
తాజా వార్తలు
దిల్లీ: మనలో చాలా మందికి కొన్ని అభిరుచులు ఉంటాయి. పెయింటింగ్స్ వేయడం, డ్యాన్స్ చేయడం, కొత్త ప్రాంతాలకు వెళ్లడం.. అలాంటివే. కానీ కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేయడమే హాబీ అట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. అది కూడా మామూలు అభ్యర్థులపై కాదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులపై పోటీ చేయడం అంటే ఈయనకు మహా ఇష్టమట. ఇంతకీ ఆయన ఎవరంటే..
కర్ణాటకకు చెందిన శివానంద వైద్యవిద్యను అభ్యసించారు. అయితే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తి అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మెడికల్ ప్రాక్టీస్‌ను వదిలిపెట్టి ఓ వార్తాపత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న శివానంద ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించారు. గెలుస్తానా.. గెలవనా అన్నది ఏ మాత్రం పట్టించుకోకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులపై పోటీ చేస్తూ వచ్చారు. తాజా ఎన్నికల్లో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కూడా పోటీకి దిగారు. అయితే వారణాసిలో వేసిన ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.
‘ప్రజాస్వామ్య వ్యవస్థకు నా వంతు సహకారం అందించాలనుకున్నా. అది కేవలం ఓటు వేయడం ద్వారా మాత్రమే కాదు. ఎన్నికల్లో పోటీ చేయడం కూడా. అది నా ప్యాషన్. హాబీ. నేను ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఒకటే చెబుతాను.. ఓట్ల కోసం నేను ఇక్కడు రాలేదు. ప్రజాస్వామ్యం గురించి సందేశం ఇవ్వడానికే వచ్చాను అని. తాజా ఎన్నికల్లో వారణాసి, అమేఠీ రెండు స్థానాల్లో నామినేషన్ వేశాను. అయితే వారణాసిలో నా నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అదే విధంగా వేసిన అమేఠీ నామినేషన్‌ను మాత్రం ఆమోదించారు. దీనిపై నేను ఈసీకి ఫిర్యాదు చేశా’ అని శివనంద వెల్లడించారు.
గతంలోనూ ఈయన పలుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి తన అభిరుచిని వ్యక్తం చేశారు. రామకృష్ణ హెగ్డే, వీరప్ప మొయిలీ, బంగారప్ప లాంటి వాళ్లపై కూడా పోటీ చేసి ఓడిపోయారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో నళిన్ కుమార్ కతీల్పై పోటీ చేయగా.. శివానందకు 4800 ఓట్లు వచ్చాయి.