close

తాజా వార్తలు

కన్నడ నాట కమల వికాసం..

రాష్ట్రంలో 25 స్థానాలు కైవసం చేసుకున్న భాజపా

 

దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్నప్పటికీ..కన్నడ నాట పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గత రెండు దశాబ్దాలుగా భాజపా అక్కడ క్రమంగా నిలదొక్కుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళలో అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ కన్నడ నాట మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. ఇందుకు సరిగ్గా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం. అక్కడ 224 అసెంబ్లీ స్థానాలకు గానూ 2018లో జరిగిన ఎన్నికల్లో భాజపా 104 స్థానాలకు కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు 80, స్థానిక జేడీ(ఎస్‌)కు 37 స్థానాలు వచ్చాయి. మూడంకెల స్కోరును దాటినప్పటికీ భాజపా మెజార్టీని నిరూపించుకోవడంలో విఫలమయింది. దీంతో అక్కడ కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

క్షణం క్షణం..భయం భయం
కూటమి ప్రభుత్వమయితే ఏర్పడింది కానీ ఇటు కాంగ్రెస్‌ సభ్యుల్లో కానీ అటు జేడీఎస్‌ నేతల్లో గానీ కొన్ని రోజుల పాటు సఖ్యత కుదరకపోవడంతో కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయి. దీనికి తోడు మంత్రి వర్గ ఏర్పాటు సమయంలోనూ ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాలన్నీ జరుగుతుండగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి బహిరంగంగా మీడియా ముందు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనానికి దారి తీసింది. ‘కంఠంలో గరళం దాచుకున్న శివుడిలా నా పరిస్థితి తయారయ్యింది’అంటూ ఆయన కొన్ని నెలల క్రితం బోరున విలపించారు. ఎన్నికలు ప్రారంభమయిన కొద్ది రోజులకే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వీడి భాజపాలో చేరుతారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇవన్నీ భాజపాకు అనుకూలంగా మారాయి. 

భాజపా ఏం చేసిందంటే..
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్న భాజపాకు..కన్నడ నాట పరిస్థితులు మరింత అనుకూలంగా మారాయి. రాష్ట్రంలో ఉన్న 28 లోక్‌ సభ స్థానాల్లో కనీసం 22 స్థానాలు గెలిస్తే..ఆ మరుసటి రోజే కూటమి ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ఆ రాష్ట్ర భాజపా సభాపక్షనేత యడ్యూరప్ప హెచ్చరించారు. వీలు చిక్కినప్పుడల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌-జేడీఎస్‌ల ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టే ప్రయత్నంచేశారు. దీనికి తోడు మాజీ మంత్రి, కాంగ్రెస్‌నేత అంబరీశ్‌ ప్రాతినిధ్యం వహించిన మండ్య రూపంలో భాజపాకు మరో చక్కని అవకాశం లభించింది. అంబరీశ్‌ తర్వాత ఆ స్థానం ఆయన భార్య సుమలతకు ఇస్తారనుకున్నారంతా. కానీ సీట్ల పంపకంలో భాగంగా మండ్య జేడీఎస్‌కు వెళ్లింది. కుమార స్వామి కుమారుడు నిఖిల్‌ అక్కడ నుంచి పోటీ చేశారు. దీంతో మనస్తాపం చెందిన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. భాజపా ఆమెకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వనప్పటికీ పరోక్షంగా ఎంతో సాయపడింది. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీని స్వాగతించింది. దీంతో మండ్యలో కొన్ని చోట్ల కాంగ్రెస్‌ పార్టీ నేతలు రెండు
వర్గాలుగా చీలిపోయాయి. నిఖిల్‌పై సుమలత గెలవడంతో భాజపాకు మద్దతిచ్చే అవకాశం ఉంది.

కూటమి బలహీనతే భాజపా బలం...
కన్నడ నాట కూటమి ప్రభుత్వాన్ని అక్కడి యువత స్వాగతించలేదనే చెప్పాలి.. ఇండియా సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో స్వతహాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభిమానించే వాళ్లు ఎక్కువ. దీన్ని బలంగా మార్చుకున్న భాజపా యువతనే లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు బాగా దగ్గరయ్యింది. దీంతోపాటు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడి ప్రజలను తమ వైపు తిప్పుకొనేలా ప్రణాళికలు రూపొందించింది. ఎన్నికల ప్రచారంలోనూ వీటినే ప్రధానాస్త్రాలుగా సంధించింది. దీంతో యడ్యూరప్ప చెప్పినట్లుగా 25కి పైగా స్థానాలు సాధించి దక్షిణాదినా పట్టు నిలుపుకొంది.

నెక్ట్స్ ఏంటి?...
కర్ణాటకలో భాజపా 25 స్థానాలు సంపాదించింది. ఈ ఫలితాలు అక్కడి కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.దీనికి తోడు ‘ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకే కుమారా స్వామి సీఎం..మహా అయితే శుక్రవారం ఉదయం వరకు సీఎంగా ఉంటారేమో..తర్వాత కాదు’ అని కేంద్రమంత్రి సదానంద గౌడ వ్యాఖ్యానించడం ఈ వార్తలకు మరింత తావిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భాజపా చూస్తోంది.  

-ఇంటర్నెట్‌ డెస్క్‌
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.