close

తాజా వార్తలు

మాల్దా హస్తానికి చిక్కేనా?

కాంగ్రెస్‌ కంచుకోటలో త్రిముఖ పోరు

ఉత్తర్‌ ప్రదేశ్‌లో అమేఠీ అనగానే అక్కడ కాంగ్రెస్‌కి ఎదురులేని లోక్‌సభ స్థానమని గుర్తొస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోనూ కాంగ్రెస్‌కు ఓ అమేఠీ ఉంది. రాష్ట్రంలోని మాల్దా జిల్లాను కాంగ్రెస్‌కు కంచుకోటగా భావిస్తారు. అందుకే రాజకీయ విశ్లేషకులు దాన్ని ‘బెంగాల్‌ అమేఠీ’ అని అంటుంటారు. రెండు సార్లు మినహా కాంగ్రెస్‌కు అక్కడ గెలుపు నల్లేరు మీద నడకే అయింది. కానీ ఈ సారి మాత్రం అక్కడ త్రిముఖ పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌, తృణమూల్, భాజపా అభ్యర్థుల మధ్య గట్టి పోరు నడుస్తోంది. మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం కోసం ఎన్నికలకు ముందే ప్రచారం ప్రారంభించారు.ఉత్తర మాల్దా లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున మౌసమ్‌ నూర్‌, భాజపా నుంచి ఖగెన్‌ ముర్ము బరిలోకి దిగుతున్నారు. దక్షిణ మాల్దా నుంచి కాంగ్రెస్‌  నుంచి అబు హసీం ఖాన్‌, భాజపా నుంచి శ్రీరూప మిత్ర చౌదరీ, తృణమూల్‌ నుంచి మొయిజమ్‌ హోస్సేన్‌ పోటీలో ఉన్నారు.  

మడమ తిప్పని హస్తం..

గత అరవై ఏళ్లుగా  కాంగ్రెస్‌కు మాల్దాలో తిరుగులేదు. కాంగ్రెస్‌ నేత ఏబీకే ఘనీ ఖాన్‌ చౌదరీ ఇక్కడ నుంచి విజయవంతంగా ఎనిమిది సార్లు ఎన్నికయ్యారు. అయితే అతి విశ్వాసం కారణంగా 1971, 1977 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండు సార్లు సీపీఐ చేతిలో కాంగ్రెస్‌ దారుణంగా ఓడిపోయింది. 1980నుంచి తిరిగి పుంజుకున్న కాంగ్రెస్‌ 2014 వరకు తన జైత్రయాత్ర కొనసాగించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగించింది. కానీ ఈ మధ్య కాలంలో అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ షాక్‌ ఇచ్చాయి. కానీ ఇక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రజలతో మంచి అనుబంధం ఉన్నవారు కావడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మాల్దా స్థానం రద్దయి మాల్దా ఉత్తరం, మాల్దా దక్షిణం ఏర్పడ్డాయి.

తీవ్రంగా శ్రమిస్తున్న తృణమూల్‌..

రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ తృణమూల్‌ కూడా బాగానే శ్రమిస్తోంది. ఇప్పటికే మాల్దా సౌత్‌, నార్త్‌ నియోజకవర్గాల్లో రెండేసి సార్లు తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచార సభలు నిర్వహించారు. రాష్ట్రంలో తలపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా మమతా ముందుకు సాగుతున్నారు.

పుంజుకుంటున్న భాజపా..
గత రెండేళ్ల కాలంలో మాల్దాలో కమలం క్రమంగా వికసిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తోసిరాజని ఎక్కువ స్థానాలు సొంతం చేసుకుంది. తృణమూల్‌ 1,108 స్థానాల్లో విజయ ఢంకా మోగించగా, భాజపా 532 స్థానాలను సొంతం చేసుకుంది. ఇక కాంగ్రెస్‌ 399 స్థానాలు కైవసం చేసుకుంది. ఉత్తర మాల్దాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రం భాజపాకు ఎదురుగాలి వీస్తోంది.

 

రెండు స్థానాల్లో అవే ప్రధాన సమస్యలు
2014 ఎన్నికల్లో ఉత్తర మాల్దాలో కాంగ్రెస్‌కు 33%, భాజపా 16%, తృణమూల్‌ 17% ఓటు శాతాన్ని సంపాదించుకున్నాయి. ఇక దక్షిణ మాల్దాలోనూ కాంగ్రెస్‌ దూసుకుపోయింది. కాంగ్రెస్‌కు 35%, భాజపాకు 20%, తృణమూల్‌కు 17% ఓట్లు లభించాయి. ఉత్తర మాల్దాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 70% ముస్లిం ఓటర్లే ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక తృణమూల్‌ వారిని ఆకర్షించడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. రాజకీయ పరిస్థితులను పక్కన పెడితే గోవుల అక్రమ రవాణా, నకిలీ నోట్ల సమస్యలు మాల్దాను కుదిపేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ రూ19లక్షలకు పైగా దొంగనోట్లను పట్టుకున్నారు. ప్రతిసారీ ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం షరా మామూలైపోయింది. ఈ సారీ ఇదే మంత్రంతో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. 

మాల్దాలోని రెండు స్థానాలతో పాటు బాలుర్ఘాట్‌, జాంగీపూర్‌, ముర్షిదాబాద్‌ స్థానాలకు మంగళవారం ఇక్కడ పోలింగ్ జరగనుంది. 

- ఇంటర్నెట్ డెస్క్‌.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.