
తాజా వార్తలు
న్యూదిల్లీ: భారీ హామీలు ఇస్తూ అభివృద్ధి అంచనాలను వేసుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వానికి రికార్డు ఉందని, అయితే, వాటిని ఏ మాత్రం అమలు చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘అంచనాలను పెంచుతూ వెళ్లడంలో, హామీలను గుప్పించడంలో భాజపా ఆధ్వర్యంలోని సర్కారుకి రికార్డు ఉంది. కానీ, వాటిల్లో ఒక్క దాన్ని కూడా అమలు చేయదు. కార్యాచరణ కొనసాగించని వాటికోసం భాజపా అనేక అంచనాలు వేసుకుంటుందనడానికి రాష్ట్రపతి ప్రసంగమే ఓ ఉదాహరణగా నిలుస్తుంది. చెప్పే మాటలకు, కార్యాచరణకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇదే లిఖితపూర్వకంగా లేని భాజపా సంప్రదాయంగా కొనసాగుతోంది’’ అని ఆ పార్టీ నేత రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు.
దేశ భద్రత విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని సుర్జేవాలా విమర్శించారు. ‘‘ఈ ఏడాది ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లో 74 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల్లో 10 మంది జవాన్లు మృతి చెందారు. ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ విషయంలో మాజీ జవాన్లు చేస్తున్న డిమాండ్లను భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వం పట్టించుకోలేదు. దేశంలో నీటి సంక్షోభం కూడా తలెత్తుతోంది. దేశంలోని 21 నగరాల్లో భూగర్భ జలాలు ఉండని పరిస్థితి నెలకొననుంది. కొత్త విద్యా విధానం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. గంగా నది ప్రక్షాళన అంటూ మోసం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు పెంచుతామని మరోసారి హామీ ఇచ్చారు. మరోవైపు, వారి ఆదాయ వృద్ధి 14 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో ఉంది’’ అని ఆయన తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.