close

తాజా వార్తలు

మోదీ గెలుపు.. ఓ కొత్త చరిత్ర

యావత్‌ భారతావని ‘మన్‌ కీ బాత్‌’ (మనసులోని మాట) ఇది! ‘తక్కువేమి మనకు మోదీ ఒక్కడుండు వరకు’ అని డజనుకు పైగా రాష్ట్రాలు ఆలపించిన నమోస్తుతి- దాదాపు 300 రేకులై విచ్చుకొన్న కమల వికాసంలో ప్రతిఫలిస్తోంది. ‘అబ్‌ కీ బార్‌ 300కే పార్‌’ అంటూ మోదీ అమిత్‌ షాలు సాగించిన ప్రచార దండయాత్రతో యావత్‌ విపక్షం కకావికలమైపోయిన వాస్తవం తాజా ఫలితాల్లో ప్రతిధ్వనిస్తోంది. ‘ఆప్‌ బటన్‌ దబాయియే ఔర్‌ సీదా ఓట్‌ మోదీకో ప్రధానమంత్రి బనాయేగా (మోదీని ప్రధానమంత్రిని చెయ్యడానికే ఈవీఎమ్‌ మీట నొక్కండి) అంటూ కమలం పార్టీ స్కంధావారాలు సాగించిన ప్రచారం సాక్షిగా- మోదీ ప్రధానమంత్రిత్వంపై రెఫరెండంలా జరిగిన ఎన్నికలివి. మోదీని గద్దె దింపడమే ఎన్‌డీయేతర పక్షాల ఏకైక ఉమ్మడి అజెండా అయినా, సీట్ల పంపకాల్లో వాటాలు తెగక, ప్రధాని అభ్యర్థిపై సమశ్రుతి కలవక వేటికవిగా పోటీపడటంతో- ఓటర్లకు సూటిగా అర్థమైన కీలకాంశం, మోదీకి ప్రత్యామ్నాయం లేదన్నది!

క్రితంసారి యూపీఏ భ్రష్టపాలనకు చరమగీతం పాడే సందర్భంలో అభివృద్ధి అజెండాతో దూసుకొచ్చిన మోదీని సమాదరించిన జనభారతం ఈసారి అంతకుమించిన ఔదార్యం కనబరచడంలో- మోదీ సామర్థ్యం, భాజపా పటిష్ఠ మంత్రాంగంతోపాటు విపక్షాల దివాలాకోరుతనమూ ప్రధాన పాత్ర పోషించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 31.3 శాతం ఓట్లతో 282 సీట్లు సాధించిన కమలం పార్టీ నేడు 40 శాతం దాటిన ఓట్లతో 303 స్థానాలు గుప్పిట పట్టిన తీరు- ఆత్యయిక స్థితి అనంతర కాలంలో 1977నాటి జనతాపార్టీ అద్భుత విజయాన్ని స్ఫురణకు తెస్తోంది. పుల్వామా, బాలాకోట్‌ దాడుల నేపథ్యంలో సమర్థ నాయకత్వం ఆవశ్యకతపై జాతి అంతఃచేతనను తట్టిలేపిన కమలం పార్టీ ప్రచారం పూర్తిస్థాయిలో ఫలించబట్టే- హిందీ రాష్ట్రాలతోపాటు గుజరాత్‌, పశ్చిమ్‌ బంగ, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకలనూ మోదీ మేనియా ఊపేసింది. ఎగ్జిట్‌పోల్స్‌ పేరిట సందడి చేసిన సర్వేక్షకుల్లో సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌, ఇండియాటుడే వంటివి ఎన్‌డీఏ (350 దాకా) సాధించిన ఫలితాల్ని కాస్త దగ్గరగా ఊహించగా తక్కినవన్నీ అలవాటుగా లెక్కతప్పాయి. అమేఠీలో రాహుల్‌ గాంధీతో మొదలుపెడితే, ఎన్నికల సమరంలో మట్టికరిచిన ప్రముఖుల చిట్టా ముందు కొండవీటి చాంతాడే కురచ అయిపోయేలా ఉంది!

‘ప్రజలు నన్ను విశ్వసించారు... నేను వారిని విశ్వసించాను... ఆ పరస్పర విశ్వాసమే దేశ ప్రగతికి చోదకశక్తి’- దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో నరేంద్ర మోదీ ఉద్ఘాటన అది. దేశ విశాలహితం కోరి అంతఃకరణశుద్ధితో కఠిన నిర్ణయాలు తీసుకొన్నా ప్రజలు అర్థం చేసుకొని సహకరిస్తారని పెద్దనోట్ల రద్దు సందర్భంగా రుజువైంది. బడుగు రైతు కడగండ్ల సేద్యాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైనా మోదీ సర్కారు దీర్ఘకాలం పట్టించుకోని పర్యవసానంగానే కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్లలో కమలం పార్టీ సర్కార్లకు కాలం చెల్లింది. నిరుపేదల సముద్ధరణకు ‘న్యాయ్‌’ పేరిట పేదింటికి ఏటా రూ.72వేలు అందిస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్‌- దాంతోనే తన హస్తవాసి గణనీయంగా మెరుగుపడి మళ్ళీ చక్రం తిప్పగలనని తలపోసింది. తాను అధికారంలో ఉన్న అయిదు కీలక రాష్ట్రాల్లో గల మొత్తం లోక్‌సభ సీట్లు 106 కాగా, కాంగ్రెసుకు దక్కింది పట్టుమని పదమూడు!

మతా దీదీకి పెట్టని కోట లాంటి పశ్చిమ్‌ బంగలోనే 17 స్థానాలు కొల్లగొట్టిన భాజపా, ఒడిశాలోనూ ఏడు సీట్లు సాధించడం మామూలు విషయం కాదు. అయిదేళ్ల క్రితం దాకా సంకీర్ణ రాజకీయాలపై తమదైన ముద్రవేసిన వామపక్షాలు అయిదారు సీట్లకే పరిమితమై కుములుతున్నాయిప్పుడు! గత ఎన్నికల్లో 80 లోక్‌సభా స్థానాలుగల యూపీలో అప్నాదళ్‌తో కలిసి భాజపా 73 సీట్లు సాధించడం అబ్బురం. అదే నేడు ఎస్పీ బీఎస్పీలు చేతులు కలిపి, కులసమీకరణల్ని మధించి తిరుగులేని కూటమి ఖడ్గంతో మోదీ మాయను ఛేదించడానికి శతథా ప్రయత్నించినా- భాజపా తానుగా 60 స్థానాలు ఒడిసిపట్టడం అద్భుతం! సీట్ల సంఖ్యాపరంగా రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర గతంలో మాదిరే భాజపా-శివసేన కూటమి కొమ్ముకాయడంతో కమలం పార్టీ విజయం సంపూర్ణమైంది. లోగడ ఎన్నడూ గెలవని 120 స్థానాలపై దృష్టిపెట్టి, మూడువేల మంది పూర్తికాల కార్యకర్తల్ని ఆయా కేంద్రాలకు తరలించి, పార్టీ విస్తరణను యుద్ధప్రాతిపదికన చేపట్టడంతోపాటు- కేంద్రప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 24 కోట్లమందితో నేరుగా సంభాషించేందుకు 161 కాల్‌సెంటర్లతో అమిత్‌ సాగించిన సార్వత్రిక సమర వ్యూహరచన అద్భుత ఫలితాల్ని రాబట్టింది. ఎన్నికలప్పుడుతప్ప పార్టీ యంత్రాంగంపై దృష్టిపెట్టని నేతాగణాలకు విలువైన గుణపాఠాలివి!

రువారాలపాటు నరాలు తెగే ఉత్కంఠ పెంచిన ఆంధ్రప్రదేశ్‌లో- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పతనాన్ని అనుశాసించిన ప్రజాతీర్పు ఇది. కాలచక్రం పదిహేనేళ్లు గిర్రున వెనక్కి వెళ్లినట్లుగా పరిస్థితి వికటించడంపై తెదేపా శ్రేణులు బిత్తరపోతుంటే- విజయానంద డోలికల్లో వైకాపా ఊరేగుతోంది. క్రితంసారి 44.8 శాతం ఓట్లతో 106 సీట్లు గెలుచుకొన్న తెలుగుదేశం, ఈసారి మూడింట రెండొంతుల మెజారిటీని మించి సాధిస్తామని వెయ్యిశాతం ధీమా వ్యక్తీకరించినా- ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ముష్టిఘాతాలకు సైకిల్‌ పార్టీ తల వేలాడేయాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో రెండు శాతం ఓట్లు తరుగుపడి 67 సీట్ల దగ్గర ఆగిపోయిన వైకాపా, నేడు ఏకంగా 50శాతం ఓట్లు, 150 సీట్లతో జేగీయమానమైంది. ముగ్గురు తప్ప మంత్రులంతా మట్టికరవడం, ఎంతో కొంత ప్రభావం చూపగలదనుకొన్న జనసేన అధ్యక్షుడే పోటీచేసిన రెండుచోట్లా ఓటమిపాలు కావడం- ప్రజాతీర్పు ఎంత ఏకపక్షమో ధ్రువీకరిస్తోంది. రాయలసీమలో మొత్తం 52 సీట్లకు 49, కోస్తాంధ్రలో 89కి గాను 73, ఉత్తరాంధ్రలో 34 స్థానాల్లో 28 గెలుచుకొన్న వైకాపా- ఇరవైకి పైగా పార్లమెంటు సీట్లనూ ఒడిసిపట్టడం చరిత్రాత్మక విజయం.

 

పాదయాత్ర సెంటిమెంటు ఫలించిందనడంకన్నా- 3,600 కిలోమీటర్ల పైచిలుకు ప్రస్థానంలో జగన్‌ జనంతో మమేకమై... ‘నేను విన్నాను- నేను ఉన్నాను’ అంటూ ఇచ్చిన భరోసా సృష్టించిన ఓట్ల వృష్టి ఇది! ఏనాడో 1972లో 52.2 శాతం ఓట్లతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ సాధించిన అపూర్వ విజయాన్ని గుర్తుచేసే విధంగా వైకాపా ప్రభంజనం సాగిపోయింది. పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్ల వంటి పథకాలే తెదేపా నావను విజయతీరాలకు చేర్చగలవన్న సైకిల్‌ పార్టీ అతి విశ్వాసానికి గాలి తీసేసి, ‘నవరత్నా’లతో బడుగు బతుకుల బాగుకు భరోసా ఇచ్చిన జగన్‌పై జనవాహిని అమిత విశ్వాసాన్ని కనబరచింది! తానే చెప్పినట్లు- ‘మంచి ముఖ్యమంత్రి’గా రుజువు చేసుకోవాల్సిన గురుతర బాధ్యత జగన్‌పైనే ఉంది! తెలంగాణలో పదహారు స్థానాలు సాధించి జాతీయ స్థాయిలో చక్రం తిప్పదలచిన కేసీఆర్‌ అంచనాలు తప్పేలా- తెరాస కారు దూకుడుకు కాంగ్రెస్‌, భాజపాలు బ్రేకులేయడం, ఎందరినో నివ్వెరపరచిన పరిణామం. తమిళనాట డీఎమ్‌కే పునరుత్థానం, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌కు పునరధికారం కీలక పరిణామాలైన ఈ ఎన్నికల్లో భాజపా దిగ్విజయ యాత్ర- భారతావని భవితను విశేషంగా ప్రభావితం చేసే సముజ్జ్వల ఘట్టం!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.