close

తాజా వార్తలు

సీఎన్‌ఎన్‌పై ట్రంప్‌ అసహనం..!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో వివాదానికి తెరతీశారు. మిడ్‌టర్మ్‌ ఎన్నికల ఫలితాలపై వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎన్‌ఎన్‌ వైట్‌హౌస్‌ చీఫ్‌ కరస్పాండెంట్‌ జిమ్‌ అకోస్టా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సదరు కరస్పాండెంట్‌కు వైట్‌హౌస్‌లోకి ప్రవేశాన్ని రద్దు చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిన్న అమెరికాలో మిడ్‌ టర్మ్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. రిపబ్లికన్లు కాంగ్రెస్‌లోని ఎగువసభ అయిన సెనెట్లో పట్టు సాధించగా డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అధిక స్థానాలను సాధించారు.

విలేకర్ల సమావేశంలో ఏం జరిగందంటే..

మిడ్‌టర్మ్‌ ఎన్నికల ప్రచార సమయంలో వలసలపై ట్రంప్‌ వాడిన ‘దండయాత్ర’ అనే పదాన్ని సీఎన్‌ఎన్‌ ప్రతినిధి జిమ్‌ అకోస్టా శ్వేతసౌధంలో జరిగిన విలేకర్ల సమావేశంలో తప్పుపట్టారు. వలసలకు వ్యతిరేకంగా ట్రంప్‌ చేసే ప్రకటనలు జాతిఅహంకారానికి చిహ్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ ‘నన్ను దేశాన్ని పాలించనీయండి.. మీరు సీఎన్‌ఎన్‌ను నడపండి’ అని అసహనంగా సమాధానం ఇచ్చారు.

అనంతరం 2016 ఎన్నికల్లో రష్యా జోక్యం పై ప్రశ్న అడిగేందుకు జిమ్‌ సిద్ధమయ్యారు. వెంటనే ట్రంప్‌ స్పందిస్తూ ‘ ఇక చాలు, మైకు పెట్టేయ్‌’ అని అన్నారు.

శ్వేతసౌధంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని వెంటనే జిమ్‌ చేతిలోని మైక్‌ లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ జిమ్‌ సున్నితంగా ఆమెను ఆపి ప్రశ్నను కొనసాగించబోయారు. ఈ సమయంలో జిమ్‌ ఆమెకు క్షమాపణలు కూడా చెప్పారు.

దీంతో ట్రంప్‌ అక్కడి నుంచి వెళ్లి పోవడానికి సిద్ధమయ్యారు. ఇక చేసేది లేక సీఎన్‌ఎన్‌ ప్రతినిధి మైక్‌ను ఆ యువతికి అప్పగించారు. దీంతో మళ్లీ వెనక్కి వచ్చిన ట్రంప్‌ ‘‘ నీలాంటి వ్యక్తిని ఉద్యోగిగా పెట్టుకున్నందుకు సీఎన్‌ఎన్‌ సిగ్గుపడాలి. నువ్వు చాలా క్రూరమైన వ్యక్తివి. భయంకరమైన మనిషివి. నువ్వు సారా హుక్రెబీ(ట్రంప్‌ ప్రెస్‌ సెక్రటరీ)తో ప్రవర్తించిన తీరు ఘోరంగా ఉంది.’’ అని అన్నారు.

అతన్ని వైట్‌హౌస్‌లోకి రానివ్వం..

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి శ్వేతసౌధం ప్రతినిధి శాండర్స్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘ విధినిర్వహణలో ఉన్న శ్వేత సౌధ ఉద్యోగినిపై చేయి వేయడాన్ని ఏమాత్రం క్షమించం. అటువంటి రిపోర్టర్‌ను నియమించుకున్నందుకు సీఎన్‌ఎన్‌ గర్వపడం చూస్తే చిరాకేస్తోంది. సీఎన్‌ఎన్‌ అరాచకానికి ఇది నిదర్శనం. నేటి నుంచి సదరు సీఎన్‌ఎన్‌ రిపోర్ట్‌ శ్వేతసౌధంలో ప్రవేశించడంపై నిషేధం విధిస్తున్నాం. ’’ అని పేర్కొన్నారు.

సాయంత్ర సమాచారం కోసం శ్వేతసౌధానికి వెళితే సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది అడ్డుకొన్నారని జిమ్‌ అకోస్టా ట్విటర్‌లో తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.