close

తాజా వార్తలు

రూపులో మార్పు లేదు.. మరి ఆటలో

క్రికెట్‌ ప్రపంచ కప్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఇటీవల బీసీసీఐ 15 మందితో మన జట్టును కూడా ప్రకటించింది. 2015 ప్రపంచ కప్‌లో ఆడిన ఏడుగురు మరోసారి కప్‌ వేటలోకి దిగుతున్నారు. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో గతసారి సెమీ ఫైనల్‌ వరకు వెళ్లిన టీమిండియా... అక్కడ ఉసూరుమనిపించింది. ఈసారి విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో కప్‌ సాధిస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. ఆ ఏడుగురు అప్పుడు ఎలా ఆడారు... ఇప్పుడు ఎలా ఆడతారో అని అందరూ అంచనాలు వేసుకుంటున్నారు. దాంతో పాటు మనం వీళ్లు అప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దామా!

కింగ్‌ కోహ్లీ

మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో 2015 వరల్డ్‌ కప్‌లో ఆడిన విరాట్‌.. ఈసారి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో  50.83 స్ట్రైక్‌రేట్‌తో 305 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం ఉంది. సెమీస్‌ వంటి కీలక మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ సారి అటు బ్యాటింగ్‌తోపాటు.. జట్టును విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత కోహ్లీపై ఉంది. కోహ్లీ ప్రస్తుతం ఉన్న ఫామ్‌ చూస్తుంటే ఈ సారి రికార్డులు బద్దలు కొడతాడేమో అనిపిస్తోంది.  

రో‘హిట్‌’ శర్మ

రోహిత్‌ శర్మ ఫామ్‌లో ఉన్నాడంటే మాత్రం ప్రత్యర్థికి కొరకరాని కొయ్యగా మారినట్టే. ఒక్కసారి క్రీజ్‌లో నిలదొక్కుకుంటే పరుగుల వరద పారిస్తాడు. ఓపెనర్‌ శిఖర్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పుతున్నాడు. గత వరల్డ్‌కప్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేశాడు. అప్పుడు ఫర్వాలేదనిపించినా.. కీలక సమయాల్లో అనవసరంగా ఔట్‌ కావడం రోహిత్‌ శర్మకు ఉన్న ప్రధాన సమస్య. ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌గా కూడా ఉండటంతో రోహిత్‌ మీద అదనపు బాధ్యత కూడా పడింది. మరి హిట్‌ మ్యాన్‌... ఈసారి ఏం చేస్తాడో చూడాలి!

ధోనీ.. ది సీనియర్‌

ధోని సారథ్యంలోనే 2011 ప్రపంచకప్‌ను నెగ్గడంతో 28 ఏళ్ల భారత్‌ కల నెరవేరింది. అదే ఊపులో 2015లోనూ బరిలోకి దిగినప్పటికీ సెమీస్‌లో బోల్తాపడింది. ఛాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆసారి మహేంద్రసింగ్‌ ధోని బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేదు. ఇదే ఆఖరి ప్రపంచకప్‌ కావొచ్చనే ఊహాగానాల మధ్య ధోని ఇంగ్లండ్‌ పయనమవుతున్నాడు. సీనియర్‌ అయిపోయాడు.. ఎలా ఆడతాడో అనే సన్నాయి నొక్కుల మధ్య ఈ సారి ఎలా రాణిస్తాడో చూడాలి. అనుభవజ్ఞుడైన ధోని సలహాలు కోహ్లీకి ఎంతో మేలు చేస్తాయనేదాంట్లో సందేహం లేదు.

గబ్బర్‌.. టెర్రర్‌

2015 ప్రపంచకప్‌లో టాప్‌ స్కోర్ చేసిన వారిలో శిఖర్‌ ధావన్‌ ఐదో స్థానంలో నిలిచాడు. మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో 51.50 స్ట్రైక్‌రేట్‌తో 412 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఒక అర్ధశతకం ఉన్నాయి. అయితే విదేశాల్లో శిఖర్‌ విశ్వరూపం చూపిస్తాడనేది ఆయన కెరీర్‌ గణాంకాలు చెబుతున్న మాట. మరి ఈసారి రోహిత్‌ శర్మతో కలిసి శిఖర్‌ మంచి భాగస్వామ్యాలను నెలకొల్పితే మాత్రం 2019 వరల్డ్‌ కప్‌లో భారత్‌కు ఓపెనింగ్‌ సమస్య తీరినట్లే.   

ఆల్‌రౌండ్‌ జడేజా

ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన రవీంద్ర జడేజా లాంటి ఆటగాడు జట్టులో ఉండటం కెప్టెన్‌కు కలిసొస్తుంది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ చేయగలగడం వల్ల జట్టులో సమతూకం తీసుకురావచ్చు. దీనికి చురుకైన ఫీల్డింగ్‌ అదనం. అయితే గత వరల్డ్‌కప్‌లో జడేజా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఎనిమిది వికెట్లను మాత్రమే తీశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాణిస్తున్నప్పటికీ ప్రపంచకప్‌లో ఎలా ఆడతాడనేదే ప్రశ్నార్థకం! మణికట్టు స్పిన్నర్లు చాహల్‌, కుల్‌దీప్‌ను పక్కనపెట్టి జడేజా తుది జట్టులోకి తీసుకుంటారా అనేది చూడాలి.

భువి.. భళా

స్వింగ్‌కు మారుపేరుగా భువనేశ్వర్‌ను పిలవచ్చు. ప్రారంభ ఓవర్లలో అద్భుతంగా బంతులు విసరగలిగే నైపుణ్యం భువిది. పేస్‌ పిచ్‌లపై స్వింగ్‌ను రాబడుతూ భువి సంధించే బంతులను ఎదుర్కోవాలంటే ఎలాంటి బ్యాట్స్‌మెన్‌ అయినా వణికిపోవాల్సిందే. గత వరల్డ్‌ కప్‌లో కుమార్‌ ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కింది. దీంతో అతని సత్తా చూడలేకపోయాం. ఈ సారి ఇంగ్లాండ్‌ పిచ్‌లపై చెలరేగాలని ప్రతి క్రీడాభిమాని కోరుకుంటున్నాడు. అయితే భువీ తాజ్‌ ఫామ్‌ మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో అభిమానులు భువీని మూడో బౌలర్‌గా చూస్తున్నారు. 

షంషేర్‌ షమీ

భారత అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్లలో షమి ఒకడు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసే షమి జట్టులో ఉన్నాడంటే పేస్‌ దళం ఎంతో బలంగా ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ తరఫున ఆడుతున్న షమి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే మాత్రం ఇంగ్లాండ్‌ పిచ్‌లపై బంతితో నిప్పులు చెలరేగే అవకాశముంది. గత ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో 4.81 ఎకానమీతో 17 వికెట్లను పడగొట్టిన షమి.. అత్యధిక వికెట్లను తీసిన వారిలో నాలుగోవాడు కావడం విశేషం. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.