close

తాజా వార్తలు

ట్రంప్‌ కరుణ రసం వెనుక కథ..!

ముందుకెళితే నుయ్యి.. వెనక్కిపోతే గొయ్యి

అడకత్తెరలో పోకచెక్కలా అమెరికా అధ్యక్షుడు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఇట్స్‌గాన్‌.. పోయిందే.. ట్రంప్‌ కోపం, బెట్టు ఒక్కదెబ్బకు దిగిపోయాయి. గురువారం ఇరాన్‌ గగనతలంపై ప్రయాణిస్తున్న అమెరికా డ్రోన్‌ను రివల్యూషనరీ గార్డ్స్‌ బలగాలు కూల్చివేయడంతో ఆయన గంభీరంగా గర్జించారు. ఇరాన్‌ చాలా పెద్దతప్పు చేసింది అని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎవరక్కడ.. యుద్ధానికి సిద్ధం చేయండి అంటూ హుకుం జారీ చేశారు. అంతలోనే ఏమైందో ఏమో.. ‘ఆగండి.. ఆగండి’ అంటూ ఆదేశాలను నిలిపేశారు. అనంతరం ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ‘‘ఇప్పుడు దాడి చేస్తే 150 మంది వరకు చనిపోతారని మా జనరల్‌ సెలవిచ్చారు. ఒక మానవ రహిత విమానం కోసం 150 ప్రాణాలు తీయలేను. అందుకే ఆలోచిస్తున్నా.’’ అంటూ కరుణరసం పలికించారు. దీంతో ఆ ఛానల్‌ యాంకర్‌ బుర్రగోక్కుంటూ విన్నాడు. ఇక్కడ సీన్‌కట్‌ చేస్తే..

క్యాంప్‌డేవిడ్‌కు వెళుతూ ట్రంప్‌ మరోసారి విలేకర్లతో మాట్లాడుతూ.. అమెరికా చెప్పిన మాట ఇరాన్‌ చప్పున వింటే ఆ దేశాన్ని ఆర్థిక శక్తిగా మారుస్తామంటూ తాయిలాన్ని బయటపెట్టారు. తన సహజ శైలికి భిన్నంగా ట్రంప్‌లో అర్జెంట్‌గా ఇంత జాలి ఉప్పొంగటానికి గల కారణాలను లోతుగా విశ్లేషిస్తేగానీ అర్థంకావు.  

కరుణామయుడేమీ కాదు..
ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల పేరు చెప్పి తల్లీబిడ్డలను కూడా వేరుచేయడానికి ట్రంప్‌ ఏరోజు వెనుకాడలేదు. చివరికి సొంత కుటుంబసభ్యుల నుంచి దీనిపై వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. గతంలో సాధారణ అయుధాల్లో అత్యంత ప్రమాదకరమైన ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ను అఫ్గానిస్థాన్‌పై ప్రయోగించిన ఘనత ట్రంప్‌కే దక్కుతుంది. ఆయన ఈ ఆయుధం వినియోగంపై ఏమాత్రం ఆలోచించలేదు. అటువంటి ట్రంప్‌ ఇప్పుడు 150 ప్రాణాల కోసం ఆలోచించి దాడి చేయలేదంటే ఏమాత్రం నమ్మలేము. 

భారీ యుద్ధానికి సిద్ధం కాలేదు..

గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ సూచీ ప్రకారం ఇరాన్‌ ప్రపంచంలో 14వ అతిపెద్ద సైనిక శక్తి. ఇరాన్‌లో మొత్తం 7లక్షలకు పైగా దళాలు ఉన్నాయి. వీటిల్లో 3.50లక్షల సంప్రదాయ సైనిక దళాలు కాగా మిగిలినవి వివిధ రూపాల్లో ఉన్నాయి. ఇవి కాకుండా దాదాపు 1.25లక్షల మంది ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ , 20వేల మంది రివల్యూషనరీ గార్డ్స్‌ నావికా దళం సిబ్బంది ఉన్నారు. ఇరాక్‌, లిబియాలతో పోలిస్తే ఇరాన్‌ దళాలు చాలా భిన్నమైనవి. ఇరాక్‌, లిబియాలు సంప్రదాయ సైనిక దళాలను మాత్రమే పెంచుకొన్నాయి. గెరిల్లా యుద్ధతంత్రాన్ని పాటించే రెబల్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకోలేదు. కానీ, ఇరాన్‌ అలా కాదు హిజ్బోల్లా వంటి రెబల్‌ గ్రూపులను నిధులు సమకూరుస్తోంది. ఇటువంటి దళాలు ఇరాక్‌, లెబనాన్‌లలో తిష్టవేసుకొని ఉన్నాయి. ఇప్పుడు అమెరికా యద్ధం మొదలు పెడితే వీటితో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఇది అంత తేలిగ్గా ముగిసే వ్యవహారం కాదు. అఫ్గానిస్థాన్‌ అనుభవాలు అమెరికాకు పునరావృతం అయ్యే పరిస్థితి ఉంది. 

ఎస్‌-300 వంటి మరో ముప్పు..
సిరియాలో అమెరికా దూకుడు ఉండకపోవడానికి రష్యాకు చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎస్‌-300 కూడా ఒక ప్రధాన కారణం. ఇరాన్‌ వద్ద  కూడా ఎస్‌-300ను పోలిన ఆయుధాలు ఉన్నాయి.  వీటికి రష్యా 2016లో క్షిపణులను సరఫరా చేసింది. ఇటీవల ఇరాన్‌ ఈ వ్యవస్థలను యుద్ధానికి సిద్ధం చేసింది. మిగ్‌-29, సూ-24 బాంబర్లు కూడా ఉన్నాయి. దీనికితోడు భారీ ఎత్తున మోహరించిన యాంటీ షిప్‌ మిసైల్స్‌ వ్యవస్థలు కూడా ఒక  ప్రధాన కారణం. పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే హర్మూజ్‌ జలసంధి మూసుకుపోతుంది. 

స్వదేశంలో సమస్యలు..

ఒబమా సర్కారు నానాతిప్పలు పడి ఇరాన్‌తో చేసుకొన్న అణు ఒప్పందాన్ని ఒక్క కలం పోటుతో ట్రంప్‌ చెత్త బుట్టలో వేశారు. ఇప్పుడు ఇరాన్‌ మరో ఒప్పందానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. ఎన్నికలలోపు ఇరాన్‌తో ఒప్పందం చేసుకోలేకపోవటం ట్రంప్‌ అసమర్థతగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా కాంగ్రెస్‌ అనుమతి లేకుండా  యుద్ధం ప్రారంభిస్తే 60రోజుల్లోపు ముగించాలి. సిరియాలో వలే రష్యా ఈ యుద్ధంలో చొరబడితే  ఇక అమెరికా విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే. ఒక వేళ ఎన్నికల  నాటికి కూడా అమెరికాకు విజయం చేకూరకుంటే ట్రంప్‌ ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది.  2020 ఎన్నికల్లో ఈ అంశం ఆయన ఓటమికి కారణమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ముందుకు పోతే నుయ్యి.. వెనక్కిపోతే గొయ్యి అన్నట్లు ఉంది ట్రంప్‌ పరిస్థితి. అందుకే ఇప్పుడు స్వరం మార్చి ఇరాన్‌ను అనునయించేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ట్రంప్‌ తాత జాలి వెనక అసలు కథ ఇదే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.