close

తాజా వార్తలు

కప్పులో ఏకలవ్యులు

సచిన్‌ అప్పర్‌కట్‌.. ధోని హెలికాఫ్టర్‌ షాట్‌ కుంబ్లే గూగ్లీ, అఫ్రిది ధనాధన్‌ బ్యాటింగ్‌ టీవీల్లో చూసి స్ఫూర్తి పొందిన వాళ్లు ఆరాధ్య ఆటగాళ్లనే గురువులుగా చేసుకుని క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న అభినవ ఏకలవ్యులు 
ప్రపంచ క్రికెట్లో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న గాంధార ఘటికులు... అఫ్గానిస్థాన్‌ క్రికెటర్లు! ఈసారి ప్రపంచకప్‌లో బరిలో దిగిన జట్లలో అఫ్గాన్‌ ప్రత్యేకం. ఒక అసోసియేట్‌ జట్టు నుంచి టెస్టు హోదా వరకు ఎదిగి.. 
ర్యాంకుల్లో పెద్ద జట్లను వెనక్కి నెట్టి సంచలన విజయాలతో ముందుకెళుతున్న అఫ్గాన్‌ జట్టుపై అభిమానులు ఒక కన్నేయాల్సిందే.

సరిగ్గా పదేళ్ల క్రితం అఫ్గాన్‌ ప్రత్యర్థి జట్లు.. జపాన్‌, బోట్స్‌వానా, మొజాంబిక్‌, జర్మనీ! ఐసీసీ ప్రపంచ క్రికెట్‌ లీగ్‌లో ఐదో డివిజన్‌ మ్యాచ్‌లు ఆడిన అఫ్గాన్‌ ఇప్పుడు వన్డేల్లో ప్రపంచ టాప్‌-10 జట్టు. శనివారం బ్రిస్టల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అఫ్గాన్‌ తొలి పోరు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ (1992 ఛాంపియన్‌)ను మట్టికరిపించిన అఫ్గాన్‌ రానున్న రోజుల్లో ఎన్ని జట్లకు షాకిస్తుందన్నదే ఈ టోర్నీలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌!

రషీద్‌ఖాన్‌, ముజీబ్‌ రెహ్మాన్‌, నబి ఈ పేర్లను అభిమానులకు పరిచయం చేయక్కర్లేదు. ప్రపంచ క్రికెట్లో అఫ్గాన్‌ విజయాల్లో ముగ్గురి పాత్ర కీలకం. కానీ ఒకప్పుడు రబ్బరు బంతి పగిలితే మరో బంతి కొనుక్కునే స్థోమత కూడా లేదు మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌కు! టీవీలు, ఇంటర్నెటో చూసి నేర్చుకోవాల్సిందే తప్ప సొంతంగా కోచ్‌లు పెట్టుకునే సామర్థ్యం లేదు అఫ్గాన్‌ ఆటగాళ్లకు! బయటికి వెళితే ప్రాణాలతో తిరిగొస్తామా లేదా అన్న గడ్డ నుంచి ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా ఎదుగుతామని వాళ్లే ఊహించి ఉండరు. అసలు అఫ్గాన్‌ ఏంటి ఒక ప్రపంచకప్‌ ఆడడం ఏంటి! 2015కు ముందు ఎవరైనా ఇలాగే అనుకొని ఉంటారు. కానీ 2015 ప్రపంచకప్‌కు ఈ జట్టు అర్హత సాధించి పెద్ద ఘనతే అందుకుంది. చిన్న జట్లలో స్ఫూర్తిని నింపింది. ఈ జట్టు టీ20, వన్డేలకు మాత్రమే పరిమితం అనుకునోలోపు టెస్టుల్లోకి వచ్చేసింది పఠాన్ల జట్టు.

అఫ్గాన్‌లో ఉండే భయానక పరిస్థితుల వల్ల అక్కడికి వచ్చి కోచింగ్‌ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వాళ్లకు క్రికెట్‌పై ఎంతో ఆసక్తి ఉన్నా చాలారోజులు వెలుగులోకి రాకుండా ఉండిపోయారు. టీవీల్లో తమ ఇష్టమైన ఆటగాళ్లు సచిన్‌, అఫ్రిది, కుంబ్లేలను చూస్తూ వారిని అనుకరిస్తూ బ్యాటింగ్‌, బౌలింగ్‌ సాధన చేసేవాళ్లు పఠాన్లు. యూట్యూబ్‌ ప్రాచుర్యంలోకి వచ్చాక అఫ్గాన్‌ ఆటగాళ్లకు క్రికెట్‌ నేర్చుకోవడం ఇంకా సులభం అయింది. రషీద్‌ఖాన్‌, ముజీబ్‌ లాంటి స్టార్లు ఇలా ఎదిగినవాళ్లే. ‘‘కుంబ్లే, అఫ్రిది బౌలింగ్‌ను చూసే నేను లెగ్‌స్పిన్‌ నేర్చుకున్నా. టీవీ, యూట్యూబ్‌లో చూసి వాళ్ల బౌలింగ్‌ శైలిలోనే బంతులు వేయడం సాధన చేశాను’’ అని రషీద్‌ఖాన్‌ అన్నాడు. ‘‘అశ్విన్‌లా బౌలింగ్‌ చేయాలనేది నా కోరిక. అతనిలా క్యారమ్‌ బంతి ఎలా వేయాలో ప్రాక్టీస్‌ చేశాను. కొత్త బంతిపై ఎలా పట్టు సాధించి స్పిన్‌ రాబట్టాలో తెలుసుకున్నా’’ అని అశ్విన్‌తో కలిసి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఆడిన ముజీబ్‌ రెహ్మాన్‌ చెప్పాడు. 


భారత్‌ సాయంతో.. 

ఈసారి అఫ్గాన్‌ జట్టు ఈ స్థాయిలో ఉందంటే కారణం కచ్చితంగా భారతే. ఆర్థికంగానే కాక వారికి సాంకేతికంగా సాయం చేస్తూ అఫ్గాన్‌ బలపడడంలో తెర వెనుక ఎంతో కృషి చేసింది భారత్‌. అఫ్గాన్‌లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో గ్రేటర్‌ నోయిడాలో ఆ జట్టుకు స్థావరం కల్పించింది. నిరుడు డెహ్రూడూన్‌లో రెండో స్థావరం కేటాయించింది. అఫ్గాన్‌ ఆటగాళ్లంతా ఇక్కడే ఉంటూ.. సాధన చేస్తూ.. మ్యాచ్‌లు ఆడుతున్నారు. డెహ్రాడూన్‌లో అఫ్గాన్‌ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది కూడా. అన్నిటికంటే ముఖ్యంగా రషీద్‌ఖాన్‌, ముజీబ్‌ రెహ్మాన్‌, మహ్మద్‌ నబి లాంటి ఆటగాళ్లను ఐపీఎల్‌ సూపర్‌స్టార్లుగా మార్చింది. వీరిని దక్కించుకోవడం కోసం ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. అఫ్గాన్‌ పసికూన స్థాయి నుంచి ఒక టెస్టు హోదా స్థాయికి చేర్చడంలో వీళ్ల పాత్ర ఎంతో ఉండడమే దీనికి కారణం.


ఆ కప్పు తర్వాత.. 

గత ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై గెలిచి ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసిన అఫ్గాన్‌ జట్టు.. ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచుకుంది. మళ్లీ ప్రపంచకప్‌ వచ్చేసరికే అఫ్గాన్‌ స్థాయి కూడా పెరిగింది. టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు సంపాదించిన ఈ జట్టు.. టెస్టు హోదానూ సొంతం చేసుకుంది. 2018లో బంగ్లాదేశ్‌ను టీ20 సిరీస్‌లో 3-0తో ఓడించడం అఫ్గాన్‌ జోరుకు నిదర్శనం. అదే ఏడాది ఆసియా కప్‌ టీ20 టోర్నీలో శ్రీలంకను చిత్తు చేసిన అఫ్గాన్‌.. అదే కప్‌లో భారత్‌ను ఓడించినంత పని చేసింది. ఈ మ్యాచ్‌ టైగా ముగిసింది. ఐర్లాండ్‌పై వన్డే, టీ20 సిరీస్‌లలో స్వీప్‌ చేసింది అఫ్గాన్‌. 


 


చిన్న జట్టేం కాదు.. 

అఫ్గానిస్థాన్‌ ప్రపంచకప్‌కు కొత్త కావొచ్చు. మిగిలిన జట్లతో పోలిస్తే అనుభవం తక్కువై ఉండొచ్చు. కానీ పసికూన మాత్రం కాదు. సులభంగా లొంగిపోయే రకం అసలే కాదు. అందుకే ఈ జట్టుపై అభిమానులకు నమ్మకం ఉంది. పెద్ద జట్లను కూడా కంగుతినిపించగల సత్తా తమ జట్టుకు ఉందని వాళ్లు నమ్ముతున్నారు. ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో అఫ్గాన్‌ జట్టు పాకిస్థాన్‌ను ఓడించడమే ఇందుకు నిదర్శనం. ప్రపంచకప్‌ ఫార్మాట్‌ ప్రకారం ఒక జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడాలి. అంటే.. లీగ్‌ దశలో ఒక్కో జట్టు 9 మ్యాచ్‌లు ఆడుతుంది. సెమీఫైనల్‌ రేసులో ఉండాలంటే కనీసం ఐదింట్లో గెలవాలి! అఫ్గాన్‌ ఆటగాళ్ల ప్రతిభ.. ఫామ్‌ ప్రకారం అస్థిరంగా ఆడే శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లపై నెగ్గితే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించిన అఫ్గాన్‌ మరో 2 సంచలనాలు సృష్టించినా షాకవ్వాల్సిందేమీ లేదు. మిస్టరీ స్పిన్నర్లు రషీద్‌ఖాన్‌, ముజీబ్‌ రెహ్మాన్‌తో పాటు ఆల్‌రౌండర్‌ నబి, అస్గర్‌ అఫ్గాన్‌ రాణించడం ఆ జట్టుకు కీలకం.


ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్‌ దళాల్లో అఫ్గానిస్థాన్‌ ఒకటి. వాళ్ల స్పిన్‌ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఇంగ్లాండ్‌లో స్పిన్‌కు అనుకూలించే వాతావరణం ఉన్నప్పుడు ఎంతటి స్టార్‌ బ్యాట్స్‌మన్‌కైనా చెమటలు పట్టిస్తారు. కచ్చితంగా ఈ ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో అయినా అఫ్గాన్‌ జట్టు సంచలన విజయాలు సాధిస్తుందని అనుకుంటున్నా

- లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, అఫ్గాన్‌ మాజీ కోచ్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.