close

తాజా వార్తలు

చివరి పరీక్ష ఎవరికి?

టీమిండియా ప్రపంచకప్‌ ప్రయోగశాలలో కుర్రాళ్లకు పోటీ

ఈనాడు.నెట్‌ ప్రత్యేకం

హైదరాబాద్‌: ప్రయాణం ఒక మధురానుభవం. సాధారణంగా ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే పర్యటన ఆరంభం అవుతుందని అంటారు. వాస్తవానికిది హృదయంలో మొదలవుతుంది. అందుకే వెళ్లే ప్రతిచోటూ ఓ అనుభూతిని మిగిలిస్తుంది. మనసును బంధింపజేస్తుంది. ఏడాది కాలంగా టీమిండియా పర్యటనలు ఇలాగే సాగాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ ప్రయాణాలు టెస్టు క్రికెట్‌ సొగసును మరోసారి బయటపెట్టాయి. ఉత్కంఠతో ఊపేశాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల్లో చిరస్మరణీయ విజయాలు మనసుకు హత్తుకున్నాయి.

ఇక్కడే మనమో విషయం గమనించాలి. టీమిండియా ఈ అద్భుత ప్రయాణం కొందరు ఆటగాళ్లకు పరీక్షగా, జట్టు యాజమాన్యానికి ప్రయోగశాలగా మారింది. అందులో చివరి ప్రయోగానికి, పరీక్షకు వేళైంది. ప్రపంచకప్‌ ముందు కోహ్లీసేనకు మిగిలిన ఒకే ఒక్క సిరీస్‌ ఇది. ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేలు, రెండు టీ20ల కోసం ఉపఖండంలో అడుగుపెట్టనుంది. ఈ నెల 24 నుంచి మార్చి 13 వరకు పోటీపడనుంది. విశ్వవిజేతగా నిలిచేందుకు ప్రపంచకప్‌ జట్టులో ఎంపిక చేసుకొనేందుకు టీమిండియా ఎవరెవరిని పరీక్షనుందో చూద్దామా!

చాన్నాళ్ల నుంచి కొందరు ఆటగాళ్లు జట్టులో స్థిరమైన చోటు సంపాదించుకున్నారు. సారథి విరాట్‌ కోహ్లీ, ఉప సారథి రోహిత్‌ శర్మ స్థానాలు శాశ్వతం. ఎడమచేతి వాటం ఓపెనర్‌గా శిఖర్ ధావన్‌ ఉన్నాడు. అనుభవజ్ఞుడు ధోనీకి ఢోకా లేదు. ఆల్‌రౌండర్‌ కోటాలో హార్దిక్‌ పాండ్య ఖాయం. యార్కర్ల వీరుడు బుమ్రా, స్వింగ్‌ కింగ్‌ భువీ పేస్‌ బౌలింగ్‌ దళాన్ని నడిపిస్తారు. మణికట్టు మాంత్రికులు కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌పై అనుమానం లేదు. కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి గురించి అందరికీ అవగాహన ఉంది. ఎడమచేతి వాటం పేసర్‌గా ఖలీల్‌ అహ్మద్‌కు బాగానే అవకాశాలు ఇస్తున్నారు. ఇక మిగిలింది వీరే..

రిషభ్‌ పంత్‌: ఈ యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ను ఆసీస్‌ సిరీస్‌లో కచ్చితంగా ఆడించాలని దిగ్గజ క్రికెటర్లు సునిల్‌ గావస్కర్‌, సౌరవ్‌ గంగూలీ, గౌతమ్‌ గంభీర్‌, అజహరుద్దీన్‌ అంటున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తారాజువ్వలా రెచ్చిపోయే పంత్‌ ఇప్పటి వరకు ఆడింది మూడు వన్డేలే. 20.50 సగటుతో 41 పరుగులు చేశాడు. అతడికి ఆశించినన్ని మ్యాచుల్లో అవకాశాలు ఇవ్వలేదు. ఈ మధ్యే భారత్‌-ఏ తరఫున రాణించాడు. రిజర్వు వికెట్‌ కీపర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా అతడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

విజయ్‌ శంకర్‌: కొన్నాళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడితో పరుగులు చేయలేకపోయిన ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో చివరి వన్డేలో జట్టు కుప్పకూలకుండా అడ్డుకున్నాడు. 64 బంతుల్లో విలువైన 45 పరుగులు చేశాడు. తన మీడియం పేస్ బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఆడింది 4 వన్డేలే. అయితే భారత్‌-ఏ తరఫున ద్రవిడ్‌ శిక్షణలో బాగా రాటుదేలాడు. మానసికంగా బలవంతుడయ్యాడు. 


 

అజింక్య రహానె: ఒకప్పుడు టీమిండియాలో స్థిరమైన క్రికెటర్‌గా పేరు పొందిన అజింక్య రహానె జట్టులో పోటీ పెరగడంతో టెస్టు క్రికెట్‌కు పరిమితమయ్యాడు. వేగంగా ఆడటం లేదని వన్డేల్లో ఎంపిక చేయడం లేదు. నిజానికి ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి పరిస్థితుల్లో నాలుగో స్థానంలో సరిగ్గా సరిపోయేది రహానె అనడంలో సందేహం లేదని విశ్లేషకుల భావన. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో ఈ మధ్యే జరిగిన మూడు మ్యాచుల్లో 150 పరుగులు చేశాడు. చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సైతం జింక్స్‌ తమ ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగానే ఉన్నాడని చెప్పాడు. మరి ఆసీస్‌ సిరీస్‌లో ఎంపిక చేస్తారా లేదో చూడాల్సి ఉంది.


 

శ్రేయస్‌ అయ్యర్‌: ఆరు అంతర్జాతీయ వన్డేలు ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆశించిన మేరకు రాణించలేదు. ముంబయి తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం అతడు అద్భుతమైన రికార్డులు నెలకొల్పాడు. ఈ మధ్యే భారత్‌-ఏ తరఫున ఆరు మ్యాచుల్లో 43.16 సగటుతో మూడు అర్ధశతకాలు అందుకున్నాడు. నిలకడగా రాణించాడు. చివరి మ్యాచ్‌ను 2018, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై సెంచూరియన్లో ఆడాడు.

శుభ్‌మన్‌ గిల్‌: ఈ పంజాబ్‌ యువ కెరటం అండర్-19 ప్రపంచప్‌లో మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, భారత్‌-ఏ, పంజాబ్‌ తరఫున నిలకడగా రాణించాడు. పరుగుల వరద పారించాడు. అనుకున్న సమయం కన్నా ముందే జాతీయ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో రెండు వన్డేలు ఆడాడు. కానీ అదృష్టం కలిసిరాలేదు. రెండు మ్యాచుల్లోనూ విఫలం అయ్యాడు. రిజర్వు ఓపెనర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా రాణించగలడు.

మనీశ్‌ పాండే: నాలుగో స్థానం కోసం టీమిండియా మనీశ్‌కు చాలా అవకాశాలు ఇచ్చింది. దాదాపు 23 వన్డేలు ఆడాడు. అద్భుత ప్రతిభావంతుడే అయినా అవకాశాలను అందిపుచ్చుకోలేదు. 2018 సెప్టెంబర్‌లో అఫ్గాన్‌పై చివరి వన్డే ఆడాడు. ఈ మధ్యే న్యూజిలాండ్‌-ఏపై 300 పరుగుల లక్ష్య ఛేదనలో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు.

సిరాజ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌: వీరిద్దరూ యువకులే. అంతర్జాతీయ అనుభవం అంతగా లేదు. భారత్‌-ఏ తరఫున నిలకడగా రాణిస్తున్నారు ఈ పేసర్లు. సిరాజ్‌ ఒక మ్యాచ్‌ ఆడగా కౌల్‌ మూడు ఆడాడు. ఇంగ్లాండ్‌ లయన్స్‌పై సిరాజ్‌ 6.13 ఎకానమితో నాలుగు మ్యాచుల్లో 8 వికెట్లు తీశాడు. కౌల్‌ 5.82 ఎకానమీతో 10 వికెట్లు తీశాడు. వైవిధ్యంగా బౌలింగ్‌ చేయగలడు. కృనాల్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌ సైతం పోటీలో ఉన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.