close

తాజా వార్తలు

‘హిట్లర్‌’లో చేయమని అడిగారు కానీ...!

సూర్యుడు ఆమెను చూడటానికి ఉదయిస్తాడు..
చంద్రుడు ఆమెను నిద్ర పుచ్చటానికి తిరిగొస్తాడు..
ఎందుకంటే కోటి నక్షత్రాల కొత్తదనం ఆమె రూపం..

దక్షిణాది భాషల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియారామన్‌. ‘మా ఊరి మారాజు’, ‘శుభ సంకల్పం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్నో సరద సంగతులను పంచుకున్నారు.

ప్రియారామన్‌ ఎలా ఉన్నారు? ఎక్కడ ఉంటున్నారు?
ప్రియారామన్‌: చాలా బాగున్నా!  నేను ఎక్కడికీ పోలేదు. చెన్నైలోనే ఉంటున్నా. 
ఎందుకని ఇండస్ట్రీకి దూరమైపోయారు?
ప్రియారామన్‌: అందరి అమ్మాయిల్లాగే పెళ్లైపోయింది. బాధ్యతలు పెరిగాయి. పిల్లలు పుట్టారు. కుటుంబమే నాకు మొదటి ప్రాధాన్యం అనిపించింది. ఒక నటిగా ఎంత బాధ్యతతో వ్యవహరించానో.. ఒక తల్లిగా అంతే బాధ్యతతో వ్యవహరించాలనుకున్నా. నాకు ఇద్దరు పిల్లలు. 
ప్రస్తుతం ఏమైనా సినిమాల్లో నటిస్తున్నారా?
ప్రియారామన్‌: తమిళంలో ఒక సీరియల్‌ చేస్తున్నా. ఇటీవల శర్వానంద్‌ నటించిన ‘పడిపడి లెచే మనసు’లో అతని తల్లిగా నటించా. హను రాఘవపూడి చెప్పిన పాత్ర నాకు బాగా నచ్చింది. ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉంటా. ఆ పాత్రకో సరైన అర్థం ఉందనిపిస్తే చాలు. ఇప్పటి వరకూ నేను చేసిన పాత్రలన్నీ చాలా సాఫ్ట్‌ రోల్సే. కోడిరామకృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ‘మా ఊరి మారాజు’ లో మాత్రం నాది కాస్త నెగెటివ్‌ రోల్‌. 

ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు?
ప్రియారామన్‌: 1993లో రజనీకాంత్‌ సొంత నిర్మాణ సంస్థలో ‘విజయ’ అనే చిత్రంతో వచ్చా. ఆ తర్వాత నా రెండో చిత్రం ‘మా ఊరి మారాజు’. 
మీరు యాక్టర్‌ అని మీ పిల్లలకు తెలియదట!
ప్రియారామన్‌: మా పిల్లలు ఆకాష్‌, ఆదిత్యలు ఒక రోజు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి ‘ఆర్‌ యూ ఫేమస్‌’ అని అడిగారు. వీళ్లకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందా? అని అనుకున్నా. వాళ్ల టీచర్‌ నేను నటించిన పాటను యూట్యూబ్‌లో చూసిందట. రజనీకాంత్‌తో నేను చేసిన సినిమా చూసి ‘నువ్వు రజనీతో నటించావా’ అని అడిగారు. అంతేకాదు, ‘సల్మాన్‌తో కూడా నటించాలట’ (నవ్వులు) 
‘శుభ సంకల్పం’ చేస్తున్నప్పుడు కమల్‌ మిమ్మల్ని జాగింగ్‌కు తీసుకెళ్లేవారట!
ప్రియారామన్‌: (నవ్వులు) రోజూ ఉదయాన్నే ఒక కర్ర తీసుకుని తలుపుపై కొడుతూ ‘జాగింగ్‌కు వెళ్లాలి.. లేవండి లేవండి’ అంటూ నిద్ర లేపేవారు. షూటింగ్‌ జరిగినన్ని రోజులు స్వీట్స్‌, టిఫిన్స్‌ బాగా వచ్చేవి. లావు కాకుండా ఉండేందుకని జాగింగ్‌కు తీసుకెళ్లేవారు. 
ఎన్ని సినిమాల్లో నటించారు?
ప్రియారామన్‌: అన్ని దక్షిణాది భాషల్లో దాదాపు 60కు పైగా సినిమాల్లో నటించా. 

కె.విశ్వనాథ్‌కు ఎలా పరిచయం అయ్యారు?‘శుభ సంకల్పం’లో అవకాశం ఎలా వచ్చింది?
ప్రియారామన్‌: ఆ అవకాశం ఎలా ఇచ్చారో నాకూ తెలియదు. అది చాలా మంచి పాత్ర. ఎందుకంటే విశ్వనాథ్‌గారి సినిమాల్లో హీరోయిన్‌ క్యారెక్టర్‌లు చాలా బాగుంటాయి. ఆయన దర్శకత్వంలో నటించడం నాకు దక్కిన గౌరవం. కమల్‌హాసన్‌గారు హీరో అని తెలియడంతో కథ కూడా వినకుండా ఒకే చెప్పేశా. ఇక సినిమా చేసేటప్పుడు ప్రతి రోజూ ఒక మర్చిపోలేని అనుభూతి. సీన్‌ సరిగా రాకపోతే విశ్వనాథ్‌గారు తిట్టేవారు. అది కమల్‌హాసన్‌ అయినా సరే. ఆయనొక హెడ్‌మాస్టర్‌. మేము విద్యార్థులం. 100 రోజుల ఫంక్షన్‌కు ఎన్టీఆర్‌ చేతులమీదుగా అవార్డు అందుకోవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను.
కోడిరామకృష్ణతో ఎన్ని సినిమాలు చేశారు?
ప్రియారామన్‌: ఒక్క సినిమానే చేశా.  మరో సినిమాలో అవకాశం వచ్చింది కానీ, నాకు డేట్స్‌ కుదరకపోవడం వల్ల చేయలేదు. ఇటీవల ఆయన చనిపోయారన్న వార్త విని చాలా బాధేసింది. ఆయన చనిపోవడానికి ఒకరోజు ముందు మేనేజర్‌ చలపతిగారు వచ్చి నన్ను కలిశారు. మా సంభాషణలో ‘మా ఊరి మారాజు’ చర్చ వచ్చింది. ఆయన వెళ్లిపోయిన తర్వాత యూట్యూబ్‌లో ఆ సినిమాలో ఒక సాంగ్‌ పెట్టుకుని చూశా. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నా. ఆ మరుసటి రోజే కోడిరామకృష్ణగారు చనిపోయారన్న వార్త తెలిసింది. 

మీ అసిస్టెంట్‌ను, మేకప్‌మ్యాన్‌ అందర్నీ ర్యాగింగ్‌ చేస్తారట!
ప్రియారామన్‌: నాకేం తెలియదు. (నవ్వులు) ఏదో సరదాకి ఆటపట్టిస్తుంటా!

మీకు లిఫ్ట్‌ ఎక్కడమంటే భయమట!
ప్రియారామన్‌: ఒక రోజు షూటింగ్‌ కోసమని ముంబయి వెళ్లాను. నేను దిగిన హోటల్‌లో 25 అంతస్తులు ఉన్నాయి. నా రూమ్‌ 17వ అంతస్తులో ఉంది. ఆ రోజు లగేజ్‌ తీసుకుని లిఫ్ట్‌ ఎక్కగానే ఏమైందో తెలియదు.. 17వ ఫ్లోర్‌ నుంచి లిఫ్ట్‌ ధబేల్‌మని కిందపడిపోయింది. మరుసటి ఏడాది కూడా సరిగ్గా అలాగే జరిగింది. దేవుడు కాపాడబట్టే నేను బతకగలిగా. మరొకసారి జిమ్‌లో వర్కవుట్‌ చేసిన తర్వాత స్టీమ్‌ రూమ్‌లోకి వెళ్లా. దాని పైకప్పు మొత్తం ఊడి కిందపడింది. అదృష్టవశాత్తూ నేను బతికా.
‘విజయ’ సినిమా చేస్తున్నప్పుడు రజనీకాంత్‌ సెట్‌కు రాకుండా ఎక్కడికో వెళ్లిపోయారట!
ప్రియారామన్‌:  చాలక్కుడి షూటింగ్‌. విపరీతమైన ఎండ. అక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు. కాళ్లకు ఎటువంటి చెప్పులు లేకుండా నేను డ్యాన్స్‌ చేయాలి. మొదటి రోజు కాళ్లు ఎర్రగా మారిపోయాయి. రెండో రోజూ కూడా అలాగే చేయడంతో బొబ్బలు వచ్చేశాయి. నడవలేని పరిస్థితి. నా వల్ల షూటింగ్‌ ఆగిపోకూడదని సుందరం మాస్టర్‌ నా పాదాలకు ప్లాస్టర్‌ వేసి, కట్టుకట్టి డ్యాన్స్‌ చేయమన్నారు. అలాగే పంటి బిగువన చేశా. షూటింగ్‌ అయిపోయిన తర్వాత ఆ సాయంత్రం పెద్ద పీటపై నా కాళ్లు పెట్టుకుని పాదాలు చూసుకుంటుంటే సడెన్‌గా రజనీకాంత్‌గారు వచ్చారు. అంతే, అందరినీ తిట్టి ‘ఆ అమ్మాయి పాదాలకు బొబ్బలు తగ్గేదాకా షూటింగ్‌ చేయకండి’ అని చెప్పి వెళ్లిపోయారు. 
శోభన్‌బాబు విమానంలో పక్కనే కూర్చొంటే గుర్తు పట్టలేదట!
ప్రియారామన్‌: ఆయనతో ‘దొరబాబు’ చేశా. శోభన్‌బాబుగారంటే మన మైండ్‌లో ఒక ఇమేజ్‌ ఉంది. చాలా అందంగా కనపడతారు. ‘దొరబాబు’ షూటింగ్‌ కోసమని చెన్నై నుంచి కోయంబత్తూరుకు ఫ్లైట్‌లో వెళ్లా. అదే విమానంలో శోభన్‌బాబుగారు కూడా ఉన్నారని తెలిసి, ఆయన కోసం ఎయిర్‌పోర్ట్‌లో చూశా కనపడలేదు. తర్వాత ఫ్లైట్‌లో వస్తారేమో అనుకున్నా. బిజినెస్‌ క్లాస్‌లో నేను, మా అమ్మగారు, నాపక్కనే ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నారు. ఆయన సూట్‌ వేసుకుని, పేపర్‌ చదువుతూ కనిపించారు. నేను ఆయనను చూస్తే హాయ్‌ చెప్పారు. ఈ అంకుల్‌ ఎవరబ్బా అనుకున్నా. కోయంబత్తూరు రాగానే రెండు కార్లు వచ్చాయి. నేను ఒక్కదాన్నే కదా! రెండు కార్లు ఎందుకనుకున్నా. ఇదే విషయం మేనేజర్‌ని అడిగా.  ‘బాబుగారు వచ్చారు కదా’ అన్నారు. ‘రాలేదు బహుశా విమానం మిస్‌ అయినట్లు ఉన్నారు’ అని చెప్పా. ‘లేదు బాబుగారు వచ్చారు మీరు చూడలేదా’ అని అడిగారు. వెంటనే ఫోన్‌ చేసి అడిగితే, ‘వచ్చేశారు’ అని చెప్పారు. ఇంతలో నా వెనకాలే వచ్చారు. విమానంలో నా పక్కన కూర్చొన్న అంకుల్‌.. శోభన్‌బాబా.. అని అనుకున్నా. నాకు చాలా సిగ్గేసింది. రెండు మూడు రోజుల ఆయన ముఖం చూడలేదు.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో చేసే అవకాశం ఎందుకు రాలేదు?
ప్రియారామన్‌: నాకు తెలియదు. రాఘవేంద్రరావుగారు రెండు సార్లు ఫోన్‌ చేశారు. పది రోజుల్లో షూటింగ్‌ అని చెప్పేవారు. అప్పటికే నాకున్న షెడ్యూల్స్‌ వల్ల డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయలేపోయేదాన్ని. అలా కొన్ని సినిమాలు వదులుకున్నా. బహుశా ఒక సినిమా బాలకృష్ణగారు, మరొక సినిమా జగపతిబాబుగారితో అనుకుంటా. ‘హిట్లర్‌’లో కూడా అవకాశం వచ్చింది. నేను వేరే దేశంలో ఉండటంతో చేయలేకపోయా. ‘క్రిమినల్‌’ కూడా నేను చేయాల్సింది. కానీ డేట్స్‌ కుదరలేదు. 

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం
రజనీకాంత్‌-సూపర్‌స్టార్‌
కమల్‌హాసన్‌-సూపర్‌ యాక్టర్‌
కె.విశ్వనాథ్‌-సూపర్‌ డైరెక్టర్‌
కోడిరామకృష్ణ- ఒక్క మాట చాలదు
కె.రాఘవేంద్రరావు-నా డ్రీమ్‌ డైరెక్టర్‌
వల్లి-నా ఫస్ట్‌ మూవీ
లిఫ్ట్‌- భయం
పడిపడి లెచే మనసు-మంచి ప్రయత్నం
పిల్లలు- నా ప్రాణం
రంజిత్‌- మై పార్టనర్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.