close

తాజా వార్తలు

వ్యాపారంలోనూ ‘స్టార్లే’..!

బిజినెస్‌లో రాణిస్తున్న సినీ ప్రముఖులు

సినిమా ఓ వినీలాకాశం.. అక్కడ విహరించినంతకాలం ప్రపంచం మొత్తం అపురూపంగా చూస్తుంది... ఒక్కసారి అక్కడి నుంచి నేల మీదకు వచ్చాక ఎవరూ పట్టించుకోరు. అలాగని సాధారణ ప్రజలతో కలవలేరు.. ఖర్చులు తగ్గించుకోలేరు.. ఇది పచ్చి నిజం. వెండితెరపై ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత కనుమరుగై కనీసం బతకడానికి కూడా ఇబ్బందిపడిన నటులు ఎందరో. దీనికి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చనే ఓ ఉదాహరణ. ఆయన అత్యంత సంపన్న జీవితం నుంచి దివాలా అంచుల వరకూ వెళ్లారు. ఆ తర్వాత మరింత పకడ్బందీగా జీవితాన్ని ప్లాన్‌ చేసుకొని నటుడిగా, వ్యాపారవేత్తగా విజయవంతమైన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇప్పుడాయన టీవీ ప్రెజెంటర్‌గా, ఏబీసీఎల్‌ యజమానిగా అద్భుత విజయాలు సాధించారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన నటులు కూడా ఉన్నారు. వీరు జీవితాన్ని అత్యంత ప్రణాళికా బద్ధంగా తీర్చిదిద్దుకొని బిజినెస్‌ టైకూన్లకు కూడా పోటీ ఇచ్చే స్థాయిలో ఎదుగుతున్నారు. వీరిలో బాలీవుడ్‌ ప్రముఖులే కాదు.. మన టాలీవుడ్‌ ప్రముఖులూ ఉన్నారు.

అక్కినేని నాగార్జున: టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా నాగార్జునకు పేరుంది. ఆయనకు ఎన్‌ గ్రిల్స్‌ పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో హైఫై కార్యక్రమాలకు వేదికగా నిలిచే ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా ఆయనదే. ఆయన కేరళ బ్లాస్టర్స్‌ జట్టుకు కూడా సహ యజమాని. గతంలో ఆయనకు ‘మా’టీవీలో వాటాలు కూడా ఉండేవి

చిరంజీవి: మెగాస్టార్‌ చిరంజీవికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకు ప్రొడక్షన్‌ హౌస్‌ కూడా ఉంది. సహ నటుడు నాగార్జున, క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి క్రీడారంగ ఫ్రాంఛైజీల వ్యాపారంలో ఉన్నారు. ప్రస్తుతం కేరళ బ్లాస్టర్స్‌ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.

మోహన్‌ బాబు: కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబుకు ప్రొడక్షన్‌ హౌస్‌తో పాటు శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థలు ఉన్నాయి. దీంతోపాటు శ్రీవిద్యా ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ కూడా ఉంది. దీని ద్వారా ఆయన పేద విద్యార్థులను చదివిస్తుంటారు.

జగపతిబాబు: పడిలేచిన కెరటానికి జగపతి బాబు ఉదాహరణ. ఆయన కెరీర్‌ దాదాపు ముగిసి ఆర్థిక కష్టాల్లో ఇరుక్కున్న సమయంలో టాలీవుడ్‌కు విలన్‌గా రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టారు. అది సూపర్‌ సక్సెస్‌ అయింది. దీంతో ఆయన వెనక్కు తిరిగి చూడలేదు. తాజాగా ఆయన టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని ప్రారంభించారు.

రామ్‌చరణ్‌: ‘మగధీరుడు’ రామ్‌చరణ్‌ విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. ఆయన ట్రూజెట్‌ పేరుతో వైమానిక రంగంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు, ఆయనకు పోలో క్లబ్‌ కూడా ఉంది. ఆయన సతీమణి ఉపాసన అపోలో గ్రూప్‌లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్‌బాబు: ‘బిజినెస్‌మేన్‌’ మహేష్‌బాబూ మంచి వ్యాపారవేత్త. ఆయనకు సినీ నిర్మాణ సంస్థ జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంది. దీంతోపాటు ఏఎంబీ సినిమాస్‌ (ఏషియన్‌ మహేష్‌ బాబు సినిమాస్‌) మల్టీప్లెక్స్‌ను కూడా ఇటీవలే ఏర్పాటు చేశారు. ఏషియన్‌ గ్రూప్‌తో ఒప్పందం చేసుకొని దీనిని ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉన్న అత్యాధునిక థియేటర్లలో ఇది కూడా ఒకటి.

విజయ్‌ దేవరకొండ: యువ హీరో విజయ్‌ దేవరకొండ వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన సినిమాలతో పాటు వ్యాపారంపైనా దృష్టిపెట్టారు. తాజాగా ‘రౌడీ’ పేరుతో ఓ దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు. ఇటీవల ఫ్యాన్స్‌ సమక్షంలో తన బ్రాండ్‌ను ప్రారంభించారు.

నందమూరి కల్యాణ్‌ రామ్‌: నందమూరి హీరోల్లో కల్యాణ్‌ రామ్‌ ఒక్కరి పేరే వ్యాపార రంగంలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఆయన ఇప్పటికే పలు చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. దీంతోపాటు వీఎఫ్‌ఎక్స్‌ వ్యాపారం కూడా ఉంది. దీన్ని 2014లో ప్రారంభించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ సంస్థ కూడా ఆయనదే.

రానా దగ్గుబాటి: భల్లాలదేవుడు రానా వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ఆయన ముంబయిలో టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని ప్రారంభించారు. సినీ రంగంలోకి ప్రవేశించాలనుకునేవారికి ఇది సహాయం చేస్తుంది.

అల్లు అర్జున్‌: ‘దేశముదురు’ అల్లు అర్జున్‌ ఎం.కిచెన్‌ పేరుతో ఇంటర్నేషనల్‌ బ్రూవింగ్‌ కంపెనీని ప్రారంభించారు. దీని కింద 800 జూబ్లీ పేరుతో బ్రూవింగ్‌, నైట్‌క్లబ్‌, రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన క్లబ్‌ల్లో ఇది కూడా ఒకటి.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌: టాలీవుడ్‌ ‘భ్రమరాంబ’ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సినిమాల్లోనే కాదు... వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. సినిమాల్లో వరుస విజయాలు అందుకుంటున్న సమయంలోనే ‘ఎఫ్‌ 45’ పేరుతో జిమ్‌ వ్యాపారం మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో ఓ బ్రాంచ్‌తో ప్రారంభమైన ఆమె వ్యాపారం.. విశాఖకూ విస్తరించింది. మరింత విస్తరించాలన్న ఆలోచన చేస్తోంది.

తమన్నా భాటియా: అందం, అభినయంతో కుర్రకారు గుండెల్ని మెలి తిప్పుతున్న కథానాయిక తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ కూడా వ్యాపార రంగంలో ఉంది. ‘వైట్‌ అండ్‌ గోల్డ్‌’ పేరుతో బంగారు నగల వ్యాపారాన్ని చేస్తోంది.

కింగ్‌ఖాన్‌ షారుఖ్‌‌: బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ అత్యంత విజయవంతమైన వ్యాపారి. ఆయన కంపెనీ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, దాని సబ్సిడరీ కంపెనీలు సినీ నిర్మాణం, వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌ సేవలు అందిస్తున్నాయి. దీంతోపాటు ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు సహ యజమాని కూడా. దీని బ్రాండ్‌ విలువ వేలకోట్ల రూపాయల్లోనే ఉంది.

శిల్పాశెట్టి: ‘సాగరకన్య’ శిల్పాశెట్టి కూడా ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు యజమానిగా వ్యవహరించారు. ఆ తర్వాత అందులో వాటాలను విక్రయించేసి ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీని ప్రారంభించారు. అనంతరం లోసిస్‌ పేరుతో స్పా అండ్‌ సెలూన్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఫిట్‌నెస్‌ యోగా డీవీడీని కూడా విడుదల చేశారు.

సునీల్‌ శెట్టి: బాలీవుడ్‌లో ఉన్న అతిపెద్ద వ్యాపారవేత్తల్లో సునీల్‌ శెట్టి ఒకరు. ఫిట్‌నెస్‌ సెంటర్ల వ్యాపారంతో మొదలు పెట్టారు. తర్వాత పాప్‌కార్న్‌ పేరుతో ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించారు. మిస్‌ఛీఫ్‌ పేరుతో చైన్‌ బొటిక్స్‌, రెస్టారెంట్లు, ఎస్‌2 పేరుతో విలాసవంతమైన రియల్‌ఎస్టేట్‌ కంపెనీ, హకీం ఆలిమ్స్‌లో వాటాలు కూడా ఉన్నాయి.

సల్మాన్‌: సల్మాన్‌ ఖాన్‌కు పలు వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయి. ఆయన బీయింగ్‌ హ్యూమన్‌ పేరుతో దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. దీంతోపాటు బీయింగ్‌ స్మార్ట్‌ పేరుతో మొబైల్‌ ఫోన్ల వ్యాపారంలో అడుగుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతోపాటు ఆయనకు యాత్ర డాట్‌ కామ్‌లో వాటాలు ఉన్నాయి.

హృతిక్‌ రోషన్‌: బాలీవుడ్‌ కలల రాకుమారుడు హృతిక్‌ రోషన్‌ 2013లో హెచ్‌ఆర్‌ఎక్స్‌ పేరుతో ఫ్యాషన్‌ బ్రాండ్‌ను ప్రారంభించారు. దీన్ని ఇటీవలే మింత్రకు విక్రయించేశారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఫిట్‌నెస్‌ స్టార్టప్‌ క్యూర్‌ఫిట్‌తో జట్టుకట్టారు. అందులో కూడా హెచ్‌ఆర్‌ఎక్స్‌ పేరుతో ఆయన వర్కౌట్స్‌ను డిజైన్‌ చేశారు. కల్ట్‌పేరుతో జిమ్‌సెంటర్లను పలు నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.