close

తాజా వార్తలు

మహిళల ‘మినీ ఐపీఎల్‌’కు అదో సంకేతం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌ ముగిసింది. ముంబయి ఇండియన్స్‌ నాలుగో సారి విజేతగా ఆవిర్భవించింది. అంతిమ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌లూ విశేషంగా ప్రజాదరణ పొందాయి. తమ అభిమాన జట్టు గెలుపు ప్రత్యక్షంగా వీక్షించాలని జనాలు తండోపతండాలుగా మైదానాలకు తరలివచ్చారు. కొన్ని మ్యాచులైతే ఉత్కంఠతో ఊపేశాయి. హార్ట్‌బీట్‌ పెంచేశాయి. వీటన్నిటితో పాటు అందరినీ ఆకట్టుకున్న మరో అంశం ఒకటుంది. అదే ఐపీఎల్‌ మహిళల టీ20 ఛాలెంజ్‌. భారత మహిళల క్రికెట్‌లో ఓ ముందడుగు!! మినీ ఐపీఎల్‌కు ఓ సంకేతం!!

ఇలా మొదలైంది

భారత క్రికెట్‌పై 100 పేజీల పుస్తకం రాస్తే అందులో పురుషుల ఆట గురించే 99 పేజీలు ఉంటుందనడంలో సందేహం లేదు. క్రికెట్‌ అంటే కేవలం పురుషుల ఆటే అన్నంతగా జనాల బుర్రల్లో ముద్రపడిపోయింది. ఫుట్‌బాల్‌, హాకీ, బాక్సింగ్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, పరుగుపందెం, కుస్తీ, ఈత, అథ్లెటిక్స్‌... ఇలా ఎన్నో ఆటల్లో మహిళలకు సమ ప్రాధాన్యం లభించింది. మగాళ్లకే సాధ్యమనుకున్న ఎన్నో క్రీడల్లో అమ్మాయిలు రాణిస్తుంటే ఆసక్తిగా చూశారు. అదేంటో..! మహిళల క్రికెట్‌ అంటేనే మొదట్నుంచీ ఓ చిన్నచూపు. కనిపించని వివక్ష. ‘వీళ్లకెందుకీ ఆట. వేగంగా పరుగెత్తడం రాదు. బంతి విసిరేందుకు బలం చాలదు. దేహ దారుఢ్యం ఉండదు. ఫీల్డింగ్‌ చేయలేరు. ఇక బ్యాటింగ్‌ గురించి చెప్పాలంటే... అసలు సరిగ్గా బ్యాటు పట్టుకోగలరా?’ ఇలాంటివెన్నో చీత్కారపు మాటలు వినిపించాయి. భారత క్రీడారంగ చరిత్రలో మరే ఆటలోనూ మహిళలు ఇన్ని అవమానాలు ఎదుర్కొని ఉండరేమో! హాకీ, కబడ్డీ, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌లో ఇలా జరగలేదు. కేవలం మహిళల క్రికెట్‌పైనే ఈ విమర్శలన్నీ.

మొదటి అడుగు

కొన్ని వేల మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో మొదలైనట్టు భారత మహిళల క్రికెట్‌ ప్రస్థానమూ అలాగే సాగింది. మహిళల క్రికెట్‌కు ప్రత్యేక సంఘం ఉండేది. స్పాన్నర్లు లేక మ్యాచ్‌ల నిర్వహణా కష్టమయ్యేది. ఇక మ్యాచు ఫీజుల సంగతి సరేసరి. ఎప్పుడు మ్యాచులు జరిగేవో వాటి షెడ్యూలేంటో తెలిసేది కాదు. మీడియా కవరేజీపై ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బాగుంటుంది. క్రికెటర్లు గుర్తింపునకు నోచుకోలేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొనేవారు. అలా చీకట్లో బుడిబుడి అడుగులు వేస్తున్న మహిళల క్రికెట్‌కు హైదరాబాదీ మిథాలీరాజ్‌ ఓ వెలుగుదివ్వెగా మారింది. ప్రపంచ క్రికెట్లో లెక్కలేననన్ని రికార్డులు సాధించింది. మరెన్నో కొల్లగొట్టింది. భారత మహిళల క్రికెట్‌కు ముఖచిత్రంగా మారింది. మీడియాలోనూ మిథాలీపై కథనాలు రావడం మొదలయ్యాయి. క్రమంగా ఆమె పేరు అభిమానుల మదిలో గుర్తుండిపోయింది. ముళ్లబాటను పూలదారిగా మార్చిన ఆమె నీడలో జులన్‌ గోస్వామి, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మతి మంధాన క్రికెట్‌ ఐకాన్స్‌గా ఎదిగారు. వారికన్నా ముందు అంజుమ్‌ చోప్రా, డయానా ఎడుల్జీ లాంటి వారూ ఆట కోసం పోరాటం చేశారు. ఈ క్రమంలో బీసీసీఐలో మహిళల క్రికెట్‌ సంఘం విలీనంతో దశ తిరిగింది. డబ్బులకు కొదవలేదు. మంచి గుర్తింపూ రావడం మొదలైంది. మ్యాచులు పెరిగాయి. పక్కాగా షెడ్యూలు చేస్తున్నారు. దేశవాళీ మ్యాచుల సంఖ్యా పెరిగింది. విదేశీ పర్యటనలు పెరిగాయి. మ్యాచుల ప్రత్యక్ష ప్రసారం మొదలైంది. ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మిథాలీసేన ప్రయాణం అద్వితీయంగా సాగింది. ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో 9 పరుగుల తేడాతో ఓడినా భారత అభిమానులు వారిని గుండెల్లో పెట్టుకున్నారు.

సంధి దశ

‘మహిళల ఐపీఎల్‌కు సమయం వచ్చేసింది’ ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ ముగిసినప్పటి నుంచి అందరూ అంటున్న మాట. మిథాలీరాజ్‌, హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన వంటి వర్ధమాన క్రికెటర్లు ఐపీఎల్‌పై తమ గళం గట్టిగానే వినిపించారు. అంజుమ్‌ చోప్రా వంటి మాజీ క్రికెటర్లూ వారికి మద్దతుగా నిలిచారు. సరే చూద్దాం! ఓ ప్రయోగం చేద్దామని బీసీసీఐ, సీఓఏ అడుగు ముందుకేశాయి. అయితే అంతకుముందు పరిస్థితేంటో గమనిద్దాం. 2008లో ఐపీఎల్‌ ప్రేరణతోనే ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్‌ మొదలైంది. క్రమంగా అన్ని క్రికెటింగ్‌ దేశాలకూ టీ20 లీగులు పాకాయి. కానీ అందరికన్నా ముందు ఆస్ట్రేలియా మహిళల బిగ్‌బాష్‌ మొదలు పెట్టి సంచలనం సృష్టించింది. పురుషులతో సమానంగా టోర్నీని నిర్వహించింది. బిగ్‌బాష్‌లో హర్మన్‌, స్మృతి మంధానా మెరుపులు మరిచిపోలేం. వారితో ఒప్పందాలకు ఫ్రాంచైజీలు అమితాసక్తి ప్రదర్శించాయి. బిగ్‌బాష్‌లో మొత్తం 8 జట్లు ఉన్నాయి. 4 సీజన్లు పూర్తయ్యాయి. సిడ్నీ సిక్సర్స్‌ రెండు సార్లు, సిడ్నీ థండర్స్‌, బ్రిస్బేన్‌ హీట్స్‌ చెరో సారి ట్రోఫీ గెలిచాయి. ప్రత్యక్ష ప్రసారాలకూ మంచి ఆదరణ లభించింది. ఇదే స్ఫూర్తితో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఆరు జట్లతో 2018లో కియా సూపర్‌ లీగ్‌ ఆరంభించింది. ఇందులోనూ హర్మన్‌, స్మృతి చెలరేగి ఆడారు. మంచిపేరు తెచ్చుకున్నారు.

ఎగ్జిబిషన్‌తో ఆరంభం

మహిళల ఐపీఎల్‌కు ఆదరణ ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు బీసీసీఐ 2018లో తొలిసారి ఓ ప్రయోగం చేపట్టింది. సూపర్‌నోవాస్‌ (ఎస్‌ఎన్‌), ట్రయల్‌ బ్లేజర్స్‌ (టీబీ)తో వాంఖడే వేదికగా ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ నిర్వహించింది. సూపర్‌నోవాస్‌కు హర్మన్‌, ట్రయల్‌ బ్లేజర్స్‌కు స్మృతి సారథ్యం వహించారు. ప్రయోగం గురించి ఆలోచించే ముందు వారికో సందేహం వచ్చింది. ఇప్పుడున్న అమ్మాయిలు టీ20 మ్యాచ్‌కు సరిపోతారా అని! ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల నుంచి టీ20 స్పెషలిస్టులను పిలిపించారు. తొలుత ట్రయల్‌ బ్లేజర్స్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఛేదనలో సూపర్‌నోవాస్‌ నిలకడగా ఆడింది. ఆఖరి బంతికి ఫలితం తేలింది. ఉత్కంఠపోరులో హర్మన్‌సేన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించింది 200 మందే. టీవీలో ప్రత్యక్షప్రసారాన్ని కొన్నివేల మంది చూశారు.

వచ్చే ఏడాది మినీ ఐపీఎల్‌?

2019లో పరిస్థితి పూర్తిగా మారింది. మహిళా క్రికెటర్ల సంఖ్య పెరిగింది. కివీస్‌, ఇంగ్లాండ్‌, శ్రీలంక నుంచి స్పెషలిస్టులు వచ్చారు. అనూహ్యంగా మూడు జట్లు తయారవ్వడంతో బీసీసీఐ ‘ఐపీఎల్‌ మహిళల టీ20 ఛాలెంజ్‌’ పేరుతో నాలుగు మ్యాచుల టోర్నీ నిర్వహించింది. హర్మన్‌ (సూపర్‌నోవాస్‌), స్మృతి (ట్రయల్‌ బ్లేజర్స్‌), మిథాలీ (వెలాసిటీ) వాటికి సారథులు. తొలి టీ20లో సూపర్‌నోవాస్‌పై స్మృతి మంధానా 90 పరుగులతో విధ్వంసం సృష్టించింది జట్టును గెలిపించింది. రెండో మ్యాచ్‌లో మిథాలీసేన చేతిలో ఓడింది. మూడో మ్యాచులో సూపర్‌నోవాస్‌ యువ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ 77*తో చెలరేగి విజయం అందించింది. డేనియల్‌ వ్యాట్‌, చమరి ఆటపట్టు, నటాలీ షివర్‌, లీ తహూహూ సహా చాలా మంది రాణించారు. మూడు జట్లూ తలో మ్యాచ్‌ గెలవడంతో రన్‌రేట్‌ ఆధారంగా సూపర్‌నోవాస్‌, వెలాసిటీ ఫైనల్లో తలపడ్డాయి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన వెలాసిటీ 37 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అలాంటిది సుష్మవర్మ (40*), అమెలియా కెర్‌(36) పోరాడి ప్రత్యర్థికి 122 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. చేసింది తక్కువ స్కోరైనా మిథాలీ తన అనుభవం, వ్యూహాలతో హర్మన్‌సేనను ముప్పుతిప్పలు పెట్టింది. హర్మన్‌ (51; 37 బంతుల్లో 4×4, 3×6) అర్ధశతకంతో చెలరేగకుంటే ఓటమి ఖాయమయ్యేదే. ఆఖరి బంతికి కానీ ఫలితం తేలకపోవడంతో అభిమానులు ఉత్కంఠ తట్టుకోలేకపోయారు. ఫైనల్‌ మ్యాచ్‌ను చూసేందుకు దాదాపు 6000 మంది మైదానానికి వచ్చారు. జైపూర్‌ మైదానంలో కేవలం నాలుగు స్టాండ్సే అనుమతి ఇచ్చారు. మొత్తం ఇచ్చుంటే నిండిపోయేదని తెలుస్తోంది. ప్రత్యక్ష ప్రసారాలకు లక్షల్లో ఇంప్రెషన్స్‌ లభించాయి. మ్యాచ్‌లు సాగిన తీరు చూస్తుంటే 2020 మినీ ఐపీఎల్‌కు అవకాశం కనిపిస్తోంది.

ఈనాడు.నెట్‌ ప్రత్యేకం

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.