close

తాజా వార్తలు

కుర్రాళ్లోయ్‌.. కుర్రాళ్లు..

మరో నెలరోజుల్లో క్రికెట్‌ అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది. ప్రపంచకప్‌ మహాసంగ్రామానికి సరిగ్గా ముప్పై రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రతీ క్రికెటర్‌కు ప్రపంచకప్‌ ఓ చిరకాలస్వప్నం. అలాంటి టోర్నీలో ఈ సారి చాలామంది యువ క్రికెటర్లు తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సారి టోర్నీ ప్రత్యేకత ఏంటంటే.. కొత్తగా ప్రపంచకప్‌ ఆడుతున్న వాళ్లలో కొంత మంది క్రికెటర్లు ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్నారు. మరి కొంతమంది టాప్‌5లో ఉన్నారు. దీంతో క్రికెట్‌ ప్రపంచం దృష్టి మొత్తం ఈ ఆటగాళ్లమీదే పడనుంది. ఆ ఆటగాళ్లెవరో ఓసారి చూద్దాం రండి..!

బుమ్రా ఇక్కడ.. ఎవరక్కడ..?

భారత పేసు గుర్రం బుమ్రా.. యార్కర్లు వేయడంతో పాటు డెత్‌ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే సామర్థ్యం ఉన్న బౌలర్‌. ఏ సమయంలో బంతి ఇచ్చినా వికెట్లు తీయగల నేర్పరి. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో కాలుమోపి అతి తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి బౌలర్‌గా మారాడు. ప్రస్తుతం వన్డే బౌలర్లలో బుమ్రా టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. ‘బ్యాటింగ్‌లో కోహ్లీ ఎంత ముఖ్యమో.. బౌలింగ్‌లో బుమ్రా అంతే ముఖ్యం’ అనే స్థాయికి చేరుకున్నాడు. భారత జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. 2018లో ఆడిన 13 వన్డేల్లోనే 22 వికెట్లు సొంతం చేసుకున్నాడు. మరో 15వికెట్లు తీస్తే 100వికెట్ల క్లబ్‌లో చేరతాడు. అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు 49 వన్డేలాడి 85 వికెట్లు తీశాడు. టీ20ల్లో 42మ్యాచుల్లో 51 వికెట్లు పడేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడుతున్నాడు. ప్రపంచకప్‌లో పాల్గొనబోయే భారత జట్టులో బుమ్రా కీలకం అవుతాడన్న విషయం అందరూ అనుకుంటున్నదే.

హార్దిక్‌ పాండ్య.. పాక్‌పై ఇన్నింగ్స్‌ గుర్తుందిగా..!

హార్దిక్‌ పాండ్య అనగానే భారత అభిమానులకు ఐపీఎల్‌ గుర్తు రావచ్చు కానీ, ప్రపంచ క్రికెట్‌కు మాత్రం ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆడిన విధ్వంసమే గుర్తుండిపోతుంది. కేవలం 43 బంతుల్లోనే 76 పరుగులు చేసి పాకిస్థాన్‌ బౌలర్లకు తన బ్యాటు రుచి చూపించాడు. ఆ తర్వాత కొంతకాలం అంత పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ వివాదం తర్వాత ఈ ఆల్‌రౌండర్‌ విజృంభణ ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న హార్దిక్‌ ప్రత్యర్థి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై 34 బంతుల్లోనే 91 పరుగులు చేసి తనలోని సత్తా ఏంటో నిరూపించాడు. ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం 17బంతుల్లోనే నమోదు చేశాడు. ప్రస్తుతం ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియాకు ఉన్న పదునైన అస్త్రం హార్దిక్‌ పాండ్య. ఆడిన 45 వన్డేల్లో 44 వికెట్లు తీయడంతో పాటు 731 పరుగులు చేశాడు. టీ20ల్లో 38 మ్యాచులాడి 36 వికెట్లు తీయడంతో పాటు 296 పరుగులు చేశాడు. 

‘అఫ్గానిస్థాన్‌ అఫ్రిదీ’ రషీద్‌ఖాన్‌ 

క్రికెట్‌ పసికూన అయిన అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన ఓ బౌలర్‌ ప్రపంచంలో మేటి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడతాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అతి తక్కువ సమయంలోనే ప్రపంచస్థాయిలో అగ్రశ్రేణి ఆటగాడిగా మారి అఫ్గానిస్థాన్‌ అఫ్రిదిగా పేరుతెచ్చుకున్నాడు రషీద్‌ఖాన్‌. ఇప్పటికే వన్డే ఆల్‌ రౌండర్లలో టాప్‌ ర్యాంక్‌ ఉన్నాడు. దీంతో పాటు టీ20 బౌలర్ల జాబితాలో టాప్‌ ర్యాంకు, వన్డే బౌలర్లలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ 20ఏళ్ల ఆల్‌రౌండర్‌ 2015లో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ప్రస్తుతం స్పిన్నర్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 56 వన్డేల్లో 123 వికెట్లు తీశాడు. 38 టీ20ల్లో 75 వికెట్ల సొంతం చేసుకున్నాడు. ఈ బౌలర్‌ 2019 ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్టు పరుగులకు అడ్డురాయిలా మారతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 

పాకిస్థాన్‌ కా కోహ్లీ... బాబర్‌ అజామ్‌

పాకిస్థాన్‌ అంటే పదునైన బౌలర్లకు పుట్టినిల్లు. అందుకే ఆ జట్టు పేరు చెప్పగానే అందరికీ ఆ జట్టులో ఆడిన వసీం అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌లే గుర్తొస్తారు. అయితే, ఆ పేరును చెరిపేస్తూ.. పాకిస్థాన్‌ అంటే పదునైన బౌలింగ్‌ మాత్రమే కాదు.. నాణ్యమైన బ్యాటింగ్‌ కూడా అని నిరూపించాడు బాబర్‌ అజామ్‌. 2015లో తన అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ కుడిచేతివాటం బ్యాట్స్‌మన్‌ మొదటి మూడు వన్డేల్లోనే వరుసగా మూడు శతకాలు బాది రికార్డు సృష్టించాడు. క్రికెట్‌ ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు. 59 మ్యాచుల్లోనే 51.29 సగటుతో 2,500 పరుగులు చేశాడు.  ప్రస్తుతం అంతర్జాతీయ వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో బ్యాటింగ్‌ విభాగంలో పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. రానున్న ప్రపంచకప్‌లో ఈ యువ బ్యాట్స్‌మన్‌ను అడ్డుకునేందుకు బౌలర్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

హిట్టింగ్‌ స్టార్‌..  హెట్‌మేర్‌ 

వెస్టిండీస్‌ అంటే దూకుడు మారుపేరు. దూకుడుకు తగ్గ నిలకడ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోపం. అయితే, ఆ లోపాన్ని పూడుస్తున్నాడు ఈ కరేబియన్‌ బ్యాట్స్‌మన్‌‌ షిమ్రాన్‌ హెట్‌మేర్‌. ఆడిన 25 వన్డేల్లోనే 900 పరుగులు చేసి విండీస్‌ జట్టు బ్యాటింగ్‌ మిడిల్‌ ఆర్డర్‌లో మినిమం గ్యారెంటీ బ్యాట్స్‌మన్‌గా మారాడు. నిదానంగా ఆడుతూనే భారీ షాట్లు బాదే హెట్‌మేర్‌ ఎన్నో మ్యాచుల్లో విండీస్‌ను ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు. వెస్టిండీస్‌ జట్టు 2015-16 అండర్‌19 ప్రపంచకప్‌ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈసారి ఇటీవల ముగిసిన కరేబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లోనూ కేవలం 18 మ్యాచుల్లో 727 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున అంతగా రాణించకపోయినా హెట్‌మేర్‌పై విండీస్‌ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అండర్‌ 19లో పోషించిన పాత్రే ఈసారి పునరావృతం చేస్తే విండీస్‌ను అడ్డుకోవడం కష్టమే..!

ఆసీస్‌ ‘గన్‌’ రిచర్డ్‌సన్‌..

ఆస్ట్రేలియా జట్టులో ఎంతోమంది నాణ్యమైన బౌలర్లున్నా ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాడు రిచర్డ్‌సన్‌. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతనెంత ప్రమాదకరమైన బౌలరో. గంటకు 140కి.మీ వేగంతో బంతులు విసరడంతో పాటు రెండువైపులా బంతిని స్వింగ్‌ చేయగలడు. ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీని ఒకే సిరీస్‌లో ఏకంగా నాలుగుసార్లు పెవిలియన్‌ పంపించాడు. ఈ గణాంకాలు చూస్తే ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా సరే ఒక్కనిమిషం ఆలోచించాల్సిందే. మిచెల్‌ స్టార్క్‌తో కూడిన వీళ్లిద్దరి జంట ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రిచర్డ్‌సన్‌ ఇప్పటి వరకూ ఆడిన 12 వన్డేల్లో 24 వికెట్లు తీశాడు.

వీళ్లతో పాటు భారత జట్టులో కుల్దీప్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌ కూడా ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్‌ గన్‌ కగిసొ రబాడా సైతం తన ఐపీఎల్‌ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌కు హెచ్చరికాలు జారీ చేశాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.