close

తాజా వార్తలు

రాజకీయర్యాలీల్లో ప్రథమస్థానంలో మోదీ

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఐదు విడతల్లో  424 నియోజకవర్గాలకు పోలింగ్‌ పూర్తవగా.. మరో 118 స్థానాలకు ఆరు, ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదివరకు జరిగిన ఐదు విడతల్లో ప్రచారాలతో హోరెత్తించిన రాజకీయ పార్టీలు.. చివరి రెండు విడతల్లో మరింత దూకుడును పెంచాయి. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విశ్వాసంతో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండగా.. భాజపాను గద్దె దింపి ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉత్సుకతతో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ కూటమి పార్టీలు ఎన్నికల బరిలో దిగి జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ పార్టీలతో పాటు కేంద్రంలో ఏర్పడనున్న ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని మాయావతి, మమతాబెనర్జీ, చంద్రబాబునాయుడు, కేసీఆర్‌, అఖిలేశ్‌యాదవ్‌, డీకే స్టాలిన్‌ లాంటి నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారాల్లో పాల్గొంటూ పార్టీ కేడర్‌లో జోష్‌ నింపుతున్నారు. దీంతో పాటు దేశంలోని పలు కీలక నేతలు తమ సొంత రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు ఎవరెవరు ఎన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నారో ఓసారి చూద్దాం..

మరోసారి అధికారమే లక్ష్యంగా... 
2014లో అఖండ మెజారిటీతో గెలుపొందిన భాజపా.. కూటమి పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో మళ్లీ అదే ప్రభంజానాన్ని కొనసాగించి, కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజపా ఆశిస్తోంది. ఇందుకోసం ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏ నాయకుడూ పాల్గొననన్ని సభల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 11 నుంచి ఇప్పటి వరకు దేశంలోని 110 నియోజకవర్గాల్లో మోదీ ప్రచారం చేశారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మే 12, 19న జరగనున్న ఆరు, ఏడు విడతల్లో ఎన్నికల కోసం ఆయన ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా.. మరో ఆరు నియోజకవర్గాల్లో అదనంగా ప్రచారం చేయాలని చేయాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. 
మోదీతో పాటు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా దేశ వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. చివరి రెండు విడతల ఎన్నికల్లో భాజపా గెలుపుకోసం మరో 11 స్థానాల్లో ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. వీరితో పాటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డాలు తమ సొంత రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు.  
భాజపా గద్దె దింపడమే ధ్యేయంగా..
అధికార భాజపాను గద్దె దింపి ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియమితులయ్యాక ఇవే తొలి లోక్‌సభ ఎన్నికలు కావడంతో ఇద్దరు కాంగ్రెస్‌ అగ్రనాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా 103 చోట్ల ప్రచారం నిర్వహించి ప్రధాని మోదీకి దగ్గరగా నిలిచారు. దేశంలోని 103 చోట్ల ప్రచారంలో పాల్గొని ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.  చౌకీదార్‌ చోర్‌ హై నినాదాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకొని, మోదీపై విమర్శలు చేస్తూ ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయాన్ని కల్పించేందుకు ‘న్యాయ్’  లాంటి ఆకర్షణీయ పథకాలను ప్రజలకు అందిస్తామని తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరితో పాటు యూపీఏ ఛైర్మన్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తదితర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పలు రాష్ట్రాల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాహుల్‌గాంధీ ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లో ప్రచారంలో పాల్గొన్నారు.

వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెదేపాకు మద్దతుగా మాజీ ప్రధాని దేవెగౌడ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా లాంటి సీనియర్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు. 
* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అభ్యర్థులకు, తమిళనాడులో డీఎంకే పార్టీకు మద్దతుగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొన్నారు.  
* ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీలు కూటమిగా ఎన్నికల బరిలో నిలిచాయి. అంతేకాకుండా బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ కురువృద్దుడు ములాయంసింగ్ యాదవ్‌ ఒకే వేదికపై నుంచి ప్రచారం చేపట్టి కార్యకర్తలకు కనువిందు చేసిన సంగతి తెలిసిందే. 

* దేశంలోనే అత్యధికంగా  ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలుండటంతో ఆ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఎస్పీ-బీఎస్పీ- ఆర్‌ఎల్‌డీ పార్టీలు కూటమిగా ఈసారి యూపీ బరిలో నిలిచాయి.  మొత్తం ఏడు దశల్లోనూ అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే  ప్రధాని మోదీ యూపీలో 19 చోట్ల ప్రచారం చేయగా, రాహుల్‌ గాంధీ 18 చోట్ల  ప్రచారంలో పాల్గొన్నారు. యూపీ తరువాత పశ్చిమబెంగాల్‌లో 11 చోట్ల, ఒడిశాలో 8 చోట్ల మోదీ ప్రచారం చేపట్టారు. రాహుల్‌ మాత్రం యూపీ తరువాత రాజస్థాన్‌, కేరళ,  కర్ణాటక, మధ్యప్రదేశ్‌లపై దృష్టి సారించారు. అయితే మోదీ మొత్తం 110 చోట్ల ప్రచారం నిర్వహించగా, ఏ నియోజకవర్గంలోనూ ఆయన రెండుసార్లు ప్రచారంలో పాల్గొనలేదు. అయితే  రాహుల్‌ మాత్రం ఒకే  నియోజకవర్గంలో రెండు మూడు చోట్ల ప్రచారం నిర్వహించారు. అమేఠీ, వయనాడ్‌, బరబంకి, జైపూర్‌,  కోట, కురుక్షేత్ర,  రాయ్‌బరేలి, సుల్తాన్‌పూర్‌ లాంటి చోట్ల  ఒకటి కంటే ఎక్కువచోట్ల ఆయన ప్రచారం చేపట్టారు.   -ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.