
తాజా వార్తలు
చైనాకు ముచ్చెమటలు పట్టించే ప్రయోగం..?
అంతరిక్ష యుద్ధ¤క్షేత్రంలోకి భారత్ అడుగు
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం: అమెరికా.. రష్యా.. చైనా.. ఇప్పుడు భారత్..! అంతరిక్ష యుద్ధంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించడానికి తొలిఅడుగు పడింది. ‘ఆపరేషన్ శక్తి’ పేరుతో భారత్ చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక ప్రాజెక్టు విజయం సాధించింది. కేవలం మూడు నిమిషాల్లో భారత క్షిపణి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో శాటిలైట్లను కూల్చే టెక్నాలజీ ఉన్న అతితక్కువ దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ఈ విభాగంలో ఇప్పటికే రష్యా చాలా ముందుంది. అమెరికా కూడా దూసుకెళుతోంది. చైనా కూడా కొన్నేళ్ల క్రితమే దీనిని ప్రారంభించింది. భూ కక్ష్యలో దాదాపు 2000పైగా సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి. చైనా 2008లోనే ఏశాట్‌ను పరీక్షించింది.
ప్రపంచ వాణిజ్యంలో అత్యధిక భాగం మహా సముద్రాల ద్వారానే జరుగుతుంది. భారత్ పరిధిలోని హిందూ మహా సముద్రంలో చమురులో 66శాతం, సరుకులలో 33 శాతం, కంటైనర్ రవాణాలో 50 శాతం రవాణా జరుగుతుంది. కొన్ని వేల నౌకలు వీటికోసం సముద్రంలో తిరుగుతుంటాయి. ఈ ప్రాంతాల్లో నిఘా వేయడంలో ఉపగ్రహాల పాత్ర చాలా కీలకం. ఈ నేపథ్యంలో కక్ష్యలో ఉన్న తమ ఉపగ్రహాలకు ఏమైనా ముప్పు వాటిల్లితే వెంటనే వాటిని రక్షించేందుకు మనకు ఒక వ్యవస్థ ఉండాలి. ఒక ఉపగ్రహం కూలిపోతే దానిని స్థానంలో మరోదానిని తీసురావడానికి చాలా కష్టపడాలి. ఉపగ్రహాలను కూల్చేందుకు ఏశాట్ టెక్నాలజీని ఇప్పుడు భారత్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2007లో భారత్ తొలిసారి కార్టోశాట్-2ఎ ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇదే భారత్‌కు చెందిన తొలి సైనిక ఉపగ్రహం.
2010లోనే బీజాలు..
అంతరిక్ష ఆధారిత సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ 2010జూన్‌లోనే ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని నాటి రక్షణ మంత్రి ఏకే ఆంతోనీ ప్రకటించారు. ప్రస్తుతం ఇది ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సర్వీస్ ప్రధాన కార్యాలయం పరిధిలో పనిచేస్తుంది. ఈ కార్యాలయం ఇస్రో, భారతీయ సైన్యంతో సమన్వయం చేసుకుంటుంది. డీఆర్డీవో కూడా దీనితో కలిసి పనిచేస్తుంది.
* 2009లో భారత్ తొలిసారి ఆర్ఐశాట్-2ను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఇది ఇజ్రాయిలీ రాడార్ ఇమేజింగ్ నిఘా వలే పనిచేస్తుంది. సరిహద్దుల్లో రక్షణకు సంబంధించి దీనిని సిద్ధం చేశారు.
* 2013లో భాతర్ జీశాట్-7 రుక్మిణీని ప్రయోగించారు. ఇది పూర్తిగా సైనిక అవసరాల కోసం ప్రయోగించింది. ఇది ఇప్పుడు భారత నౌకాదళానికి అద్భుతంగా ఉపయోగపడుతోంది.
* 2017 నాటికి భారత్ వద్ద సైనిక అవసరాల కోసం 13శాటిలైట్లు అందుబాటులోకి వచ్చాయి.
జీశాట్-6ను సైనిక దళాలు ఉపయోగించుకోగా.. జీశాట్-7ను యుద్ధనౌకలు, సబ్మెరైన్లు, విమానాలు, ఇతర వ్యవస్థలు వాడుకొనేలా తీర్చిదిద్దారు. ఈ రకంగా ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ పూర్తిస్థాయి అంతరక్షి యుద్ధతంత్రానికి భారత్‌ను సిద్ధం చేసింది.
యాంటీ శాటిలైట్ సామర్థ్యం..
భారత క్షిపణి కార్యక్రమం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. ఫలితంగా ఉపగ్రహాల వ్యూహాత్మక అవసరం భారత్‌కు అర్థమైంది. యుద్ధాల్లో వినియోగించే గైడెడ్ బాంబులు, క్షిపణులు అన్నీ శాటిలైట్ ఆధారంగా తమ లక్ష్యాలను ఛేదిస్తాయి. ఉదాహరణకు భారత్‌పై ఏదైనా దేశం క్షిపణి ప్రయోగిస్తే.. భారత్ అప్రమత్తమై ఆ క్షిపణికి మార్గనిర్దేశకత్వం చేసే శాటిలైట్‌ను కూల్చివేసి ముప్పును తప్పించుకోవచ్చు. ఈ దెబ్బకు దాడి చేసిన దేశం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ అవసరాన్ని గుర్తెరిగి ప్రత్యర్థి దేశాల శాటిలైట్లను కూల్చే సామర్థ్యాన్ని భారత్ కూడా సంపాదించింది. కాకపోతే ఈ పరీక్షను భారత్ అత్యంత రహస్యంగా ఉంచింది. గతంలో చైనా ఈ పరీక్ష నిర్వహించినప్పుడు ప్రపంచ దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
చైనా మరింత ముందుకు..
ప్రస్తుతం చైనా అంతరిక్ష యుద్ధ విషయంలో మరో అడుగు ముందుకేసింది. దీనికోసం డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ (డ్యూ)ల నుంచి ఎలక్ట్రోమేగ్నిటిక్ తరంగాల ఆధారంగా పనిచేసే ఈఎంపీల వైపు మళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్యూ వ్యవస్థలో అంతరిక్షంలోని శాటిలైట్ల కదలికలు కనుగోనడానికి చైనా పలు చోట్ల ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఒక సారి శత్రువు శాటిలైట్ కదలికలు కనుగొన్నాక డ్యూ ఆయుధాలు రంగంలోకి దిగుతాయి. ఇవి కెమికల్ లేజర్ సాయంతో వాటిని కూల్చివేస్తాయి. షింగ్జాంగ్లో ఇలాంటి ఒక కేంద్రం ఉంది.
ఏమిటీ ఏశాట్ వ్యవస్థ..
ఏశాట్ అంటే యాంటీ శాటిలైట్ అని అర్థం. దీనిని భూఉపరితలంపై నుంచికానీ, యుద్ధవిమానాల పై నుంచి కానీ ప్రయోగించే అవకాశం ఉంది. దాదాపు 2,000 కిలోమీటర్ల లోపు ఉన్న ఉపగ్రహాలను పేల్చివేసే సామర్థ్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది. భారత్ చేపట్టిన ‘మిషన్ శక్తి ’ చేపట్టిన ఆపరేషన్‌లో కేవలం మూడు నిమిషాల్లోనే భారత క్షిపణి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ వద్ద ఉన్న ఏ క్షిపణిని అయినా మార్పులు చేసి ఏశాట్గా వాడొచ్చని డీఆర్డీవోకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
* 1985 సెప్టెంబర్ 13న యూఎస్ ఏఎస్ఎం-135 ఏశాట్‌ను ఎఫ్-15 ఈగిల్ నుంచి ప్రయోగించి ఒక ఉపగ్రహాన్ని కూల్చింది. ఇదే తొలి ఏశాట్ విజయంగా పరిగణిస్తారు. అదే సమయంలో సోవియట్ యూనియన్ కూడా ప్రయోగాలు చేపట్టింది.
భవిష్యత్తు ఏమిటీ..
అంతరిక్ష యుద్ధతంత్రంలో ప్రస్తుతం ఏశాట్ ద్వారా భూ ఉపరితలం నుంచి శాటిలైట్లను కూల్చి వేసే వ్యవస్థలను అభివృద్ధి చేశారు. అమెరికా వంటి దేశాలు ఆయుధాలను అంతరక్షింలోకి తరలించి వాటి ద్వారా భూఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే కార్యక్రమాలను కూడా చేపట్టింది. కానీ అధికారికంగా ఎక్కడా దీనికి సంబంధించిన ప్రస్తావన ఉండదు.
అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి..
1967లో భారత్ ఔటర్ స్పేస్ ట్రీటీపై సంతకం చేసింది. దీనిని 1982లో పార్లమెంట్ గుర్తించింది. (రాటిఫై చేసింది). దీని ప్రకారం అంతరిక్షంలోకి సామూహిక జనహనన ఆయుధాలను తీసుకెళ్లడాన్ని నిషేధించింది. ప్రస్తుత ప్రయోగం భారత్ ఏ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదు.