close

తాజా వార్తలు

గెలుపు మంత్రం @ ‘గురువు’

ప్రపంచకప్‌లో టాప్-5 జట్లను నడిపిస్తున్న కోచ్‌లు

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఏకపక్ష మ్యాచుల స్థానంలో ఉత్కంఠభరిత పోరాటాలు మొదలయ్యాయి. భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. ట్రోఫీ ముద్దాడేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ వ్యూహరచనా బృందంలో అత్యంత కీలకం కోచ్‌. వారి అనుభవం జట్టుకు కొండంత అండనిస్తుంది. ప్రణాళికలు సిద్ధం చేయడం, పక్కగా అమలుపరచడంలో కోచ్‌ అత్యంత ప్రధానం. మరి సెమీస్‌ బరిలో నిలిచేందుకు తహతహలాడుతున్న ఆయా జట్ల కోచ్‌ల గుణగణాలు, సామర్థ్యాలు ఏంటీ?

స్వేచ్ఛకు C/O రవిశాస్త్రి

ప్రపంచకప్‌లో భారత్‌ వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అద్భుతమైన వనరులు టీమిండియా సొంతం. రెండేళ్లుగా కోహ్లీసేన మరింత దుర్భేద్యంగా మారింది. మ్యాచ్‌లను మలుపు తిప్పే జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య జట్టుకు దొరికారు. ఇక విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ పరుగుల వరదపై ఎంత చెప్పినా తక్కువే. స్ట్రోక్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ టెక్నిక్‌, సీనియర్‌ ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌ బుర్ర గురించి అందరికీ తెలిసిందే.

బలమైన టీమిండియాకు 2017, జులై 13 నుంచి రవిశాస్త్రి పూర్తిస్థాయిలో కోచింగ్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు డైరెక్టర్‌గా పనిచేశారు. ‘ఆటను ఆస్వాదించండి. ఆనందించండి. స్వేచ్ఛగా ఉండండి’ అనే తత్వం ఆయనది. దానినే అనుసరిస్తారు. నాయకుడు విరాట్‌దీ అదే తత్వం. అందుకే ఇద్దరూ కలిసిపోయారు. విభాగాల వారీగా శాస్త్రి ఆటగాళ్లకు ప్రత్యేకంగా శిక్షణేమీ ఇవ్వరు. సూచనలూ చేయరు. ‘ఈ స్థాయికి వచ్చారంటే ఆట, టెక్నిక్స్‌ తెలియకుండా ఆటగాళ్లు ఉండరు కదా! మానసికంగా బలవంతుల్ని తయారు చేయడమే నా పని. కఠిన శిక్షణ, కఠోర నియమాలకు నేను కాస్త దూరం’ అంటారు శాస్త్రి. ఆయన ఆధ్వర్యంలోనే కోహ్లీసేన శ్రీలంకలో ఆతిథ్య జట్టును అన్ని ఫార్మాట్లలో క్లీన్‌స్వీప్‌ చేసింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌లు కైవసం చేసుకొని చరిత్రను తిరగరాసింది. టీమిండియా ఎలా ఆడుతున్నా శాస్త్రి ముఖంలో చిరునవ్వు తొలగిపోదు. ఆందోళన దరిచేరదు. ఆటగాళ్లకు హద్దులు దాటని అపరిమిత స్వేచ్ఛను ఇస్తారు. జట్టును బలంగా నమ్ముతారు. విశ్వాసం ఉంచుతారు. కోహ్లీ నిర్ణయాలను గౌరవిస్తారు. ఆటగాడిగానూ రవిశాస్త్రికి మంచి రికార్డే ఉంది.

‘నిర్భయ క్రికెట్‌’ @ ట్రెవర్‌ బేలిస్‌

ఆస్ట్రేలియా ఫస్ట్‌క్లాస్‌ క్రికెటరైన ట్రెవర్‌ బేలిస్‌కు కోచ్‌గా అద్భుతమైన రికార్డు ఉంది. వ్యూహరచనలో మంచి దిట్ట. జట్టుకు సమతూకం ఇచ్చే ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. 2015 నుంచి ఇంగ్లాండ్‌కు ఆయన కోచ్‌గా పనిచేస్తున్నారు. ఇంగ్లిష్ జట్టు క్రికెట్‌ దృక్పథమే మార్చేసిన గురువు ఆయన. ‘భయం లేని క్రికెట్‌’ను అభివృద్ధి చేయడంలో, ఇంగ్లాండ్‌ పునర్‌ నిర్మాణంలో ఆయన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆ జట్టు 400 పైచిలుకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నా, ఛేదిస్తున్నా ఆయన చలవే!

మొదట బేలిస్‌ న్యూసౌథ్‌ వేల్స్‌ జట్టుకు కోచ్‌. 2007 - 2011 కాలంలో శ్రీలంక బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలోనే లంక 2011 ప్రపంచకప్‌ రన్నరప్‌గా, టెస్టుల్లో రెండో స్థానంలో నిలిచింది. బిగ్‌బాష్‌లో సిడ్నీ సిక్సర్‌ను విజేతగా నిలబెట్టారు. ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 ట్రోఫీనీ అందించారు. ఆయన ట్రాక్‌ రికార్డు చూసి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌కు ఆహ్వానించింది. గంభీర్‌, బేలిస్‌ కలయికలో కేకేఆర్‌ రెండు సార్లు విజేతగా అవతరించింది. 2015లో ఆయనను ఇంగ్లాండ్‌ కోచ్‌గా నియమించారు. నాటి నుంచి ఇంగ్లాండ్‌ కథే మారింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆఖరి ఓవర్‌లో బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్‌ నాలుగు సిక్సర్లు వరుసగా బాదకుంటే ఇంగ్లిష్ జట్టు విజేతగా అవతరించేదే. ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్‌ గెలవని ఆ జట్టుకు సంధిదశలో బేలిస్‌ అండగా నిలిచారు. ప్రతి ఆటగాడి బలాన్ని గుర్తించడంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రశాంతంగా ఉంటారు. క్రికెటర్ల ఆటను చక్కగా పరిశీలించి విశ్లేషిస్తారు. ఆయన మార్గదర్శకత్వంలో ఇంగ్లాండ్‌ తిరుగులేని విజయాలు సాధించింది. మరి 2019 ప్రపంచకప్‌లో బేలిస్‌ ఏం చేస్తాడో చూడాలి!

‘ఆసీస్‌ వైఖరి’@ జస్టిన్‌ లాంగర్‌

ఆస్ట్రేలియాకు ఆడిన అద్భుతమైన క్రికెటర్లలో జస్టిన్‌ లాంగర్‌ ఒకరు. టెస్టు క్రికెట్‌లో మాథ్యూ హెడెన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేశారు. వీరిద్దరూ 113 ఇన్నింగ్సుల్లో 5,655 పరుగులు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పారు. మంచి టెక్నిక్‌, దూకుడు లాంగర్‌ సొంతం. ఆటగాడిగా ఎన్నో ఘనతలు సాధించారు. కౌంటీ, షెఫీల్డ్‌ షీల్డ్‌, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించారు. కోచ్‌గా ఎక్కువ అనుభవం లేదు. 2009లో ఆయన ఆసీస్‌ సహాయ కోచ్‌గా ఎంపికయ్యారు. టిమ్‌ నీల్సన్‌ ఆధ్వర్యంలో బ్యాటింగ్‌ కోచ్‌గా, మార్గదర్శకుడిగా పనిచేశారు. 2012లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా సీనియర్‌ కోచ్‌ అయ్యారు. 2015-16 సీజన్‌లో పెర్త్‌ స్కార్చర్‌ కోచ్‌గా పనిచేశారు. 2018, మే నెల్లో లాంగర్‌ ఆసీస్‌ జాతీయ జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు.

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం ఆసీస్‌ క్రికెట్‌ను కుదిపేసింది. ప్రధాన కోచ్‌ డారెన్‌ లెమన్‌ రాజీనామాతో లాంగర్‌ను రంగంలోకి దించారు. స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ నిషేధంతో డీలాపడ్డ ఆసీస్‌ జట్టులో దశలవారీగా ఆత్మవిశ్వాసం నింపారు. వరుస వైఫల్యాలు, ఓటములతో దాదాపు పాతాళానికి పడిపోయిన ఆసీస్‌ క్రికెట్‌కు జవసత్వాలు అందించారు. ఫామ్‌ కోల్పోయిన సారథి ఆరోన్‌ ఫించ్‌ను ఎంత మంది విమర్శించినా వెనకేసుకు వచ్చాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్‌ గురించి పదేపదే వివరించాడు. ఆసీస్‌ తరహా దూకుడు వైఖరే లాంగర్‌ది. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. బలహీనపడిన ఆసీస్‌ను పటిష్ఠంగా మార్చేందుకు ఆయన విభిన్న మార్గాలు అన్వేషించారు. ప్రపంచకప్‌కు బయల్దేరే ముందు ఆటగాళ్లను ఓ యుద్ధ క్షేత్రానికి తీసుకెళ్లి యోధులు ఎలా ఉంటారో వివరించారు. ప్రస్తుతం పాంటింగ్‌తో కలిసి లాంగర్‌ చక్కని వ్యూహాలు రచిస్తూ పక్కగా అమలు చేస్తున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను సెమీస్‌ బరిలో నిలిపారు.

‘పక్కా ప్లానర్‌’ @ గ్యారీ స్టీడ్‌

ఈ ప్రపంచ కప్‌లో ఓటమెరుగని మరో దేశం న్యూజిలాండ్‌. మెగాటోర్నీ ముందు కివీస్‌పై ఎవరికీ భారీ అంచనాల్లేవు. అలాంటి జట్టు జైత్రయాత్రను తెరవెనక నడిపిస్తున్నదెవరో తెలుసా? కోచ్‌ గ్యారీ స్టీడ్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా పరిచయం లేని వ్యక్తి. అద్భుతమైన ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌. ఆడింది మాత్రం ఐదు టెస్టులే. కివీస్‌ను విజయవంతమైన జట్టుగా మార్చిన మైక్‌ హెసన్‌ స్థానంలో స్టీడ్‌ ఎంపికయ్యారు. దీనికి ముందు ఆయన న్యూజిలాండ్‌ మహిళల జట్టును 2009 వన్డే ప్రపంచకప్‌, 2010 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు తీసుకెళ్లారు. 2004 నుంచి 2008 వరకు కివీస్‌ హై ఫర్ఫామెన్స్‌ కేంద్రంలో పనిచేశారు. 2012లో కాంటర్‌బరీ కోచ్‌గా ఎంపికై వరుసగా నాలుగుసార్లు టైటిళ్లు అందించారు. 2016-17లో కివీస్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గానూ పనిచేసిన అనుభవం ఉంది.

గ్యారీ స్టీడ్‌ది విభిన్నమైన వ్యక్తిత్వం. మ్యాచ్‌కు ముందు అత్యంత ప్రణాళికా బద్ధంగా ఉంటారు. ఒక్క అంశాన్నీ వదిలిపెట్టరు. పక్కగా ప్రణాళిక రూపొందించడంలో సిద్ధహస్తుడు. అన్నీ ఒక క్రమ పద్ధతితో చేస్తారు. చేయిస్తారు. స్టీడ్‌ తన అభిప్రాయాల్ని బలంగా వినిపిస్తారు. అస్సలు మొహమాటపడరు. ‘ఆ మ్యాచ్‌ గెలవగలరా? నువ్విలా ఆడగలవా?’ అని క్రికెటర్లను సవాల్‌ చేసి శ్రుతిమించని విధంగా రెచ్చగొట్టి ఫలితాలు సాధిస్తారు. ప్రణాళికకు విరుద్ధంగా నడుచుకుంటే కఠినమైన నిర్ణయాలు తీసుకొనేందుకు వెనుకాడరు. కొత్తగా ఆలోచిస్తారు. సమస్యలకు పరిష్కారాలు వెదుకుతారు. ఆటగాళ్లను అస్సలు సౌకర్యంగా (కంఫర్ట్‌ జోన్‌) ఉండనివ్వరు. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత సుదీర్ఘ ఉపన్యాసాలు దంచే వ్యక్తి కాదు. సూటిగా సుత్తిలేకుండా అనుకున్నది చెప్పేసి పనిలో నిమగ్నమవుతారు. ఆయన ఆలోచనలకు తగినట్టే కేన్‌ విలియమ్సన్‌ ఉన్నాడు. అందుకే వీరిద్దరూ జట్టును తిరుగులేకుండా ముందుకు నడిపిస్తున్నారు. వీరి ప్రణాళికలు అనుకున్నట్టు సాగితే కివీస్‌ తొలిసారి ప్రపంచకప్‌ ట్రోఫీ ముద్దాడినా ఆశ్చర్యం లేదు.

‘కొత్త ప్రతిభ’ @ స్టీవ్‌ రోడ్స్‌

ఈ ప్రపంచకప్‌లో అభిమానులను అలరించింది ఒక్క బంగ్లాదేశ్‌ అనే చెప్పొచ్చు. టోర్నీలో 7 మ్యాచుల్లో 3 గెలిచి 3 ఓడి 7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. శ్రీలంకతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దాదాపు 300 పైచిలుకు లక్ష్యాలను బంగ్లా పులులు తడబడకుండా ఛేదిస్తున్నాయి. దక్షిణాఫ్రికాపై 21 పరుగులు, విండీస్‌పై 7 వికెట్లు, అఫ్గాన్‌పై 62 పరుగుల తేడాతో బంగ్లా గెలిచింది. మెగాటోర్నీకి కొద్ది రోజుల ముందే బంగ్లా బోర్డు కొత్త కోచ్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన స్టీవ్‌ జాన్‌ రోడ్స్‌ను నియమించింది.

రోడ్స్‌కు బ్రాడ్‌ఫోర్డ్‌, యార్క్‌షైర్‌, ఇంగ్లాండ్‌కు జట్లకు ఆడిన అనుభవం ఉంది. 2005లో ఆయన వోర్సెస్టర్‌ షైర్‌ కోచ్‌గా ఎంపికయ్యారు. 2006 నుంచి 2017 వరకు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గానూ వ్యహరించారు. 2018 జూన్‌ 7న రోడ్స్‌ను బీసీబీ నియమించింది. స్వయంగా గ్యారీ కిర్‌స్టన్‌ ఆయన పేరును బోర్డుకు సూచించారట. వివిధ స్థాయిల్లో ఆటగాళ్ల సత్తాను పసిగట్టే గుణం ఆయన సొంతం. కొత్త ప్రతిభను ఇట్టే కనిపెడతారు. ఆటగాళ్లకు సవాళ్లు విసరతారు. వోర్సెస్టర్‌షైర్‌ కోచ్‌గా ఆయనకు మంచి పేరుంది. ఆటగాళ్ల పనిభారం అంచనా వేసి తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. క్రికెటర్లతో సఖ్యంగా మెలుగుతూ ప్రోత్సహిస్తారు. ఆత్మవిశ్వాసం కల్పిస్తారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.