
తాజా వార్తలు
బీజింగ్: అమెరికా దృష్టికోణంలో హువావేను చూడొద్దని చైనా గురువారం భారత్‌ను అభ్యర్థించింది. అమెరికా ప్రభావానికి గురి కాకుండా భారత్ నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కింగ్ ఒక ప్రకటన చేశారు. భారత్‌లో త్వరలో 5జీ తరంగాలను వేలం వేయనున్నారు.. ఈ నేపథ్యంలో హువావే కూడా వీటిల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దీనిలోకి హువావేను అనుమతించాలా.. వద్దా.. అన్న అంశంపై నిర్ణయం తీసుకోలేదు.
ఈ నెల మొదట్లో కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘మేము దీనిపై స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. అక్కడ భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయి. ఇది కేవలం సాంకేతికతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఈ నేపథ్యంలో ఒక కంపెనీ దీనిలో పాల్గొనాలని చెప్పడం కష్టమైపోతుంది.’’ అని వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లూకింగ్ మాట్లాడుతూ‘‘ చైనా కంపెనీలు ఎక్కడైతే సేవలు అందిస్తున్నాయో ఆయా దేశాల చట్టాలను, నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెబుతాము. ఏదైనా దేశం వారి చట్టం ప్రకారం ఏకపక్షంగా ఆంక్షలు విధించడాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. భద్రతను ఒక సాకుగా వాడుకోవడాన్ని కూడా చైనా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే చాలా దేశాలు హవావే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి 5జీలో భాగస్వామిగా చేర్చుకున్నాయి. భారత్ కూడా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొంటుందని భావిస్తున్నాము. ’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా హువావేకు టెక్నాలజీని ఇవ్వడంపై ఆంక్షలను విధించింది.