close

తాజా వార్తలు

కొడితే... బంతి గ్రౌండ్‌ దాటాల్సిందే

ఐపీఎల్‌లో సిక్సర్ల యోధులు వీరే.. 

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 12వ సీజన్‌తో కలిపి ఇప్పటివరకూ 7,400 సిక్సర్ల పైనే బాదేశారంటే నమ్ముతారా? కానీ, ఇది నిజం. ఎందుకంటే సిక్సర్ల క్రేజ్‌ అలాంటిది మరి. కొంచెం కష్టపడితే సిక్సర్‌ను కొట్టడం సులువే. కానీ, దాన్ని అందరి కంటే దూరంగా పంపించాలంటే.. సిక్సర్ల యోధులకే సాధ్యం. ఇప్పటివరకు అన్ని ఐపీఎల్‌ సీజన్లలో అత్యంత భారీ సిక్సర్‌ను నమోదు చేసిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.. 

మొదటి సీజన్‌ మోర్కెల్‌దే.. 

ఆల్‌ రౌండర్‌ మోర్కెల్‌ 21వ దశాబ్దంలో విధ్వంసంకర ఆటగాడు. తొలి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడిన మోర్కెల్‌ జట్టుకు ఎంతో విలువైన ఆటగాడిగా నిలిచాడు. చెపాక్‌ స్టేడియం వేదికగా డెక్కన్‌ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రజ్ఞాన్‌ ఓజా బౌలింగ్‌లో మోర్కెల్‌ భారీ సిక్సర్‌ బాదాడు. మిడి వికెట్‌ మీదుగా వెళ్లిన ఈ సిక్సర్‌ 125 మీటర్ల దూరంలో పడి అన్ని సీజన్‌ల్లోనే భారీ సిక్సర్‌గా నమోదైంది. దీన్ని అప్పటి కామెంటర్స్‌ మెరీనా బీచ్‌లో పడిందని వర్ణించడం విశేషం.

సిక్సర్ల రారాజు.. యువరాజ్‌ 

యువరాజ్‌ సిక్సర్లను అభిమానులు ఎంతో ప్రేమిస్తారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను యువీ బాది అందరినీ అలరించాడు. 2008లో జరిగిన రెండో ఐపీఎల్‌ సీజన్‌లో యువీ.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఆడాడు. సెంచూరియన్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ భారీ సిక్సర్‌ బాది, ఆ సీజన్‌కే టాప్‌గా మార్చాడు. మోర్కెల్‌ వేసిన బంతిని యువీ ఒక అడుగు ముందుకు వేసి మిడ్‌ వికెట్‌ మీదుగా 119 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు. 


⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔

ఊపేసిన ఉతప్ప

కర్ణాటక బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఉతప్ప పొట్టి ఫార్మాట్‌లో కీలక ఆటగాడు. ఐపీఎల్‌ మూడో సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ తరఫున ఆడిన ఊతప్ప భారీ సిక్సర్‌ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. 2010లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊతప్ప 120 మీటర్ల సిక్సర్‌ బాదాడు. డ్వేన్‌ బ్రావో వేసిన లెన్త్‌ డెలివరీని లాంగాన్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టాడు. ఆ సీజన్‌లో బెంగళూరు విజయాల్లో ఉతప్ప కీలక పాత్ర పోషించాడు. 

గిల్లీ పంజా..

ఆస్ట్రేలియన్‌ దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ విధ్వంసకర ఆట గురించి క్రికెట్‌ అభిమానులకి సుపరిచితమే. ఐపీఎల్‌ నాలుగో సీజన్‌లో అత్యంత దూరంలో సిక్సర్‌ను బాదిన ఆటగాడిగా గిల్లీ నిలిచాడు. 2011 ఐపీఎల్‌లో గిల్‌క్రిస్ట్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున కెప్టెన్‌గా వ్యవహరించాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గిల్లీ.. చార్లెస్‌ లాంజ్వెల్ట్‌ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ మీదుగా 122 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు.


⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔

ధనాధన్‌ ధోని

ధోని క్రీజులో ఉంటే ఆఖరి ఓవర్లో 20 పరుగులు అవసరమైనా బౌలర్‌కు ఆందోళనే. దానికి కారణం..ధోని సిక్సర్లతో విరుచుకుపడతాడని. బంతిని బలంగా బాదడంలో ధోని తర్వాతే ఎవరైనా. ఐపీఎల్‌ ఐదో సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌పై ధోని 112 మీటర్ల దూరంలో సిక్సర్‌ బాదాడు. ఈ సీజన్‌కు ఇదే భారీ సిక్సర్‌. 2012లో జరిగిన మ్యాచ్‌లో జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌ బౌలింగ్‌లో ధోని లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ కొట్టి ఈ రికార్డు నెలకొల్పాడు.

సిక్సర్ల సునామి‌

కరేబియన్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌ సిక్సర్లను బాదడంలో ‘యూనివర్సల్‌ బాస్‌’. అవలీలగా సిక్సర్లు బాదే ఈ యోధుడు ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడాడు. పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశోక్‌ దిండా వేసిన బంతిని 119 మీటర్ల సిక్సర్‌ను బాది, ఈ సీజన్‌కే భారీ సిక్సర్‌గా మలిచాడు. 2013లో జరిగిన ఈ మ్యాచ్‌లో గేల్‌ 66 బంతుల్లోనే 175 పరుగులు చేయడం విశేషం. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లను బాదిన ఆటగాడు కూడా ఈ బాసే.


⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔

మిల్లర్‌.. కిల్లర్‌ 

ఐపీఎల్‌ ఏడో సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున డేవిడ్‌ మిల్లర్‌ ఆడాడు. 2014లో హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో 102 మీటర్ల భారీ సిక్సర్‌ను మిల్లర్‌ బాదాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక దూరం వెళ్లిన సిక్సర్‌. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మిల్లర్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. స్లాగ్‌ ఓవర్లలో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లలో ఒకడైన మిల్లర్‌ దక్షిణాఫ్రికా ఆటగాడు.

డేంజర్‌ డివిలియర్స్‌

మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌కు ప్రపంచమంతా అభిమానులే. అతను మైదానంలో కదిలే శైలి అందరినీ ఆకట్టుకుంటుంది. ఐపీఎల్‌ ఎనిమిదో సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన డివిలియర్స్‌ 108 మీటర్ల దూరంలో సిక్సర్‌ను బాది, సీజన్‌కే భారీ సిక్సర్‌గా మలిచాడు. 2015లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మలింగ వేసిన బంతిని మిడ్‌వికెట్‌ మీదుగా సిక్సర్‌ కొట్టి ఈ రికార్డు నెలకొల్పాడు.


⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔

ఫైనల్‌ కటింగ్‌.. 

ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌కటింగ్‌ ఐపీఎల్‌ తొమ్మిదో సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఆడాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కటింగ్‌ 117 మీటర్ల సిక్సర్‌ను బాదాడు. షేన్‌వాట్సన్‌ వేసిన ఫుల్‌టాస్‌ను కటింగ్‌ సీజన్‌కే భారీ సిక్సర్‌గా నమోదు చేశాడు. ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలిచి 2016 ఐపీఎల్‌లో విజేతగా నిలిచింది.

ట్రావిస్‌ టైం..

బిగ్‌బాష్‌ లీగ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ తరఫున ఆడిన ట్రావిస్‌ హెడ్‌ సిడ్నీ సిక్సర్స్‌పై వరుసగా మూడు సిక్సర్లను బాది తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్‌ పదో సీజన్‌లో హెడ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడాడు. 2017లో చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో హెడ్‌ 109 మీటర్ల సిక్సర్‌ బాదాడు. ఫ్లడ్‌లైట్‌ పిల్లర్‌కు తగిలిన ఈ సిక్సర్‌.. సీజన్‌కే భారీ సిక్సర్‌గా నిలిచింది. 


⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔⇔

మిస్టర్‌ 360 రెండోసారి..

డివిలియర్స్‌ భారీ సిక్సర్‌ రికార్డును మరోసారి ఐపీఎల్‌ 11వ సీజన్‌లో నమోదు చేశాడు. 2018లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. చెన్నై బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ వేసిన బంతిని డివిలియర్స్‌ 111 మీటర్ల సిక్సర్‌ బాదాడు. మిస్టర్‌ 360 ఐపీఎల్‌ ఎనిమిదో సీజన్‌లో కూడా 108 మీటర్ల భారీ సిక్సర్‌ కొట్టి.. ఆ సీజన్‌కు టాప్‌గా నిలిచాడు.

ఇక ఈ సీజన్‌లో....

ఈ ఏడాది ఇప్పటివరకు భారీ సిక్సర్‌ కొట్టిన ఆటగాడిగా హార్దిక్‌ పాండ్య నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ 104 మీటర్ల భారీ సిక్సర్‌ను కొట్టాడు. 14 రోజులు మాత్రమే పూర్తయిన ఈ సిరీస్‌లోనే ఇంత భారీ సిక్సర్‌ నమోదైతే... ఇంకా రానున్న రోజుల్లో ఇంకెలాంటి సిక్స్‌లు చూస్తామో. అసలే భీకరమైన ఫామ్‌లో బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు మరి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.