close

తాజా వార్తలు

మాథ్యూస్ శతకం: భారత్‌ లక్ష్యం 265

లీడ్స్‌: ప్రపంచకప్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక తిరుగులేని పోరాట పటిమతో ఆకట్టుకుంది. విలవిల్లాడే దశ నుంచి పటిష్ఠ స్థితికి చేరుకుంది. సీనియర్‌ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ (113; 128 బంతుల్లో 10×4, 2×6) అద్వితీయ శతకంతో చెలరేగాడు. అతడికి తోడుగా తిరిమానె (53; 68 బంతుల్లో 4×4) సమయోచిత అర్ధశతకం సాధించడంతో భారత్‌కు లంక 265 పరుగుల మంచి లక్ష్యం నిర్దేశించింది.

లీడ్స్‌ మాథ్యూస్‌ అడ్డా!

12 ఓవర్లకు శ్రీలంక స్కోరు 55/4. జస్ప్రీత్‌ బుమ్రా నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నాడు. అప్పటికే ఓపెనర్లను పెవిలియన్‌ బాట పట్టించాడు. జడ్డూ, పాండ్య తలో వికెట్‌ తీశారు. ఇలాంటి స్థితిలో లంక కనీసం 30 ఓవర్లైనా ఆడుతుందా అనిపించింది. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేశాడు ఏంజెలో మాథ్యూస్‌. తన అనుభవంతో సహచరుడు లాహిరు తిరిమానె అండతో చెలరేగాడు. బుమ్రా, జడ్డూ, పాండ్య బౌలింగ్‌ను కాచుకొని క్రీజులో నిలిచాడు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించి మంచి బంతులను గౌరవించింది ఈ జోడీ. ఐదో వికెట్‌కు ఏకంగా 124 పరుగుల భారీ భాగస్వామ్యం అందించింది. అర్ధశతకాల తర్వాత వీరిద్దరూ చెలరేగారు. నిలదొక్కుకున్న ఈ జోడీని తిరిమానెను ఔట్‌ చేయడం ద్వారా కుల్‌దీప్‌ విడదీశాడు. జట్టు స్కోరు 179 వద్ద అతడిని పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధనంజయ డిసిల్వా (29*; 36 బంతుల్లో 1×4) అండతో మాథ్యూస్‌ శతకం బాదేశాడు. అతడు 10 బంతులకో బౌండరీ చొప్పున బౌండరీ బాదడం గమనార్హం. లీడ్స్‌లో అతడికి అద్భుతమైన రికార్డుంది. గతంలో ఆడిన మూడు మ్యాచుల్లో  46*, 85*, 35*తో అతడు అజేయంగా నిలిచాడు. ఈ సారి ఏకంగా శతకం బాదేశాడు. ధనంజయతో కలిసి 74 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 253 వద్ద మాథ్యూస్‌ను బుమ్రా ఔట్‌ చేయడంతో భారత్‌ కాస్త ఊపిరి పీల్చుకుంది. లంక 264/7తో నిలిచింది. 

జస్ప్రీత్‌ బుమ్రా వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా అవతరించాడు. ఇందుకు 57 వన్డేలు తీసుకున్నాడు. షమి (56 వన్డేలు) ముందున్నాడు.

భయపెట్టిన బుమ్రా

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకేయులకు జస్ప్రీత్‌ బుమ్రా (10-2-37-3) సింహస్వప్నంలా మారాడు. వేసిన తొలి ఓవర్‌ను మెడియిన్‌ చేశాడు. రెండో ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వకుండా దిముతు కరుణరత్నె (10; 17 బంతుల్లో 2×4)ను ఔట్‌ చేశాడు. అప్పుడు జట్టు స్కోరు 17. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన అవిష్క ఫెర్నాండో (20; 21 బంతుల్లో 4×4)ను ఎల్బీ చేశాడు. సమీక్షలో అతడు బతికిపోయాడు. జట్టు స్కోరు 40 వద్ద కుశాల్‌ పెరీరా (18; 14 బంతుల్లో 3×4)ను ఔట్‌ చేశాడు. మరికాసేపటికే కుశాల్‌ మెండిస్‌ (3)ను జడ్డూ, ఫెర్నాండోను పాండ్య పెవిలియన్‌ పంపడంతో లంక విలవిల్లాడింది. ఈ క్రమంలో మాథ్యూస్‌, తిరిమానె జోడీ లంకను జట్టును ఆదుకుంది. బుమ్రా ఈ మ్యాచ్‌లో వంద వికెట్ల ఘనత అందుకున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌ ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. 10-0-73-1 గణాంకాలు నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో జడేజా (10-0-40-1) ఆకట్టుకున్నాడు. వేసిన నాలుగో బంతికే వికెట్‌ తీశాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.