close

తాజా వార్తలు

నెరవేరని రాయుడి ‘పంతం’.. ఎందుకిలా?

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెగా సమరానికి తొలి భేరీ మోగించింది. వచ్చేనెల ఇంగ్లాండ్‌ వేదికగా ఈ టోర్నీ జరిగే సంగతి తెలిసిందే. అనుభవం, ఆటతీరు, అవసరం, వాతావరణం, పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని 15 మంది ఆటగాళ్ల పేర్లను సెలక్షన్‌ బృందం ప్రకటించింది. ఏడాది కాలంగా చోటు పక్కా అనుకుంటున్న హైదరాబాదీ అంబటి రాయుడికి షాక్‌ తగిలింది. ధోనీ వారసుడు పంత్‌కు మొండిచేయి ఎదురైంది. ఎందుకిలా?

ఆఖరి మెట్టుపై బోల్తా

పది సీజన్లు సేవలందించిన ముంబయి ఇండియన్స్‌ వేలానికి వదిలేసింది. అప్పుడే పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ అతడిని కళ్లకు అద్దుకుంది. మహీ నమ్మకంతో అతడిని ఓపెనర్‌గా బరిలోకి దించాడు. అంతే ఆకలిగొన్న పులిలా విరుచుకుపడ్డాడు అంబటి రాయుడు. పరుగుల వరద పారించాడు. మొత్తం 602 పరుగులు చేశాడు. అతడి ప్రదర్శన మెచ్చిన బీసీసీఐ సెలక్టర్లు వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. ఆ ఏడాది 11 మ్యాచుల్లో 10 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆసియాకప్‌లో హాంకాంగ్‌, అఫ్గానిస్థాన్‌పై అర్ధశతకాలు చేశాడు. మరో రెండు మ్యాచుల్లో అజేయంగా నిలిచాడు. పరిస్థితులను అధ్యయనం చేసి ఆడుతున్న రాయుడిని సారథి విరాట్‌ కోహ్లీ మెచ్చాడు. ప్రోత్సహించాడు.

వెస్టిండీస్‌ సిరీస్‌లో నాలుగో వన్డేలో శతకం సాధించి 2018ని ఘనంగా ముగించాడు. 56 సగటుతో 392 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ప్రపంచకప్‌ కోసం రంజీలకు గుడ్‌బై చెప్పేశాడు. అక్కడే కథ అడ్డం తిరిగింది. 2019 ఏడాదిని రాయుడు డకౌట్‌తో ఆరంభించాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండో మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శనే. మూడో మ్యాచ్‌లో చోటు మాయమైంది. న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఓ అర్ధశతకం (13*, 47, 40*, 0, 90) చేసినా కీలక సమయాల్లో ఔటయ్యాడు. సొంతగడ్డ మీద ఆసీస్‌పై (13, 18, 2) కంగారూ పడిపోయాడు. ఇదే నిరాశాజనక ఫామ్‌నూ ఐపీఎల్‌లో కొనసాగిస్తున్నాడు. ఇవన్నీ చూసిన సెలక్షన్‌ కమిటీ అతడిపై వేటు వేసింది.

అంతం కాదిది ఆరంభం

ఎంఎస్‌ ధోనీ వారసుడిగా భావిస్తున్న యువ రిషభ్‌పంత్‌కు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించారు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీసుల్లో అతడి బ్యాటింగ్‌ను చూసి మురిసిపోయారు. అయితే వన్డేల్లో పంత్‌ రాణించింది తక్కువే. కేవలం ఐదు వన్డేలే ఆడాడు. విండీస్‌పై 3 మ్యాచుల్లో 41, ఆసీస్‌పై 2 మ్యాచుల్లో 52 పరుగులే చేశాడు. తన ఫైర్‌ పర్ఫామెన్స్‌ను బయటకు తీయలేదు. నిజానికి పంత్‌ మొదట్నుంచి ప్రపంచకప్‌ ప్రణాళికల్లో లేడు. ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ తర్వాతే అతడిపై అంచనాలు పెరిగాయి. ధోనికి విశ్రాంతినిచ్చిన ఆసీస్‌ సిరీస్‌లో అతడు కీపింగ్‌లో చాలా తప్పిదాలు చేశాడు. కెరీర్‌ ఆరంభంలో ఉన్న అతడికి మరిన్ని అవకాశాలు, అనుభవం అవసరం.

కీపింగ్‌ పరంగా ప్రాథమిక అంశాల్లో పంత్‌ పట్టు సాధించాలని బిషన్‌సింగ్‌ బేడీ, కిరణ్‌ మోరె వంటి పెద్దలు చెప్పారు. అతడు ఎంఎస్‌ ధోనీని అనుసరిస్తున్నాడని అది ప్రమాదకరమని వెల్లడించారు. మహీ సైతం కెరీర్‌ తొలినాళ్లలో పొరపాట్లు చేశాడని వాటిని సవరించుకున్నాకే గొప్పగా ఎదిగాడని అంటున్నారు. ‘వన్డేల్లో వికెట్‌ కీపింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే దినేశ్‌ కార్తీక్‌ను ఎంచుకున్నాం. లేదంటే రిషభ్‌ పంత్‌ జట్టులో ఉండేవాడే. మహీ గాయపడితేనే రెండో వికెట్‌కీపర్‌కు అవకాశం దక్కుతుంది. ఒత్తిడి నెలకొన్న భారీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం వల్లే కార్తీక్‌ వైపు మొగ్గుచూపాం’ అని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. అంటే భవిష్యత్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అనే ఈ మాటల ద్వారా స్పష్టం అవుతోంది. అవసరమైన మార్పులు  చేసుకొని త్వరగా అనుభవం సాధిస్తే పంత్‌కు తిరుగులేదు. అతడు తర్వాతి ప్రపంచకప్‌ను కచ్చితంగా ఆడతాడు. ప్రస్తుతం దినేశ్‌ కార్తీక్‌ వయస్సు 33 కాగా.. పంత్‌ వయస్సు 21.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.