close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 22/08/2019 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్నికల వేళ విభజన రాజకీయం 

‘పుట్టుకతో పౌరసత్వం’పై ట్రంపరితనం 
ఎన్నికల వేళ విభజన రాజకీయం 

న్మతః పౌరసత్వ హక్కు చట్టంలో మార్పు చేయనున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాలో నివసించే భారతీయులు, వారి కుటుంబాలు, మన దేశంలోని వారి తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. అమెరికాలో అత్యధికంగా ఉన్న తెలుగువారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా రాజ్యాంగంలో పౌరసత్వంపై పూర్తి స్పష్టతలేదు. రాష్ట్రాలు ఇష్టానుసారం వ్యవహరించేవి. 1857లో తొలిసారి సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఆఫ్రికా, అమెరికా జాతీయులైన బానిసలకు పౌరసత్వ హక్కు లేదని తేల్చింది. తరవాత అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ హయాములో బానిసల బతుకులపై చలించి బానిసత్వాన్నే రద్దు చేశారు. దీంతో 1868లో తీసుకొచ్చిన 14వ రాజ్యాంగ సవరణ- అమెరికాలో పుట్టిన ఎవరైనా చట్టాలకు లోబడి దేశ పౌరులేనని స్పష్టీకరించింది. అయినా చైనా నుంచి వలస వచ్చినవారికి ఈ సౌకర్యాన్ని నిరాకరించారు. చైనా జాతీయులను నానాహింస పెట్టారు. జాతి దురహంకారంతో 17మంది చైనా నుంచి చట్టబద్ధంగా వచ్చి స్థిరపడిన వలసవాదులను 1871లో ఉరితీశారు. ప్రభుత్వం ఈ జాతి దురహంకారులకు అండగా నిలిచింది. 1882లో చైనీయుల ప్రవేశాన్ని నిషేధించింది. దేశంలో ఉన్న చైనా వలసవాదులు ఈ దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. 1895లో వాంగ్‌ కిమ్‌ ఆర్క్‌ అనే చైనా జాతీయుడు అమెరికా గడ్డపై పుట్టినందువల్ల తనకు పౌరసత్వం ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయన వాదనను సమర్థించింది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డా అమెరికా పౌరుడేనని స్పష్టం చేసింది. అప్పటి నుంచి దాదాపు 120 సంవత్సరాలుగా అప్రతిహతంగా జన్మతః ప్రతి బిడ్డా అమెరికా పౌరుడవుతున్నాడు.

ఎన్నికల వేళ విభజన రాజకీయం ఆగ్రహానికి కారణం... 
ట్రంప్‌ గెలిచిన దగ్గర నుంచి వలస విధానంలో మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్‌ ఈ మార్పులపై పెద్దగా స్పందించకపోవటంతో ఆయన తన అధ్యక్ష విచక్షణాధికారం ఉపయోగించి కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా నిబంధనలను కఠినతరం చేయడం ప్రారంభించారు. ఇటీవల నెల రోజులుగా అమెరికా దిగువనున్న దేశాల నుంచి తండోపతండాలుగా వలసదారులు ప్రదర్శన చేసుకుంటూ అమెరికా వైపు రావడంతో పెద్ద దుమారం చెలరేగుతోంది. ఎల్‌ సాల్వడార్‌, గ్వాటెమాలా, మెక్సికో మీదుగా అమెరికాకు వస్తున్న వలసదారులపై ట్రంప్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దక్షిణ సరిహద్దుకు సైన్యాన్ని తరలించాలని ఆదేశించారు. కొన్ని విపరీత చర్యలకూ సిద్ధపడ్డారు. అందులో భాగమే జన్మతః పౌరసత్వ హక్కు చట్టంలో మార్పులకు ప్రయత్నం. పద్నాలుగో రాజ్యాంగ సవరణను అక్రమ వలసదారులు దుర్వినియోగపరుస్తున్నారనేది ట్రంప్‌ అభియోగం. గర్భిణీ స్త్రీలను అక్రమంగా అమెరికా భూభాగంలోకి తరలించి అక్కడ ప్రసవం అయ్యేలా చేస్తున్నారని, వారికి పుట్టిన బిడ్డలు అమెరికా పౌరులవుతున్నారని, ఇప్పుడు అమలులో ఉన్న వలస విధానంతో వీరి తల్లిదండ్రుల రక్త సంబంధీకులూ అమెరికా పౌరులవుతున్నారన్నది ట్రంప్‌ వాదన. ఈ విధంగా జన్మతః పౌరసత్వ హక్కుతో అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారని, చివరకు వలస ఓ హక్కుగా మారుతోందన్నది ఆయన అభియోగం. అందుకే 14వ రాజ్యాంగ సవరణ దుర్వినియోగం కాకుండా కొన్ని వివరణలతో ‘కార్యనిర్వాహక ఉత్తర్వు’ ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇందుకు మద్దతుగా 1898 నాటి సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తున్నారు. అందులో అక్రమ వలసదారుల పిల్లల గురించి ప్రస్తావించలేదని, చట్టప్రకారం వచ్చిన వలసదారుల పిల్లల గురించే వివరణ ఇచ్చారని వాదిస్తున్నారు. ఈ చర్చ చాలా ఏళ్ళ నుంచి కొంతమంది సెనేటర్లు, కాంగ్రెస్‌వాదులు సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడే ఈ వాదనను తెరపైకి తీసుకురావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది.

ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా జన్మతః పౌరసత్వహక్కు లేదని ట్రంప్‌ వాదిస్తున్నారు. ఇది వాస్తవం కాదు. 30కి పైగా దేశాలు ఇలాంటి పౌరసత్వ హక్కుల్ని ఇస్తున్నాయి. అమెరికా ఖండంలోని ఎక్కువ దేశాలు, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలు తమ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డనూ పౌరుడిగా పరిగణిస్తున్నాయి. పిల్లల్ని కనడానికే అక్రమంగా చొరబడుతున్నారనేది ట్రంప్‌ మరో ఆరోపణ. గణాంకాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మొత్తం అక్రమ వలసదారుల పిల్లల జననాల్లో 70 శాతానికి పైగా అయిదేళ్లు పైబడి నివాసం ఉంటున్న తల్లుల పిల్లలే. వాస్తవానికి అదివరకటితో పోలిస్తే అక్రమ వలసదారుల పిల్లల జననం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు 2016లో మొత్తం అమెరికాలో 50 లక్షల జననాలుండగా అందులో రెండున్నర లక్షలు అక్రమ వలసదారుల పిల్లలు. ఇది గత 18 ఏళ్లలో అతి తక్కువగా నమోదైంది. 2007లో ఈ సంఖ్య దాదాపు నాలుగు లక్షలుంది. అయినా ట్రంప్‌ ‘అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వు’ ద్వారా వీళ్ళందరిని పౌరులు కాకుండా ప్రకటించాలంటున్నారు. అంటే ఈ పిల్లల్ని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారన్న మాట. మరి ప్రవాస భారతీయులు, తెలుగువారి పిల్లల పరిస్థితేంటి? సక్రమంగా వలసవెళ్ళి అమెరికాలో నివాసం ఉంటున్నవారి గురించి ప్రస్తావించడం లేదు. ఇందులో శాశ్వత నివాసులు (గ్రీన్‌కార్డు ఉన్నవారు), పౌరసత్వం వచ్చినవారు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోకపోవచ్చు. మిగతావారు వివిధ దశల్లో నివాసముంటున్నారు. చదువుకోవటానికి, తాత్కాలిక ఉద్యోగులుగా, కంపెనీ ప్రాజెక్టు పని మీద వెళ్ళినవారూ లక్షల మంది ఉన్నారు. 2010 తరవాత ఇప్పటివరకూ భారతీయులే ఎక్కువ మంది అమెరికాకు తరలివెళ్ళారు. ఈ ఎనిమిదేళ్లలో ఎనిమిది లక్షల మంది భారతీయులు వలస వెళ్లగా, ఆరు లక్షలతో చైనా తరవాతి స్థానంలో ఉంది. వీళ్ళందరూ శాశ్వత నివాసానికి (గ్రీన్‌ కార్డు) దరఖాస్తు చేసుకుంటారు. ఇటీవలి కాలంలో గ్రీన్‌కార్డు రావటం చాలా కష్టతరంగా మారింది. దీనికోసం పాతికేళ్ల నుంచి ఎదురుచూస్తున్నవారూ ఉన్నారు. వీళ్ళందరికీ ఎప్పటికి గ్రీన్‌కార్డు వస్తుందో తెలియదు కనుక లక్షలాది ప్రవాస భారతీయుల్ని తాత్కాలిక ఉద్యోగులుగానే పరిగణిస్తారు. వీరి పిల్లల విషయంలో ట్రంప్‌ ఆలోచనేమిటో తెలియదు. ట్రంప్‌ మద్దతుదారులు మాత్రం ఈ పిల్లల విషయంలో చట్టంలో స్పష్టత లేదని వాదిస్తున్నారు. చట్టబద్ధ వలసదారుల పిల్లలందరూ (కేటగిరీతో నిమిత్తం లేకుండా) పౌరులుగా పరిగణించకపోతే పరిస్థితి ఏమిటి? దీనికితోడు ఇటీవల హెచ్‌1బీ వీసాల నిబంధనల్ని కఠినతరం చేశారు. కొత్త నిబంధనలతో వీసా ప్రక్రియను సంక్లిష్టం చేస్తున్నారు. రెండోవైపు గ్రీన్‌కార్డు రావటం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఒక్కరి జీతం మీదే ఆధారపడి పిల్లల్ని చదివించటం, కుటుంబ ఖర్చులు పెరగటం లాంటి కారణాలతో హెచ్‌4 వీసా మీదున్న జీవిత భాగస్వామికీ ఉద్యోగం చేసుకునే అవకాశమిచ్చే వెసులుబాటును ఒబామా కల్పించిన సంగతి తెలిసిందే. ఇది నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని త్వరలో దీన్ని రద్దు చేస్తామని ట్రంప్‌ ప్రకటించారు. హెచ్‌4 కేటగిరీ ఉద్యోగుల్లో ఎక్కువమంది భారతీయ మహిళలే ఉన్నారు. దాదాపు లక్షా అయిదు వేలమంది భారతీయులుంటే, ఇరవైవేల మందితో చైనావారు రెండో స్థానంలో ఉన్నారు. హెచ్‌1బీ వీసాల్లో కఠిన నిబంధనలు, హెచ్‌4 వీసా ఉద్యోగ పర్మిట్ల తొలగింపు భయం నేపథ్యంలో క్షణక్షణం ఉద్వేగాలకు లోనవుతున్న ప్రవాస భారతీయులకు ట్రంప్‌ ప్రకటన శరాఘాతం వంటిదే. అమెరికాలోని ఎక్కువ మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్‌కు చెందిన ఉభయ సభల సభ్యులూ ఈ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని చెబుతున్నారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రతినిధుల సభ అధ్యక్షుడు పాల్‌ రాయన్‌ అధ్యక్షుడికి జన్మతః పౌరసత్వ హక్కుపై ఉత్తర్వు జారీ చేసే అధికారమే లేదని కుండ బద్దలుకొట్టారు. అయినా ట్రంప్‌ గురించి తెలిసినవాళ్ళెవరూ ఆయన మాటలను తేలిగ్గా తీసుకోవటం లేదు.

ఎన్నికల వేళ విభజన రాజకీయం 

అందరిలో ఆందోళన 
అమెరికా రాజ్యాంగానికి సవరణ చాలా క్లిష్టమైన ప్రక్రియ. కాంగ్రెస్‌లోని ఉభయ సభలూ మూడింట రెండొంతులు మెజారిటీతో ఆమోదించాలి. ఆ తరవాత రాష్ట్రాలూ నాలుగింట మూడొంతులు నిర్ధారించాలి. అందువల్ల ఇది సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. 14వ రాజ్యాంగ సవరణ అంశాన్ని అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా మార్చలేరనీ రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ట్రంప్‌ మద్దతుదారుల వాదన మరోలా ఉంది. తాము రాజ్యాంగ సవరణ జోలికి వెళ్లబోమని, రాజ్యాంగ సవరణ అమలుపై కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా స్పష్టత మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. అంటే ‘లోపభూయిష్ఠంగా’ ఉన్న రాజ్యాంగ సవరణ అమలును మాత్రమే సరి చేస్తామన్నది వారి అభిప్రాయం, అంటే అక్రమవలసదారులు అమెరికా చట్టాల్లోకి రారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని అమెరికా పౌరులుగా పరిగణించరని వాదిస్తున్నారు. చాలామంది న్యాయ నిపుణులు ఈ వాదన రాజ్యాంగ వ్యతిరేక, సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకమైనదిగా స్పష్టీకరిస్తున్నారు. అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వును సుప్రీంకోర్టు కచ్చితంగా రద్దు చేస్తుందని చెబుతున్నారు. ఈ ఉత్తర్వు కోసం ట్రంప్‌ తహతహలాడటం వెనక వేరే కారణాలున్నాయి. కార్యనిర్వాహక ఉత్తర్వు న్యాయస్థానాల పరీక్షలో నిలిచినా నిలవకపోయినా జన్మతః పౌరసత్వ హక్కుపై సవరణను వచ్చే ఎన్నికల్లో ఓ అజెండాగా ముందుకు తీసుకెళ్ళటానికి, తద్వారా సమాజాన్ని విభజించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆశిస్తున్నట్లుగా అర్థమవుతుంది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ ఓటర్లలో నూతనోత్సాహాన్ని నింపటానికి కూడా ట్రంప్‌ ఈ చర్య ద్వారా ప్రయత్నించారు. ఇది కేవలం 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులపై ఎక్కుపెట్టిన బాణంగా చూడలేం. చట్టబద్ధ వలసదారుల పిల్లలపైనా కత్తి వేలాడుతుందని పరిశీలకుల అంచనా. దీనివల్ల లక్షలాది ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్‌ చర్యలతో వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మున్ముందు ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో వేచిచూడాలి!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.