close

తాజా వార్తలు

సివిల్స్‌ కొట్టాలంటే.. 24 గంటలూ చదవక్కర్లేదు

కల కన్నాడు... జనం వెతలు తగ్గించి ఆత్మసంతృప్తినిచ్చే హోదాను అందుకోవాలనే అందమైన కల! దాన్ని నిజం చేసుకోవాలని తపించాడు. ఆశానిరాశల ఊగిసలాటల మధ్య సహనంతో సుదీర్ఘకాలం శ్రమించాడు. సాధించాడు! క్లుప్తంగా కర్నాటి వరుణ్‌రెడ్డి విజయగాథ ఇది! నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఇతడు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో అఖిలభారత స్థాయి ఏడో ర్యాంకు,  తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ ర్యాంకు సాధించాడు. వదిలేస్తేనే ఓటమి అనీ,  నిలిచి గెలవాలంటూ తన స్ఫూర్తిదాయక విశేషాలను ‘చదువు’తో ఇలా పంచుకున్నాడు.

చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, ఐఏఎస్‌ సాధించాలన్న కల, అమ్మానాన్నల ప్రోత్సాహం... ఇవీ సివిల్స్‌లో నేను ఏడో ర్యాంకు పొందడానికి కారణాలు. ఈ ర్యాంకును అసలు ఊహించలేదు. తప్పకుండా 100 లోపు ర్యాంకు వస్తుందని మాత్రం ఇంటర్వ్యూ తర్వాత అనిపించింది. కానీ సింగిల్‌ డిజిట్‌లో ర్యాంకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే..మనం ఎంత చదివినా మంచి ర్యాంకు రావాలంటే కొంత అదృష్టం కూడా కావాలేమో...
మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఏడో తరగతి వరకు అక్కడే... తర్వాత ఇంటర్‌ వరకూ విజయవాడ దగ్గర్లోని గూడవల్లిలో చదువుకున్నా. ఐఐటీ బాంబేలో సీటు రావడంతో ఉన్నత విద్య అక్కడే గడిచింది. నాన్న జనార్దన్‌రెడ్డి నేత్రవైద్యుడు, అమ్మ నాగమణి వ్యవసాయ శాఖ ఉద్యోగిని. తమ్ముడు పృథ్వీరెడ్డి ప్రస్తుతం హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్నాడు. జనంతో మమేకమయ్యే ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచీ ఉండేది. దానిలోనే ఆత్మసంతృప్తి ఉంటుందనిపించింది. సివిల్స్‌ సాధించాలని ఐఐటీలో చదువుతున్నపుడు బలంగా నిర్ణయించుకున్నా!

ఐదేళ్ల శ్రమ
ఈ ర్యాంకు రావడానికి వెనుక దాదాపు ఐదేళ్ల శ్రమ ఉంది. సివిల్స్‌ మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా నిరాశే ఎదురైంది. రెండో ప్రయత్నంలో మెయిన్స్‌లోనే విఫలమయ్యా. మూడో ప్రయత్నంలో బాగా కష్టపడి చదివి 166వ ర్యాంకు సాధించా.. అప్పుడు ఇండియన్‌ రెవిన్యూ సర్వీసు (ఐఆర్‌ఎస్‌)లో ఉద్యోగం వచ్చింది. సివిల్‌ సర్వీసు ఉద్యోగం చేయాలని పట్టుదలతో మళ్లీ నాలుగో ప్రయత్నం చేయగా అప్పుడు 225 ర్యాంకు వచ్చింది. దీంతో ఐఆర్‌ఎస్‌ ఉద్యోగంలో శిక్షణలో ఉన్నప్పుడే సెలవు పెట్టుకొని ప్రిపేరయ్యా. ఐదో ప్రయత్నంలో ఇప్పుడీ ర్యాంకు సాధించాను.
గతంలో ఊహించినంత ర్యాంకు రానప్పుడు ‘అనవసరంగా సివిల్స్‌ వైపు వచ్చానేమో’నని నిరాశ చెందా. ఇవన్నీ వదిలేసి ఎం.ఎస్‌. చేయడానికి అబ్రాడ్‌ వెళ్దామని అనుకున్నా. అయితే నా నిరాశ తొలగేలా స్నేహితులు, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. చిన్నప్పుడు క్షేత్రస్థాయిలో చూసిన ప్రజల కష్టాలను మళ్లీ తలుచుకొని సివిల్స్‌ ప్రయత్నాలు కొనసాగించా. మొదటి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం నేను ఎస్సే రైటింగ్‌ను అంతగా పట్టించకోకపోవటం. మూడో ప్రయత్నంలో దానిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించా. ఆప్షనల్స్‌ సబ్జెక్ట్స్‌నూ ఎక్కువగా సాధన చేశా.
ప్రస్తుతం సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవారు ఒక్కసారి ప్రయత్నించి విఫలమవగానే వదిలేస్తున్నారు. అలా కాకుండా లోటుపాట్లు  ఎక్కడ జరిగాయో తెలుసుకొనే గ్రహించి సవరించుకోవాలి. ఇంకా కసిగా చదవాలి. మొదట ఫెయిల్యూర్‌ వచ్చినా స్వీకరించే మానసిక సన్నద్ధత ఉండాలి.

రోజువారీ లక్ష్యాలు
రోజుకు 10 నుంచి 12 గంటలు చదివేవాణ్ణి. చర్చ ద్వారా చదివితే ఎక్కువగా గుర్తుండటానికి అస్కారముంటుందని నలుగురైదుగురు స్నేహితులం కలిసి గ్రూప్‌ స్టడీస్‌ చేసేవాళ్లం. నాతో పాటు చదువుకున్న సూర్యాపేటకు చెందిన మల్లు చంద్రకాంత్‌రెడ్డికి 208 ర్యాంకు వచ్చింది. మిత్రులం అంతా రోజు వారీ లక్ష్యాలు పెట్టుకొని చదివేవాళ్లం. ఈ రోజు ఒక సబ్జెక్ట్‌ను పూర్తి చేయాలంటే ఎంత కష్టపడైనా దాన్ని పూర్తి చేసేవాళ్లం. జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌) అంశం పరిధి చాలా ఎక్కువ. దీన్నెలా చదవాలో అర్థంకాకే చాలామంది మెయిన్స్‌లో విఫలమవుతారు. అలా కాకుండా  ఒకే అంశాన్ని వివిధ కోణాల్లో సమగ్రంగా తెలుసుకోగలిగితే ఉపయోగం ఉంటుంది. ఎప్పటికప్పుడు నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుని, సందేహాలను నివృత్తి చేసుకోవాలి. తెలిసిన విషయం ఎంతమేర  ప్రెజెంట్‌ చేస్తామనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ చదవాలనే ఆరాటంతో అన్ని అంశాలను సగంసగం చదవడం వల్ల ఉపయోగం లేదు. నిత్యం సమాజంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పత్రికాపఠనం తప్పనిసరి.

మొదట్లో ఆటంకాలు ఎదురైనా దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయి. అప్పటివరకూ ఓపిగ్గా ఉండాలి. నిరాశ పడకుండా సన్నద్ధమయితే సివిల్స్‌ సాధించవచ్చు.

స్నేహాలూ, సినిమాలూ...
సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాం కదాని రోజంతా చదువుతూనే కూర్చోకూడదు. అన్నింటినీ బ్యాలెన్స్‌ చేయాలి. స్నేహితులు, సినిమాలు, కుటుంబం అన్నీ ఉండాలి. నేనైతే రోజులో చదివే సమయం తప్పితే స్నేహితులతో గడిపేవాడిని. సినిమాలు చూసేవాడిని. ఇవి కొంత మనకు ఆలోచన శక్తినీ, లక్ష్యాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తాయి.
ప్రిలిమ్స్‌ పాసైనవారు చాలామంది మెయిన్స్‌లో విఫలమవుతారు. మొదటి రెండు సార్లు విఫలమవడానికి నేను ఎంచుకున్న ఆప్షనల్స్‌ సబ్జెక్ట్స్‌ కారణమని అనిపించింది. మొదటి రెండు ప్రయత్నాల్లో జాగ్రఫీని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. అందులో ఊహించిన మార్కులు రాకపోవడంతో మూడో ప్రయత్నంలో మ్యాథ్స్‌ని ఎంచుకున్నా.  నిరంతరం సాధన చేయడంతో మూడో ప్రయత్నంలో 166వ ర్యాంకు వచ్చింది. ఇక్కడ సివిల్స్‌ సన్నద్ధమయ్యేవారికి చెప్పేదేమంటే- వారు ఎంచుకున్న సబ్జెక్టులపై మంచి పట్టు ఉండాలి. అప్పుడే ఆ పేపర్లలో ఎక్కువ స్కోర్‌ చేయగలుగుతాం. ఎక్కువ చదవడం కంటే సాధనపై దృష్టి పెడితేనే చదివినది గుర్తుంచుకోగలుగుతాం..

ఇంటర్‌వ్యూలో...

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ సాధించిన తర్వాత మరో ప్రధాన అంకం ఇంటర్వ్యూ. బస్సీ నేతృత్వంలోని బోర్డు 25 నుంచి 30 నిమిషాల పాటు నన్ను ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ ఎక్కువగా డిబేట్‌ గానే సాగింది. ఈ బోర్డులో అడిగే ప్రశ్నలు అభ్యర్థులకు ఎక్కువగా ఒత్తిడికి గురి చేసేలా ఉంటాయి. దాన్ని మొదట అధిగమిస్తేనే మంచి ర్యాంకు సాధించగలం.
* ‘ఐఐటీల్లో చదువుకునేవారు దేశానికి సేవ చేయకుండా ఉన్నతోద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం?’ అని అడిగారు.
‘ఐఐటియన్ల వల్లే మనదేశానికి ప్రతిష్ఠాత్మక సాఫ్ట్‌వేర్‌ సంస్థలు వచ్చాయి. మన దగ్గర నాణ్యమైన ఇంజినీర్లు ఉండటం వల్లే అమెరికా, చైనా, ఆస్త్ట్రేలియా లాంటి దేశాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల కోసం మనవైపు చూస్తున్నాయి. ఇక్కడ స్టార్టప్‌ విప్లవం సైతం బాగా ఉంది. దీంతో చాలామంది సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేసి ఉపాధిని కల్పించటం కోసం చూస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఐఐటి©యన్లే చురుగ్గా ఉన్నారు’ అని చెప్పా.
* నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం ఏ విధంగా ఉంది? దీనివల్ల దేశంలోని నిరుద్యోగ యువతకు దక్కాయా? లేదా?’ అని ప్రశ్నించారు.
‘ఈ కార్యక్రమం మంచిదే. ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోవచ్చు. దీర్ఘకాలంలో దీనివల్ల నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుంది’ అని చెప్పాను.
దేశంలో ఫార్మా రంగం సాధిస్తోన్న ప్రగతి, సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల వల్ల దేశ పారిశ్రామిక రంగానికి కలిగే మేలు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ తదితర అంశాలను ఇంటర్వ్యూల్లో అడిగారు. ప్రశాంతంగా సమాధానాలు ఇచ్చాను. ఇక్కడ ఒత్తిడిని హ్యాండిల్‌ చేయాలి. తెలిసిన విషయాన్ని వారికి ఎంతబాగా వివరిస్తామనే దానిపైనే ఇంటర్వ్యూ ఫలితం ఆధారపడి ఉంటుంది.

-  జీడిపల్లి దత్తురెడ్డి, ఈనాడు, నల్గొండ


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.