close

తాజా వార్తలు

ఐపీఎస్‌ పేరుతో ఘరానా మోసాలు 

ఎన్‌ఐఏ.. వాయుసేన అధికారిగా చలామణి 
‘నకిలీ పోలీస్‌’ జీవీకే రెడ్డి అరెస్ట్‌

హైదరాబాద్‌: ‘గురు వినోద్‌కుమార్‌రెడ్డి అలియాస్‌ జీవీకే రెడ్డి.. ఐపీఎస్‌.. జాతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్నా.. ఇదీ నా ఐడీ..’ అంటూ పోలీసులు, బంధువులు, సన్నిహితులు, రైల్వే, దేవాదాయ శాఖ అధికారులకు నకిలీ గురింపు కార్డు చూపుతూ మోసం చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందానంటూ జీవీకేరెడ్డి.. నాలుగేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు. కొన్నిసార్లు వాయుసేన అధికారిగా కూడా చెప్పుకున్నాడు. గతంలో మూడుసార్లు జైలుకు వెళ్లినా బయటకు వచ్చి మళ్లీ అదేతరహా మోసాలకు పాల్పడుతున్నాడు. అత్యవసర కోటాలో రైల్వే రిజర్వేషన్‌ పొందేవాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలకు వెళ్లి వీఐపీ హోదాలో దర్శనాలు చేసుకునేవాడు. తాజాగా మాజీ సైనికాధికారి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. జీవీకేరెడ్డి నుంచి ఒక డమ్మీ పిస్టల్‌, పోలీస్‌ అధికారి హోదా తెలిపే నకిలీ రబ్బరు స్టాంపులు, ఎన్‌ఐఏ డైరీ, ఐప్యాడ్‌, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌, హెచ్‌డీ ప్రొజెక్టర్‌, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.అంజనీకుమార్‌ గురువారం విలేకరులకు తెలిపారు. 
సైనికాధికారి ఇంట్లో చోరీ.. 
హైదరాబాద్‌లోని ఆర్‌.సి.రెడ్డి కోచింగ్‌ కేంద్రంలో సోషియాలజీ సబ్జెక్ట్‌ను బోధిస్తున్న మాజీ సైనికాధికారి మేజర్‌ జి.శ్రీనివాసరావుకు వినోద్‌కుమార్‌ నాలుగు నెలల క్రితం ఎన్‌ఐఏ అదనపు ఎస్పీగా పరిచయమయ్యాడు. వినోద్‌ను గుడ్డిగా నమ్మిన మేజర్‌ శ్రీనివాసరావు.. తన ఇంటికి తీసుకెళ్లేవాడు. కొన్ని రోజులుగా వినోద్‌కుమార్‌ రాలేదు. ఇంట్లో ఎయిర్‌గన్‌తోపాటు కొన్ని విలువైన వస్తువులు కనిపించలేదు. దీంతో ఆయన నేరుగా ఎన్‌ఐఏ హైదరాబాద్‌ కార్యాలయానికి వెళ్లి వినోద్‌ గురించి వాకబు చేశాడు. ఆ పేరుగల అధికారి ఎవరూ లేరని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన ఆయన వారంక్రితం గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యమండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ బృందం వినోద్‌ కదలికలపై నిఘా ఉంచి గురువారం పట్టుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించామని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వి.రాధాకిషన్‌రావు తెలిపారు. 
సివిల్స్‌లో ఉత్తీర్ణుడు కాకపోవడంతో.. 
కడప జిల్లా వడ్డెమాను గ్రామానికి చెందిన కర్నాటి గురు వినోద్‌కుమార్‌ హైదరాబాద్‌లో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదు. అందరూ ఉద్యోగం గురించి పదేపదే ప్రశ్నిస్తూ ఉండటంతో, ఎయిర్‌ఫోర్స్‌లో ప్లయింగ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చిందంటూ గుర్తింపు కార్డు తయారు చేసుకున్నాడు. సివిల్స్‌కి ప్రయత్నిస్తున్నట్లు అందరికీ అబద్ధం చెప్పాడు. జాతీయ పోలీస్‌ అకాడమీ జారీ చేసినట్లు నకిలీ గుర్తింపు కార్డును తల్లిదండ్రులకు చూపించాడు. స్నేహితులకు విందు ఇచ్చాడు. ఐపీఎస్‌ పోస్టింగ్‌ ఇస్తారంటూ హైదరాబాద్‌కు వచ్చాడు. 
అరెస్టయినా ఆగని నేరాలు 
రెండేళ్ల క్రితం గిద్దలూరు పోలీసులు ఇతడిని అరెస్ట్‌ చేశారు. 4 నెలల క్రితం ఎన్‌ఐఏ అదనపు ఎస్పీనంటూ సికింద్రాబాద్‌లోని డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలోకి ప్రవేశించే యత్నం చేయగా వారు నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుదలైన వినోద్‌.. కొద్దిరోజుల తర్వాత తనకు కొంత సమాచారం కావాలంటూ శామీర్‌పేట పోలీసులకు ఫోన్‌ చేశాడు. సదరు పోలీసులు వినోద్‌ అడిగిన సమాచారాన్ని స్వయంగా అతడి ఇంటికి వెళ్లి ఇచ్చారు. తర్వాత అతడు నకిలీగా గ్రహించి కేసు నమోదు చేశారు. తాజాగా సైనికాధికారి ఇంట్లో చోరీ చేసి పట్టుబడ్డాడు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.