close

తాజా వార్తలు

50 రోజుల యుద్ధం.. మస్త్‌ మజా సొంతం 

బద్దలైన రికార్డులు, సిక్సర్లతో హోరెత్తిన స్టేడియాలు, పేకమేడలా కుప్పకూలిన వికెట్లు, ఆటగాళ్ల భావోద్వేగాలు, నరాలు తెగేంత ఉత్కంఠ, సూపర్‌ ఓవర్లు.. ఇలా అభిమానులకు ఐపీఎల్‌ 12వ సీజన్‌లో దొరికిన మజా అంత ఇంతా కాదు. 

50 రోజులు... ఎనిమిది జట్లు... ప్రతి మ్యాచులోనూ చావో రేవో అన్నట్లుగా తలపడ్డాయి.  బెంగళూరు మినహా మిగిలిన అన్ని జట్లు ప్లేఆఫ్స్‌ అవకాశం ఆఖరి వరకు దోబూచులాడింది. 

కానీ ఆ అవకాశం ముంబయి ఇండియన్స్‌,  చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌,  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు దక్కింది. ఆఖరికి తుది పోరులో చెన్నైపై ముంబయి విజయం సాధించి నాలుగోసారి కప్‌ను ముద్దాడింది.

 లీగ్‌ దశలో జరిగిన 56 మ్యాచుల్లో, ప్లేఆఫ్‌ పోరులో గుర్తుండిపోయే అంశాలు కొన్ని జరిగాయి...  అవేంటో ఒకసారి చూద్దామా!

1. అత్యల్ప స్కోరు ఇదే

తొలి మ్యాచ్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ), చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్ల మధ్య మ్యాచ్‌ అనగానే.. అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. బలమైన జట్లు కదా పరుగుల వరద గ్యారెంటీ అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. చెన్నై బౌలర్ల ధాటికి ‘ఈసాలా కప్‌ నమదే’ అంటూ బరిలోకి దిగిన ఆర్‌సీబీ 70 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. బెంగళూరు జట్టులో ఒక్క పార్థివ్‌ పటేల్‌ మినహా ఎవరూ రెండంకెల స్కోరుని నమోదు చేయలేకపోయారు.

2. ప్రమాద హెచ్చరిక జారీ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌. ఐపీఎల్‌లోనే అద్భుత బౌలింగ దళం ఉన్న సన్‌రైజర్స్‌.. 18 బంతుల్లో 53 పరుగులను కాపాడుకోవాలి. దీంతో హైదరాబాద్‌ విజయం ఖాయమని అనుకున్నారంతా. కానీ రసెల్‌ పిడుగులా ఒక్కసారిగా ఎస్‌ఆర్‌హెచ్‌పై పడ్డాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ 19 బంతుల్లోనే 49 పరుగులు సాధించి కోల్‌కతాకు తొలి విజయాన్ని అందించాడు. తాను ఎంత ప్రమాదకరమో ఈ మ్యాచ్‌తో ఇతర జట్లకు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశాడు రసెల్‌. అదే విధంగా క్రికెట్‌ నుంచి ఏడాది పాటు బహిష్కరణకు గురైన తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన డేవిడ్‌ వార్నర్‌(85) భారీ ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. 

3. పంత్‌ తొలి పంచ్‌

దిల్లీ డేర్‌డెవిల్స్‌ నుంచి దిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుని తొలిసారిగా బరిలోకి దిగిన డీసీ మొదటి మ్యాచ్‌లో ముంబయిను ఢీకొంది. దిల్లీ 14 ఓవర్లకు స్కోరు 114/3.  కానీ పంత్‌ విజృంభణకి 20 ఓవర్లు ముగిసేసరికి స్కోరు బోర్డు 213 మార్క్‌ని అందుకుంది. తొలి ఐదు బంతుల్లో ఒక్క పరుగు చేసిన పంత్‌.. చివరి 22 బంతుల్లో 77 పరుగులు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో తనపై దిగ్గజాలు ఎందుకు నమ్మకం ఉంచారో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ సీజన్‌లో 200 మైలురాయిని అందుకున్న తొలి జట్టు దిల్లీనే.

4. క్రికెట్‌ ప్రపంచాన్ని ఊపేసిన ‘మన్కడింగ్‌’

పంజాబ్‌, రాజస్థాన్‌ జట్ట మధ్య మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఐపీఎల్‌లో మన్కడింగ్‌ ద్వారా ఔటైన తొలి బ్యాట్స్‌మెన్‌గా బట్లర్‌.. ఔట్‌ చేసిన బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించారు. అయితే ఈ మ్యాచ్‌లో మరో విశేషం ఏంటంటే రాజస్థాన్‌ 16 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లను కోల్పోయి మ్యాచ్‌ని చేజేతులా జారవిడుచుకుంది.

5. ధోని... ధోని

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతాలు, రికార్డులు ఏమీ నమోదవ్వలేదు. అయినా స్టేడియంలోని అభిమానులకు ఆనందమే. దానికి కారణం మ్యాచ్‌ చివరి వరకు ధోని క్రీజ్‌లో ఉండటం. ధోని.. ధోని అనే నామస్మరణంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. మ్యాచ్‌ జరిగేది దిల్లీలోనైనా అభిమానుల మద్దతు ధోని సేనకి ఎక్కువగా ఉండటం విశేషం.

6. పంజాబ్‌కు రసెల్‌ సెగ 

ఎస్‌ఆర్‌హెచ్‌పై పంజా విసిరిన రసెల్‌ మరోసారి పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. కేవలం 17 బంతుల్లో 48 పరుగులు సాధించడంతో కోల్‌కతా 218 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో రసెల్‌ కేవలం బ్యాట్‌తోనే కాదు బంతితోనూ ఆకట్టుకున్నాడు. రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్‌ తొలి ఓటమికి, కోల్‌కతా రెండో విజయానికి కారణమయ్యాడు రసెల్‌. 

7. అంపైర్‌ చూసుకోలేదు

చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి నో బాల్‌ అయితే? ఫలితం కచ్చితంగా మారుతుందనడంలో సందేహమే లేదు. ముంబయి ఇండియన్స్‌, ఆర్‌సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదంతో ఆఖరి బంతిని నోబాల్‌గా ప్రకటించలేదు. ఆ దురదృష్టం బెంగళూరుకే దక్కింది. ఓటమితో బెంగళూరు బ్యాట్స్‌మెన్ డగౌట్‌ చేరిన తర్వాత స్ర్కీన్‌పై మలింగ వేసిన నోబాల్‌ ప్రత్యక్షమైంది. అయితే అప్పటికే ముంబయికి విజయం ఖరారు చేసేశారు.

8. సీజన్‌లో తొలి సెంచరీ

ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ సంజు శాంసన్‌ (102*) శతకాన్ని బాదేశాడు. ఈ సీజన్‌లో ఇదే తొలి సెంచరీ కాగా శాంసన్‌కు రెండోది. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్‌ మిగిలుండగానే సన్‌రైజర్స్ ఛేదించింది. హైదరాబాద్‌కు ఛేదనలో అత్యుత్తమం ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు పిజ్జా డెలివిరీ బాయ్‌ను చూసి దృష్టిని కేంద్రీకరించుకోలేకపోయాడు. దీంతో విజయ్‌ శంకర్‌ను బంతిని వేయొద్దని శాంసన్‌ కోరాడు.

9. ఎనిమిదేళ్ల తర్వాత..

సొంతమైదానంలో ఏ జట్టైనా బలమైన జట్టే. కానీ తమ ఇలాఖానైనా మొహాలిలో ముంబయి ఇండియన్స్‌ను ఓడించడానికి పంజాబ్‌కు ఎనిమిదేళ్లు పట్టింది. 2011లో చివరిసారిగా గెలిచిన పంజాబ్‌.. ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ సీజన్‌లో ముంబయిపై గెలవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది.

10. తొలి ‘సూపర్‌’ పోరు

ఈ సీజన్‌లో తొలి సూపర్‌ ఓవర్‌ దిల్లీ, కోల్‌కతా జట్ల మధ్య జరిగింది. రబాడ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో విజయం దిల్లీనే వరిచింది. కోల్‌కతా సూపర్‌ గండం ఈ పోరులో కూడా తప్పలేదు. ఇప్పటివరకు కోల్‌కతా మూడు సార్లు సూపర్‌ పోరులో తలపడగా మూడింటిలోనూ ఓటమిని మూటగట్టుకుంది.

11. డకౌట్‌ లేదు.. భారీ ఓటమి తప్పలేదు

ఐపీఎల్‌ పన్నెండో సీజన్‌లో భారీ ఓటమి ఎవరిదో తెలుసా..? రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. పాపం పేరుకే ఛాలెంజర్స్‌ కానీ.. ఆటలో మాత్రం తేలిపోయారు. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 234 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో 120 పరుగుల భారీ ఓటమి రికార్డును ఆర్‌సీబీ తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో (114), వార్నర్‌ (100) శతకాలు సాధించడం విశేషం. ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు.. అదీ ఓపెనర్లు సెంచరీలు బాదడం ఇదే తొలిసారి. స్వల్పస్కోరుకే ఆర్‌సీబీ ఆలౌటైనా ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా డకౌటవ్వకపోవడం గమనార్హం.

12. బ్యాట్‌ విరిగింది

ఆఖరి బంతి వరకు సాగిన మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌పై సీఎస్‌కే పైచేయి సాధించింది. బ్రావో వేసిన ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమవ్వగా రాజస్థాన్‌ కేవలం మూడు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు కోల్పోయింది. ఇదే ఓవర్లో బ్రావో బౌలింగ్‌ ధాటికి ఆర్చర్‌ బ్యాట్‌ విరిగింది. కొత్త బ్యాట్‌ను తెచ్చుకున్న ఆర్చర్‌.. జట్టుని విజయతీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు.

13. ఐదుగురు డకౌట్‌

పంజాబ్‌తో తలపడిన మ్యాచ్‌లో దిల్లీ చెత్త రికార్డులను నమోదు చేసుకుంది. ఒకే ఇన్నింగ్స్‌లో ఐదురుగు దిల్లీ బ్యాట్స్‌మెన్‌ పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరారు. కేవలం ఎనిమిది పరుగుల వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లను దిల్లీ కోల్పోయింది. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను హ్యాట్రిక్‌తో కట్టడి చేసిన సామ్‌ కరన్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ సాధించిన ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు సామ్‌‌ కరన్‌.

14. భారీ మూల్యం

ఒక క్యాచ్‌ ఎంత విలువైందో ఆర్‌సీబీకి తెలిసినంతగా ఏ జట్టుకూ తెలియదేమో.. క్యాచ్‌లను జార విడవడంలో అన్ని జట్ల కన్నా ఆర్‌సీబీ ఒక అడుగు ముందుంటుంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడిన మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాళ్లు నాలుగు క్యాచ్‌లను జారవిడిచి భారీ మూల్యం చెల్లించుకున్నారు. కీలక సమయాల్లో బంతిని అందుకోలేక వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది ఆర్‌సీబీ.

15. ముంబయి సెంచరీ

వరుస విజయాలతో ఊపు మీదున్న చెన్నైకు ముంబయి చెక్‌ పెట్టింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌ చరిత్రలో వంద విజయాలు సాధించిన ఏకైక జట్టుగా ముంబయి రికార్డు సృష్టించింది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఆసీస్‌ ఆటగాడు బెరెన్‌డార్ఫ్‌ (4-0-22-2) చక్కని స్పెల్‌తో చెన్నెను కట్టడి చేశాడు.

16. మీరు 5 అయితే.. మేము 10

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ బ్యాట్స్‌మెన్‌ ముగ్గురు ఐదు పరుగులు సాధించారు. దీనికి దీటుగా సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ కూడా ముగ్గురు పది పరుగులు సాధించడం గమనార్హం. ఇలా ఒకే సంఖ్యతో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు చేరడం చాలా అరుదు.

17. సిరాజ్‌.. నువ్వు బౌలింగ్‌ చేయొద్దు 

వరుస ఓటములతో ఉన్న ఆర్‌సీబీ.. తొలుత బ్యాటింగ్‌ చేసి కోల్‌కతాకు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి నాలుగు ఓవర్లలో కేకేఆర్‌కు 66 పరుగులు అవసరమవ్వగా రసెల్‌ సిక్సర్ల వర్షానికి.. కేకేఆర్‌ ఒక ఓవర్‌ మిగిలుండగానే విజయం సాధించింది.  రసెల్‌ 13 బంతుల్లోనే 48 పరుగులు చేసి మ్యాచ్‌ రూపురేఖలే మార్చేశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ బ్యాట్స్‌మెన్‌కు హాని కలిగించే విధంగా బంతులు విసురుతున్నాడని.. అంపైర్లు తన బౌలింగ్‌ను అడ్డుకున్నారు.

18. ఇది వన్డే కాదు..

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ పోరాడిన తీరు అభిమానుల ఆగ్రహానికి గురైంది. కేఎల్‌ రాహుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ కలిసి 93 బంతుల్లో 110 పరుగులు చేశారు. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. వీరిద్దరి నిదానమైన ఆటతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. చేతిలో వికెట్లున్నా.. కావాలిసిన రన్‌రేటు భారీగా పెరిగిపోవడంతో ఛేదించలేక చెన్నైకు తలవంచింది. వన్డే తీరులో ఆడినందుకు నెటిజన్ల నుంచి పంజాబ్‌ జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. 

19. అల్లాడించిన అల్జారి

సన్‌రైజర్స్‌కు 137 పరుగుల లక్ష్యాన్ని ముంబయి నిర్దేశించింది. హైదరాబాద్‌ ఓపెనర్లు భీకర ఫామ్‌లో ఉండటంతో గెలుపుపై అభిమానులకు చింతలేదు. కానీ అల్జారి జోసెఫ్‌ (3-0-12-6) ధాటికి హైదరాబాద్‌ 96 పరుగులకే చాప చుట్టేసింది. పదకొండేళ్లుగా ‘ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్ల తీసిన’ తన్వీర్‌ రికార్డును ఈ మ్యాచ్‌తో అల్జారి జోసెఫ్‌ బద్దలు కొట్టాడు. 

20. బెంగళూరు డబుల్‌ హ్యాట్రిక్‌

ఆర్‌సీబీ వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి దిల్లీ రికార్డును సమం చేసింది. 2013లో దిల్లీ వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి చెత్త రికార్డును నమోదు చేసుకుంది. అయితే.. దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలోనే ఆరో మ్యాచ్‌ను ఓడిన బెంగళూరు ఈ చెత్త రికార్డుని దిల్లీతో పంచుకోవడం విశేషం. గత సీజన్‌లో చివరి మ్యాచ్ కూడా ఓడిన ఆర్‌సీబీ ఈ ఓటమితో వరుసగా ఏడు ఓటములను మూటగట్టుకుంది.

21. ఇదే అత్యల్పం

చేతిలో వికెట్లున్నా పరుగులు చేయలేకపోవడం అంటే ఎలాగో రాజస్థాన్‌ రాయల్స్‌కు తెలుసు.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌ఆర్‌ మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో మూడు అంతకంటే తక్కువ వికెట్లు కోల్పోయి అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టుగా రాజస్థాన్‌ పేరు తెచ్చుకుంది. 2012లో దిల్లీపై పుణె రెండు వికెట్లు కోల్పోయి 146 పరుగులను మాత్రమే చేసింది.

22. నిదానంగా వార్నర్‌

వార్నర్‌ అంటే ఎంతటి బౌలర్లకైనా దడే. అలాంటిది పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ ఓ రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన శైలికి భిన్నంగా ఆడిన వార్నర్‌ 62 బంతుల్లో 70 పరుగులే చేశాడు. దీంతో ఐపీఎల్‌లో 60 బంతులు పైగా ఆడిన వారిలో తక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో వార్నర్‌ మూడో స్థానం సంపాదించాడు. తొలి రెండు స్థానాల్లో జేపీ డుమిని 59 (63), ఆరోన్‌ ఫించ్‌ 68 (62) ఉన్నారు.

23. వైడ్‌తో విజయం

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ నలుగురు డకౌటయ్యారు. అయినా రసెల్‌ (50) రాణించడంతో కేకేఆర్‌ 108 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై అనవసర పరుగుతో విజయం సాధించింది. నరైన్‌ వైడ్‌ వెయ్యడంతో 16 బంతులు మిగిలుండగానే చెన్నై గెలుపు బాట పట్టింది. ఈ సీజన్‌లో అనవసర పరుగుతో ముగించిన మ్యాచ్‌ ఇదే.

24. పొలార్డ్‌ విధ్వంసం

పొలార్డ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రాహుల్‌ శతకం చిన్నబోయింది. పంజాబ్‌ నిర్దేశించిన 198 పరుగుల భారీ టార్గెట్‌ను ముంబయి బ్యాట్స్‌మెన్‌ పొలార్డ్‌ ఆకాశమే హద్దుగా అన్నట్లుగా విజృంభించి లక్ష్యాన్ని ఛేదించాడు. 31 బంతుల్లోనే 83 పరుగులు బాదిన పొలార్డ్‌ ఇన్నింగ్స్‌ ఈ సీజన్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది.

25. ధోని ఆవేశం

ఎప్పుడూ శాంతంగా ఉండే ధోని తొలిసారి ఆవేశపడిన సంఘటన ఈ ఐపీఎల్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయానికి ఆఖరి మూడు బంతుల్లో 8 పరుగులు కావాలి. స్టోక్స్‌ వేసిన బంతిని అంపైర్లు నోబాల్‌గా ప్రకటించి నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నారు. దీంతో డగౌట్‌లో ఉన్న ధోని  మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. చివరికి చెన్నై విజయం సాధించినా ఈ సంఘటనను క్రికెట్‌ అభిమానులను ఎన్నటికీ మరువలేరు. 

26. అయ్యో ధావన్‌..

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్రామ్‌ అత్యుత్సాహానికి గబ్బర్‌ శతకం చేజారింది. ఆఖరి ఎనిమిది బంతుల్లో దిల్లీకి ఐదు పరుగులు అవసరమవ్వగా ఇంగ్రామ్‌ సిక్సర్‌ బాదడంతో ధావన్‌ (97*) సెంచరీ సాధించలేకపోయాడు. దీంతో ధావన్‌ టీ20లో తన తొలి సెంచరీని ఈ మ్యాచ్‌లో సాధించలేకపోయాడు.  

27. భయపెట్టిన ముంబయి

చివరి 24 బంతుల్లో ఆర్‌ఆర్‌కు 20 పరుగులు అవసరం. చేతిలో ఎనిమిది వికెట్లు. కానీ ఒక్కసారిగా ముంబయి బౌలర్లు చెలరేగడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓటమి అంచుల దాకా వెళ్లింది. ఆఖర్లో శ్రేయస్‌ గోపాల్‌ ఆదుకోవడంతో ఆర్‌ఆర్‌ ఊపిరి పీల్చుకుంది. 

28. తొలి విజయం

సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూసిన ఆర్‌సీబీ.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. పంజాబ్‌ నిర్దేశించిన 174 పరుగుల టార్గెట్‌ను బెంగళూరు రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓపెనర్‌ గేల్‌ 99* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇలా 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మెన్స్‌ రైనా, గేల్‌ మాత్రమే.

29. ఒక్క బౌండరీ రాలేదు

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 161 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ బాదని జట్టుగా కేకేఆర్‌ అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లోని ఆఖరి ఆరు ఓవర్లలో కేవలం 39 పరుగులే చేసి ఐదు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఛేజింగ్‌ చేసిన జట్లు విజయం సాధించడం వరుసగా పదోది కావడం విశేషం.

30. 15 పరుగులు.. ఎనిమిది వికెట్లు 

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఘోరపరాజయాన్ని చవిచూసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఓపెనర్లు వార్నర్‌ (51), బెయిర్‌స్టో (41) కాకుండా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ అంతా కలిసి చేసింది 24 పరుగులే. ఎస్‌ఆర్‌హెచ్‌ 15 పరుగుల వ్యవధిలోనే చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయి 116 పరుగులకే కుప్పకూలింది.

31. ఆర్‌సీబీపై 16 సార్లు..

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్‌సీబీపై అత్యధికంగా (16 సార్లు) గెలిచిన జట్టుగా ముంబయి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో బెంగళూరు.. తొలి ఎనిమిది మ్యాచుల్లో ఏడు మ్యాచ్‌లు ఓడిన నాలుగో జట్టుగా రికార్డుకెక్కింది. ఆర్‌సీబీ ముందు కేకేఆర్‌, పంజాబ్‌, దిల్లీ ఉన్నాయి. 

32. టర్నర్‌ 0.. అర్షదీప్‌ 2

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విజయం సాధించింది. ఎప్పటిలాగే ఆర్‌ఆర్‌ ఒత్తిడి గురై చిత్తయింది. కానీ ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఎంట్రీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పంజాబ్ తరఫున ఆడిన అర్షదీప్‌ సింగ్ తొలి మ్యాచ్‌లో బట్లర్‌, రహానె వికెట్ల తీసి తన సత్తా చాటాడు. రాజస్థాన్‌ తరఫున ఆడిన టర్నర్‌ మాత్రం గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

33. వార్నర్‌ 3000 @ఎస్‌ఆర్‌హెచ్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్నర్‌ తనదైన రీతిలో చెలరేగి 25 బంతుల్లోనే ఆర్ధశతకాన్ని బాదేశాడు. దీంతో వార్నర్‌  హైదరాబాద్‌ తరఫున 3వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

34. రోహిత్‌ 3000.. మిశ్రా 150

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్‌ శర్మ టీ20 కెరీర్లో 8వేల పరుగుల మైలు రాయిని దాటాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను అమిత్‌ మిశ్రా ఔట్‌ చేశాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో మిశ్రాకు ఇది 150వ వికెట్‌ కావడం విశేషం.

35. కుల్‌దీప్‌ వ్యథ..

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌, ఆర్‌సీబీ జట్లు తలపడిన పోరులో పరుగుల వరద పారింది. కోహ్లి (100), మొయిన్‌ అలీ (66) విజృంభించడంతో బెంగళూరు 213 పరుగులు చేసింది. ఈ సెంచరీ కోహ్లికి ఐదోది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. రాణా (85), రసెల్‌ (65) చెలరేగడంతో విజయపుటంచుల వరకు వెళ్లి ఓడింది. కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది ఏకంగా 27 పరుగులు రాబట్టుకుని చివరి బంతికి ఔటయ్యాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాననే బాధతో మైదానంలో కుల్‌దీప్‌ భావోద్వేగానికి గురైయ్యాడు.

36. రాజస్థాన్‌ రాజసం

బలమైన ముంబయి జట్టు.. గత రెండు సంవత్సరాల నుంచి రాజస్థాన్‌ ముందు తల వంచుతుంది. జయపుర వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2018 నుంచి ఇప్పటివరకు మంబయితో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ రాజస్థాన్‌దే పై చేయి.

37. రనౌట్‌ డ్రామా..

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీకి 12 బంతుల్లో పది పరుగులు అవసరమయ్యాయి. ఈ తరుణంలో షమి బౌలింగ్‌ వేయగా.. తొలి మూడు బంత్లులో కేవలం ఒక్క పరుగే ఇచ్చి ఇంగ్రామ్‌ను ఔట్‌ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్‌ పటేల్‌ షాట్‌ కొట్టి రెండో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా.. షమి ఢీకొనడంతో అక్షర్‌ రనౌటయ్యాడు. దీంతో మ్యాచ్‌ కొద్దిసేపు నాటకీయ పరిణామంగా సాగినా.. చివరికి దిల్లీనే గెలిచింది. 

38. బెయిర్‌స్టో టాప్‌

కోల్‌కతా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. 15 ఓవర్లలోనే తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 80* పరుగులు సాధించిన బెయిర్‌స్టో రికార్డు సృష్టించాడు. తొలి ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా శ్రేయస్‌ అయ్యర్‌ (439) పేరిట ఉన్న రికార్డుని బెయిర్‌స్టో (439).. ఈ మ్యాచ్‌తో బద్దలు కొట్టాడు.

39. ధోని @ 200 సిక్సర్లు

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఒక్క పరుగు తేడాతో ఓడింది. ధోని (84) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ను చూసి కోహ్లిసేన విజయంపై ఆశలు వదిలేసినా.. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఆఖరి బంతిని ధోని అంచనా వేయడంలో విఫలమవ్వడంతో ఆర్‌సీబీ ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు గణాంకాలు నమోదయ్యాయి. ఒకటి.. ధోని ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులే తన టీ20 కెరీర్లో అత్యధికం. రెండోది.. ఐపీఎల్‌లో 200 సిక్సర్లను బాదిన భారత ఆటగాడు ఒక్క ధోని మాత్రమే. 

40. రహానె శతకం వృథా..

రహానె (105) అద్భుత శతకం చేసినా విజయం దిల్లీనే వరించింది. దిల్లీ క్యాపిటల్స్‌ పోరాట పటిమ ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ స్కోరు చిన్నబోయింది. ఈ మ్యాచ్‌లో కూడా టర్నర్‌ డకౌటయ్యాడు. ఐపీఎల్‌లోని తొలి మూడు మ్యాచుల్లో డకౌటైయిన ఆటగాడిగా టర్నర్‌ రికార్డు సృష్టించాడు. టర్నర్‌ తన చివరి ఐదు టీ20 మ్యాచుల్లోనూ పరుగుల ఖాతా తెరవకపోవడం గమనార్హం. సెంచరీలు ఆర్‌ఆర్‌కు కలిసి రావట్లేదు. ఈ సీజన్‌లో సంజు శాంసన్‌ హైదరాబాద్‌పై శతకం బాదినా రాజస్థాన్‌ ఓడింది.

41. తొలి బెర్త్‌ చెన్నైదే

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన తొలి జట్టు చెన్నైగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో వాట్సన్‌ (96) అదరగొట్టడంతో హైదరాబాద్‌ నుంచి మ్యాచ్‌ దూరమయ్యింది. ఈ మ్యాచ్‌తో వాట్సన్‌ టీ20లో 8వేల పరుగులను సాధించడం విశేషం. ఈ సీజన్‌లో అదరగొట్టిన బెయిర్‌స్టో.. ఆఖరి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.

42. పాపం పంజాబ్‌

ఈ సీజన్‌లో బెంగళూరు చేతిలో రెండు సార్లు ఓడిన ఏకైక జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మాత్రమే. ఆఖరి మూడు ఓవర్లలో 64 పరుగులు సమర్పించుకున్న పంజాబ్.. భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌, కోహ్లి సెలబ్రేషన్స్‌ అభిమానులకు మరింత కిక్‌ను ఇచ్చింది. తొలుత విరాట్‌ ఔటైనప్పుడు అశ్విన్‌ రెచ్చిపోగా.. తర్వాత అశ్విన్‌ క్యాచ్‌ పట్టిన కోహ్లి తనదైన శైలిలో బదులిచ్చాడు. 

43. పరాగ్‌ హిట్‌ వికెట్‌ 

ఆర్‌సీబీ వరుస ఆరు ఓటములను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సమం చేసింది. సీజన్‌ ఆరంభంలో వరుస విజయాలతో హోరెత్తించి తర్వాత డీలా పడిన కోల్‌కతాకు.. రాజస్థాన్‌ రాయల్స్ ఆరో ఓటమి రుచిని చూపించింది‌. ఒక్క సీజన్‌లో ఇలా రెండు జట్లు (ఆర్‌సీబీ, కేకేఆర్‌) ఆరు మ్యాచులు వరుసగా ఓడిపోవడం ఇదే తొలిసారి. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్ హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరిన ఏకైక బ్యాట్స్‌మెన్‌ రియాన్‌ పరాగ్‌ మాత్రమే.

44. చెన్నైకు చెక్‌

ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను రెండు సార్లు ఓడించి ముంబయి ఇండియన్స్‌ తమ సత్తా చూపింది. ముంబయి సమష్టిగా రాణించి చెన్నైను 109 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఈ సీజన్‌లో లీగ్‌ దశలో చెన్నైను రెండు సార్లు ఓడించిన ఏకైక జట్టు రోహిత్‌ సేన మాత్రమే. చెపాక్‌, వాంఖడేలోనూ చెన్నైను మట్టి కరిపించింది.

45. ఒక్క బౌండరీ బాదని వార్నర్‌

అరవీర భయంకర ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోవడం విశేషం. 32 బంతుల్లో 37 పరుగులు సాధించిన వార్నర్‌ ఒక ఫోర్‌ కూడా కొట్టకపోవడంతో అభిమానులను నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో మనీశ్‌ పాండే (61) రాణించినా విజయం రాజస్థాన్‌ రాయల్స్‌కే దక్కింది. 

46. ఏడేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు..

2012 తర్వాత తొలిసారి దిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఆర్‌సీబీపై 16 పరుగుల తేడాతో గెలిచిన దిల్లీ.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచి ప్లేఆఫ్స్‌లో బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి టాస్ ఓడిన తర్వాత చేసిన సెలబ్రేషన్స్‌ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ మ్యాచ్‌తో.. ఈ సీజన్‌లో కోహ్లి తొమ్మిది మ్యాచుల్లో టాస్‌ ఓడటం గమనార్హం.

47. హార్డ్‌ హిట్టర్‌ హార్దిక్‌

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్, ముంబయి ఇండియన్స్‌ తలపడిన మ్యాచ్‌ను అభిమానులు ఎన్నటికీ మరవలేరు. తొలుత రసెల్‌ (80*; 40 బంతుల్లో 6×4, 8×6) విజృంభణ చూసిన అభిమానులు.. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్య (91; 31 బంతుల్లో 6×4, 9×6) ఊచకోత చూడటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతాకు ఇది వందో గెలుపు కావడం విశేషం.

48. వార్నర్‌ ఫెయిర్‌వెల్‌

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఎన్నో విజయాలు అందించిన వార్నర్‌ చివరి మ్యాచ్‌లోనూ జట్టుని గెలుపు తీరాలకు చేర్చాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగులు సాధించిన వార్నర్‌.. ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకుని మరీ ఈ సీజన్‌ నుంచి నిష్ర్కమించాడు. 

49. ఫలితం లేని హ్యాట్రిక్‌

ఐపీఎల్‌ పన్నెండో సీజన్‌లో ఫలితం తేలని ఒకే ఒక్క మ్యాచ్‌ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడ్డాయి. వర్షం పడటంతో మ్యాచుని ఐదు ఓవర్లకు కుదించారు. శ్రేయస్‌ గోపాల్‌ హ్యాట్రిక్‌ సాధించడం విశేషం. వరుణ దేవుడు కరుణించకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేశారు. 

50. ఆ రికార్డు వాట్సన్‌దే..

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌ ఈ సీజన్‌లో అరుదైన రికార్డు సాధించాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకముందే వాట్సన్‌ పెవిలియన్‌కు చేరాడు. ఈ సీజన్‌లో అత్యధిక బంతులు ఆడి డకౌటైన ఆటగాళ్లలో వాట్సనే టాప్‌. ఈ మ్యాచ్‌లో దిల్లీని 99 పరుగులకే కుప్పకూల్చి చెన్నై 80 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

51. రెండో సూపర్‌ ఓవర్‌

ఈ సీజన్‌లో రెండో సూపర్‌ ఓవర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగింది. ఈ సూపర్‌ పోరు ఏడు బంతుల్లోనే ముగియడం గమనార్హం. సూపర్‌ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి 7 పరుగులే చేయగా.. ముంబయి మూడు బంతుల్లోనే లక్ష్యాన్ని ముగించింది. ఈ మ్యాచ్‌లో మనీశ్‌ ఆఖరి బంతికి సిక్సర్‌ బాది స్కోరుని సమం చేసినా.. సూపర్‌ పోరులో జట్టుని విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

52. లోకల్‌ బాయ్‌దే విజయం

మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం సాధించింది. లోకల్‌ బాయ్‌ శుభ్‌మన్‌ గిల్‌ అదరగొట్టడంతో కోల్‌కతా సునాయాసంగా గెలిచింది. ఆడేది కోల్‌కతా తరఫునైనా తన సొంత మైదానంలో రాణించడం ఎంతో ఆనందంగా ఉందని యువ బ్యాట్స్‌మన్‌ గిల్‌ తెలిపాడు. మ్యాచ్ అనంతరం వారి తల్లిదండ్రులను ఇంటర్వూ చేశాడు గిల్‌. ఈ సీజన్‌లో తల్లిదండ్రులను ఇంటర్వూ చేసింది గిల్‌ ఒక్కడే. అంతకుముందు రసెల్‌ పుట్టినరోజు సందర్భంగా తన భార్య జేసిమ్‌ లోరా.. రసెల్‌ను ఇంటర్వ్యూ చేసింది.  

53. మిశ్రా హ్యాట్రిక్‌ మిస్‌..

గౌతమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో బౌల్ట్‌ విఫలమవ్వడంతో.. ఐపీఎల్‌లో అమిత్‌ మిశ్రా నాలుగో హ్యాట్రిక్‌ నమోదు మిస్‌ అయింది. దిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్‌ తలపడుతున్న మ్యాచ్‌లో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో రియాన్‌ పరాగ్‌.. ఐపీఎల్‌ కెరీర్‌లో అర్ధశతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడుగా రికార్డు సృష్టించాడు.

54. నాలుగో వికెట్‌ 144

ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన బెంగళూరు ఆఖరి మ్యాచ్‌లో రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 పరుగులకే కీలక వికెట్లను కోల్పోయింది. అయితే హెట్‌మెయిర్‌, గుర్‌కీరత్‌ సింగ్‌ అద్భుత పోరాటంతో బెంగళూరు విజయం సాధించింది. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. ఐపీఎల్‌ చరిత్రలో నాలుగో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం అవ్వడం విశేషం.

55. పవర్‌ప్లేలో రాహుల్‌

ఐపీఎల్ లీగ్‌ దశ ముగిసే ఆఖరి రోజు వార్నర్‌ పేరిట ఉన్న రికార్డును రాహుల్‌ చెరిపేశాడు. ఒక ఇన్నింగ్స్‌లోని పవర్‌ప్లేలో వ్యక్తిగతంగా చేసిన పరుగుల వీరుల్లో వార్నర్‌ (52) అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతూ పవర్‌ప్లేలోనే 55 పరుగులు బాదేశాడు. దీంతో వార్నర్‌ పేరిట ఉన్న రికార్డు రాహుల్‌ వశమైంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఘన విజయం సాధించినప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పలేదు.  

56. టాపర్‌ ఆఫ్‌ ది బ్యాచ్‌

ఈ సీజన్‌లో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతాను చిత్తుచిత్తుగా ఓడించి ముంబయి అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్‌ పోరాట పటిమ చూపించకుండానే లొంగిపోయింది. ముంబయి టేబుల్‌ టాపర్‌గా నిలవడం ఇది మూడోసారి. కోల్‌కతా, పంజాబ్‌ కంటే నెట్‌రన్‌రేటు ఎక్కువగా ఉండటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరే అదృష్టం వరించింది. ఐపీఎల్‌లో 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టు ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రమే.

57. క్వాలిఫయిర్‌-1.. ఫైనల్‌ నంబర్‌ ఫైవ్‌

క్వాలిఫయిర్‌-1లో ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడ్డాయి. ఈ సీజన్‌లో అన్ని జట్లపైనా తన పంజా విసిరిన డ్యాడీస్‌ ఆర్మీ.. ముంబయి ముందు మాత్రం చతికిలపడుతోంది. ఈ ఏడాది చెన్నైతో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ముంబయిదే పైచేయి సాధించడం విశేషం. క్వాలిఫయిర్‌లో గెలిచిన ముంబయి ఫైనల్‌కు వెళ్లడం ఇది ఐదోసారి. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ చాహర్‌ (4-0-14-2) బంతితో మాయ చేయగా.. సూర్యకుమార్ (71*) బ్యాటుతో అదరగొట్టి ముంబయికి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసిన చెన్నై.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు చెన్నె మాత్రమే. 29 వికెట్లు కోల్పోయి.. అన్ని జట్ల కన్నా ముందుంది. వాట్సన్‌ 11 సార్లు పవర్‌ప్లేలోనే ఔటయ్యాడు. 

58. ఎలిమినేటర్‌ మ్యాచ్‌: అబ్‌స్ట్రక్టింగ్‌ ఔట్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ‌దిల్లీ క్యాపిటల్స్‌ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అమిత్‌ మిశ్రా ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌’గా ఔటయ్యాడు. ఆఖరి మూడు బంతుల్లో దిల్లీ విజయానికి రెండు పరుగులు అవసరమవ్వగా.. మిశ్రా పరుగు కోసం ప్రయత్నించాడు. ఖలీల్‌ మహ్మద్‌ వేసిన ‘త్రో’ వికెట్లకు తగలనివ్వకుండా.. మిశ్రా తన దిశను మార్చి పరుగెత్తాడు. దీంతో సన్‌రైజర్స్‌ సమీక్షని కోరగా అంపైర్లు మిశ్రాను అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌ ఔట్‌గా ప్రకటించారు. ఐపీఎల్‌ చరిత్రలో అబ్‌స్ట్రక్టింగ్‌గా ఔటైన రెండో బ్యాట్స్‌మెన్‌ మిశ్రా. 2013లో యూసుఫ్‌ పఠాన్‌ అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌గా వెనుదిరిగాడు.

59. క్వాలిఫయిర్ -2: పదిలో ఎనిమిది ఫైనళ్లు‌

ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటివరకు ఫైనల్‌లో అడుగుపెట్టలేదు. క్వాలిఫయిర్‌-2లో చెన్నైను ఓడించి.. ఫైనల్లో ముంబయిని మట్టికరిపించి.. విజేతగా నిలుద్దామనుకున్న దిల్లీ ఆశ కలగానే మిగిలిపోయింది. అన్ని విభాగాల్లో నిరాశపరిచి చెన్నై చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. పది సీజన్‌లు ఆడిన చెన్నె ఫైనల్లో అడుగుపెట్టడం ఇది ఎనిమిదోసారి. ఈ మ్యాచ్‌లో రూథర్‌ఫొర్డ్‌ని ఔట్‌ చేసిన హర్భజన్‌కు ఇది 150వ వికెట్ కావడం విశేషం.

60. నాలుగో టైటిల్‌ విజేత ముంబయి

ఐపీఎల్‌లో నాలుగు టైటిళ్లు సాధించిన ఏకైక జట్టు ముంబయి మాత్రమే. నాలుగు టైటిళ్లు ఒకే కెప్టెన్‌ సాధించడం కూడా విశేషం. అన్ని జట్లకు ముచ్చెటమలు పట్టించిన చెన్నైను.. ఈ సీజన్లో నాలుగు సార్లు మట్టికరిపించి రోహిత్‌ సేన టైటిల్‌ను ఎగరవేసుకొని పోయింది. 50 రోజులు జరిగిన ఐపీఎల్‌ యుద్ధంలో ముంబయి విజేతగా నిలిచింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.