close

తాజా వార్తలు

సుమ అక్కా.. నీకు శుభాకాంక్షలు

రాజకీయ వైరానికి తెరదించుతూ నిఖిల్‌ పోస్ట్

బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటక వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పార్లమెంట్‌ స్థానం మండ్య. ఈ స్థానం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ జేడీఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలవగా.. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్రంగా యత్నించి చివరికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు ప్రముఖ సినీనటి సుమలత. ఆమె భర్త అంబరీశ్‌ ఇక్కడి నుంచి పలుమార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించడంతో పట్టుబట్టి ఈ స్థానంలో పోటీ చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరుపక్షాల నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. పోలింగ్‌ తేదీ దగ్గరయ్యే సమయంలో అక్కడక్కడా హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. సుమలతను అక్కా అని సంబోధిస్తూ నిఖిల్‌ పెట్టిన ఓ పోస్టును  ప్రస్తుతం పలువురు నెటిజన్లు, రాజకీయ ప్రముఖులు అభినందిస్తున్నారు. సుమలతను ఈ ఎన్నికల్లో వెన్నుతట్టి ప్రోత్సహించిన సీనియర్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ సైతం నిఖిల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. నిఖిల్‌ పోస్ట్‌పై కృష్ణ  స్పందిస్తూ... ‘ప్రియమైన నిఖిల్‌. అభిషేక్‌కు నువ్వు శుభాకాంక్షలు తెలియజేసిన విధానం నన్నెంతగానో ఆకర్షించింది. ఇదే క్రీడా స్ఫూర్తి అంటే. ఎన్నికలు వస్తూ, పోతూ ఉంటాయి. కానీ, జీవితం రాజకీయాలకు అతీతమైంది. ఇలాంటి ప్రవర్తనతోనే నడుచుకుంటే నువ్వు కూడా ఏదోకరోజు విజేతగా నిలుస్తావు. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’ అంటూ కృష్ణ ప్రశంసించారు.

ఇటీవల నిఖిల్‌ కుమారస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. అందులో సుమలత తనయుడు అభిషేక్‌ అంబరీశ్‌ నటించిన తొలిచిత్రం అమర్‌ను తన అభిమానులు కూడా చూసి ఆదరించాలని కోరాడు. రాజకీయ  అంతరాలను చెరిపేస్తూ .. ‘అన్నింటి కంటే ముఖ్యంగా నేను అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తాను. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్తావించాను. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన సుమక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ తన పోస్ట్‌లో నిఖిల్‌ పేర్కొన్నారు. నిఖిల్‌ తాను అభిషేక్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా షేర్‌ చేశారు. ఇదే సందర్భంలో తన ఓటర్లకు, కార్యకర్తలకు కూడా నిఖిల్‌ ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయాల్లో నిఖిల్‌ కొనసాగుతారా లేదా అని పలువురికి వస్తున్న సందేహాలను నివృత్తి చేస్తూ త్వరలోనే  వివిధ జిల్లాల పర్యటన చేపడతానని స్పష్టం చేశారు. తద్వారా స్థానిక సమస్యలను అర్థం చేసుకోవడమే కాకుండా కార్యకర్తల్లో కూడా ఉత్తేజం నింపేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా ‘వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నానని’, తన పోరాటం కార్యకర్తల్ని నిరుత్సాహపరచి ఉంటే మాత్రం క్షమించాలని కోరారు. ఈ పోస్టుపై సుమలత కూడా స్పందించారు. ఎమోజీతో నమస్కారం పెడుతూ నిఖిల్‌ పోస్టును రీట్వీట్‌ చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.