనదైన కామెడీతో అల్లరి చేస్తారు. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన వీరు ఎన్నో సరదాలు సంగతులు పంచుకున్నారు.

మీ ఇద్దరిలో మొదట ఇండస్ట్రీకి వచ్చిందెవరు?
గీతాసింగ్‌: 2002లో వచ్చా.
జ్యోతి: నేను కూడా అదే సంవత్సరం చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టా.

అప్పుడు ఇలాగే లావుగా ఉండేవాళ్లా?
గీతాసింగ్‌: చాలా సన్నగా ఉండేదాన్ని. ‘కితకితలు’ కోసం బాగా లావయ్యా. అప్పటి నుంచి అదే అలవాటై ఈ సైజునే కొనసాగిస్తున్నా.

ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
జ్యోతి: ప్రస్తుతం తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నా. ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నా.

ఇండస్ట్రీకి వెళ్తే మంచి లైఫ్‌ ఉంటుందని ఊళ్లో ఎవరైనా చెప్పారా?
జ్యోతి: ఎవరూ చెప్పలేదు. చిన్నప్పటి నుంచి డ్యాన్సు అంటే ఇష్టం. అది నాన్న గుర్తించి, సినిమాల్లోకి పంపితే బాగుంటుందని భావించారు. డిగ్రీ పూర్తి చేశా.
గీతాసింగ్‌: నేను ఇంటర్మీడియట్‌ తర్వాత పాలిటెక్నిక్‌ చేశా. ఆ తర్వాత యూఎస్‌ వెళ్దామని అనుకున్నా. మాది నిజామాబాద్‌. అందరి సినిమాలు చూస్తుండేదాన్ని. అప్పట్లో ఒక యాడ్‌ ఫిల్మ్‌ చేశా. నాతో పాటు చేసిన వ్యక్తి ‘సినిమాల్లోనూ ప్రయత్నించవచ్చు కదా’ అన్నారు. అప్పుడు తేజగారి దగ్గరకు వెళ్లా. ‘జై’ కోసం ఆడిషన్స్‌ చేస్తున్నారు. అప్పటికే నా పాత్ర ఇంకొకరితో చేయించారు. కానీ నచ్చకపోవడంతో మళ్లీ ఆడిషన్స్‌ పెట్టారు. అందులో నేను సెలక్ట్‌ అయ్యా. ఆ తర్వాత నా గురించి ఎవరో ఈవీవీ సత్యనారాయణగారికి చెబితే ‘ఎవడిగోల వాడిది’లో అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరు దర్శకులు నాకు దైవంతో సమానం. ‘కితకితలు’ చేస్తున్న సమయంలో నాకు బిర్యానీ తినమని డబ్బులు కూడా ఇచ్చేవారు.

ఎప్పుడూ వెలుగుతూ ఉండాలని మీకు ‘జ్యోతి’ అని పేరు పెట్టారా?
జ్యోతి: అవును. (మధ్యలో అలీ అందుకుని. ఈ షోలో అందరూ నిజాలే చెప్పాలి. నీ పేరు జ్యోతి లక్ష్మి కదా!) సినిమాల్లో నా పూర్తి పేరు ఎందుకు చెప్పుకోనంటే.. అప్పటికే జ్యోతిలక్ష్మిగారూ ఉన్నారు కదా! అందుకునే పూర్తి పేరు చెప్పుకోను. టైటిల్స్‌లో కూడా జ్యోతి అనే వేస్తారు.

అంటే మీ నాన్నగారికి జ్యోతిలక్ష్మి అంటే ఇష్టమా?
జ్యోతి: మా నాన్నకే కాదు. అందరు నాన్నలకూ జ్యోతిలక్ష్మి అంటే ఇష్టమే కదా! (నవ్వులు) తొలిసారి ‘మందారం’తో నేను కెమెరా ముందుకు వచ్చా. అప్పుడు వైజాగ్‌లో ఆడిషన్స్‌ జరుగుతుంటే డాడీ ప్రోత్సహించారు. నన్ను బాగా ఇన్‌‌స్పైర్‌ చేసిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. థియేటర్‌లోనే దాదాపు 15-20సార్లు చూశా. ఆ సినిమా చూస్తుంటే శ్రీదేవి, చిరంజీవి తెరవెనుక నిజంగా నటిస్తున్నారేమో అనుకునేదాన్ని. అంత అమాయకంగా ఉండేదాన్ని. శ్రీదేవి చేసిన డ్యాన్స్‌లను ఇంటికి వెళ్లాక చేసేదాన్ని. ‘మందారం’ తర్వాత ‘అందం’ చేశా.

మీరు అందంగా ఉన్నా సరైన అవకాశాలు రాకపోవడానికి కారణం?
జ్యోతి: ఇక్కడ పోటీ చాలా ఎక్కువ. అయితే, ‘నేను హీరోయిన్‌గా మాత్రమే చేయాలి’ అని ఎప్పుడూ అనుకోలేదు. మా కుటుంబంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో పాత్ర నచ్చితే చేసేసేదాన్ని. ఎస్వీ కృష్ణారెడ్డిగారు నాకు గాడ్‌ ఫాదర్‌లాంటివారు.

‘పెళ్లాం ఊరెళ్తే’ చేసే సమయంలో ఎలా అనిపించింది?
జ్యోతి: ఆ సినిమాలో పెద్దగా ఎక్స్‌పోజింగ్‌ కూడా ఉండదు. కేవలం డైలాగ్‌లతోనే మెస్మరైజ్‌ చేయాలి. ‘నువ్వు ఎంత కేర్‌లెస్‌గా ఉంటావో. అలాగే ఈ పాత్రను చెయ్‌‌’ అని డైరెక్టర్‌ అన్నారు. దాంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయా. ఇప్పటికి 80 సినిమాలు చేసినా ‘పెళ్లాం ఊరెళితే’ ఎవరూ మర్చిపోరు. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చి, వాటిని దాటుకుంటూ కామెడీ పాత్రలు కూడా చేశా. ‘మహాత్మ’లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర కూడా చేశా.

ఈవీవీగారితో ఒక పాత్ర విషయంలో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది?
జ్యోతి: నేను గొడవ పడలేదండీ. ఈవీవీగారు అసలు మనం చేసే పాత్ర గురించి ముందు చెప్పరు. ఆయన సినిమాలో చేయడమే గొప్ప అనుకుంటారు. అంతకుముందు ఆయన దర్శకత్వంలో ‘తొట్టిగ్యాంగ్‌’ ‘ఎవడిగోలవాడిది’ చిత్రాలు చేశా. అందుకే నేను కూడా పాత్ర గురించి అడగలేదు. నేరుగా షూటింగ్‌ వెళ్లిపోయా. నన్ను తీసుకెళ్లి జూనియర్‌ ఆర్టిస్ట్‌ల మధ్య కూర్చోబెట్టారు. సీన్‌ చేయమన్నారు. ‘సర్‌ కొంచెం ఈ పాత్రను మార్చండి సర్‌’ అంటే, ‘నేను చెబితే చేయవా’ అన్నారు. ‘చేస్తాను సర్‌. కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నా’ కొంచెం సీరియస్‌ అయ్యారు. నాకు ఇబ్బంది కలిగేది నేను చేయను. బయటకు వచ్చేసి, డ్రెస్‌ మార్చుకుని వెళ్లిపోయా.

ఇలాంటి ప్రవర్తనతోనే చాలా సినిమాలు మిస్‌ చేసుకున్నారని విన్నాను నిజమేనా?
జ్యోతి: అలా ఏమీ లేదు. చాలా సినిమాలు చేశాను. నాకు నచ్చని సన్నివేశాల్లో నేను నటించను.

గీతా.. నీకు ఎంతమంది సిస్టర్స్‌

గీతాసింగ్‌ ‌: నాకు ఇద్దరు అక్కలు. ఒక అన్నయ్య. ఒక చెల్లి. అన్నయ్య చనిపోయారు. ఆయన పిల్లలను నేనే చూసుకుంటున్నాను. వాళ్ల బాధ్యతలన్నీ నావే. నాకు అవకాశాలు వస్తేనే ఇల్లు గడిచేది. పిల్లల చదువులకు సంబంధించి మోహన్‌బాబుగారు, విష్ణుబాబు నాకు సహయం చేశారు. వాళ్లు తిరుపతిలోనే చదువుకున్నారు. పిల్లల కోసమే నేను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. మా ఆయన వచ్చిన తర్వాత పిల్లలను వదిలేయమంటే కష్టం కదా! ఒకవేళ నాకు పెళ్లై నా భర్త చనిపోయి ఉంటే నా పిల్లలను అన్నయ్య చూసుకునే వారు కాదా? నాకు కూడా అన్నయ్య పిల్లలు అంతే!

మీ పెళ్లి పీటల వరకూ వచ్చి ఆగిపోయిందని విన్నాం నిజమేనా?
గీతాసింగ్‌: అవును, ప్రపోజల్‌ వచ్చింది. ‘పెళ్లయ్యాక, ఈ పిల్లలను పట్టించుకోకూడదు’ అన్నారు. దాంతో వద్దని చెప్పేశా.

మీ ఫ్యామిలీలో నిన్ను ఎవరైనా ఏమైనా అంటే కొట్టేసేదానివట!
గీతాసింగ్‌: ఇప్పుడు కూడా అంతే! కాకపోతే ఇప్పుడు తిడతాను. చిన్నప్పుడు ఊళ్లో ఎవరి పెళ్లైనా వెళ్లి బాగా తినేసి, ఫొటో దిగేసి, డ్యాన్స్‌ చేసి డబ్బులు తీసుకుని వచ్చేదాన్ని. (నవ్వులు).

జ్యోతి మీకు పెళ్లయిందా?
జ్యోతి: అయింది. మాకు ఒక బాబు. ఆయన నుంచి విడాకులు తీసుకున్నా. చాలా చిన్న వయసులోనే పెళ్లయింది. ఈగో ప్రాబ్లమ్స్‌ కారణంగా విడిపోయాం. మా అబ్బాయి అప్పుడప్పుడు అడుగుతుంటాడు. ఏమీ తెలియని వయసులో నాన్న అనే పదానికి దూరమయ్యాడు. ఈ విషయం నన్ను ప్రతి క్షణమూ దహించి వేస్తుంది.

పెళ్లి విషయంలో మీ తల్లిదండ్రులను సంప్రదించలేదా?
జ్యోతి: సంప్రదించాం. నేను సినిమాలు చేసే సమయంలో మానాన్న నాతో ఉండేవారు కాదు. ప్రేమ కావాలనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో నేను ఇండస్ట్రీకి చెందినదానిని కాదని అనుకునేదాన్ని. నేను చాలా ఎమోషనల్‌గా ఉండేదాన్ని. ఒక అమ్మాయిగా నాకు చాలా ప్రపోజల్స్‌ వచ్చాయి. కొన్నాళ్లు లవ్‌ చేసుకున్న తర్వాత ‘ఇది నాకు సెట్‌ కాదు’ అని చెప్పి వెళ్లిపోయిన రెండు, మూడు ఘటనలు నాకు ఎదురయ్యాయి.

నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక ఆర్ట్‌ డైరెక్టర్‌ కొడుకు చెప్పాడు. ‘పుట్టింటికి రా చెల్లి’ చేస్తున్నప్పుడు పరిచయం అయ్యాడు. అతడి తల్లిదండ్రులు చాలా మంచి వాళ్లు. కానీ, ఇతనే కాస్త తేడా. అది బ్రేక్‌ అయింది. ఇలాంటి రెండు, మూడు ఘటనలు జరిగిన తర్వాత ప్రేమ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి ‘ఈ ప్రేమలు, ఫ్రెండ్‌షిప్‌లు నాకు నచ్చవు. పెళ్లి చేసుకుందామా’ అని అడిగాడు. సరేనని ఒప్పుకొన్నా. కానీ, అది కాస్తా ఫ్లాప్‌ అయింది. ఏది ఏమైనా నా కొడుకు నాతోనే ఉన్నాడు.

ఇండస్ట్రీ నుంచి నువ్వు ఏం పొందావు? ఏం కోల్పోయావు?
జ్యోతి: నా కెరీర్‌లో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయి. నేను చేసిన పాత్రలు వేరు. తెరపై వ్యాంపు పాత్రలు చేస్తే, నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారన్నది ప్రేక్షకుల భావన. అది నాకు నచ్చలేదు. ఆ ముద్ర పోగొట్టుకోవడానికి కామెడీ పాత్రలు చేశా. ప్రతినాయక ఛాయలున్న పాత్రలు కూడా చేశా. సెలబ్రిటీ అయ్యాక అందరి కళ్లు మనపైనే ఉంటాయి. ఏ చిన్న తప్పు జరిగినా, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు. అవి చూసి మా నాన్నగారు బాధతో చనిపోయారు. ఇలాంటి వార్తల వల్ల ‘నా కూతురు నన్ను చూసుకుంటుందా’ అన్ని అభద్రతా భావం మా నాన్నగారిలో వచ్చేసింది. నేను బాగా సంపాదించి ఉంటే మానాన్నను కాపాడుకునేదాన్ని కదా అనిపిస్తుండేది. 
ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, నేను పైకి వచ్చాను.

అలాంటి పాత్ర వల్లే మీ పేరు పోయిందనుకుంటున్నారా?
జ్యోతి: అలా ఏమీ లేదు. నేను వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశా. హిందీ వాళ్లతో పోలిస్తే, తెలుగు వాళ్లు భిన్నంగా ఆలోచిస్తారు. నేను చేయనిదానికి చాలా బాధపడ్డా. 
మానాన్న చనిపోయినప్పుడు టికెట్ల కోసం ఎయిర్‌పోర్ట్‌లో అటూ ఇటూ తిరుగుతుంటే, ‘ఇంత జరిగినా ఎలా తిరుగుతుందో చూడండి’ అంటూ ట్రోలింగ్స్‌ మొదలు పెట్టారు. అవి చూసి చాలా బాధేసింది. మీడియా ఇంత దారుణంగా ఉంటుందా? అనిపించింది. వీలైతే సాయం చేయాలి. లేకపోతే మాట్లాడకుండా కూర్చోవాలి.

తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ కమెడియన్స్‌కు తగిన ప్రాధాన్యం లేదని మీ అభిప్రాయమా?
గీతాసింగ్‌: దీనిపై నేను ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్‌ పెట్టాను. బయటకు వెళ్తే ‘ఏం సినిమాలు చేయడం లేదా’ అని అందరూ అడుగుతున్నారు. వాళ్లు ఇస్తే చేయకుండా ఉంటామా? ఇక్కడ ఆర్టిస్ట్‌లను వదిలేసి, బయట వాళ్లకు ఎక్కువ ఇచ్చి పాత్రలు ఇస్తున్నారు. నేను ఆ పోస్ట్‌ పెట్టడం వెనుక ప్రధాన కారణం ఎవరినో విమర్శించాలని కాదు.. దర్శక-నిర్మాతలకు తెలిసిన వాళ్లు మన పేరుని సూచిస్తారన్న ఉద్దేశంతోనే పెట్టా. 

జ్యోతి: అవకాశాలు వస్తాయని ఎవరూ అలా పెట్టరు. ఆవేదనతోనే ఆ పోస్టులు పెడతారు.

 

సీమశాస్త్రి జరుగుతుండగా ఒక చేదు సంఘటన జరిగింది.. ఏంటది?
గీతాసింగ్‌: అల్లరి నరేష్‌, హీరోయిన్‌ ఇద్దరూ బైక్‌తో సహా చెట్టుపై ఇరుక్కుంటారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టును తన్నాలి. నేను రెడీ అయిపోయాను. ఇంతలో ఎవరో ‘అరేయ్‌ చూడరా! ఆ మోటు వెళ్లి చెట్టును ఢీకొడుతుంది’ అన్నారు. ఇంతలో డైరెక్టర్‌ యాక్షన్‌ చెప్పేశారు. నేను ఏడుస్తూ ఉండిపోయాను. వెంటనే డైరెక్టర్‌ నా దగ్గరకు వచ్చి ‘ఏమైంది గీత’ అని అడిగారు. ‘కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు’ అన్నా. ‘నువ్వు అవేవీ పట్టించుకోవద్దు’ అని చెప్పారు. ఆ సీన్‌ చేసిన తర్వాత నన్ను ఎవరైతే కామెంట్‌ చేశారో వాళ్లే చప్పట్లు కొట్టారు.

‘మహాత్మ’లో ఆ పాత్ర ఎలా వచ్చింది?
జ్యోతి: పెళ్లయిన తర్వాత కొన్నాళ్లకు విభేదాలు వచ్చాయి. దీంతో దుబాయి నుంచి నా కొడుకుతో ఇక్కడకు వచ్చేశా. ఆ సమయంలోనే పరుచూరి గోపాలకృష్ణగారు ఫోన్‌ చేశారు. సినిమాలు చేస్తానని ఆయనకు చెప్పా. అప్పుడే కృష్ణవంశీ సినిమా చేస్తున్నారని చెప్పి, వెళ్లి ప్రయత్నించమన్నారు. ఆఫీస్‌కు వెళ్లి అవకాశమివ్వమని అడిగా. ఆడిషన్‌ చేసిన తర్వాతే తీసుకుంటానని చెప్పారు. ఐదురోజుల ఆడిషన్‌ నన్ను ఆ పాత్రకు తీసుకున్నారు.

మీకు ఎప్పుడైనా లవ్‌ప్రపోజల్స్‌ వచ్చాయా?
గీతాసింగ్‌: వెయిట్‌ చేస్తున్నా. అందరూ భయపడి పారిపోతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.