close

తాజా వార్తలు

దేశాభివృద్ధికి ‘పథకాలు’.. ప్రణాళికలు..

న్యూదిల్లీ: దేశాభివృద్ధికి మార్గాలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్డీఏ సర్కారు అమలు చేస్తున్న పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, భారత్‌మాల, సాగర్‌మాల, ఉడాన్‌, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన వంటి పథకాల ద్వారా దేశంలో మౌలిక సదుపాయాలు పుంజుకోవడానికి మోదీ సర్కారు పలు మంత్రాలు చెప్పింది. మేకిన్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌, ఉజ్వల, ఉజల, ఉదయ్‌ పథకాలతో అభివృద్ధి వైపునకు ఎలా దూసుకెళ్లాలనుకుంటున్నామన్న విషయాన్ని, వాటి కోసం వేసుకున్న ప్రణాళికలను వివరించింది.‌

మేకిన్‌ ఇండియా: అంకుర పరిశ్రమలు, ఇన్‌ఫ్రా, డిజిటల్‌, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాల వేగవంత తయారీ పథకం ‘ఎఫ్ఏఎంఈ-2’ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు మంజూరు చేసింది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, తయారీదారులకు ప్రోత్సహకాలు, ఛార్జింగ్‌కు వీలు కల్పించే సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కస్టమ్స్‌ సుంకాల్లో మార్పులు చేసి, మేకిన్‌ ఇండియాను మరింత విస్తృతపర్చాలని నిర్ణయం తీసుకుంది.

ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన: ఈ పథకం కోసం 2018-19 బడ్జెట్‌లో రూ.15,500 కోట్లు కేటాయిస్తే ఈ సారి 22.6 శాతం అధికంగా రూ.19,000 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు ఈ పథకంలో భాగంగా 30,000 కిలోమీటర్ల రోడ్లను గ్రీన్‌ టెక్నాలజీ ద్వారా వేశారు. ఈ పథకం మూడో దశ పనులు జరగనున్నాయి. ఇందులో భాగంగా 1.25 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లను నవీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.   

భారత్‌మాల: ఈ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా రహదారుల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు సాయం అందనుంది. జాతీయ రహదారుల నిర్మాణాల సమగ్ర పునరాకృతి విషయం పరిశీలన దశలో ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ వాటి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేలా ఈ పథకం కొనసాగుతోంది.

ఉడాన్‌: విమానయాన రంగంలో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. చిన్న నగరాలకు కూడా విమాన సదుపాయాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ రంగం మరింత అభివృద్ధి చెందేందుకు ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఫైనాన్సింగ్‌, లీజింగ్‌ రంగంలోకి దిగుతోంది. 

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కోసం గత బడ్జెట్‌లో రూ.55,000 కోట్లు కేటాయిస్తే, ఈ సారి తొమ్మిది శాతం అధికంగా రూ.60,000 కోట్లు కేటాయించారు. దేశ ప్రజలకు ఉపాధి హామీ భరోసాను ఇవ్వడానికి ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.

సాగర్‌మాల: జల రవాణాను మరింత అభివృద్ధిపర్చే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వస్తువుల రవాణా కోసం నదుల వినియోగం గురించి ప్రస్తావించింది. గంగానదీ ద్వారా వస్తువుల రవాణా రానున్న నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరగనుందని తెలిపింది. ‘జల్‌ మార్గ్‌ వికాస్‌’ ద్వారా రవాణా ధరలు తగ్గుతాయని, పోటీ తత్వం పెరుగుతుందని కేంద్రం పేర్కొంది. 

ప్రధానమంత్రి ఉజల యోజన (పీఎంయూవై): గ్రామీణ ప్రాంతాలన్నింటినీ విద్యుదీకరణ చేసే పథకం. 100 శాతం నివాసిత గృహాలకు విద్యుత్‌ సౌకర్యం అందనుంది. ఈ పథకం కింద మరోవైపు 35 కోట్ల ఎల్ఈడీ బల్బులను అందించారు. ఏడాదికి రూ.18,341 కోట్లు ఆదా అయినట్టు సమాచారం.

స్వచ్ఛ భారత్‌: 95 శాతం కంటే అధిక నగరాలు, 5.6 లక్షల గ్రామాలు బహిరంగ మల, మూత్ర విసర్జన (ఓడీఎఫ్‌లు) రహితాలుగా ప్రకటించబడ్డాయి. 45,000 పబ్లిక్‌, కమ్యూనిటీ టాయిలెట్‌లను గూగుల్‌ మ్యాప్స్‌లో పొందుపర్చారు. దేశంలోని ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని మరింత విస్తృతపర్చనున్నారు. 9.6 కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించారు.    

పట్టణాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన: పీఎంఏవై-యూ ద్వారా ఇప్పటి వరకు ఈ పథకం కింద 81 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 47 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొత్తం 27 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 24 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అందాయి.  

గ్రామాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన: పీఎంఏవై-జీ ద్వారా ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 కోట్ల ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. రెండో దశలో భాగంగా 1.95 కోట్ల ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదన చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.