close

తాజా వార్తలు

అప్ప‌టి నుంచి ర‌జ‌నీ మ‌ర్యాద ఇవ్వ‌డం మానేశారు!

అప్ప‌టి నుంచి ర‌జ‌నీ మ‌ర్యాద ఇవ్వ‌డం మానేశారు!

ఆమె గొంతు విప్పితే అదే చ‌రిత్ర‌! ఆమె న‌టించ‌డం మొద‌లు పెడితే 'మ‌రో చ‌రిత్ర‌!' త‌న‌ అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన వ‌నిత‌. అందంగా మార్చారు త‌న డ‌బ్బింగ్‌తో హీరోయిన్‌ల భ‌విత‌. డైలాగ్ చెబితే క‌వి క‌లం నుంచి జాలువారిన క‌విత‌. ఆమె న‌టిస్తే ఉర్రూత‌లూగింది ఆనాటి యువ‌త‌. ఆమే మరెవ‌రో కాదు.. మ‌న స‌రిత‌! అలీ వ్యాఖ్యాత‌గా ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి విచ్చేసి, తన సినిమా కెరీర్‌, స‌ర‌దా సంగ‌తుల‌ను ఇలా ఎన్నో పంచుకున్నారిలా!
 

మీరు టెలివిజ‌న్ ముందుకు వ‌చ్చి దాదాపు పాతికేళ్లు అవుతుందా?
స‌రిత‌: మ‌ధ్య‌లో ఒక త‌మిళ సీరియ‌ల్ చేశా. ఇంట‌ర్వ్యూ అయితే ఇదే మొద‌టిసారి! 
మీ సొంతూరు గుంటూరు క‌దా!
స‌రిత‌: అవును! గుంటూరు ద‌గ్గ‌ర మునిప‌ల్లె. నేను స్టార్ అయిన త‌ర్వాత నా ఊరికి వెళ్ల‌డం కుద‌ర‌లేదు.
మీ అస‌లు పేరు స‌రితేనా?
స‌రిత‌:  నా అస‌లు పేరు అభిలాష‌. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన త‌ర్వాత కె.బాల‌చంద‌ర్‌గారు స‌రిత అని పేరు పెట్టారు. త‌మిళ‌వాళ్లు అభిలాష‌ను అభిలాస అంటారేమోన‌ని భ‌య‌మేసి స‌రిత అని పెట్టారు. 
మ‌రోచ‌రిత్ర కోసం 162మందిని ఆడిష‌న్స్ చేసి మిమ్మ‌ల్ని ఎందుకు సెల‌క్ట్ చేశారు బాల‌చంద‌ర్‌?
స‌రిత‌:  నేను న‌టిస్తాన‌ని అస్స‌లు అనుకోలేదు. మా తండ్రిగారికి ర‌చ‌యిత గ‌ణేష్‌పాత్రో స్నేహితుడు. ఆయ‌న ఒక‌సారి మా ఇంటికి వ‌చ్చారు.  అప్పుడే నేను స్కూల్ నుంచి వ‌చ్చి షూ విప్పి లోప‌లికి వెళ్లాను. న‌న్ను చూసి, 'మీ అమ్మాయి న‌టిస్తుందా?' అని అడిగారు. వెంట‌నే మా ఫాద‌ర్ పిలిచి 'నువ్వు న‌టిస్తావా?' అని అడిగితే 'నో' చెప్పి వెళ్లిపోయాను. అయితే, క‌మ‌ల్‌హాస‌న్‌తో సినిమా అన‌గానే నా ముఖంలో ఎక్క‌డాలేని వెలుగు వ‌చ్చేసింది. వెంట‌నే ఒకే చెప్పేశా. మ‌రుస‌టి రోజు షాపింగ్ వెళ్లి చీర‌, బ్లౌజ్‌, హీల్స్ కొనుక్కొని గెట‌ప్ వేసుకుని వెళ్లా. రిజ‌క్ట్ అవ్వ‌కూడ‌ద‌ని నా అభిప్రాయం. ప‌రీక్ష‌ల్లో ర్యాంకు త‌క్కువ వ‌చ్చినా నేను అప్‌సెట్ అయిపోతాను. బాగా త‌యారై ఆఫీస్‌కు వెళ్లా. వెళ్ల‌గానే పాట పాడ‌మ‌ని అడిగారు. కాసేపు ఆలోచించి పాడ‌టం మొద‌లు పెట్టా. 'ఏ దివిలో విరిసిన పారిజాత‌మో' పాట పాడా. ఆ త‌ర్వాత పేజీన్నర డైలాగ్‌లు ఇచ్చారు. చ‌క‌చ‌కా చెప్పేశా. 'స్విమ్‌సూట్ వేసుకోవాలి, కిస్సింగ్ సీన్స్ ఉంటాయి' అన్నారు. అన్నింటికీ ఒకే చెప్పేశా. మ‌రుస‌టి రోజే వైజాగ్ తీసుకెళ్లారు. అక్క‌డే క‌మ‌ల్‌హాస‌న్‌గారిని చూశాను. మొద‌టిరోజు షూటింగ్ అస్స‌లు  బాగా జ‌ర‌గ‌లేదు. ఆయ‌న్ను చూడ‌గానే డైలాగ్‌లు మ‌ర్చిపోయేదాన్ని. ఫ‌స్ట్‌సీన్ క‌మ‌ల్ చేయిమీద ముద్దుపెట్టే సీన్‌. దాదాపు ప‌ది, ప‌దిహేను టేక్‌లు తీసుకున్నా. అయినా ఒకే కాలేదు. నిర్మాత అయితే, 'ఈ అమ్మాయి వ‌ద్దు.. శ్రీ‌దేవిని తీసుకొద్దాం' అని బాల‌చంద‌ర్‌గారితో చెప్ప‌టం మొద‌లు పెట్టారు. ఆ రోజు సాయంత్రం బాల‌చంద‌ర్‌గారి అసోసియేట్ అనంత్‌గారు వ‌చ్చారు. 'క‌మ‌ల్‌హాస‌న్ అంటే ఇష్ట‌మేనా'? అన్నారు. 'చాలా ఇష్టం' అన్నా. 'అది ఫేస్‌లో రావాలి అంతే'! అన్నారు. 'ఆయ‌న సినిమాలు ఏవైనా చూశావా?' అన్నారు. 'లేద‌ని' చెప్పా. 'అయితే నేను ఒక డైలాగ్ ఇస్తాను. రేపు ఇది చాలా పెద్ద సీన్‌. నువ్వు త‌ప్ప‌క చేయాలి' అన్నారు. ఆ త‌ర్వాత క‌థ మొత్తం క్లుప్తంగా చెప్పారు. మ‌రుస‌టి రోజే నాకు పెద్ద ప‌రీక్ష‌. క్లైమాక్స్ ముందు సీన్ చేయాల్సి వ‌చ్చింది. సింగిల్ టేక్‌లో చేసేశా. అంతా దేవుడి ద‌య‌.

అప్ప‌టి నుంచి ర‌జ‌నీ మ‌ర్యాద ఇవ్వ‌డం మానేశారు!

సినిమా విడుద‌లైన త‌ర్వాత మీ స్పంద‌న ఏంటి?
స‌రిత‌: అమ్మాయి బాగోలేద‌ని మొద‌టివారంలో రిపోర్ట్ వ‌చ్చిందట‌. రెండో వారం నుంచి పూర్తి రివ‌ర్స్‌. ఆ అమ్మాయే సినిమాకు ప్ల‌స్ అన్నారట‌. హిట్‌లు, స‌క్సెస్‌లు నాక‌స్స‌లు తెలియ‌దు. వెంట‌నే ర‌జ‌నీకాంత్‌కు జోడీగా బాల‌చంద‌ర్ మ‌రో సినిమాకు బుక్ చేశారు. అది ఒక వేశ్య‌ క్యారెక్ట‌ర్. దాన్ని మంజుల గారు చేయాల్సింది. అస‌లు ఆ సినిమాలో న‌న్ను ఆమె చెల్లెలిగా ప‌రిచ‌యం చేద్దామ‌నుకున్నారు. కానీ, ఆ స‌మ‌యంలోనే ఆమెకు వివాహ‌మైంది. వేశ్య‌పాత్ర‌ను చేయ‌డానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆ అవ‌కాశం నాకొచ్చింది. ఆ సినిమాలో 22ఏళ్ల అమ్మాయిగా, వేశ్య పాత్ర‌లో న‌టించా. 
బాల‌చంద‌ర్‌ కోసం చేశారా? క‌మ‌ల్‌హాస‌న్ కోసం చేశారా?
స‌రిత‌: నిజం చెప్పాలంటే క‌మ‌ల్‌హాస‌న్‌గారి కోస‌మే చేశా. ఎందుకంటే ఆయ‌నంటే అప్ప‌ట్లో క్ర‌ష్ ఉండేది. స్కూల్లో చెప్పుకోవాలి. ఇలా ఆలోచించేదాన్ని.
బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మొత్తం ఎన్ని సినిమాలు చేశారు?
స‌రిత‌: హీరోయిన్స్‌లో బాల‌చంద‌ర్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో నేనే ఎక్కువ సినిమాలు చేశా. మొత్తం 23 చిత్రాల్లో న‌టించా. క‌మ‌ల్‌హాస‌న్‌గారు నాకంటే ఎక్కువ చిత్రాలు చేశారు. ఆయ‌న్ను బీట్ చేయాల‌ని అనుకున్నా. కానీ, కుద‌ర‌లేదు. 
బాల‌చంద‌ర్‌కు కోపం ఎక్కువ అని విన్నాం నిజ‌మేనా?
స‌రిత‌: ఉండేది. కానీ న‌న్నెప్పుడూ ఏమీ అన‌లేదు. ఏది చెప్పినా వెంట‌నే చేసేసేదాన్ని అయితే, కొత్త‌వాళ్లు ఎవ‌రైనా త‌ప్పు చేస్తే మాత్రం ఆ తిట్లు మ‌న‌కు ప‌డ‌తాయి. 
మొత్తం ఎన్ని సినిమాల్లో న‌టించారు?
స‌రిత‌:  తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ చిత్రాలు క‌లిపి 160కు పైగా సినిమాల్లో న‌టించా. 
మీకు ఏ సంవ‌త్స‌రంలో వివాహం అయింది?
స‌రిత‌: 1988లో పెళ్ల‌యింది. నాకు ఇద్ద‌రు కొడుకులు. పెద్ద కొడుకు డాక్ట‌ర్‌. రెండోవాడు ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తున్నాడు. 

అప్ప‌టి నుంచి ర‌జ‌నీ మ‌ర్యాద ఇవ్వ‌డం మానేశారు!

మీరేంటి దేశం వ‌దిలేసి వెళ్లిపోయారు?
స‌రిత‌:  మా వివాహ బంధంలో క‌ల‌త‌లు వ‌చ్చాయి. కొన్ని న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వ‌చ్చాయి. దీంతో నా బిడ్డ‌ల‌ను తీసుకుని న్యూజిలాండ్ వెళ్లిపోయి, అక్క‌డే చ‌దివించా. ఆ త‌ర్వాత కొన్నాళ్లు దుబాయ్‌లో ఉన్నాం.
మీరు డ‌బ్బింగ్ వైపు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింది?
స‌రిత‌:  మీకో సంగ‌తి చెప్పాలి. 'మ‌రోచ‌రిత్ర' స‌మ‌యంలో న‌న్ను డ‌బ్బింగ్ చెప్పొద్ద‌ని డైరెక్ట‌ర్ చెప్పేశారు. అయితే, సౌండ్ ఇంజినీర్ మాత్రం 'ఈ అమ్మాయి వాయిస్ చాలా బాగుంద‌ని' చెప్ప‌డంతో ఒకే చేశారు. నేను డ‌బ్బింగ్ వైపున‌కు రావ‌డానికి కార‌ణం మాత్రం దాస‌రి నారాయ‌ణ‌రావుగారు. 'గోరింటాకు' సినిమా కోసం ఆయ‌న డ‌బ్బింగ్ చెప్ప‌మ‌ని అడిగారు. నాకే ఆశ్చ‌ర్య‌మేసింది. నాకూ న‌చ్చ‌డంతో ఒప్పుకొన్నా. ఆ త‌ర్వాత విజ‌య‌శాంతి, సుహాసిని, ర‌మ్య‌కృష్ణ‌, రోజా, న‌గ్మా, సౌందర్య ఇలా చాలా మందికి చెప్పా. న‌గ్మా అయితే స‌రిత డ‌బ్బింగ్ చెబితేనే సినిమా చేస్తాన‌ని కండీష‌న్ కూడా పెట్టేది. అంతేకాదు, నాకు ఫోన్ చేసి కూడా అడిగేది. 
'అర్జున్' సినిమాలో విల‌న్ పాత్ర ఎందుకు చేయాల్సి వ‌చ్చింది?
స‌రిత‌:  సినిమాలో నా పాత్ర ఇలా ఉంటుంద‌ని ముందే చెప్పారు. ఈ సినిమాకు ముందు త‌మిళంలో ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర చేశా. అది చూసి ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. నేను అంత బాగా చేశానంటే కార‌ణం ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్. 
ర‌జ‌నీకాంత్‌తో ఫ‌స్ట్‌డే ఫ‌స్ట్ షాట్ త‌ర్వాత ఒక త‌మాషా జ‌రిగింద‌ట‌!
స‌రిత‌: (న‌వ్వులు) త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఆ సినిమా మొద‌లు పెట్టారు. మొద‌టి రోజు త‌మిళంలో స‌న్నివేశాలు తీసిన‌ప్పుడు సెట్‌కు రాగానే ర‌జ‌నీకాంత్‌ను ప‌రిచ‌యం చేశారు. ర‌జ‌నీ ఎంతో మ‌ర్యాద‌గా నాకు న‌మ‌స్కారం చేశారు. మ‌రుస‌టి రోజు క‌న్న‌డలో సీన్లు తీయాలి. ఓ హోట‌ల్‌లో నేను ఉంటే అసోసియేట్ డైరెక్ట‌ర్ నా ద‌గ్గ‌రకు వ‌చ్చి సీన్లు చెబుతున్నారు. ఆయ‌న ర‌జ‌నీకాంత్‌కు బాగా క్లోజ్‌. ఒక గ‌దిలో మేమిద్ద‌రం కూర్చొని ఉన్నాం. నేనేమో ఫ్రాక్ వేసుకుని ఆయ‌న చెప్పే సీన్లు వింటున్నా. అటుగా ర‌జ‌నీ వెళ్తూ, ఆయ‌న‌తో మాట్లాడి ముందుకు వెళ్లి, మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చి, 'స‌రిత ఎక్క‌డ' అని అడిగారు. 'నేనే స‌రిత' అని చెప్పా. ఒక్క‌సారి పైకి కింద‌కు చూశారు. మేక‌ప్ లేక‌పోవ‌డం, గౌను వేసుకోవ‌డం నెత్తినోరు కొట్టుకుని, 'చిన్న పిల్ల‌ను తీసుకొచ్చి యాక్ట్ చేయిస్తున్నారా?'అని ఆ రోజు నుంచి నాకు మ‌ర్యాద లేదు. చిన్న పిల్ల‌లా చూసుకునేవారు. 

అప్ప‌టి నుంచి ర‌జ‌నీ మ‌ర్యాద ఇవ్వ‌డం మానేశారు!

భార‌తీరాజాతో సినిమా చేశారా?
స‌రిత‌: ఒక సినిమా చేశాను. స‌త్య‌రాజ్ హీరో. అందులో నాది 60ఏళ్ల ముస‌లావిడ పాత్ర‌. మొద‌ట మేక‌ప్ టెస్టు చేసుకుని ఒకే చేశారు. సెట్‌పైకి వెళ్లి త‌ర్వాత న‌న్ను మ‌రింత ముస‌లావిడిగా చేసేశారు. న‌న్ను నేను అద్దంలో చూసుకోలేక‌పోయా. అంతలా ఉంటుంద‌ని నేను అనుకోలేదు. ఇష్టం లేకుండానే ఆ సినిమా చేశా. క‌నీసం రెమ్యున‌రేష‌న్ కూడా తీసుకోలేదు. ఫ‌స్ట్ కాపీ చూసిన త‌ర్వాత తీసుకున్న చెక్ తిరిగి ఇచ్చేశా!
హీరోయిన్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌, మ‌ద‌ర్ ఏదంటే మీకు ఇష్టం!
స‌రిత‌: మ‌ద‌ర్‌. అందుకే ఎక్కువ సినిమాలు చేయ‌డం ఆపేశా. 
'మ‌రోచ‌రిత్ర' సినిమా అయిన త‌ర్వాత మీకు ఏవైనా ప్రేమ‌లేఖ‌లు వ‌చ్చాయా?
స‌రిత‌:  చాలా వ‌చ్చాయి. నా ఫొటోను క‌లిపి వాళ్లు రిప్లై ఇచ్చేదాన్ని. నాకు మ‌ల్లెపూలు ఇష్ట‌మ‌ని చాలా మంది మ‌ల్లెపూల మొక్క‌లు పంపేవారు. 
'మ‌రోచ‌రిత్ర‌'లో మీ మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్ క‌మ‌ల్‌హాస‌న్ ఫొటోను కాల్చేస్తే, ఆ బూడిద తీసుకుని కాఫీలో క‌లుపుకొని తాగుతారు నిజంగా తాగేశారా?
స‌రిత‌: (న‌వ్వులు) నిజంగా తాగేశా. అప్పుడు తెలియ‌దు క‌దా! డైరెక్ట‌ర్ చేయ‌మంటే చేసేశా. 
ఆ కాఫీ తాగిన త‌ర్వాత మీరు ఇలా లావుగా అయిపోయారా? 
స‌రిత‌: న‌వ్వులు. అలా ఏమీ లేదు. 

అప్ప‌టి నుంచి ర‌జ‌నీ మ‌ర్యాద ఇవ్వ‌డం మానేశారు!

మోహ‌న్‌బాబుని చూస్తే మీరు భ‌య‌ప‌డేవార‌ట‌!
స‌రిత‌: అవునండీ! చాలా భ‌యం. 'విజ‌య' చిత్రంలో ముర‌ళీ మోహ‌న్‌, మోహ‌న్‌బాబు ఇద్ద‌రూ ఉన్నారు. ఒక రేప్ సీన్‌లో న‌న్ను ఎత్తి ఢమాల్ అని బెడ్‌పై ప‌డేశారు. అప్ప‌టి నుంచి ఇంకా భ‌యం పెరిగిపోయింది. ఇటీవ‌ల క‌లిసిన‌ప్పుడు తెలిసింది. ఆయ‌న మృదుస్వభావో. చాలా మంచిగా మాట్లాడారు. ఈయ‌న గురించా?  నేను ఇంత‌గా భ‌య‌ప‌డింది అని అనుకునేదాన్ని.
మొద‌టిసారి మిమ్మ‌ల్ని మేక‌ప్ టెస్టు చేసింది ఎన్టీఆర్ అని అంటారు నిజ‌మేనా?
స‌రిత‌:  నిజ‌మే! 'అక్బ‌ర్‌, స‌లీమ్, అనార్క‌లీ' కోసం మొద‌టిసారి మేక‌ప్ వేశారు. కానీ, చాలా చిన్న‌పిల్ల‌గా అనిపించ‌డంతో వ‌ద్ద‌నుకున్నారు. 
అప్ప‌ట్లో చాలా మంది హీరోల‌తో చేశారు క‌దా! ఏ హీరో బెస్ట్‌?
స‌రిత‌: క‌మ‌ల్‌హాస‌న్‌గారు. నా అభిమాన న‌టుడు. మ‌ల‌యాళంలో మోహ‌ల్‌లాల్‌గారంటే ఇష్టం. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.