close

తాజా వార్తలు

ఎలా ధైర్యం చేస్తారో చూద్దాం..

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ


అందుల్(పశ్చిమ బెంగాల్‌): పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌స్థానాల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా ఒక్క స్థానంలో కూడా గెలవకుండా శూన్యంగా మిగిలిపోనుందని ఆమె అన్నారు. బుధవారం హౌడా జిల్లాలోని అందుల్‌లో టీఎంసీ అభ్యర్థి  ప్రశూన్‌ బెనర్జీకు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. ‘ కేంద్రంలో ఈసారి భాజపా కచ్చితంగా అధికారంలోకి రాదు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న రెండు స్థానాల్లో కూడా ఈసారి ఆ పార్టీ ఓటమిని చవిచూడనుంది. ఒక్క సీటు గెలవకుండా భాజపా రాష్ట్రంలో శూన్యంగా మిగిలిపోనుంది ’ అని ఆమె పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్‌లో చొరబాటుదారులను నియంత్రించేందుకు జాతీయ పౌర రిజిస్టర్‌ను అమలు చేస్తామని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. షా వ్యాఖ్యలపై మమతా స్పందిస్తూ ‘ ఈ మధ్యన ఒక వ్యక్తి రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో జాతీయ పౌర రిజిస్టర్‌ను అమలుచేస్తామని ప్రకటించారు. ముందు వారు (భాజపా) అధికారంలోకి రానీ.. తర్వాత దాన్ని అమలుచేసేందుకు వారు ఎలా ధైర్యం చేస్తారో చూద్దాం ’ అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే దేశంలో 300 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయని, రాజస్థాన్‌, యూపీ, బిహార్‌, పంజాబ్‌, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో భాజపా ఓటమిని చవిచూడనుందని ఆమె జోస్యం చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో భాజపా విఫలమైందని విమర్శించారు. దేశంలో భాజపా హయాంలో 1200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే భాజపా అయోధ్య రామమందిర అంశాన్ని ప్రస్తావిస్తుందని, ఈ ఐదేళ్లలో అక్కడ చిన్న నిర్మాణం కూడా జరగలేదని దుయ్యబట్టారు.  పశ్చిమ బెంగాల్‌ గురించి మోదీకి ఏమీ తెలియదని, కానీ ఇప్పుడొచ్చి ఓట్లు మాత్రం అడుతున్నారని ఆమె విమర్శించారు. మహరాష్ట్రలోని గడ్చిరోలిలో బుధవారం నక్సల్స్ సృష్టించిన ఘాతుకంపై స్పందిస్తూ.. ‘ పశ్చిమ బెంగాల్‌లోని జంగిల్‌మహల్‌లో కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడ మేము ప్రశాంతమైన పరిస్థితులు ఉండేలా చర్యలు చేపడుతున్నాం. ఝార్ఖండ్‌, మహరాష్ట్రల్లోని మావోయిస్టులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా భాజపా ప్రభుత్వాలు అలాంటి చర్యలు తీసుకోవాలి ’ అని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా, మరో మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.