close

తాజా వార్తలు

మెరుపు దాడులు కావవి.. విజయానికి దారులు

మోదీ కీర్తిని పెంచిన ‘మిషన్‌ శక్తి’

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’.. ఈ పేరు వింటేనే మనకు నరేంద్ర మోదీ గుర్తుకొస్తారు. ఈ మెరుపు దాడులు అటు దాయాది పాకిస్థాన్‌ను ఎంతగా వణికించాయో.. ఇటు భారత్‌లో విపక్షాలను కూడా అంతగానే భయపెట్టాయి. ఎందుకంటే మోదీ గ్రాఫ్‌ కాస్త తగ్గిన ప్రతిసారీ అవి ప్రజల్లో ఆదరణను పెంచుతూ వచ్చాయి.  ఎన్నికల్లో కమలదళం విజయానికీ కారణమయ్యాయి.

తొలి సారి దాడులు.. నాలుగు రాష్ట్రాల్లో భాజపా పాగ
ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారంగా మోదీ సర్కార్‌ తొలిసారిగా 2016 సెప్టెంబర్‌ 29న పాక్‌పై మెరుపుదాడులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రస్థావరాలపై భారత సేనలు విరుచుకుపడ్డాయి. దాదాపు 70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం పేర్కొంది. పాకిస్థాన్‌ లక్ష్యంగా అప్పట్లో మోదీ సర్కారు జరిపిన ఈ మెరుపు దాడులపై విస్తృత చర్చే జరిగింది. ఉగ్రమూకలకు సరైన సమాధానం ఒక్క మోదీయే ఇవ్వగలరని కమల శ్రేణులు ప్రచారం చేసుకున్నారు. ఈ దాడుల అనంతరం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. భాజపా నాలుగింటిలో విజయకేతనం ఎగరవేసింది. 2017 ఫిబ్రవరి, మార్చి నెలల్లో పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌ శాసనసభలకు ఎన్నికలు జరగ్గా.. పంజాబ్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో భాజపా విజయం సాధించింది. ఒక్క పంజాబ్‌ మాత్రం కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లిపోయింది. గోవాలో భాజపా తిరిగి అధికారం చేజిక్కించుకోగా.. ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లో కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇక దేశరాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్‌లో భాజపా సమాజ్‌వాదీ ప్రభుత్వాన్ని మట్టికరిపించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  అదే ఏడాది నవంబర్‌, డిసెంబర్‌లో జరిగిన హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో కూడా భాజపా జయకేతనం ఎగరవేసింది.

కలిసొచ్చిన వైమానిక దాడులు
పుల్వామా ఉగ్రదాడి ఘటనలో ముష్కరులు 40 మందికిపైగా సీఆర్పీఎఫ్‌ జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతిగా మోదీ సర్కార్‌ మరోసారి మెరుపుదాడులతోనే సమాధానమిచ్చింది. ఫిబ్రవరి 26న పాక్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ వైమానిక దాడులతో భారత వాయుసేన విరుచుకుపడింది. వేల కిలోల శక్తిమంతమైన బాంబులను ఉగ్రస్థావరాలపై వదిలి ధ్వంసం చేసింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ వైమానిక దాడులను కూడా మోదీ సర్కారు తనకు అనుకూలంగా మార్చుకుంది.

దేశ భద్రత మోదీ చేతుల్లో సురక్షితం..
వైమానిక దాడుల అంశాన్ని భాజపా నేతలు విస్తృతంగా వినియోగించుకున్నారు. దేశం మోదీ చేతుల్లో సురక్షితంగా ఉందని దేశవ్యాప్త ప్రచారానికి దిగారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ఒక అడుగు ముందుకేసి  భారత సైన్యాన్ని ‘మోదీ సేన’గా కీర్తించారు. ఎన్నికల ప్రచారంలో సైనికుల త్యాగాలను రాజకీయాంశాలుగా వాడుకుంటున్నారని భాజపాపై విపక్షాలు మండిపడ్డాయి. ఐదేళ్ల పాలనలో చెప్పుకోదగ్గ పనులేవీ చేయలేదని.. అందుకే ఈ దాడులను భాజపా వినియోగించుకుంటోందని ధ్వజమెత్తాయి. ఈ అంశంపై  ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో పలువురు నేతలపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది. నేతలెవరూ ప్రచారంలో సైనికుల ప్రస్తావన  తీసుకురావొద్దని సూచించింది. అయినా ఈ అంశం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చివరిదాకా నిలిచింది. సత్ఫలితాలు భాజపాకు లభించాయి.

తామూ చేశామని కాంగ్రెస్‌ చెప్పినా..
మన్మోహన్‌సింగ్‌ హయాంలో తాము పాక్‌పై పలుసార్లు మెరుపుదాడులు చేశామని కాంగ్రెస్‌ పేర్కొంది. అయితే తాము మాత్రం భాజపాలా ప్రచారం చేసుకోలేదని విమర్శలు గుప్పించింది. అయితే కాంగ్రెస్‌ చేపట్టిన ఆ దాడుల గురించి పెద్దగా సమాచారం లేకపోవడంతో అవి ప్రజల్లోకి వెళ్లలేకపోయాయి. ఇక బాలాకోట్‌పై జరిపిన వైమానిక దాడులకు మోదీ సర్కారు ఆధారాలు చూపించాలని.. చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య వెల్లడించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అయితే దీనికి భాజపా నేతలు కూడా దీటుగానే సమాధానమిచ్చారు. ఉగ్రవాదులపై దాడులకు ఒకరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని.. విపక్షాలు పాకిస్థాన్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు.

అభినందన్‌ను సురక్షితంగా రప్పించడం..
వాయుసేన దాడుల అనంతరం పాక్‌ కూడా భారత్‌పై ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వైమానిక ఘర్షణ జరిగింది. భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి  పాక్‌ విమానాలను తిప్పికొడుతూ పొరపాటున ఆ దేశ భూభాగంలోకి వెళ్లి అక్కడి సైన్యానికి చిక్కాడు. దాయాది సైన్యం బందీలో ఉన్నప్పటికీ ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. పాక్‌ సైనికాధికారులకు మాటకు మాట సమాధానమిచ్చి.. అందరినీ ఔరా అనిపించాడు. చివరికి.. భారత్‌తోపాటు ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గిన పాక్‌.. అభినందన్‌ను మూడు రోజుల్లోనే విడిచిపెట్టింది. అభినందన్‌ను స్వదేశానికి సురక్షితంగా రప్పించడంలో మోదీ దౌత్యనీతి పనిచేసిందని భాజపా ప్రచారం చేసుకుంది. ఈ అంశం కూడా భాజపాకు సానుకూలాంశంగా మారింది.

‘మిషన్‌ శక్తి..’
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ‘మిషన్‌ శక్తి’ గురించి ప్రకటన చేశారు. అంతరిక్షంలో భారత్‌ గొప్ప విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని సగర్వంగా ప్రకటించారు. ఈ ప్రయోగంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత.. నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని ఏశాట్‌ విజయవంతంగా కూల్చి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. అంతరిక్ష యుద్ధానికి ఈ ప్రయోగం వేదిక కాదనీ.. కేవలం అంతరిక్షంలో తమ వనరుల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే దీన్ని చేపట్టినట్లు వివరించింది. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా దేశ ప్రధాని ఎలా ఈ ప్రకటన చేస్తారంటూ విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈసీ మోదీ ప్రకటనను పరిశీలించి.. ఇది ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. అంతరిక్షంలో భారత్‌ సత్తాను చాటిన ఈ ప్రయోగం.. మోదీ కీర్తిని మరింత పెంచింది. ఓట్ల వర్షం కురిపించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.