close

తాజా వార్తలు

ఏపీ అసెంబ్లీలో రుణమాఫీపై వాగ్యుద్ధం

అమరావతి: రుణమాఫీ అంశంపై ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. తెదేపా సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘‘2014 ఎన్నికలకు ముందు దేశంలో ఎక్కడా కూడా రుణమాఫీ అనే పదం లేదు. వ్యవసాయం మీద తీసుకున్న రుణాలు మాఫీ  చేస్తామని చెప్పాం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. రిజర్వ్‌ బ్యాక్‌ సహకరించకపోయినా..కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. ఒక్కో రైతుకు రూ.1.50లక్షల వరకు రుణమాఫీ చేశాం. పక్కనే ఉన్న తెలంగాణ మిగులు బడ్జెట్‌ఉన్న రాష్ట్రమైనా రూ.లక్ష వరకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఈదేశంలో రుణమాఫీ చేయలేమని చెప్పి చాలా ప్రభుత్వాలు, పార్టీలు మాట్లాడాయి. కానీ, చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేసి చూపించారు’’ పేర్కొన్నారు.

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ..రుణమాఫీ విషయంలో విశ్వసనీయత కోల్పోవడం వల్లే తెదేపా ప్రతిపక్షంలో కూర్చుందని విమర్శించారు. రైతుల రుణాలు మాఫీ చేయకపోవడం వల్లే ప్రతిపక్షంలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి షరతులు పెట్టకుండా .. అధికారంలోకి వచ్చిన తర్వాత షరతులు పెట్టారని విమర్శించారు. ఎన్నికల ముందు మూడు విడతలే రుణ మాఫీ చేసి.. మరో రెండు విడతలు ఇవ్వకుండా పసుపుకుంకుమకు ఎందుకు వెళ్లారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

గోరంట్ల వర్సెస్‌ బుగ్గన
గత ఐదేళ్ల తెదేపా పాలనలో అవినీతి పెచ్చుమీరిపోయిందని  ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా తెదేపా సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై ఆర్థిక మంత్రి స్పందిస్తూ ..‘‘ గత సభలో ఎంత సమయం ఇచ్చారు.. ఇప్పుడు ఎంత సమయం ఇస్తున్నారని మాట్లాడుతున్నారు. సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఆ పార్టీకి సమయం కేటాయిస్తారు. అవినీతి రహిత పాలన కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమైన విషయాలు మాత్రమే 15 పేజీలతో గవర్నర్‌ ప్రసంగంలో ఉంచాం. ఈ ప్రభుత్వానికి వృద్ధిరేటు కాదు.. మేనిఫెస్టోలోని అంశాలే ప్రధానం’’ అని వివరించారు.
అంతకు ముందు బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ..‘‘ సక్రమమైన పాలన ఉన్నందునే గత రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు వచ్చాయి. ఆర్థిక వనరులు, అప్పులు ఎలా ఉన్నాయో గవర్నర్‌ ప్రసంగంలో లేవు. తెదేపా హయాంలో అత్యధిక వృద్ధిరేటు వచ్చింది. సేవారంగంలో అభివృద్ధి ద్వారా రూ.3.30 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఆశా వర్కర్లకు రూ.10వేలు పెంచామని వైకాపా ప్రభుత్వం చెబుతోంది. దీంతోపాటు ప్రోత్సాహకాలు కూడా ఇస్తారా.. స్పష్టం చేయాలి. వృద్ధాప్య పింఛన్లు రూ.3వేలకు పెంచుమతామన్నారు... రూ.2,250 చేశారు. సంక్షేమ పథకాల పేర్లు మార్చడం కాదు.. సక్రమంగా చేయడమే ముఖ్యం. మమ్మల్ని విమర్శించడం కాదు.. మీరేం చేస్తారో చెప్పాలి. రాజధాని పనులు నిలిపివేయడం కాదు.. లోటుపాట్లు ఉంటే సరిచేయాలి. రాజధాని పనులు ప్రారంభించేలా సీఎం జగన్‌ చూడాలని కోరుతున్నా. సంఖ్యలో తక్కువ కావచ్చు.. ప్రతిపక్షంగా మా వాణి వినిపించే అవకాశం ఇవ్వాలి’’ అని విజ్ఞప్తి చేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.