
తాజా వార్తలు
దిల్లీ: తాజా లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. ఏకపక్షంగా 303 చోట్ల విజయబావుటా ఎగురవేసింది. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 350 స్థానాలకు పైనే కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి నరేంద్రమోదీ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. మరోవైపు మంత్రివర్గంలోనూ చాలా కొత్త ముఖాలు కనిపించాయి. మరికొందరికి తొలిసారిగా కీలక బాధ్యతలు అప్పగించారు. విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి జయశంకర్‌ను కేబినెట్లోకి తీసుకోవడమే ఇందుకు ఉదాహరణ. అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్ లాంటి సీనియర్ నేతలకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఆరోగ్య సమస్యలే ఇందుకు కారణమన్న సంగతి తెలిసిందే. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన ఉమాభారతి లాంటి కొందరు నాయకులు తాజా ఎన్నికల్లో పోటీ చేయకపోడంతో వారికి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఇంకొందరు పోటీ చేసి గెలిచినప్పటికీ వారికి చోటు దక్కలేదు. వారెవరో చూద్దామా?
మేనకాగాంధీ
లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపా నుంచి బరిలోకి దిగిన మేనకాగాంధీ తన విమర్శలతో వార్తల్లోకెక్కారు. తనకు ఓటు వేయని ముస్లింలెవరూ అభివృద్ధి పనుల కోసం తన వద్దకు రావొద్దని బహిరంగంగా హెచ్చరించారు. అప్పట్లో ఇది పెద్ద దుమారాన్నే లేపింది. అందువల్లే తాజా ఎన్నికల్లో విజయం సాధించినా... ఆమెకు మంత్రి పదవి దక్కలేదని రాజకీయ వాదులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మేనక మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
జయంత్ సిన్హా
ఈయన ఝార్ఖండ్‌లోని హజారిబాగ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. భాజపా మాజీ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు. తాజాగా ఎన్నికల ముందు యశ్వంత్ సిన్హా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఎన్నికల తర్వాత కూడా మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందువల్లే జయంత్ సిన్హాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదనే వాదన ప్రచారంలో ఉంది. గతంలో జయంత్ సిన్హా ఆర్థిక, పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.
సురేశ్ ప్రభు
కేంద్రమంత్రి వర్గంలో సురేశ్ ప్రభుకు చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. భాజపా, శివసేన మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో కేంద్రమంత్రి పదవి చేపట్టిన ప్రభు.. అనంతరం శివసేనకు రాజీనామా చేసి, భాజపా తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ, మంత్రివర్గంలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు.
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
మాజీ సైనికాధికారి, ఒలింపిక్ పతక విజేత అయిన రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ మోదీ ప్రభుత్వంలోనే అత్యంత పిన్న వయస్కుడు. గతంలో కీలక శాఖలైన క్రీడలు, సమాచార ప్రసార శాఖలను నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల తాజా మంత్రి వర్గంలో స్థానం కోల్పోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాధామోహన్ సింగ్
2014 ఎన్నికల తర్వాత కేబినెట్ ర్యాంక్ హోదాలో రాధామోహన్‌సింగ్ వ్యవసాయశాఖ బాధ్యతలు చేపట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గత కేంద్ర మంత్రి వర్గంలో పనితీరు బాగోలేని మంత్రుల్లో రాధామోహన్‌సింగ్ ఒకరు. వ్యవసాయ శాఖలో నెలకొన్న ఒడిదొడుకులను సమర్థంగా ఎదుర్కొనలేక పోయారనే వాదన కూడా ఉంది. అందువల్లే తాజా మంత్రి వర్గంలో ఆయనకు చోటు దక్కలేదని పలువురు భావిస్తున్నారు.
జగత్ ప్రకాశ్ నడ్డా
ఈయన భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గత మంత్రివర్గంలో తక్కువ ప్రాధాన్యత ఉన్న శాఖలనే అప్పగించారు. కానీ, మోదీ నిర్వహించిన ఆరోగ్యశాఖలో కీలక బాధ్యలు చేపట్టారు. రాజకీయ ఎత్తుగడల విషయంలో మంచి పట్టున్న వ్యక్తి. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, దిల్లీలో భాజపా విజయపతాక ఎగురవేయాలని పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అక్కడ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నడ్డాకు మంత్రి వర్గంలో చోటివ్వలేదనే వాదన ఉంది.
మనోజ్ సిన్హా
గత మంత్రివర్గంలో తక్కువ స్థాయి బాధ్యతలు చేపట్టినప్పటికీ కష్టపడి పని చేసే తత్వం ఉన్న వ్యక్తి. గతంలో రైల్వే సహాయమంత్రిగా పని చేశారు. అయితే తాజా ఎన్నికల్లో ఓటమిపాలవ్వడంతో తాజా కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కోల్పోయారు.
అనుప్రియా పటేల్
అప్నాదళ్ అధినేత్రి అనుప్రియా పటేల్ గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఐదేళ్లపాటు అదే పదవిలో ఉన్నప్పటికీ తనను తాను నిరూపించుకోలేకపోయారు. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ ఆమెకు మాత్రం మంత్రివర్గంలో రిక్త హస్తమే మిగిలింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
