close

తాజా వార్తలు

సూపర్‌ సైక్లోన్‌గా ఫొని‌: అంధకారంలో సిక్కోలు! 

అమరావతి: ‘ఫొని’ సూపర్‌ సైక్లోన్‌గా మారింది. గడిచిన కొద్ది గంటల నుంచి శ్రీకాకుళం జిల్లాలో క్రమంగా వర్షం, ఈదురుగాలుల ప్రభావం తీవ్రమైంది. దీంతో జిల్లాలోనే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల తీవ్రంగా వీస్తుండటంతో అనేక మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల్లో అంధకారం నెలకొనడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, వీరఘట్టం, కొత్తూరు, హిరమండలం, పొందూరు, బూర్జ, ఎల్‌.ఎన్‌.పేట, రాజాం, గార, సరుబుజ్జిలి, జలుమూరు, టెక్కలి, భామిని, సీతంపేట, ఆమదాలవలస తదితర మండలాల్లో భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. దానికనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. సహాయక, పునరావాస చర్యలు కొనసాగిస్తున్నారు. తుపాను ప్రభావిత మండలాల్లో సుమారు 126 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన ఆహారం అందుబాటులో ఉంచారు. గడిచిన 24గంటల్లో 20వేల మందికి సహాయక చర్యలు అందించినట్టు అధికారులు చెబుతున్నారు. 23 మండలాల్లో గాలులు, వర్షం ప్రభావం స్పష్టంగా ఉండనుంది. ఈ రాత్రి అంతటా తుపాను బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. 130కి.మీలకు పైగా వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉండంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

హైవేలపై వాహన రాకపోకలపై నియంత్రణ!

పెను తుపానుగా కొనసాగుతుందని భావించినప్పటికీ సూపర్‌ సైక్లోన్‌గా మారిన ఫొని శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం కల్గించే అవకాశం కనబడుతోంది. రేపు మధ్యాహ్నానికి పూరీ సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నా..  శ్రీకాకుళం తీర ప్రాంతానికి సమాంతరంగా కదులుతున్న ఈ భారీ తుపాను ఈదురు గాలులు, వర్షాల ప్రభావంతో పెను నష్టం కల్గించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తోన్న వర్షాలతో బహుదా నది, వంశధార నదులకు రేపట్నుంచి భారీగా వరదనీరు పోటెత్తే అవకాశం ఉంది. దానికనుగుణంగా బ్యారేజీలన్నింటి వద్ద గేట్లు ఎత్తివేశారు. ఈ రాత్రికి వరద ప్రభావం ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. తిత్లీ సమయంలో జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాలు, లారీలు కూలబడిపోయిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు రాత్రి 8గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు  జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.