close

తాజా వార్తలు

లెఫ్ట్‌..రైట్‌..లాంతరు.. బెగుసరాయ్‌ ఓటు ఎవరికి?

బెగుసరాయ్‌లో కన్నయ్య వర్సెస్‌ కేంద్రమంత్రి

వివిధ జాతులకు చెందిన పక్షులన్నీ వచ్చి చేరే అందమైన కన్వార్‌ సరస్సు ఉన్న ప్రాంతం బెగుసరాయ్‌. అక్కడ రాజకీయ వలసలకు కూడా ఢోకా లేదు. అందుకే దీన్ని ‘రాజకీయనాయకుల వలస రాజ్యం’ అని సరదాగా సంబోధిస్తారు. బిహార్‌ని బెగుసరాయ్‌లో ఈ లోక్‌సభ ఎన్నికల్లో నువ్వా- నేనా అన్నట్లు పోరు నడుస్తోంది. అక్కడ ఎన్ని పార్టీలు బరిలోకి దిగుతున్నప్పటికీ భాజపా అభ్యర్థి, కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌- సీపీఐ అభ్యర్థి కన్నయ్య కుమార్‌ మధ్యనే ప్రధాన పోటీ. ఇక మహాగత్‌ బంధన్‌ నుంచి ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్‌ హసన్‌ బరిలోకి దిగుతున్నారు. 

ఎవరి బలం ఎంతంటే?

గిరిరాజ్‌ సింగ్‌..  
కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు బెగుసరాయ్‌ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు.  సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ కొద్ది రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ప్రచారంలో పాల్గొన్పప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.  రెండు రోజుల క్రితం ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆకుపచ్చ రంగులో ఉన్న ఆర్జేడీ జెండాను ఉద్దేశిస్తూ.. మన దేశంలో ఆకుపచ్చ రంగులో ఉన్న రాజకీయ పార్టీల జెండాలను నిషేధించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్‌ చేశారు. పాకిస్థాన్‌ జాతీయ జెండాలో కూడా ఆకుపచ్చ రంగు ఉంటుంది. కాబట్టి మన దేశంలో హింసను రెచ్చగొట్టే అవకాశం ఉందని, అందుకే ఆకుపచ్చ జెండాలను నిషేధించాలన్నారు. దీంతో పెద్ద దుమారమే రేగింది.  స్థానికంగానూ ఈయన ఫైర్‌ బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్నారు. విద్యుత్‌ లేక సతమతమవుతున్న బెగుసరాయ్‌కు రోజుకు భాజపానే కరెంట్‌ అందించింది. గత ఎన్నికల్లో ఇక్కడ భాజపా అభ్యర్తి డా. భోలాసింగ్‌ భారీ మెజార్టీతో గెలిచారు. ఈ రెండు అంశాలు మినహా భాజపాకు అనుకూలమైనవేవీ లేవు. 2014 ఎన్నికల్లో నవాడా నుంచి గిరిరాజ్‌ గెలుపొందారు.

కన్నయ్య కుమార్‌...
సీపీఐ అభ్యర్థి కన్నయ్య కుమార్‌కు ఇవే తొలి ఎన్నికలు.  జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడయిన ఈయనకు అక్కడి పూర్వ విద్యార్థుల మద్దతు ఉంది. స్వరా భాస్కర్‌ వంటి బాలీవుడ్‌ నటులు అండగా ఉన్నారు. దీంతో పాటు బెగుసరాయ్‌ కన్నయ్య స్వస్థలం కావడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. వామపక్షాలు ఈయనని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ సైతం కన్నయ్య తరఫు నుంచి ప్రచారం చేశారు.  బెగుసరాయ్‌లోని మేధావులు, జేఎన్‌యూ విద్యార్థులు, రచయితలు, కళాకారులు కన్నయ్యకు అండగా ఉన్నారు. ఇక కన్నయ్యకు రాజకీయ అనుభవం లేకపోవడం, తొలి సారి ఎన్నికల్లో పోటీ వంటి కొన్ని అంశాలు ప్రతికూలంగా మారనున్నాయి.

తన్వీర్‌ హస్సన్‌..
బెగుసరాయ్‌ నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా తన్వీర్‌ హస్సన్‌ బరిలోకి దిగుతున్నారు. గెలుపుపై అతి విశ్వాసంతో ఉన్నారు. దీంతో ఈయన ప్రవర్తన పార్టీ పెద్దలకు సైతం తలనొప్పిగా మారింది.   
గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి డా. భోలా సింగ్‌ గెలుపులో భూమిహార్‌ సామాజిక వర్గానిదే కీలక పాత్ర.  అయితే ఈ సారి గిరిరాజ్‌సింగ్‌, కన్నయ్య కుమార్‌లది కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో ఆ ఓట్లలో చీలిక ఏర్పడింది. భూమిహార్‌ ఓట్లతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల మీదే భాజపా ఆశలు పెట్టుకుంది. బెగుసరాయ్‌లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం, యాదవ ఓటర్లు ఎక్కువ. వీరి ఓట్లను రాబట్టుకునేందుకు ఆర్జేడీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక వామపక్షాలేమో  విద్యావేత్తలు, విద్యార్థులు, కళాకారులపై దృష్టి సారించాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.