close

తాజా వార్తలు

ఐపీఎల్‌ ’గ్రోత్‌ రేట్‌’ కొలిచే సాధనమేంటి?

యువతీ యువకులను ఆకర్షిస్తున్న క్రికెట్‌ వేడుక

ఒక కార్పొరేట్‌ సంస్థ అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుందో లేదో తెలిసేదెలా?అది విడుదల చేసే త్రైమాసిక ఫలితాలను అధ్యయనం చేయడం ఒక మార్గం. వార్షిక వృద్ధి రేటు ఏటా పెరుగుతుందో లేదో తెలుసుకోవడం మరోమార్గం. మరి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వృద్ధిరేటును అంచనా వేయడం ఎలా?ఏటా ఆటను వీక్షించేవారి సంఖ్య పెరుగుతుందో లేదో చూసి తెలుసుకోగలం. అంచనాల్లేకుండా 2008లో ఆరంభమైన ఐపీఎల్‌ నేడు భారత ఆర్థికవ్యవస్థకే ఊతంగా మారుతోంది. 12వ సీజన్‌ సైతం ప్లేఆఫ్ దశకు చేరుకుంది. గతంతో పోలిస్తే ఐపీఎల్‌ వీక్షకుల వృద్ధిరేటు ఎలా ఉందంటే!!

ప్రత్యేకతే బలం

తనకున్న లక్షణాల వల్ల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రపంచవ్యాప్తంగా విశేషంగా అభిమానాన్ని మూటగట్టుకుంది. రోజంతా ఆటకు కేటాయించాల్సిన పన్లేదు. ఎందుకంటే పోరు 3 గంటలే సాగుతుంది. ఇష్టమైన క్రికెట్‌ను చూసేందుకు చేయాల్సిన పనులను ఆపాల్సిన అవసరం లేదు. కార్యాలయాలు, విద్యాలయాల్లో పని పూర్తైన తర్వాత రాత్రి 8 గంటలకు హాయిగా కుటుంబంతో కలిసి ఆస్వాదించొచ్చు. టెస్టుల తరహాలో ఆటగాళ్లు బంతులు వృథా చేయరు. ప్రతి బంతిని బౌండరీగానో లేదంటే కళ్లు చెదిరే సిక్సర్‌గా మలవాలనో ప్రయత్నిస్తుంటారు. సరికొత్త షాట్లతో అభిమానులను అలరిస్తారు. ఇక బౌలర్లేమో వికెట్లు తీసేందుకు తహతహలాడుతుంటారు. ఫీల్డర్లూ తక్కువేం కాదు. గతానికి భిన్నంగా క్యాచ్‌లు ఒడిసిపడుతూ వారెవ్వా! అనిపిస్తున్నారు. ఇక ధోనీలాంటి వికెట్‌కీపర్లు మిల్లీ సెకన్లలో స్టంపిగులు చేస్తూ సలామ్‌! కొట్టిస్తున్నారు. అభిమాన క్రికెటర్లు ప్రత్యర్థులుగా మారినప్పుడు వారిని చూడడం భలే సరదాగా అనిపిస్తుంది. ఇవన్నీ ఐపీఎల్‌ను ఆకర్షణీయంగా మార్చాయి. అందుకే ఏటా వీక్షకుల సంఖ్య గణనీయంగా రెట్టింపు అవుతోంది. యువతను క్రేజీగా మారుస్తోంది.

నిలకడగా పెరుగుదల

అంతా కొత్తదనం కాబట్టి ఆరంభ ఏడాదిలోనే యువతను విశేషంగా ఆకర్షించింది ఐపీఎల్‌. 2008లో 34,22,000 మంది మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడమే ఇందుకు ఉదాహరణ. సగటున ఒక్కో మ్యాచ్‌కు 58,000 మంది వచ్చారు. అయితే ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2014లో 19,05,00 (సగటు 31,750)గా నమోదైంది. ఆపై రెండేళ్లకు ఈ సగటు 25,728కి పడిపోయింది. అంటే 2016లో 15,43,655 మందే ఐపీఎల్‌ను వీక్షించారు. 2017 గణాంకాల్లో వృద్ధి మొదలైంది. ఆ ఏడాది 15,92,543 ప్రత్యక్షంగా టోర్నీ చూశారు. మ్యాచ్‌ సగటూ 26,542కి పెరిగింది. 2018లోనూ వృద్ధి ఎగబాకింది. ఒక్కో మ్యాచ్‌ను సగటున 26,671 మంది వీక్షించడంతో మొత్తం సంఖ్య 16,00,263కు చేరుకుంది. ప్రస్తుతం టికెట్ల కొనుగోలు మరింత సులభమైంది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే 2019లో మరింత వృద్ధిరేటును ఫ్రాంచైజీల యజమానులు, బీసీసీఐ అధికారులు అంచనావేస్తున్నారు. 12వ సీజన్లో స్టాండ్స్‌ అన్నీ నిండుగా దర్శనిమిస్తున్నాయి. చెన్నై, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ మ్యాచ్‌లకు పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు పోటెత్తుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్‌లను వీక్షించడం నగరాల్లో ఫ్యాషన్‌గా మారింది.

గ్రామాల్లో ప్రసారాలు

మైదానాల్లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారితో పోలిస్తే టీవీల్లో చూస్తున్న వారి సంఖ్య కోట్లలో ఉంటోంది. ఏటా టీవీ వ్యూయర్‌షిప్‌ రెట్టింపు అవుతోంది. రికార్డులు సృష్టిస్తోంది. బార్క్‌ మూడేళ్ల గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2016, 17లో సోనీ నెట్‌వర్స్క్‌ ప్రసారదారు. 2018లో స్టార్‌ ఇండియా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, బెంగాలీ సహా ఇతర స్థానిక భాషల్లో మ్యాచ్‌లను ప్రసారం చేసింది. ఛానెళ్ల సంఖ్యను 14కు పెంచింది. స్థానిక భాషల్లో వ్యాఖ్యనం యువతకు తెగనచ్చేసింది. అందుకే 2016తో పోలిస్తే 2018లో టీవీ ఇంప్రెషన్స్‌ 41% పెరిగాయి. 2017తో అయితే వృద్ధిరేటు 16%. సగటున ఐపీఎల్‌ మ్యాచుల్ని వీక్షిస్తున్న సమయం 2016లో 28 నిమిషాలుంటే 2018లో 34కి పెరిగింది. బాలబాలికలు, యువతీ యువకులు, నడివయస్కుల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషకులు మాట.

పెరిగిన మహిళలు

ఐపీఎల్‌ను టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు, పురుషుల్లో చాన్నాళ్లు ఎలాంటి మార్పు లేదు. అలాంటిది 2018లో మహిళల్లో పెరుగుదల నమోదైంది. 2016, 2017లో స్త్రీ, పురుష నిష్పత్తి 41:59గా ఉండేది. 2018లో ఇది 42:58గా మారింది. ఈ ఏడాది అనూహ్య పెరుగుదల నమోదైనా ఆశ్చర్యం లేదు. ఇక వయసు ఆధారంగా పరిశీలిస్తే.. 15 ఏళ్ల లోపు 52%, 15-21 ఏళ్లలో 50%, 22-30 ఏళ్లలో 20% వృద్ధి చోటుచేసుకుంది. క్రీడల మొత్తం వ్యూయర్‌షిప్‌లోనూ ఐపీఎల్‌కే అగ్రప్రాధాన్యం ఇస్తున్నారు అభిమానులు. మొత్తం క్రీడల్లో 2016లో 22%, 2018లో 43% ఐపీఎల్‌నే చూశారు. స్థానిక భాషల్లోకి ఐపీఎల్‌ రావడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానళ్లు చూస్తున్నవారిలో మూడుశాతం ఐపీఎల్‌వైపు మళ్లింది. కుటుంబమంతా కలిసి మ్యాచ్‌లను చూడడం ఇందుకు కారణం.

చెన్నై, ముంబయి అంటే పిచ్చి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌. మూడుసార్లు ఈ రెండు జట్లు విజేతగా ఆవిర్భవించాయి. అందుకే యువతీ యువకులకు ముంబయి, చెన్నై అంటే పిచ్చి. ఈ కారణంగానే సొంతమైదానాల్లో ఈ జట్లు ఆడినప్పుడు వీక్షకుల సంఖ్యలో అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. చెన్నై చెపాక్‌లో ఆడుతున్నప్పుడు ఇతర జట్లతో పోలిస్తే  దేశవ్యాప్తంగా 21%, తమిళనాడు, పుదుచ్చెరిలో 106%, చెన్నైలో 119% అధికంగా మ్యాచులు చూస్తున్నారు. ముంబయి వాంఖడెలో ఆడితే దేశవ్యాప్తంగా 8%, మహారాష్ట్ర, గోవాలో 29%, ముంబయిలో 43% ఎక్కువ మంది మ్యాచుల్ని వీక్షిస్తున్నారు.

‘స్మార్ట్‌’ వీక్షణ

సమాచారయుగంలో స్మార్ట్‌ఫోన్‌దే హవా! యువతీ యువకులు మొబైల్‌ లేకుండా 10 నిమిషాలూ ఉండలేరు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్లో మ్యాచ్‌ వీక్షణలు ఊపందుకున్నాయి. 2018లో 700 మిలియన్ల మంది ఆన్‌లైన్‌లో ఐపీఎల్‌ చూశారు. 2016తో పోలిస్తే 40% వృద్ధి నమోదైంది. అంటే ఏకంగా 200 మిలియన్లు పెరిగారు. 2019లో ఈ వృద్ధిరేటు 60 శాతమైనా ఆశ్చర్యం లేదు. 12వ సీజన్‌ టీవీ వ్యూయర్‌షిప్‌లో రెండు వారాల్లోనే రికార్డులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే తొలి 17 మ్యాచుల వ్యూయర్‌షిప్‌లో 21% వృద్ధిరేటు నమోదైంది. ఛానళ్లు పెరగడం వల్ల రీచ్‌ 14% పెరిగింది. తొలి రెండు వారాల్లో ఐపీఎల్‌ 12ను 345 మిలియన్ల మంది వీక్షించారు. నిరుడు ఈ సంఖ్య 302.8 మిలియన్లే. ఇక సగటు ఇంప్రెషన్స్‌ 29.8 మిలియన్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది 24 ఛానళ్లలో మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.